
కొంటె బొమ్మలపైనా క్రోధమేనా!
రెండో మాట
శంకర్ ఒక రచనలో అన్నారు–‘కార్టూన్ కథానాయకుడి గుండెలో అంతర్గతంగా గాయం చేస్తుంది. పైకి మాత్రం ఆ కథానాయకుడు ‘నవ్వలేక నవ్వు’ ముఖం పెడతాడు. అదే, కార్టూన్ కళ ఆంతర్యం’ అన్నారు. హాస్యదూరుడైన నాయకుడు మాత్రం ‘కృద్ధనర్తన’ను మాత్రం విడిచిపెట్టడు. శంకర్ ‘మార్చ్ ఆఫ్ టైమ్’లో రాజకీయాలనూ, పార్లమెంటునూ ఉతికి ఆరేయని వారం ఉండేది కాదు. అయినా వారు ఆనందంగా భరించారు. చంద్రబాబు కుమారరత్నం ఈ పాఠం గురించి తెలియకుండా వీరంగాలు వేయరాదు.
‘నేను చెప్పబోయే అంశం గురించి మీ మనసులను ఆలోచించనివ్వండి! మీ పిల్లల మనసులలోనూ పాదుకొనివ్వండి! పత్రికా స్వేచ్ఛ అంటే దేశ పౌర, రాజకీయ మత స్వాతంత్య్ర పరిరక్షణా కల్పవృక్షమని అర్థం. అన్ని సందర్భా లలోనూ, అన్ని కేసులలోనూ, తీర్పులలోనూ న్యాయాధికారులూ, న్యాయ మూర్తులూ ఈ కల్పవృక్షాన్ని సంరక్షించి తీరాలి. ఇది రాజ్యాంగంలో ముఖ్య మైన భాగం. ఈ భాగాన్ని జడ్జీలు నియంత్రించడానికి గాని, పరిమితులు విధించడానికి గాని వీలుండరాదు. ఆమాటకొస్తే లెజిస్లేచర్ (శాసనవేదిక) సహితం ఏ రూపంలోనూ ఈ ప్రజా కల్పవృక్షాన్ని ప్రశ్నించడానికి వీలుండ రాదు. ఇంకా, పాలకుడు రాజులైనా, తరాజులైనా సరే ఈ పౌర హక్కుపైన నిరంకుశాధికారం చలాయించే హక్కు లేదు. ఈ పాలనాశక్తులు ప్రజల తరఫున పాలన వెలగబెట్టే కేవల ధర్మకర్తలుగానే ఉండాలి గాని, ప్రజల ఆస్తికి యజమానులుగా ఉత్తరాధికారులుగా వ్యవహరించరాదు.’ – వీక్లీ అడ్వర్టయిజర్ (లండన్: 18వ శతాబ్దం. హెన్రీ శాంప్సన్ ఉడ్‌ఫుల్ ‘జూనియస్ లెటర్స్’ పేరిట పార్లమెంట్ వ్యవహార శైలిని విమర్శించిన పత్రాలు).
పార్లమెంట్‌ను, శాసన వేదికలను సందర్భానుగుణంగా తూర్పారబట్టిన మరొక ప్రసిద్ధుడు, ‘నార్త్ బ్రిటన్’ పత్రిక అధిపతి జాన్ విల్కీస్ పార్లమెంట్ సభ్యుడు. శాంప్సన్ ఉడ్‌ఫుల్ మాదిరే విల్కీస్ కూడా వేధింపులకు గురైన వాడు. కోపోద్రిక్తుడైన రాజు విల్కీస్‌నే గాక, ఆ పత్రిక ముద్రాపకులను, ప్రూఫ్ రీడ ర్లను, అమ్మేవారిని కూడా ‘రాజద్రోహ’ నేరం మీద అరెస్టు చేసి జైలుకు పంపారు. దీని మీద అప్పీలుకు వెళ్లిన విల్కీస్‌ను ప్రధాన న్యాయమూర్తి విడు దల చేయడమే కాకుండా, అధికార జులుంను ఖండిస్తూ ‘ఇది తప్పుడు అరెస్టు’ అని నిండు పేరోలగంలో ప్రకటించాడు. అలాగే ఉడ్‌ఫుల్‌ను కూడా లండన్ కోర్టు జైలుకు పంపడానికి నిరాకరించింది. ఆ తరుణంలో జూనియస్ రాసిన నిశిత ప్రకటనేlపైన ఉదహరించిన లేఖ. నిరంకుశ పాలకులను ఎలా లొంగదీయాలో నిరూపించి, నిభాయించుకున్న ఆనాటి కోర్టులు తీరు అది.
వ్యంగ్య చిత్రాలతో వణుకు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలకులు, వారి సంతానం ప్రతిపక్షాల మీద, పత్రికా రచయితలపైన జులుం చలాయించడానికి చూస్తోంది. పాలనలోని లోటు పాట్లను విమర్శనాత్మకంగా విశ్లేషించిన జర్నలిస్టులనూ, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న వెబ్ నిర్వాహకులనూ (ఉదా: సోషల్ మీడియా స్వచ్ఛంద కార్యకర్తగా ‘పొలిటికల్ పంచ్’ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న రవికిరణ్ అరెస్ట్) ఒక వార్త ఆధారంగా వేధించి అరెస్టు చేశారు. నిజానికి భిన్నాభిప్రా యాన్ని సహించలేని ఒక ధోరణి ఇటీవల కాలంలో కేంద్రం నుంచి రాష్ట్రాల పాలకుల దాకా ప్రత్యేక ‘వ్యాధి’గా మారింది.
రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా పునర్‌నిర్మాణం పేరిట హిందూత్వ మితవాద, సెక్యులర్ వ్యతి రేక భావజాలాన్ని విద్యారంగం, శాస్త్ర విధాన పరిషత్తులు, యూజీసీ సహా అన్ని శాఖలలోను చాపకింద నీరులా చొప్పించడానికి ఐక్యతా నినాదం చాటున అనైక్యతా బీజాలను యువత ఆలోచనలలో నాటుతున్నారు. ఇవాళ అభిప్రాయ వ్యక్తీకరణకు, విమర్శకు, సొంత డబ్బా వాయించడానికి, విపక్ష వాణిని వక్రీకరించడానికి, విజయావకాశాన్ని భూతద్దంలో చూపించుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగించడం సాధారణమైపోయింది. ఇంకా ట్వీటర్ ట్వీట్స్‌ను కూడా ఇందుకు ఉపయోగించుకోలేని వాడిని పాపా త్ముడిగా పరిగణిస్తున్న కాలమిది.
చివరికి కార్టూన్ బొమ్మలను కూడా భరించ లేని వారు పాలకులుగా ఎదుగుతున్న ఘడియలివి. ఎక్కడికో వెళ్లనక్కరలేదు. ఏ మార్గంలో అయితేనేం! ఓటుకు కోట్లు కేసులో చిక్కుకున్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవమానాన్ని మిగిల్చారు. బీజేపీ చెలిమితో బొటాబొటీ మెజారిటీని అసెంబ్లీలో కొనసాగిస్తున్నారు. ఆ పార్టీతో పొత్తు తన పుట్టెను ఏ క్షణాన ముంచుతుందోనన్న భయంతో విపక్షంలో బలహీ నులైన సభ్యులను ధనరాశులు చూపించి చంద్రబాబు లోబరుచుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అలాగే జర్నలిస్ట్ రవికిరణ్ వెబ్ ఆసరాగా పొలిటికల్ పంచ్‌లో చిత్రించిన కార్టూన్ చూసుకుని జడుచుకునే స్థితికి పాలకులు వచ్చా రంటే పచ్చి వాస్తవాలను భరించలేకపోవడమే కాదు, అలాంటివాటికి వేది కగా నిలిచిన పంచ్ ముద్రను కూడా సహించలేకపోతున్నారు. అంటే ప్రస్తు తం నాయకత్వ పతన దశకు పరాకాష్టను మనం చూస్తున్నామ నిపిస్తుంది.
శంకర్ పిళ్లై–పండిట్ నెహ్రూ– కార్టూన్
సుప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారుడు, ‘శంకర్స్ వీక్లీ’ పత్రిక స్థాపకుడు శంకర పిళ్లై ‘మార్చ్ ఆఫ్ టైమ్’ పేరిట రాజకీయాలనూ, పార్లమెంటులో అధికార, ప్రతి పక్షాల నాయకుల ప్రవర్తనపైన, అసహనంపైన కార్టూన్లు చిత్రిస్తూ ప్రజలను విజ్ఞానవంతులను చేసేవారు. నాటి ప్రధాని పండిట్ నెహ్రూ, ముఖ్య మంత్రులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. శంకర్ ఒక రచనలో అన్నారు–‘కార్టూన్ కథానాయకుడి గుండెలో అంతర్గతంగా గాయం చేస్తుంది. పైకి మాత్రం ఆ కథానాయకుడు ‘నవ్వలేక నవ్వు’ ముఖం పెడతాడు (ఇంట ర్నల్ ఊండ్ అండ్ ఎక్స్‌టర్నల్ లాఫ్టర్). అదే, కార్టూన్ కళ ఆంతర్యం’ అన్నారు. హాస్యదూరుడైన నాయకుడు మాత్రం ‘కృద్ధనర్తన’ను (కోపం నటిస్తూ) మాత్రం విడిచిపెట్టడు. శంకర్ ‘మార్చ్ ఆఫ్ టైమ్’లో రాజ కీయాలనూ, పార్లమెంటునూ ఉతికి ఆరేయని వారం ఉండేది కాదు. అయినా వారు ఆనందంగా భరించారు. చంద్రబాబు కుమారరత్నం ఈ పాఠం గురించి తెలియకుండా వీరంగాలు వేయరాదు.
కార్టూన్ ప్రక్రియను కుంచె కళా వైభవంగా భావించి, చిరునవ్వుతో భరించిన కొద్దిమంది అగ్ర రాజకీయ వేత్తలలో పండిట్ నెహ్రూ ఒకరు. తన స్నేహితుడు శంకర్ కార్టూన్లతో తనపై వ్యంగ్య విమర్శనాస్త్రాలు వేయడానికి స్నేహ వాత్సల్యంతో జంకుతాడే మోనని భావించిన నెహ్రూ, ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా, ‘శంకర్! నన్నూ నీవు విడిచిపెట్టొద్దు. మా అహం కారాల్ని నీ కార్టూన్ ద్వారా కిందికి దించేయ్’ అంటూండేవారు. అందుకనే నేమో, రాజ్యాంగ నిర్మాతలు ‘ముందుమాట’ నుంచి ముగింపు దాకా రాజ్యాంగంలో అడుగడుగునా ‘భావ ప్రకటనా స్వేచ్ఛ’ గురించీ, పౌరుల ప్రాథమిక హక్కుల గురించీ, సెక్యులర్ ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ పరిరక్షణ గురించీ; బాధ్యతల అధ్యాయంలో ప్రజలలో మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా శాస్త్ర విజ్ఞానాన్ని పెంచి పోషించాలనీ మొత్తుకున్నారు. నేడు ఆ మౌలిక ప్రజాస్వామ్య విలువలన్నింటికీ తూట్లు పొడిచే ‘యజ్ఞం’ ప్రారం భమైంది.
ప్రపంచ ప్రసిద్ధ చరిత్రకారుడు, పరిశోధనాచార్య రోచీ అన్నారు: ‘అధికారం పాలకులను అవినీతిపరులుగా మారుస్తోంది. అధికారం కోల్పో బోతున్న దశలో వారిని మరింతగా అవినీతివైపునకు నెడుతుంది’. ఇందుకు దృష్టాంతంగా నిలిచే ఒక వార్తను ‘హిందూ’ పత్రిక రెండేళ్లనాడే ప్రకటిం చింది: ‘ఆసక్తిదాయకమైన విషయం–ముఖ్యమంత్రి అతి వేలంగా పెడుతున్న హద్దుమీరిన ఖర్చులు (ప్రజాధనం) కేవలం ఆఫీసులను పదే పదే మార్చ డంతోనే ఆగడం లేదు. చార్టర్డ్ విమానాలను, హెలికాప్టర్లను తరచూ వాడే వరకూ కొనసాగుతోంది. ‘పొదుపు’ అనే పదాన్ని పక్కన పెట్టేసి అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నారు (3.5.15). చివరికి ప్రతిపక్షంలోని ఫిరాయింపు దార్లపై ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని విధిగా ప్రయోగించాలని సుప్రీం కోర్టు తమిళనాడు అసెంబ్లీ పరిణామాలపై ఇచ్చిన తీర్పులో (జి. విశ్వ నాథం వర్సెస్ స్పీకర్, తమిళనాడు అసెంబ్లీ) స్పష్టం చేసినా, దేశ రాజ్యాంగ చట్టానికే విలువనివ్వని కేంద్ర, రాష్ట్రాల పాలకులు న్యాయస్థానాలను కేవల ‘విరామ చిహ్నాలు’గా వినియోగించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విద్య నేర్చారు.
సోషల్ మీడియాకు ఎందుకీ ప్రాధాన్యం?
బాధ్యతగల, విమర్శనా దృష్టిగల పత్రికలు ప్రపంచంలో పాలకుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడకుండా ప్రజాపక్షంగా సాధించిన విజయాలెన్నో ఉన్నాయి. 1810లోనే భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి పార్లమెంటులో చాటిన రిచర్డ్ బ్రిన్ స్లీ హెరిడన్ (బ్రిటన్) ఏమన్నాడు: ‘పత్రికా స్వేచ్ఛను నాకు ప్రసాదించండి, ప్రతినిధుల సభలో ఎంతమంది అవినీతిపరులో మంత్రికి నిరూపించి చూపుతా, సభ్యులను ఎంతగా డబ్బుకి లోబర్చుకోవచ్చో మంత్రికి నిరూపిస్తా’నని సవాలు విసిరాడు. ఇలాంటి ప్రజానాయకులూ, పాత్రికేయ కురువృద్ధులూ భారత స్వాతంత్య్రోద్యమంలో కాకలు తీరిన పత్రికాధిపతులూ, ప్రజా సంక్షేమానికే కట్టుబడి ఆంధ్రదేశంలోనేగాక (రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన) యావద్భారత స్థాయిలో కీర్తి పతాకాలను ఎగు రవేసిన వారెందరో ఉన్నారు.
జాతీయ స్థాయికి ఎదిగిన కోటంరాజు రామారావు, మానికొండ చలపతిరావు (నేషనల్ హెరాల్డ్), కుందూరి ఈశ్వర్‌దత్, నార్ల వెంకటేశ్వర రావు లాంటి ప్రముఖులెందరో ఉన్నారు. వారంతా పత్రికా విలువల సంరక్షణకే కాదు, అధికార స్థానాల్లో ఉన్న వారిని తమ రచనల ద్వారా, వ్యంగ్య చిత్రాల ద్వారా గడగడలాడించిన వారు కూడా. ఇంతకూ ఇవాళ మీడియా పాఠకులూ, వివిధ వర్గాలూ, విద్యావంతులూ సోషల్ మీడియా సాధనాలను ఎందుకు ఆశ్రయించవలసివస్తోందన్నది పెద్ద ప్రశ్న. కొన్ని పత్రికలూ, టీవీ ప్రసారాలూ బాకాలుగా మారి పాక్షిక వార్తలతో, విద్వే షపూరిత ఉద్దేశాలకు పరిమితం కావడంవల్ల సామాన్య పాఠకలోకం గందర గోళంలో పడింది. అందుకే వారు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను, విమర్శలను, ప్రశంసలను వ్యంగ్య చిత్రాల ద్వారా పంచుకోవలసివస్తోంది. చానళ్లమధ్య అసూయతో నిండిన అనారోగ్యకర పోటీ ఫలితంగా ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోలేకనే సోషల్ మీడియా సోపానాలను ఎక్కవలసిన దుస్థితి పాఠకులకు దాపురించింది.
ప్రస్తుతం దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఏ పద్ధతిలో కొడిగట్టుకు పోతున్నదో తెలుసుకోవాలంటే శ్రీశ్రీ ‘ఖడ్గసృష్టి’ని ఆశ్రయించాల్సిందే: ‘‘రెండు రెళ్లు నాలుగన్నందుకు/గూండాలు గండ్రాళ్లు విసిరే సీమలో/క్షేమం అవిభాజ్యం అంటే/జైళ్లు నోళ్లు తెరిచే భూమిలో’’ ఆకాంక్షలు, అస్తిత్వాలూ కోల్పోతున్నాం!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in