టెక్సాస్ : అమెరికా తెలంగాణ అసొసియేషన్ (ఆటా) రెండో తెలంగాణ మహా సభలను ఈ నెల 29నుంచి టెక్సాస్ రాష్ట్రంలోని హుస్టన్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించబోతోంది. జార్జ్ బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుకల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. నిర్వహణ బాధ్యతల కోసం పలు కమిటీలను ఏర్పాటు చేశారు. 2016లో డెట్రాయిట్‌వేదికగా తొలి మహాసభలు జరగాయి. ఈ సంస్థ ఉత్తర అమెరికాలో నివసించే ప్రవాస తెలంగాణ వాసుల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పడి, అమెరికా అంతటా విస్తరించిన దాదాపు 40 తెలంగాణ సంఘాల్ని ఒక్కతాటి మీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికీ, ప్రవాసీ తెలంగాణ వాసులకి ఒక వారధి ఆటా. ఈ సారి వేడుకలను ప్రముఖ సాహితీవేత్త సింగిరెడ్డి నారాయణరెడ్డికి అంకితం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత ఏడాది జూన్ 12న కన్నుమూసిన సినారెను, సాహిత్యానికి ఆయన చేసిన సేవలను ఈ సభల్లో ప్రత్యేకంగా గుర్తు చేసుకోనున్నారు.
"రైతే రాజు" నినాదంతో రైతు ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా "రచ్చబండ" కార్యక్రమాన్ని వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో నిర్వహించనున్నారు. భాషా సాహిత్యాల పరంగా కార్యక్రమాలు జరుగనున్నాయి. అష్టావధానంతో పాటు, సాహిత్య సదస్సులు, యువశక్తి అంశంపై చర్చలు నిర్వహించనున్నారు. మహాసభల్లో చివరిరోజు భద్రాచలం నుండి పూజారులు వచ్చి అక్కడి ఉత్సవ విగ్రహాలు, మరియు ప్రసాదముతో శ్రీ సీతారామ స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపి భక్తులకు స్వామివారి ఆశీస్సులందించనున్నారు.
ఆటా అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి
‘తెలుగు భాష మరియు తెలంగాణ అభిమానులందరికి హృదయపూర్వక ఆహ్వానం. కొత్తగా ఏర్పడ్డ మన తెలంగాణ.. కోటి రతనాల వీణగా మారాలి. తెలంగాణలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి, సర్వాంగీణ వికాసం జరగాలి. ప్రవాస తెలంగాణ వాసుల ఆకాంక్ష ఫలితమే ఆటా-తెలంగాణా. తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి, సంస్కృతి -సంప్రదాయాలు, భాష-యాస, ఆచారం, కట్టుబాట్లు , నడవడికల పరిరక్షణ ధ్యేయంగా, ప్రపంచంలోని తెలంగాణ సంఘాల సమ్మేళనంగా ఆటా ఏర్పడింది. ఇదే ధ్యేయంతో మహాసభలను విజయవంతం చేయాలని కోరుతున్నా. ప్రపంచం నలుమూలలలో విస్తరించిన ప్రవాస తెలంగాణ సోదర సోదరీమణులు ఈ వేదికగా కలుసుకోనుండడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ మహాసభలు అంగరంగ వైభవంగా జరిపేందుకు ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. అనితర సాధ్యమైన బృహత్ లక్ష్యాన్ని ఆటా ధర్మకర్తలు, కార్యవర్గం మరియు కార్యకర్తల సమష్టి కృషితో, తెలంగాణ ప్రవాస మిత్రుల అండదండలతో, ఎన్నారై పారిశ్రామికవేత్తల ఆర్ధిక, హార్దిక వెన్నుదన్నుతో, ఘనంగా, వైభవంగా నిర్వహించబోతున్నామ’ని ఆటా అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి కందిమల్ల తెలిపారు.
ఆటా ఛైర్మన్ కరుణాకర్ మాధవరం
ఆటా ఛైర్మన్ కరుణాకర్ మాధవరం మాట్లాడుతూ.. ‘అమెరికా రాష్ట్రాల్లోని స్థానిక తెలంగాణ సంస్థల ఐక్యసమాఖ్య సంఘటిత శక్తి ఆటా. ప్రతి తెలంగాణ వాసి, తెలంగాణ బాగు కోరే ప్రతి ఒక్కరు మా సంస్థ లోకి ఆహ్వానితులే. ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రానికి, అమెరికాలోని తెలంగాణ ప్రవాసులకు వారధిగా ఉంటుంది. మేము చేసే ప్రతి మంచి పనికి మా వెంటే వుండే కార్య కర్తలకు, దాతలకు మా శుభాబి వందనాల’ను తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment