
బాపు ఇచ్చిన ఏకవాక్య జవాబు
ఇద్దరూ ఏం మాట్లాడరు, నా వంక చూడరు. ఉదయమే కదా ‘భరాగో’ నేనెవరో పరిచయం చేసింది! అప్పటికే నేను కథలకు బొమ్మలు వేస్తున్నాను. నాకు కొన్ని అనుమానాలున్నాయి- ఓ కారెక్టర్‌ను లేక ఒక వస్తువును వేసామనుకోండి. ఆ కారెక్టర్‌కి అవసరమయితే నీడను నల్లగా వేస్తాం. ఆ నీడ నాకెందుకో అందంగా బాలెన్స్‌డ్‌గా కుదరడం లేదు. అలా కుదరాలంటే ఏం చేయాలి?
వారు (బాపు, రమణ) తీసిన ఏదో పిక్చర్ ఎలాపోతుందో అని ఆంధ్రదేశంలో పర్యటిస్తున్నారు. అలా ఈ వైజాగ్ కూడా వచ్చారు. ఎలాగూ వచ్చారు కాబట్టి మిత్రుడైన ‘భరాగో’ను చూడ్డానికి వస్తున్నారు. నన్ను పరిచయం చేశాడు భరాగో. విష్ చేసి నిలబడ్డాను. కాసేపు ఆ కబురూ ఈ కబురూ చెప్పుకున్నారు. మధ్యలో మాట్లాడ్డానికి నాకు కుదరలేదు. వారు బయలుదేరేట్టున్నారు. ‘‘మిమ్మల్ని కలుసుకోవాలనుకొంటున్నాను. ఎక్కడ కలుసుకోవాలి’’ అని బాపుగార్ని అడిగాను.
‘‘సాయంకాలం వరకూ బిజీగా ఉంటాం. ఐదు గంటలకయితే హోటల్ అప్సరలో ఫలానా రూంలో ఉంటాం’’ అంటూ రూం నంబర్ చెప్పారు. నంబర్ నోట్ చేసుకున్నాను. ఆ రూం ఇండివిడ్యువల్ రూముల సిరీస్‌లో ఉంది. అంటే ప్రయివేట్ రూం అన్నమాట. అవి ఆ హోటల్‌కి మొదట్లోనే కనిపిస్తాయి.
అవి తొలకరి రోజులనుకుంటాను. పగలంతా ఎండ బాగా కాసీ సాయంకాలానికి వర్షం మొదలయింది. ఎలాగన్నా వారిని కలవాలన్న ఉద్దేశంతో వర్షానికి తడుస్తూ హోటల్‌కే బయలుదేరాను. అక్కడికి చేరేసరికి బట్టలు తడిసి ముద్దయి పోయాయి. చేతిలో కేరియర్ సంచీ. రిసెప్షన్‌లో మరో మారు కన్‌ఫర్మ్ చేసుకొని ఆ రూం తలుపు తట్టాను. ముందుగా ముళ్లపూడివారు వచ్చారు. కూచోండి అన్నారు. బయట పొడవాటి బల్ల, సోఫాలాంటి చెక్క కుర్చీలున్నాయి. బల్లమీద కూచున్నాను. కిందంతా వర్షానికి తడిసిపోయి ఉంది. పైనుండి గొట్టంలో పెద్దగా నీళ్లు పడుతున్నాయి. ఆ నీళ్లన్నీ ఇనుపచట్రం ఉన్న కంతగుండా ఎటో పోతున్నాయి. అరుగు కింద పూల మొక్కలు. బాపుగారు, ముళ్లపూడి వారూ వచ్చారు. మధ్యాహ్నం పడుకున్నారు కాబోలు. ఫ్రెష్ అయి తెల్లటి బట్టలు కట్టుకొని ఉన్నారు. సోఫాల్లా ఉన్న చెక్క కుర్చీలో కూచున్నారు. ఇద్దరూ ఏం మాట్లాడరు, నా వంక చూడరు. ఏం మాట్లాడాలో నాకూ తోచడం లేదు. ఉదయమే కదా ‘భరాగో’ నేనెవరో వీళ్లకి పరిచయం చేసింది! అప్పటికే నేను కథలకు బొమ్మలు వేస్తున్నాను. నాకు కొన్ని అనుమానాలున్నాయి- బొమ్మలపరంగా ఆ అనుమానాలను నివృత్తి చేసుకోవాలి- అవీ ఒకటీ రెండు అంశాలు మాత్రమే! ఓ కారెక్టర్‌ను లేక ఒక వస్తువును వేసామనుకోండి. ఆ కారెక్టర్‌కి అవసరమయితే నీడను నల్లగా వేస్తాం. ఆ నీడ నాకెందుకో అందంగా బాలెన్స్‌డ్‌గా కుదరడం లేదు. అలా కుదరాలంటే ఏం చేయాలి? దానికి బాపుగారినుండి వచ్చిన సమాధానం ఇలా సంక్షిప్తంగా ఉంది.
‘‘సోవియట్ లాండ్ పుస్తకంలోని బొమ్మలు చూడండి తెలుస్తుంది.’’
తిరిగి మా మధ్య నిశ్శబ్దం. వాళ్లిద్దరూ జీవితంలో అదే మొదటిసారిగా చూస్తున్నట్టు, పై నుండి పడుతున్న వాననీరు తూములోకి పోవడం చూస్తూనే ఉన్నారు. పది నిమిషాలు గడిచాయి. ఇక నాకు ఏం మాట్లాడాలో తోచలేదు. సీతమ్మధారకు పోవాలంటే ఇప్పటిలా ఇన్ని బస్సులు లేవు. తడిసిన వాచీని చూస్తే బస్ వేళయ్యింది. వస్తానన్నట్టు లేచాను. వాళ్లూ లేచారు.
వర్షం తగ్గేదాకా కూచోమనన్నా అనలేదు. ఆ రెండు మెట్లు కిందికి దిగి రెండడుగులు వేసి వెనక్కు చూశాను. వారు లోపలికి పోయి తలుపులు వేసుకుంటున్నారు.
‘‘అది మంచికయినా చెడుకయినా ఫస్ట్ ఇంప్రెషన్ ప్రభావం ఉంటుంది, ఎదుటివారిపై.’’ నేను వర్షంలోనే బస్ పట్టుకొని ఇంటికెళ్లిపోయాను. ఇక ఈ చిత్రకళలో ఏవన్నా డెవలప్‌మెంట్స్ కావాలంటే ప్రపంచంలోనే వెతుక్కోదలచుకున్నాను- తరువాత అలాగే చేశాను కూడ.
- బాలి
(ఔచిత్య అనౌచిత్యాలతో నిమిత్తం లేకుండా చిత్రకారుడు బాలి రాసుకున్న ఆత్మకథ: ‘చిత్ర’మైన జీవితం. పురాణం, నండూరి, శ్రీశ్రీ, లత, సౌరిస్, మోహన్ లాంటివారెందరో ఇందులో తీపికో చేదుకో పాత్రలుగా నిలబడతారు. ‘రావిశాస్త్రా, వాడెవడూ’ అన్న టీసీ సంగతీ, వడ్డెర చండీదాస్ సీరియల్ నవలకు బొమ్మలు వేస్తూ తనకు నచ్చని సెక్స్ శాడిజం వర్ణనలున్న పేజీల్నీ బాలి చించేసిన సంగతి కూడా ఇందులో వస్తాయి. ‘మరీ ఘోరంగా ఉన్నచోట పేజీలకు పేజీలు చించేశాను- ఆ చివరా ఈ చివరా కలిపేశాను’. ఒక సంపాదకుడు(పురాణం) ఎంపిక చేసిన నవలని ఒక ఇల్లస్ట్రేటర్ తన విచక్షణతో ఇలా చేయడం ఏ రకమైన సాహిత్య ప్రమాణం అన్న ప్రశ్న తలెత్తుతుంది. దానికి బాలి సమర్థన: ‘ఎవరి బుర్రలోకి ఏ వెర్రి ఆలోచనో వస్తే ఎలాగ?’ అచ్చు ప్రమాణాల పరంగానూ నిరుత్సాహం కలిగించే ఈ పుస్తక ప్రచురణ: శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్. పేజీలు: 226; వెల: 150; ప్రతులకు: రచయిత, ప్లాట్ నం. 1బి-83, 2-8-18, సెక్టర్-9, ఎమ్వీపీ కాలనీ, విశాఖపట్నం-9849963082.)