సింగపూర్ : ప్రముఖ బాడీబిల్డర్, భారత సంతతికి చెందిన ప్రదీప్ సుబ్రమణియన్(32) అనూహ్యరీతిలో ప్రాణాలు కోల్పోయారు. కిక్ బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థి పంచ్‌ల ధాటికి కుప్పకూలిన ఆయన.. గుండెపోటుకు గురై ఆస్పత్రికి తరలించేలోపే తుదిశ్వాసవిడిచారు. కాగా, ప్రొఫెషనల్ బాక్సర్ కానప్పటికీ ప్రదీప్‌ను బరిలోకి దింపిన టోర్నీ నిర్వాహకులపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి.
సింగపూర్‌లోని మరీనా బే స్లాండ్స్ వేదికగా శనివారం ఆసియా ఫైటింగ్ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. తొలిరోజే ‘సెలబ్రిటీ బౌట్’ కేటగిరీలో యూట్యూబర్ స్టీవెన్ లిమ్, గాయకుడు సిల్వెస్టర్ సిమ్‌ల మధ్య మ్యాచ్ జరగాల్సిఉంది. అయితే నిబంధనల ప్రకారం ఇన్సురెన్స్(బీమా) లేకపోవడంతో సిల్వెస్టర్ మ్యాచ్ ఆడే అర్హతను కోల్పోయాడు. దీంతో నిర్వాహకులు హుటాహుటిన సిల్వెస్టర్ స్థానంలో ప్రదీప్‌ను బరిలోకి పంపారు. ఆయనకు ఇది తొలి మ్యాచ్.
బౌట్ ఏ దశలోనూ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయిన ప్రదీప్‌కు.. ఒక దశలో ముక్కువెంట రక్తం కారింది. చివరికి స్టీవెన్ మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. అంపైర్ విజేతను ప్రకటిస్తున్న తరుణంలోనే ప్రదీప్ రింగ్‌లో కూలబడిపోయాడు. ఆయనను సింగపూర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రదీప్ మరణానికి గుండెపోటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించామని, అయితే పూర్తి వివరాలను మరో నెలరోజుల్లో వెల్లడిస్తామని వైద్యులు చెప్పారు.
బాడీబిల్డర్ అయిన ప్రదీప్‌ను బాక్సింగ్ రింగ్‌లోకి దింపిన నిర్వాహకులపై అభిమానులతోపాటు నెటిజన్లు సైతం విమర్శలు చేశారు. అయితే జరిగింది దురదృష్టకర పరిణామమని, ప్రదీప్ కుటుంబానికి అండగా ఉంటామని బాక్సింగ్ టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు. ఎవరిచేతిలో దెబ్బలు తిని ప్రాణాలు కోల్పోయాడో, ఆ స్టీవెన్ లిమ్ సైతం ప్రదీప్‌కు నివాళులు అర్పించారు.
(ఫొటో స్లైడ్ చూడండి..)