సామాన్యునికి పట్టంగట్టిన ప్రధాని
ప్రధాని జన ధన్ యోజన పథకానికి మూడు రోజుల్లోనే మూడు కోట్ల మంది స్పందించారంటే ప్రజలు ఎంతగా ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో అర్థం కావడం లేదా? సామాన్యుల ప్రయోజనాలే పరమ పవిత్ర కర్తవ్యంగా తలదాల్చిన ప్రధాని... అసాధ్యాలను సుసాధ్యం చేయగల నేతనని ఈ వంద రోజుల్లో రుజువు చేశారు.
‘‘ఈ దేశానికో గమ్యం ఉంది. అది ప్రపంచ సంక్షేమం కోసం పని చేయడం. ఇది స్వామి వివేకానంద చెప్పిన మాట. ఆ గమ్య సాధన క్రమంలోనే హిందుస్థాన్ అవతరించింది. భారత్ ఆవిష్కృతమైంది’’
-ప్రధాని నరేంద్ర మోడీ
భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ తొలి వంద రోజుల పాలన పూర్తయింది. ఈ స్వల్ప వ్యవధిలో ఆయన పని తీరును అంచనా వేయడం దుస్సాహసమే. అయితే ఆయన తన లక్ష్యంగా ప్రకటించిన నవ్య భారత్ దిశగానే కచ్చితంగా దేశాన్ని నడుపుతున్నారనేది ఇప్పటికే స్పష్టమవుతోంది. ఈ కొద్ది రోజుల్లో ఆయన చేపట్టిన చర్యలే అందుకు సాక్ష్యం. ఆర్థిక అస్పృశ్యత నివారణకు జరుగుతున్న బృహత్తర కృషిని, ఆర్థిక క్రమశిక్షణ సాధనలోని ప్రగతిని ఆయన విమర్శకులు సైతం గుర్తించక తప్పదు. అలసత్వానికీ, జాప్యానికీ మారుపేరుగా నిలిచిన అధికార యంత్రాంగాన్ని సున్నితమైన వ్యాఖ్యలతో దారిలోకి తెస్తున్నారు. దానికి జవాబుదారీతనం, పారదర్శకత అలవడేట్టు చేసి భారతదేశ గౌరవ ప్రతిష్టలను ఇనుమడింపజేసే దిశగా దృఢసంకల్పంతో కూడిన కృషి మొదలైంది.
మందకొడితనానికి స్వస్తి...
ప్రపంచం కుగ్రామంగా మారుతున్న నేపథ్యంలో ఇరుగుపొరుగు దేశాలతో, ఇతర ప్రపంచ దేశాలతో సత్సంబంధాలకు చాలా ప్రాధ్యానం ఉంది. ప్రమాణ స్వీకారానికి ‘సార్క్’ దేశాల అధిపతులను ఆహ్వానించడంతోనే ప్రధానిగా మోడీ తొలి రోజునే ఆ కృషికి శ్రీకారం చుట్టారు. బర్మా, బ్రెజిల్, నేపాల్ పర్యటనల నుండి నిన్నటి జపాన్ పర్యటన వరకు మోడీ సాధించిన వరుస దౌత్య విజయాలే వినూత్నమైన ఆయన విదేశాంగ విధాన సాఫల్యతకు తిరుగులేని సాక్ష్యం. ఒక్క పర్యటనతో జపాన్ నుండి రెండున్నర లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులనే గాక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సాధించడం అపూర్వం. కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి అనే తీరుగా సాగిన గత ప్రభుత్వ పాలనలో నెలకొన్న విధానపరమైన స్తంభనతో అభివృద్ధి కుంటుపడింది. ప్రణాళికా సంఘం, ఆర్థిక సంఘం, మంత్రుల కమిటీలు ఇలా పలు అంచెలలో ఒకరు అవునన్నది మరొకరు కాదంటుండగానే కాలం గడచిపోయేది. విధానపరమైన జాప్యం, అలసత్వం వ్యాపించిపోయాయి. చివరికది నిష్క్రియాపరత్వంగా దిగజారి ప్రజలకు చేరాల్సినవేవీ చేరేవి కావు. ఈ దుస్థితిని సమూలంగా సంస్కరించడానికే మోడీ పలు వ్యవస్థాగతమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ఎన్నడో నిరర్థకమైనదిగా మారిన ప్రణాళికా సంఘంతో పాటూ లెక్కకు మించి ఉన్న రకరకాల అధికారిక సంఘాలను, గ్రూపులను రద్దుచేశారు. సత్వర నిర్ణయాలు తీసుకునే వ్యూహ కల్పనలో భాగంగానే పలు చిన్న చిన్న మంత్రిత్వ శాఖల విలీనం వంటి చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో పని సంస్కృతిని పెంచడం కోసం... ప్రతి నెలా ఉత్తమ ఉద్యోగి, ప్రతి ఏటా ఉత్తమ ఉద్యోగి అవార్డులను ప్రవేశపెట్టారు. తనతో సహా మంత్రివర్గ సహచరులందరిలోనూ, ప్రతి మంత్రిత్వ కార్యాలయంలోనూ జవాబుదారీతనం, పారదర్శకతల సంస్కృతిని ప్రవేశపెట్టారు.
వడి వడిగా.. అభివృద్ధి దిశగా...
ఆర్థికాభివృద్ధి శుష్క ప్రవచనాలతో జరిగేది కాదు. ప్రజలకు కావలసింది... తమ బతుకులు బాగుపడటంతో పాటు, దేశం పటిష్టంగా, సురక్షితంగా ఉండటం. అందుకు హామీని ఇవ్వగల సుస్థిర ప్రభుత్వాన్నే ప్రజలు ఎన్నుకున్నారు. ఆ బాధ్యతను భుజస్కంధాలకెత్తుకున్న ప్రధాని మోడీ... విధాన పరమైన లోపాలకు తావు లేకుండా పారిశ్రామికాభివృద్ధిని, మొత్తంగా జాతీయ ఉత్పత్తిని త్వరితగతిన పెంపొందింపజేయడానికి చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడం వల్ల కీలకమైన దేశ రక్షణ రంగంలో సైతం లక్షల కోట్ల విలువైన పనులు మూలన పడ్డాయి. మోడీ ప్రభుత్వం చక చకా 30 వేల కోట్ల రూపాయల పనుల ఫైళ్లను ఖరారు చేసి దేశ రక్షణ పట్ల దృఢ సంకల్పాన్ని ప్రదర్శించింది. మౌలిక సదుపాయాల కల్పన కోసం కొన్ని కీలక రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం ఈ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నిర్ణయాలలో ఒకటి. అలా అని స్వావలంబన లక్ష్యాన్ని విస్మరించలేదు. రక్షణ రంగం సహా భారత్ తన కాళ్లపై తాను నిలిచేలా అన్ని రంగాలలోనూ చర్యలను చేపట్టారు. మన దేశం పెద్ద అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రంగా వృద్ధి చెందేందుకు మార్గం సుగమమైంది.
దిగొచ్చిన ధరలు...
గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అంతకు ముందు 4.1 శాతంగా ఉన్న స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఇప్పుడు 5.7 శాతానికి చేరింది. మరీ ముఖ్యంగా సామాన్యుల జీవితాలను దుర్భరంగా మారుస్తున్న నిత్యావసర వస్తువుల ధరలను కట్టడి చేయగలిగారు. ఉల్లి, టమోట, ఆలుగడ్డ తదితర కాయగూరలను నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి తేవడం, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం, ఎగుమతి-దిగుమతి విధానంలో మార్పులు చేయడం వంటి చర్యలను చకచకా చేపట్టడం వల్లనే అది సాధ్యమైంది. అక్రమ నిల్వదారులపట్ల చేపట్టిన కఠిన వైఖరి సైతం సత్ఫలితాలను ఇచ్చింది.
ఆదర్శ గ్రామాలు ఎలాగంటే...
బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో స్మార్ట్ సిటీస్, ఆదర్శ గ్రామాలు, జన ధన్ యోజన, అందరికీ విద్యుత్ తదితరమైన ముఖ్య వాగ్దానాలను చేసింది. తక్షణమే వాటిని నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మోడీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వందకుపైగా స్మార్ట్ నగరాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అధునాతన సౌకర్యాలు కల్పించడానికి సన్నాహాలు చేస్తోంది. కిక్కిరిసిన పెద్ద నగరాలపై వలసల భారాన్ని తగ్గించడం, నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడం అనే ప్రధాన లక్ష్యాలతో స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయబోతున్నారు. పార్లమెంటు సభ్యులు తమకు కేటాయించిన నిధులతో ప్రతి ఏటా ఒక ఆదర్శ గ్రామాన్ని తయారు చేయాలని నిర్దేశించారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల నుండి శ్రామికులు వలస పోవాల్సిన స్థితిని నివారించడం సాధ్యమవుతుంది. అలాగే నానాటికీ ‘సాగుబడి’ క్షీణించిపోయే స్థితిని వెనక్కు మరల్చగలగడం సాధ్యమని నిపుణుల అంచనా! వచ్చే ఐదేళ్లలో అన్ని గ్రామాలకు విద్యుత్‌ను సరఫరా చేసేలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ‘పవర్ టు ఆల్’ అనే పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టింది. గాంధీ జయంతి నాడు ప్రారంభించే ఈ పథకానికి ఎంపికైన మూడు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది.
ఆర్థిక అంటరానితనానికి చెల్లు చీటి
నేటికీ గ్రామీణ ప్రాంతాలలో నూటికి 60 శాతం మందికి బ్యాంక్ ఖాతాలు లేవు. ఈ ఆర్థిక అంటరానితనం ఫలితంగానే ప్రభుత్వ సహాయం అత్యవసరమైన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరడం లేదు. దీనిని రూపుమాపే లక్ష్యంతోనే ప్రధాని యుద్ధ ప్రాతిపదికపై జన ధన్ యోజన పథకాన్ని అమలు చేయిస్తున్నారు. మూడు రోజుల్లోనే సుమారు 3 కోట్ల ఖాతాలు తెరిచారంటేనే ప్రజలు ఇలాంటి అవకాశం కోసం ఎంతకాలంగా ఎదురు చూస్తున్నారో అర్థం అవుతుంది. జన ధన్ యోజన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు మాత్రమే అందేలా చేస్తుంది, పేదలకు చేరాల్సిన నిధులను కాజేసే స్వార్థపర శక్తుల ఆట కట్టిస్తుంది. అవినీతిని రూపుమాపడానికి, దొంగనోట్ల చెలామణీని అరికట్టడానికి, నల్లధనాన్ని వెలికి తీయడానికి కూడా బ్యాంకు ఖాతాల ద్వారానే లావాదేవీలు జరగడం అవసరం. ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రకటించినా అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నది ఈపీఎఫ్ పెన్షన్‌ను రూ.500 నుంచి 1000 రూపాయలకు పెంచడం.
దీని వల్ల దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది సంఘటిత, అసంఘటిత కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. పాలకులైనా, అధికారులైనా, ప్రభుత్వాలైనా... ఇలా ఎవరైనా విశ్వసించాల్సింది ఈ దేశ పౌరుల్నే. అందుకే నరేంద్ర మోడీ ఈ దేశ పౌరులే పెద్ద గెజిటెడ్ అధికార్లుగా భావించారు. దేశ పౌరులు తమకు తాముగా ఇచ్చే స్వయం ప్రకటిత అఫిడవిట్లు చెల్లుబాటవుతాయని చెప్పారు. ప్రధాని నోట ఏ మాట వచ్చినా అది సామాన్యులను ఉద్దేశించినదే. అందుకు ఆగస్టు 15న ఆయన ఎర్రకోట నుండి చేసిన ప్రసంగమే తిరుగులేని సాక్ష్యం. పర్యావరణాన్ని కాపాడండి, పరిశుభ్రతను పాటించండి. విద్యుత్‌ను పొదుపు చేయండి, మీ పిల్లలకు (మీ కుమారులకు) ఏది ఒప్పో ఏది తప్పో చెప్పి నియంత్రించేలా చూడండి అని ఆయన కోరినది కోట్లాది మంది దేశ ప్రజలనే. సామాన్య ప్రజల ప్రయోజనాల పరిరక్షణే పరమ పవిత్ర కర్తవ్యంగా తలదాల్చిన తొలి ప్రధాని... అసాధ్యాలను సుసాధ్యం చేయగల నేతనని ఈ వంద రోజుల్లో చేసి చూపారు. అంతకు మించి చేయాల్సింది ఏముంది?
-నల్లు ఇంద్రసేనారెడ్డి ,మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు