
మస్కట్:
ఒమన్‌లోని ఇండియన్ సోషల్ క్లబ్, తెలంగాణ వింగ్ (ఒమన్ తెలంగాణ సమితి) ఆధ్వర్యంలో మస్కట్లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగాయి. మాతృభూమికి దూరంగా ఓమాన్లో ఉన్న రెండువేలకు పైగా తెలంగాణ ప్రవాసులు మస్కట్లోని వాది కబీర్లోని మస్కట్ క్లబ్లో ప్రవాసి బతుకమ్మ సంబరాలు సంప్రదాయబద్దంగా ఘనంగా నిర్వహించారు. ఇండియా నుంచి వచ్చిన ప్రముఖ గాయకులు తేలు విజయ, రాంపూర్ సాయి తమ పాటలతో మస్కట్ లోని ప్రవాసులను అలరించారు.
తంగేడు తదితర పూలను ఇండియా నుండి తెప్పించుకుని పేర్చిన బతుకమ్మలు పూల జాతరను తలపించాయి. బతుకు తెరువు కోసం ఎడారి దేశం వచ్చిన తామందరం ఒకే దగ్గర చేరి బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందని, తమకు స్వదేశంలో ఉన్నఅనుభూతి కలిగిందని ఒమన్ తెలంగాణ సమితి అధ్యక్షుడు ఖానాపూర్ కు చెందిన ప్రముఖ భారతీయుడు గుండేటి గణేష్ తెలిపారు.