
సింగపూర్ : సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో స్థానిక సెరంగూన్ రోడ్ లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంలో శ్రీ విళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉగాదిని పురస్కరించుకొని, రాబోయే సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని తిరుమల తరహాలో సుప్రభాతసేవ, తోమాలసేవ, తిరుమంజనం, సహస్రనామార్చన, ఇతర విశేషపూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉగాది వేడుకలకు భారీ ఎత్తున స్థానిక తెలుగువారు సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొన్నారు. వేదమంత్రోచ్చరణలతో, భక్తుల గోవింద నామాలతో, భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. పూజానంతరం నిర్వహించిన పంచాంగ శ్రవణాన్ని అందరూ ఆసక్తిగా ఆలకించారు. అందరికీ షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడి, అన్నదాన వితరణ చేశారు.
సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సింగపూర్ తెలుగు సమాజం సభ్యులు సుమారు 3000 మంది స్థానిక తెలుగువారికి వేపపువ్వును ఉచితంగా అందించారన్నారు. ప్రాంతీయకార్యదర్శి అనిల్ పోలిశెట్టి ఈ కార్యక్రమం విజయవంతం కావడం వెనుక చాలామంది సహాయ సహకారాలు అందించారని తెలిపారు. సమాజం సభ్యులకు, దాతలకు, కార్యకర్తలకు, వాలంటీర్లకు కార్యదర్శి సత్యచిర్ల ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.




Comments
Please login to add a commentAdd a comment