సాక్షి నెట్‌వర్క్: ముందస్తు ఎన్నికల్లో విజయదుందుభి మోగించి మళ్లీ అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పుడైనా తమ సమస్యలపై దృష్టి సారించాలని గల్ఫ్ కార్మికులు కోరుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ వలస కార్మికుల సంక్షేమంపై పలు హామీలు ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అంతగా దృష్టి పెట్టలేదనే విమర్శలు ఉన్నాయి. గత బడ్జెట్‌లో ఎన్‌ఆర్‌ఐ సెల్‌కు రూ.100 కోట్లు కేటాయించినప్పటికీ వాటి వినియోగంపై మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో ఉపయోగం లేకుండా పోయింది. గల్ఫ్ వలస కార్మికుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర సచివాలయంలోని ఎన్‌ఆర్‌ఐ సెల్‌ను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కార్మికులు కోరుతున్నారు. ఎన్‌ఆర్‌ఐ సెల్‌లో సిబ్బంది అసలే లేకపోవడంతో తమ వినతులు బుట్టదాఖలవుతున్నాయని కార్మికులు చెబుతున్నారు. కార్మికులకు వారు ఎంపిక చేసుకున్న రంగంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించడం వల్ల గల్ఫ్ దేశాల్లో మెరుగైన ఉపాధి పొందడానికి అవకాశం ఉంది. అలాగే ఏజెంట్ల మోసాలపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించి బాధితులకు సరైన న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతూ మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సూచిస్తున్నారు. కేరళ తరహా విధానం అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గల్ఫ్‌లో నష్టపోయి సొంతూళ్లలో స్థిరపడాలనుకునే వారికి రాయితీ రుణాలు ఇప్పించాలనే డిమాండ్ కూడా వ్యక్తమవుతోంది.
ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి
గల్ఫ్ వలస కార్మికుల సంఖ్య అధికంగా ఉన్న దృష్ట్యా రాష్ట్ర మంత్రి వర్గంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. కేరళ తరహా విధానం అమలు చేస్తే వలస కార్మికులకు మేలు జరుగుతుంది. గల్ఫ్ వలసల వల్ల లబ్ధి పొందిన వారికంటే నష్టపోయిన వారి సంఖ్యనే అధికంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.
– సుందర ఉపాసన, తెలంగాణ గల్ఫ్ సంక్షేమ, సాంస్కృతిక సంస్థ ప్రతినిధి
గల్ఫ్ కార్మికులకు అండగా ఉండాలి
తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు అండగా ఉండాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే గల్ఫ్ బాధితులకు న్యాయం జరిగింది. ఆ తరువాత కార్మికుల గురించి ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. కొత్త ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పథకాలను అమలు చేయాల్సి ఉంది. కార్మికుల పిల్లలకు గురుకుల పాఠశాలల్లో చదువుకోవడానికి అవకాశం కల్పించాలి.
– షేక్ చాంద్‌పాషా, గల్ఫ్ రిటర్నింగ్ మెంబర్స్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్
మానవతా దృక్పథంతో స్పందించాలి
గల్ఫ్ వల్ల నష్టపోయిన వారి పట్ల ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించాలి. ఎంతో మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి లేక సొంతూళ్లకు చేరుతున్నారు. అలాంటి వారికి స్వయం ఉపాధి కోసం రాయితీపై రుణాలు ఇప్పించాలి. బతుకుపై భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గల్ఫ్‌లో మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షల నష్ట పరిహారం అందించాలి.
– శివన్నోల్ల రాజు, కువైట్
ఎన్‌ఆర్‌ఐ పాలసీని అమలు చేయాలి
కేరళ తరహాలో ఎన్‌ఆర్‌ఐ (గల్ఫ్) పాలసీ అమలు చేయాలి. వలస వెళ్లి ఐదేళ్లు పూర్తి చేసుకున్న గల్ఫ్ కార్మికులకు ఆసరా పింఛన్ ఇవ్వాలి. రైతు బీమా తరçహాలో గల్ఫ్ బీమా అమలు చేసి రూ.5 లక్షల బీమా అందించాలి. గల్ఫ్ దేశాల్లోని భారత ఎంబసీలో అన్ని భాషలకు సంబంధించిన అధికారులను నియమించాలి. గల్ఫ్ కార్మికులకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేయాలి.
– ఎండీ.హబీబ్, గల్ఫ్ కార్మికుడు, వీవీరావుపేట
ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి
టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఏటా బడ్జెట్‌లో రూ.500 కోట్లు పెడతామని, గల్ఫ్‌లో మరణించినవారి కుటుంబాలకు రూ.5 లక్షల నష్ట పరిహారం ఇస్తామని, ప్రమాదవశాత్తు గాయపడిన వారిని స్వదేశానికి తీసుకువచ్చి నాణ్యమైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్ దేశాల్లో న్యాయ సహాయం అందించేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ అమలు చేయలేదు. ఇప్పుడైనా టీఆర్‌ఎస్ సర్కార్ గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించాలి. వీటితో పాటు 50 ఏళ్లు దాటిన గల్ఫ్ కార్మికులకు పింఛన్ ఇవ్వాలి. వలస కార్మికులకు స్వగ్రామాల్లో రేషన్ కార్డులు తొలగించరాదు.
– గుగ్గిల్ల రవిగౌడ్, మేడిపల్లి, జగిత్యాల జిల్లా
Comments
Please login to add a commentAdd a comment