కాన్సాస్ : కాన్సాస్ తెలుగు సంఘం(టీఏజీకేసీ) ఆధ్వర్యంలో స్థానిక హిందూ దేవాలయంలో దసరా, బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. దాదాపు 1500 మంది పాల్గొన్న ఈ వేడుకలు పూజారీ శ్రీనివాసా చార్య నిర్వహించిన గౌరీ పూజతో ప్రారంభమయ్యాయి. తెలుగు వారందరూ సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలతో రావడంతో అమెరికాలో అచ్చమైన తెలుగు పండగ వాతావరణం కనిపించింది. ఈ కార్యక్రమానికి అదితి బావరాజు, శ్రీకాంత్ లంకలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
ఈ వేడుకల్లో బతుకమ్మ తయారు చేయడం, గోరింటాకు అలంకరణలు ప్రత్యేకంగా ఆకర్షించాయి. బతుకమ్మ పాటలతో చిన్న పెద్ద తేడాలేకుండా అందరూ బతుకమ్మ చుట్టూ నృత్యం చేశారు. ఉత్తమ బతుకమ్మలకు పట్టు చీరలను బహుమతిగా అందించారు. తర్వాత సంప్రదాయ బద్దంగా బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకుని వెళ్లి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి కృషి చేసిన వారందరికీ కాన్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు శివ తీయగూర ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment