పనిమనిషితో సరసలాడుతూ దొరికిపోయినా..
ఆశ్చర్యపోవడం! విస్తుపోవడం!!
నోవా వెబ్‌స్టర్ (1758–1843) అమెరికా నైఘంటికుడు. 1828లో ‘యాన్ అమెరికన్ డిక్షన్రీ ఆఫ్ ది ఇంగ్లిష్ లాంగ్వేజ్’ పేరుతో ఆంగ్ల నిఘంటువు కూర్చారు. Center, Check, Color, Program లాంటి అమెరికా తరహా స్పెలింగ్స్‌ను ప్రాచుర్యానికి తెచ్చారు. ఆధునిక ‘మెరియమ్–వెబ్‌స్టర్ డిక్షన్రీ’కి మూలం వెబ్‌స్టర్ కూర్చినదే! ఇందులో మెరియమ్ అనేది జార్జ్, చార్లెస్ అనే ప్రచురణకర్త సోదరుల ఇంటిపేరు. ఇంగ్లండ్‌లో ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు ఎంత ప్రసిద్ధమైందో, అమెరికాలో వెబ్‌స్టర్ నిఘంటువు అంత ప్రసిద్ధమైంది.
వెబ్‌స్టర్ జీవితంలో జరిగిందని చెప్పే ఈ గాథ విస్తృత ప్రచారంలో ఉంది. ఒకరోజు వెబ్‌స్టర్ భార్య పనిమీద బయటికి వెళ్లి ఇంటికి వచ్చేసరికి, వెబ్‌స్టర్ ఇంటి పనిమనిషితో సరసమాడుతూ దొరికిపోయారట!.. ‘‘నోవా, నేను ఆశ్చర్యపోయాను(ఐమ్ సర్‌ప్రైజ్డ్),’’ అని అరిచిందట భార్య.
‘‘డియర్, నువ్వు మన గొప్ప భాషను జాగ్రత్తగా చదివినట్టు లేదు,’’ అని ఈ సందర్భంలోనూ భార్య భాషను సరిదిద్దారట వెబ్‌స్టర్. ‘‘ప్రసిద్ధ నైఘంటికుడి భార్యవై వుండి ‘ఆశ్చర్యపోయాను’ అంటావా? ‘విస్తుపోయాను(ఎస్టానిష్డ్)’ అనాలిగానీ!’’.