జనజీవనంలో ‘మందు’ పాతర
విశ్లేషణ
విజయవాడలో ఇటీవల జరిగిన కల్తీ మద్యం దుర్ఘటన రాష్ట్రాన్ని కుదిపివేసింది. ఐదుగురు చనిపోయారు. మరికొందరు ఆస్పత్రుల పాలయ్యారు. ఇది మొదటిది కాదు. చివరిదీ కాదు. కానీ దుర్ఘటనలు సృష్టించే విషాదం ఎప్పటికీ కదలిస్తూనే ఉంటుంది. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధితులను పరామర్శించారు. వారి గోడుతో స్పందించి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించాలని కోరారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చేయలేకపోతే, తాము అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తామని కూడా జగన్ ప్రకటించారు. దీనితో ఈ అంశానికి మళ్లీ ప్రాధాన్యం వచ్చింది. విజయవాడ తాజా దుర్ఘటన అనేక సామాజిక అంశాలను ఎత్తి చూపింది.
ప్రపంచం మొత్తం మీద భారతదేశంలో ఉన్న మానవ వనరులు విలువైనవని, 35 సంవత్సరాల లోపు యువతరం 60 శాతం ఉందని, ఈ వనరు దేశం ప్రబల ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఎంతో దోహదం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ మొదలు ఎందరో మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇది అతిశయోక్తి కాదు. కాకపోతే దేశంలో మానవ వనరులు ఏ తీరులో ఉన్నాయి? వాటిని ఏ మేరకు ఉపయోగించుకోగలుగుతున్నాం? తగిన నైపుణ్యం లేకపోవడం ఒక లోపం కాగా, మద్యపానంతో ఈ వనరులు అధికశాతం నిర్వీర్యం కావడం మరో వాస్తవం.
గ్రామీణ ప్రాంతాలలో ఈ వ్యసనం కారణంగా 65 శాతం ప్రజలు పూర్తిగా ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. అమాయకత్వం, బలహీనతలను ఆసరా చేసుకుని సాగుతున్న కల్తీ మద్యం అమ్మకాలకు అధికార యంత్రాంగం మద్దతు, రాజకీయ జోక్యం తోడై పేదల రక్తాన్ని పీలుస్తున్నాయి. అందుకే ‘స్వర్ణబార్’ తరహా ఉదంతాలు ఎన్ని జరుగుతున్నా ప్రభుత్వాలు మాత్రం మద్యం ఇచ్చే ఆదాయం మత్తుకు బానిసలవుతున్నాయి.
మద్యం కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 80 లక్షల కుటుంబాలు రకరకాల ఇక్కట్లకు గురి అవుతున్నాయని ‘సామాజిక సర్వే’ చెబుతున్నది. సంపాదన మొత్తం మద్యం పైనే వెచ్చించే వారు 5 శాతం ఉండగా, 50 శాతం ఆదాయాన్ని తగలేస్తున్నవారు 40 శాతం మించి ఉన్నారు. దీనికి బానిసలైన వారి సగటు ఆయుర్దాయం కూడా గణనీయంగా తగ్గిపోతున్నది. కాగా, గత రెండు దశాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే ఈ వ్యసనానికి బానిసలవుతున్న వారు 25 శాతం పెరిగిన సంగతి అర్థమవుతుంది. అసలు ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం మద్యంలో 5 శాతం మన దేశంలోనే వినియోగిస్తున్నారు.
అయితే దేశంలో తాగుతున్న మొత్తం మద్యంలో 2/3 వంతు వరకు రికార్డులలోకి ఎక్కడం లేదు. అంతర్జాతీయ బెవరేజెస్ వినియోగం గురించి వివరించే ‘లాన్‌సెట్’ పత్రిక ఈ విషయం వెల్లడించింది. ఆరోగ్యానికి తీవ్ర హాని చేసే కల్తీ కల్లు, కాపుసారా, గుడుంబాల వినియోగం కూడా భారత్‌లో ఎక్కువేనని ఆ పత్రిక పేర్కొన్నది. దేశ ఆర్థిక వ్యవహారాల మీద తాజా నివేదికలు అందించే ‘అసోసియేట్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ నివేదిక ప్రకారం మద్యం పరిశ్రమ దేశంలో ఏటా 30 శాతం మేర విస్తరిస్తున్నది. 2015 చివరకు చూస్తే దేశంలో ఖర్చయిన మద్యం 20 బిలియన్ లీటర్లనీ, వీటి మీద ప్రజలు పెట్టిన ఖర్చు 1.5 లక్షల కోట్ల రూపాయలని కూడా ఆ నివేదిక వెల్లడించింది.
ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్‌తో (ఐఎంఎఫ్‌ఎల్) పాటు, దిగుమతి చేసుకుంటున్న విదేశీ మద్యానికి కూడా డిమాండ్ పెరుగుతున్నదని పారిశ్రామిక వర్గాల అధ్యయనంలో తేలింది. మద్యం అమ్మకాలతో ఖజానాకు ఇబ్బడిముబ్బడిగా ఆదాయం వస్తున్నది. దీనితో అధికారంలోకి ఎవరు వచ్చినా, ఎన్నికల ముందు మద్య నిషేధం మీద హామీ ఇచ్చినా దీని జోలికి వెళ్లడం లేదు. గులాటి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ టాక్సేషన్ (తిరువనంతపురం) వెలువరించిన నివేదిక ప్రకారం, చాలా రాష్ట్రాల ఆదాయాలలో 20 శాతం మద్యం ద్వారానే సమకూరుతున్నది. ఈ ఆదాయం రెండు దశాబ్దాల నుంచి పెరుగుతున్నది.
2014-15 ఆర్థిక సంవత్సరంలో తమిళనాడుకు సమకూరిన ఆదాయం రూ. 21,800 కోట్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004-05 నాటి మద్యం ఆదాయం రూ. 2,367 కోట్లు. ఇదే పదేళ్ల వ్యవధిలో 2013-14 నాటికి రూ. 10,923 కోట్లకు చేరుకుంది. అంటే 460 శాతం పెరుగుదలతో, సగటు సంవత్సర వృద్ధి 46 శాతమన్నమాట. ఈ పెరుగుదల మరే ఇతర వనరుల్లోను కనిపించకపోవచ్చు. రాష్ట్ర విభజన తరువాత 2014-15 ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ ఆదాయం రూ. 10,927 కోట్లు. ఆపై 2015 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు మన రాష్ట్రానికి సమకూరిన ఆదాయం రూ. 5,544 కోట్లు. అంటే 2015-16 చివరి వరకు లెక్కిస్తే మరో రూ. 3000 కోట్లు ఆదాయం ఆర్జించనున్నది. వెరసి ఈ సంవత్సరం ఆదాయం రూ. 8,544 కోట్లకు చేరుతుందని అంచనా. అంటే మద్యం ఆదాయం మత్తులో ప్రభుత్వం కూరుకుపోయిందా?
ఆదేశిక సూత్రాల ప్రకారం సంక్షేమ రాజ్యస్థాపన రాజ్యాంగం ప్రధాన లక్ష్యం. పేదలకు పెద్దపీట వేసి సంక్షేమ రాజ్యాన్ని స్థాపిస్తామని అంతా ప్రకటిస్తారు. అయితే ఒక పక్క పింఛన్లు, సబ్సిడీ బియ్యం, గృహ నిర్మాణం, ఆరోగ్య పథకాలు వంటివి ఇస్తూనే, మరోవైపు ప్రజల ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీసే మద్యాన్ని యథేచ్ఛగా పంపిణీ చేయిస్తున్నారని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరలాజికల్ సెన్సైస్ కర్ణాటకలో జరిపిన అధ్యయనంతో తేల్చింది. ఇలాంటి ఆదాయాన్ని పౌర సేవలకు వినియోగించడం నేరమని గాంధీజీ ఏనాడో చెప్పారు. ఇది కొన్ని సందర్భాలలో తప్ప ప్రభుత్వాలు గుర్తుంచుకోలేదు. మద్యం మీద ప్రభుత్వానికి ఒక రూపాయి ఆదాయం వస్తే, దామాషా ప్రకారం ఒక వ్యక్తి తన ఆరోగ్యం కోసం రూ. 2 ఖర్చు చేయాలి. కాబట్టి ప్రభుత్వాలు మద్య నిషేధం విషయంలో మీనమేషాలు లెక్కించడం సరికాదు.
అయినా మద్య నిషేధం సాధ్యం కాదని వాదించేవారూ ఉన్నారు. ఇదొక పలాయన వాదమే. మద్యం ఆదాయం లేకుండా మనుగడ సాగిస్తున్న, వృద్ధి చెందుతున్న రాష్ట్రాలు ఉన్నాయి. ఆ ఆదాయం లేకున్నా గుజరాత్ 10 శాతం వృద్ధిరేటు సాధిస్తున్నది. నిషేధం ప్రయత్నం ఇక్కడా జరిగింది. నెల్లూరు జిల్లాలో దూబగుంట రోశమ్మ సారా వ్యతిరేకోద్యమం ఆరంభించారు. నిషేధించడం, మళ్లీ ఎత్తివేయడం జరిగింది. 2014 ఎన్నికలలో చంద్రబాబు కూడా తన ఎన్నికల ప్రణాళికలో నిషేధం అమలును చేర్చారు. కానీ ఇంతవరకు ఏమీ చేయలేదు.
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. బెల్టు షాపుల ఎత్తివేతకు సంబంధించిన ఫైలు మీద తొలిరోజే ముఖ్యమంత్రి సంతకం చేసినా, క్షేత్ర స్థాయిలో వాటి సంఖ్య పెరిగిపోయింది. ప్రభుత్వమే నేరుగా మద్యం వ్యాపారానికి పూనుకున్నది. ఫోన్ చేస్తే డోర్ డెలివరీ సౌకర్యం కూడా వచ్చిందని కూడా వినికిడి. పైగా ధరలు తగ్గించి, విక్రయాలు పెంచి అధికారులకు లక్ష్యా లను కూడా నిర్దేశిస్తున్నారు. ఇదేమి సంక్షేమం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పన్నుల ద్వారా సమకూరుతున్న ఆదాయంలో ద్వితీయ స్థానం మద్యానిదే. 2014-15 సంవత్సరంలో అన్ని రకాల వస్తువుల మీద సమ కూరిన మొత్తం ఆదాయం రూ. 35,126.60 కోట్లు. అందులో మద్యం ద్వారా లభించినది రూ. 11,480 కోట్లు. కాగా 2015-16 సంవత్సరం రాబడిలో ఇందులో 15 శాతం పెరుగుదల ఉండవచ్చునని అంచనా.
‘మద్యం రాబడి పెరుగుతున్నదంటే అర్థం, పేద కుటుంబాల పిల్లలకు పోషకాహారం తగ్గిపోతున్నట్టు లెక్క’ అని సెంటర్ ఫర్ సోషియో ఎకనమిక్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ పేర్కొంది. మద్యం అమ్మకాలు ఎంతగా పెరిగితే, అసమానతలు కూడా అంత తీవ్రంగా పెరుగుతాయని కూడా ఆ సంస్థ వెల్లడించింది.
గ్రామం, పట్టణం, నగరం అనే తేడా లేకుండా జన జీవితాన్ని ‘మందు’ పాతర ధ్వంసం చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాలలో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, నేతలు పంచు తున్న ఉచిత మద్యం పాఠశాలలకు వెళ్లే బాలలను కూడా ఆ వ్యసనానికి బానిస లయ్యేటట్టు చేస్తున్నదని కొన్నేళ్ల క్రితం లోక్‌సత్తా చేపట్టిన అధ్య యనం ద్వారా వెల్లడైంది. సమాజంలో విషమ పరిస్థితులు సృష్టిస్తున్న మద్యాన్నీ, దాని మీద వచ్చే ఆదాయాన్నీ ఒక పెద్ద వనరుగా ప్రభుత్వాలు పరిగణిం చడం సమంజసం కాదు. ప్రభుత్వ ఆదాయం కన్నా, ప్రజారోగ్యమే మిన్న.
- డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
(వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రి. మొ. 9989024579)