రాజంపేట : తెలంగాణలోని వరంగల్‌లో చిన్నారి అత్యాచారానికి స్పందించడమే వైఎస్సార్ జిల్లా వాసులకు శాపంగా మారింది. కువైట్ దేశంలోని మాలియాలో శుక్రవారం ప్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టినందుకు అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టారు. మొత్తం 24 మందిని అరెస్టు చేసి కేసులు పెట్టారు. ఇందులో జిల్లాకు చెందిన వారు ఉండటంతో వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. రాయచోటి, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు తదితర ప్రాంతాలకు చెందిన వారు అరెస్టైన వారిలో ఉండడంతో ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కువైట్ దేశంలో ఉంటూ అక్కడ చట్టాలు తెలియకపోవడం ప్రవాసాంధ్రులకు శాపంగా పరిణమించింది. తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ కేసు విషయంలో స్పందిస్తే అదే వారికి పెద్ద శాపమై కూర్చుంది. రాచరిక వ్యవస్థ ఉన్న కువైట్ సహా ఏ గల్ఫ్‌దేశంలోనైనా నిరసన సభ, ప్రదర్శన నిర్వహించడం తీవ్రనేరం. దీనికి జైలుశిక్ష పూర్తయినా తర్వాత వీసా రద్దు చేసి ఏ గల్ఫ్‌దేశంలోనూ అడుగుపెట్టకుండా జీవితకాలం నిషేధం విధిస్తారు.
ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ...
తమవారు కువైట్‌లో అరెస్టు అయి ఉంటే విడుదల చేయించే విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ప్రవాసాంధ్రులు విన్నవిస్తున్నారు. అరెస్టయిన వారిని కలిసేందుకు భారతీయ దౌత్యవర్గాలు రెండురోజులుగా ప్రయత్నిస్తున్నా, అక్కడి అధికారులు అనుమతించడం లేదని తెలిసింది. జిల్లాకు చెందిన ఎంపీలు వెంటనే స్పందించి తమ వారిని విడిపించాలని అరెస్టయిన సంబంధీకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment