
భంగపడిన రాజ్యాంగం
ఒక పెద్ద రాష్ట్రాన్ని వివాదాల నడుమ విభజించే ముందు రాజ్యాంగంలోని 143వ అధికరణ (1)(2) క్లాజులను సద్వినియోగం చేసుకుని ఇంతటి ప్రజా ప్రయోజనాలు ఉన్న అంశం కాబట్టి రాష్ట్రపతి సుప్రీంకోర్టును సంప్రదించి ఉండవలసింది. అదీ చేసినట్టు కనిపించదు.
‘రాజ్యాంగాన్ని గౌరవంతో చూసుకోవాలి. రాజకీయ పార్టీల, పాలకుల చేతుల లో రాజ్యాంగం ఆటవస్తువు కారాదు. నేడు దేశంలో రాజకీయ జీవితం చిందరవందరయింది. రాజకీయ పక్షాలు తామరతంపరగా విస్తరించడంతో ఇంతకు ముందు ఉన్న అగ్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. నేడు ఏ ఒక్క పార్టీకి పార్లమెంటు ఉభయ సభలలో మూడింట రెండు వంతుల మెజారిటీ వచ్చే పరిస్థితులు లేవు. 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు అనేక పర్యాయాలు సవరణలు జరిగాయి. ఈ సవరణలు ప్రజల ప్రాథమిక హక్కులను హరించివేశాయి. పాలక పక్షం రాజకీయ ప్రయోజనం కోసం ప్రతిపాదించే బిల్లులకు అడ్డుతగులుతున్నాయన్న పేరుతో ఇంకొన్ని సవరణలు న్యాయస్థానాల తీర్పులనే బేఖాతరు చేశాయి’.
(ఇండియన్ కానిస్టిట్యూషనల్ లా, ఆచార్య ఎంపీ జైన్)
తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ను విభజించడానికి కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ తన స్వార్థం కోసం తొక్కిన పెడమార్గాలను చూస్తే ఆ మాటలు ఎంతటి అక్షరసత్యాలో తెలుస్తుంది. అలాంటి స్వార్థబుద్ధితో ఉత్తరప్రదేశ్‌ను విభజించాలని కోరుతూ బీఎస్‌పీ ముఖ్యమంత్రి మాయావతి రెండున్నర సంవత్సరాల క్రితమే తీర్మానం చేయించి, కేంద్రానికి నివేదించింది. కానీ ఆ తీర్మానం అతీగతీ లేదు. ఆంధ్రప్రదేశ్‌ను మాత్రం ఆగమేఘాల మీద విభజించి, బిల్లు మీద రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా వేయించింది.
చివరకు మిగిలింది!
పార్లమెంటరీ ప్రభుత్వాలు ఎప్పుడైనా, ఎక్కడైనా ఒక ప్రతిపాదన, ఒక బిల్లు, అది అప్రధానమైన చిన్న బిల్లు అయినా, చట్టసభలో ప్రవేశపెట్టాలంటే ఉండవలసింది -లక్ష్య నిర్వచనం. ఇంకా ఉపోద్ఘాతం, తగిన వివరణ సభలో ప్రవేశపెట్టే బిల్లుకు ఇవ్వడం పార్లమెంటరీ చరిత్రలో కనిపిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన బిల్లుకు లక్ష్యం లేదు. లక్షణమూ లేదు. నిజానికి ఇరుప్రాంతాలవారికి (సీమాంధ్ర, తెలంగాణ) విభజన వల్ల ఒనగూడే ప్రయోజనం గురించి కొన్ని గాలివాటు కబుర్లు, ప్రతిపాదనలు మాత్రమే చేసిన ఈ తప్పుల తడక బిల్లును మొదట రాష్ట్ర శాసనసభ తిరస్కరించి పంపేసింది. దీనితో ఇరుప్రాంతాల వారికీ మిగిలినది- రెండు ‘టైటిల్స్- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే రెండు నిరుపయోగమైన పట్టాలు. ఇవి నిరుద్యోగులకు దొరికే పట్టాల వంటివే. బిల్లులో కనిపిస్తున్నవి అమలుకు నోచుకోవు. బిల్లులో చేర్చకుండా జాగ్రత్తపడి, బుజ్జిగింపుతో బయట చేసిన వాగ్దానాలకు విలువ లేదు. రాష్ట్రపతి కూడా కాంగ్రెస్ వారే కనుక తక్షణమే సంతకం చేశారు. ఇక్కడ గమనించవలసిన అంశం- రాష్ట్రపతి సహా యావత్తు కేంద్ర మంత్రిమండలి రాజ్యాంగబద్ధంగా పాలిస్తామని బాస చేసి కూడా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినవారే.
అడుగడుగునా ఉల్లంఘనే
అనేక రాజ్యాంగ ఉల్లంఘనలలో భాగమే ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన బిల్లు. ఉల్లంఘన కాకుండా ఉండాలంటే, పత్రికా సమాచార స్వేచ్ఛను ఆటంక పరచడానికి రాజీవ్‌గాంధీ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పోస్టల్ బిల్లును నాటి రాష్ట్రపతి జయిల్‌సింగ్ తొక్కిపెట్టినట్టే, విభజన బిల్లు తన ఆమోదముద్ర కోసం వచ్చినపుడు నేటి రాష్ట్రపతి నిలిపివేసి ఉండేవారు. ఒక పెద్ద రాష్ట్రాన్ని వివాదాల నడుమ విభజించే ముందు రాజ్యాంగంలోని 143వ అధికరణ (1)(2) క్లాజులను సద్వినియోగం చేసుకుని ఇంతటి ప్రజా ప్రయోజనాలు ఉన్న అంశం కాబట్టి రాష్ట్రపతి సుప్రీం కోర్టును సంప్రదించి ఉండవలసింది.
అదీ చేసినట్టు కనిపించదు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలంటే, దాని సమైక్యతను రక్షించడానికి 32వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన 371(డి)వ అధికరణను మూడింట రెండువంతుల మెజారిటీతో సవరించక తప్పదని కేంద్రప్రభుత్వ అటార్నీ జనరల్ వాహనవతి మొత్తుకున్నా కేంద్రం పెడచెవిని పెట్టినప్పుడయిన వారించవలసిన రాష్ట్రపతి ఆ బాధ్యతను, హక్కును పట్టించుకోకపోవడమూ విచారకరమే! రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో 368వ ప్రత్యేక అధికరణ ప్రకారం చేర్చిన రాజ్యాంగ సవరణలని మళ్లీ మార్చాలంటే (అందులోనూ ఉభయ రాష్ట్రాల విద్య, ఉద్యోగాది ప్రయోజనాలను రక్షించడం కోసం) రాజ్యాంగ సవరణ అవసరం.
అదీఎలా? పార్లమెంటులో మూడింట రెండువంతుల మెజారిటీ ఆమోదించడమే గాక రాష్ట్రాల శాసనసభలలో సగం లెజిస్లేచర్లు కూడా ఆమోదించవలసి ఉంటుంది. దాన్ని కూడా పాటించలేదు. అంతేగాదు రాష్ట్రాలను విభజించే హక్కు పార్లమెంటుకూ, ప్రభుత్వానికీ ఉందని రాజ్యాంగంలోని 3వ అధికరణ చెప్పినా, పాలకులు రాజ్యాంగం మౌలిక స్వభావానికీ ఫెడరల్(సమాఖ్య) స్ఫూర్తికీ, ఫెడరల్ వ్యవస్థ స్వభావానికీ విరుద్ధంగా వెళ్లమని ఆ అధికరణ ఎక్కడా చెప్పలేదు. ఈ విషయంలో కూడా ‘అధికరణ-3’ రాజ్యాంగంలో పొందుపరచవలసి వచ్చిన చారిత్రక సందర్భాన్ని (అది 1948 నాటి సంస్థానాధీశుల ‘రాజ్యాలు’ ఇలాచేయక యూనియన్‌లో విలీనం కావడానికి మొరాయిస్తున్న దశ) మరచిపోరాదని 1967/1993 నాటి తీర్పుల్లో సుప్రీం స్పష్టం చేసింది. విభజన ప్రక్రియలో ‘రాజ్యాంగాన్ని, రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదు’ అని వక్కాణించింది; రాజ్యాంగ నిబంధనలను దాని మౌలిక స్వభావాన్ని అతిక్రమించి పార్లమెంటు సవారీ చేయరా’దని హెచ్చరించింది! ఎందుకంటే రాజ్యాంగ రచనకు జోడించిన ‘ముందుమాట’ లేదా ‘ఉపోద్ఘాతం’ సహితం రాజ్యాంగ పత్రంలో భాగం కాదని చెప్పి, అందులోని సాంఘిక, ఆర్థిక, న్యాయపరమైన, విలువైన ఆదర్శాలను ఉల్లంఘించడానికి కొన్నేళ్ల పాటు నడుం కట్టిన పాలకులు, ‘పెద్దలు’న్న దేశం ఇది! కాని అటు తర్వాత సుప్రీం ఈ ‘ఉపోద్ఘాతాన్ని’ రాజ్యాంగం మౌలికతలో అంతర్భాగమని తీర్పు చెప్పి, నోళ్లు మూయించింది!
ఫకృద్దీన్ మాదిరిగానే
రాజ్యాంగ అధికరణలలోని ఏ ‘ప్రోవిజో’నయినా సరే రద్దు చేయవచ్చు. సవరించవచ్చు లేదా మార్చవచ్చునన్న నిబంధన ప్రకారమైనా పార్లమెంటు ‘అధికరణ-3’లో రాష్ట్రాల విభజనకు సంబంధించిన తప్పుడు ‘ప్రోవిజో’లను సవరించవచ్చు. అదీ చేయలేదు. ఆ విషయాన్ని రాష్ట్రపతి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రస్తావించడానికీ సాహసించడం లేదు. ఆ ఉన్నత స్థానంలోని వ్యక్తి చలనం లేని వారైతే రాజ్యాంగానికీ, సమున్నత న్యాయస్థానానికీ, మొత్తం దేశ ప్రజా బాహుళ్యానికే ఎలాంటి ఉపద్రవం సంభవిస్తుందో - 1975 నాటి ఎమర్జెన్సీ ప్రకటన పైన రాష్ట్రపతి (ఫకృద్దీన్ అలీ అహ్మద్) రాజ్యాంగ రక్షణ బాధ్యత నుంచి తప్పుకుని అనాలోచితంగా చేవ్రాలు చేశారు. ఆ తర్వాత మళ్లీ నేటి రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు విషయంలో సరిగ్గా అదేపని చేశారు! పైగా వ్యాపారుల మధ్యగాని, రాష్ట్రాల మధ్యగాని, ప్రాంతాల మధ్య గాని ‘సమానత్వం, సమానన్యాయం’ అన్న సూత్రాన్ని పాటించి తీరాలన్న 14వ అధికరణను కూడా పాలకులు గంగలో కలుపుతూవచ్చారు. ఇందుకు తాజా ఉదాహరణ విభజిత ‘ఆంధ్రప్రదేశ్’కు ‘ప్రత్యేకప్రత్తిపత్తి’ని కల్పించాలన్న ప్రతిపాదన.
హామీలకు భరోసా ఉండదు
రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయిన బీజేపీ, తెలుగుదేశం ఎంత సహకరించినా, కొండ ప్రాంతాలకు, దుర్గమ ప్రదేశాలయిన ప్రాంతాలకు వర్తించే ప్రతిపాదన మనకు చెల్లదు. జాతీయాభివృద్ధి మండలి సంయుక్త సమావేశం ఆమోదం ప్రకారం ఆచరణకు రావలసిన ఈ ప్రతిపత్తి ప్రధాన మంత్రి ప్రణాళికా సంఘాన్ని ఆదేశిస్తే జరిగేపని కాదు. పైగా బిల్లులోనూ లేదు. ఇటువంటి విలువలేని హామీలనూ, భరోసాలనూ న్యాయస్థానాలు నమ్మజాలవని 1952/1954/1955/1967/1979లో సుప్రీం స్పష్టం చేసింది! న్యాయ సమీక్షకు ఎసరు తెస్తున్న పాలక వర్గాలున్న దశలో మన దేశం ఉందని మరువరాదు! ఈ దుస్థితికీ, దుర్గతికీ ఢిల్లీనుంచి ఆంధ్రప్రదేశ్ ఉభయ ప్రాంతాలకు ‘బ్రహ్మజెముడు’లా పాకిపోయిన ఎంపీ, ఎమ్మెల్యేల ఇటాలియన్ బెటాలియన్ ప్రధాన కారణం!
- వ్యాసకర్త సీనియర్ సంపాదకులు
ఏబీకే ప్రసాద్