
హైదరాబాద్: సౌదీ అరేబియాలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ముషీరాబాద్‌లోని బాకారానికి చెందిన వ్యాపారి జహినుల్లా అబిదిన్ దంపతులు గత 40 ఏళ్లుగా సౌదీలోని జెడ్డా ప్రాంతంలో నివాసముంటున్నారు. వీరికి ఐదుగురు కుమారులు, ఓ కుమార్తె. కాగా వీరిలో ఇద్దరు కుమారులు రష్యాలోనూ, మరో కుమారుడు బాకారంలోనూ నివసిస్తున్నారు. మిగిలిన సంతానం వీరివద్దే ఉంటోంది.
ఈ నెల 27న జహినుల్లా అబిదిన్ తన భార్యా పిల్లలతో కలసి జెడ్డా నుంచి సౌదీకి కారులో వస్తుండగా వీరి వాహనానికి ఒంటె అడ్డుగా రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అబిదిన్ దంపతులిద్దరితో పాటు కుమారుడు ముర్తాజా అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో కుమారుడు ఇస్మాయిల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇస్మాయిల్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారాన్ని అందుకున్న బాకారంలోని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ముగ్గురి మృతదేహాలను మరో రెండ్రోజుల్లో నగరానికి చేరుకునేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment