
బడ్జెట్‌లను మింగే ‘బ్లాక్ హోల్స్’
దేశంలో పేదరిక నిర్మూలన జరగాలన్నా, రాజకీయ, సామాజిక ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలన్నా మొదటి షరతుగా ప్రభుత్వాలు ఖర్చు చేసే డబ్బులో అనగా రాష్ట్ర, కేంద్ర బడ్జెట్‌ల రూపకల్పన, అమలులో ఆర్థిక ప్రజాస్వామ్యం చోటు చేసుకోవాలి. ఆర్థిక ప్రజాస్వామ్యం అంటే ఆర్థిక సమానత్వంతో సమానార్థకమైనది కాదని నా అభిప్రాయం. ఇక్కడ ఆర్థిక సమానత్వం అంటే సమాజం ఆర్థిక నియమం కలిగి ఉండటం. ప్రభుత్వంతో సహా సమాజం అంతా ఒక రాజకీయ, ఆర్థిక నియంత్రణకు బద్ధులై ఉన్నప్పుడే ఆర్థిక ప్రజాస్వామ్యం సాధ్యమవుతుంది.
అన్ని వ్యాపారాల్లాగే ఎన్నికలు కూడా సరికొత్త పెట్టుబడిగా మారిపోయాయ న్నది కాలానుగుణంగా రుజువవుతూ వస్తున్నది. ఎవరైనా పోటీ చేసే హక్కు ఇంకా అడుగంటిపోలేదు కానీ, కేవలం కొందరే గెలవాలన్న నిర్ధారణ ఈ రాజ్యాంగ సూత్రాన్ని పూర్తిగా విస్మరిస్తోంది. కొంత విడ్డూరంగా అనిపించినా ఇది నిజం. కాంట్రాక్టర్లు, రియల్టర్లు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం ఇప్పుడు సర్వసాధారణం. ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చు సాధారణ పౌరుల ఊహకు కూడా అందదు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లోనే కాదు, పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో కూడా డబ్బు ప్రభావం తీవ్రంగానే ఉంది. సర్పంచ్, ఎంపీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్ అభ్యర్థులు వేలు కాదు, లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. కొందరు ఆస్తులు అమ్మి పోటీ చేస్తున్నారు. మరికొందరు గెలుస్తామనే ధీమాతో అప్పులు చేస్తున్నారు.
అంతులేని రాజకీయ బేరసారాలు
అభ్యర్థుల ఖర్చు మీద ఎన్నికల కమిషన్ విధించిన పరిధి గురించి చర్చించి ప్రయోజనం లేదు. దాని లెక్క దానికే. ఎన్నికల్లో చేసే ఖర్చు, మళ్లీ వేరే ఒక్కొక్క అభ్యర్థి పదికోట్ల నుంచి వంద కోట్ల దాకా ఖర్చు చేసినట్టు గత ఎన్నికల అనుభవం చెబుతున్నది. దానితో అభ్యర్థుల ఎంపిక దగ్గరే పార్టీలు ఖర్చును దృష్టిలో పెట్టుకొంటున్నాయి. పార్టీకి నిధులు ఇవ్వగలిగే వాళ్లు, భారీగా ఖర్చు చేయగలిగే వాళ్లు అభ్యర్థులు అవుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలదీ అదే దారి. ఇటువంటి అభ్యర్థులకు పార్టీ మీదగానీ, ప్రజల మీదగానీ ప్రేమ, అభిమానాలు లేవు. పైగా పార్టీని, నాయకత్వాలను బ్లాక్ మెయిల్ చేసైనా పదవులు, ఇతర అవకాశాలు సంపాదించడం సర్వసాధారణమైపోయింది. ఎన్నికల తర్వాత మరొక తంతుకు తెర లేస్తున్నది. మెజార్టీ సీట్లు సాధించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సహజం. తదనంతరం వివిధ పార్టీల మీద గెలిచిన వాళ్లు అధికార పార్టీల్లోకి దూకడం మామూలైపోయింది. ఇటువంటి వారిని తీసుకోవడానికి అధికార పార్టీ వెనకాడటం లేదు. ఇటీవలి ఎన్నికల్లో ఇది మరింత తీవ్రమైంది. ఎదురు లేకుండా చేసుకోవడానికీ, ప్రతిపక్షాలను బలహీన పర్చడానికి చేస్తున్న ప్రయత్నమిది.
వడ్డీతో సహా రాబట్టుకుంటున్నారు
అధికార పార్టీకి అవసరం, ఆసక్తి లేకపోయినప్పటికీ ప్రతిపక్షాల శాసనసభ్యులు వేలం వెర్రిగా పార్టీ మారుతున్నారు. దీని వెనుకఉన్న బలమైన కారణం- ఎన్నికల్లో ఖర్చు పెట్టిన కోట్ల రూపాయలను తిరిగి రాబట్టుకోవడం. రాజకీయ ప్రజాస్వామ్యం సాధించుకున్నా, ఆచరణలో అది ధనస్వామ్యంగా మారిపో యింది. దీనితో రాజకీయ ప్రజాస్వామ్యం, సామాజిక ప్రజాస్వామ్యం రెండూ అర్థం లేని అంశాలుగా మారాయి. భారతదేశంలో కులం ద్వారా ధనం ఒనగూడుతున్నది. తరతరాలుగా నిచ్చెన మెట్లపైనే ఉన్న ఆధిపత్య కులాలు ధనార్జనలో కూడా పైననే ఉన్నాయి. దానితో బడుగు, బలహీనవర్గాలు, డబ్బులు లేని నాయకులకు ఎన్నికలు అసాధ్యమైన ప్రక్రియగా మారిపో యాయి. రాజకీయంగా ఓటు హక్కుకు, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయింది. సరిగ్గా ఇక్కడే బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ సభలో చేసిన చివరి ప్రసంగంలోని మాటలు గుర్తుకొస్తాయి. ‘‘1950, జనవరి 26 నుంచి అమలులోకి వచ్చే రాజ్యాంగం ద్వారా మనం వైరుధ్యంలోకి అడుగుపెడుతు న్నాం. ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒక విలువ ద్వారా రాజకీయ సమానత్వాన్ని అందిస్తున్నాం. కానీ ఆర్థిక, సామాజిక రంగాల్లో ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయి. వీటిని వీలైనంత తొందరలో తొలగించు కోవాల్సి ఉంది. ఒకవేళ ఇవి ఇలాగే కొనసాగితే, రాజకీయ ప్రజాస్వామ్యం ప్రమాదపు అంచుల్లోకి వెళ్లకతప్పదు. మనం ఎంతో శ్రమపడి నిర్మించుకున్న ఈ ప్రజాస్వామ్య సౌధం పేకమేడలా కూలిపోతుంది’’. ఈ వ్యాఖ్యలను భారతదేశ రాజకీయ పరిస్థితులకు ఒక హెచ్చరికగా చూడాలి.
ధనస్వామ్యం వర్ధిల్లుతోంది
రోజురోజుకీ కడు పేదరికంలో కూరుకుపోతూ, ఖరీదైపోయిన ప్రజాస్వామ్య ఫలాలు అందుకోలేని స్థితిలో కొందరుంటే, మరికొందరు కళ్లు మూసి తెరిచేలోగా కోటీశ్వరులుగా మారిపోతున్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తుతున్నారు. వీళ్లెవ్వరూ పరిశ్రమలు పెట్టడం ద్వారా, వ్యాపారాలు చేయడం ద్వారా డబ్బులు సంపాదించడం లేదు. ప్రభుత్వాలు ప్రజల నుంచి పన్నుల ద్వారా సమీకరించిన ప్రజాధనాన్ని గుండు గుత్తగా పట్టపగలే కొల్లగొడుతున్నారు. కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన వాళ్లు, పార్టీలు ఫిరాయిస్తున్న వాళ్లందరూ ఈ కోవలోకే వస్తారు. మన దేశంలో పేదరిక నిర్మూ లన జరగాలన్నా, రాజకీయ, సామాజిక ప్రజాస్వామ్యం మనుగడ సాగించా లన్నా మొదటి షరతుగా ప్రభుత్వాలు ఖర్చు చేసే డబ్బులో అనగా రాష్ట్ర, కేంద్ర బడ్జెట్‌ల రూపకల్పన, అమలులో ఆర్థిక ప్రజాస్వామ్యం చోటుచేసుకోవాలి. ఆర్థిక ప్రజాస్వామ్యం అంటే ఆర్థిక సమానత్వంతో సమానార్థకమైనది కాదని నా అభిప్రాయం. ఇక్కడ ఆర్థిక సమానత్వం అంటే సమాజం ఆర్థిక నియమం కలిగి ఉండటం. ప్రభుత్వంతో సహా సమాజం అంతా ఒక రాజకీయ, ఆర్థిక నియం త్రణకు బద్ధులై ఉన్నప్పుడే ఆర్థిక ప్రజాస్వామ్యం సాధ్యమవుతుంది. ఆర్థిక ప్రజాస్వామ్యం ప్రభుత్వానికి సంబంధించినది. ఇది పూర్తిగా చట్టాల, శాసనాల పరిధిలో జరిగేది. ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేయాలి.
ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలను అమలు చేయాలి. ప్రజలకు కేటాయించిన మొత్తాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ కొందరు వ్యక్తుల లాభాల్లోకి వెళ్లకూడదు. ఇటీవలి కాలంలో బడ్జెట్ రూపొందడంలో, అమలు చేయడంలో వ్యక్తుల ప్రయోజనాలు ప్రధానమవుతున్నాయి. వారి ప్రయోజనా లను ప్రజల అవసరాలుగా చూపించి సంక్షేమ పథకాల ముసుగులో ప్రజా ధనాన్ని కొల్లగొట్టడం పరిపాటి అయింది. అదే సమయంలో ప్రభుత్వాలు తాము నిర్వహించే కొనుగోళ్లలో అవకతవకలకు అవకాశం కల్పించి ప్రజాధనం వృథా అయ్యే అవకాశం ఇస్తాయి. కాంట్రాక్టర్లు, మధ్యవర్తుల ప్రమేయంతో అమలు జరుగుతున్న కార్యక్రమాలకు అవసరాన్ని మించి కేటాయింపులు జరుగుతున్నాయి. ఉదాహరణకు పది కోట్లు ఖర్చు అయ్యేచోట కేవలం ఐదు కోట్లతో పనులు పూర్తి చేసి మిగిలినదంతా సొంత ఖాతాల్లో జమచేసుకోవడం ఒక పద్ధతి. రెండవది పదికోట్లతో జరిగే పనికి 20 కోట్లకు అంచనాలు పెంచి ఆ విధంగా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. జరిగే పనులు కూడా నాసిరకంగా చేసి, మళ్లీ ఆ పనులను తిరిగి టెండర్లు వేయించుకొని నిత్యధనార్జ నకు మార్గం వేసుకుంటున్నారు.
బడ్జెట్‌లో రంధ్రాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లలోని సింహభాగం కాంట్రా క్టర్లు, కార్పొరేట్ సంస్థలకు, బహుళజాతి కంపెనీలకు, బిలియనీర్లకు వెళుతు న్నది. అంటే ప్రజల పేరుతో ఖర్చుచేస్తున్న బడ్జెట్‌లో ప్రకృతిలో ఉన్న బ్లాక్‌హోల్ తరహా హోల్ (రంధ్రం) తయారైంది (విశ్వంలో కృష్ణబిలాలు లేదా బ్లాక్‌హోల్స్ ఉన్నాయని ఖగోళశాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటికి పదార్థాన్ని విశేషంగా ఆకర్షిం చే శక్తి ఉంటుంది). ఎకనమిక్ బ్లాక్ హోల్‌లోకి ఈ నిధులన్నీ వెళుతు న్నాయి. దీంతో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న లక్షల కోట్ల బడ్జెట్ ఎటుపోతున్నదో అంతు చిక్కడంలేదు.
ఆశించిన ఫలితాలు సాధించకపోవడం, ఎటువంటి ప్రజల ప్రయోజనాలు నెరవేరకపోవడం దీని ఫలితమే. అందుకే పౌరసమాజం, ప్రజా సంఘాలు ఇతర ప్రజాస్వామిక సంస్థలు ఎవరైనా సరే ప్రజల ప్రగతి గురించి శ్రద్ధ ఉన్నవాళ్లు కేంద్ర, రాష్ర్టప్రభుత్వాల బడ్జెట్‌ల గురించి ఆలోచించాలి. ప్రభు త్వ బడ్జెట్లు ప్రజలకు నిజంగా ఉపయోగపడాలంటే తప్పనిసరిగా రాజకీయ ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటున్న బ్లాక్ హోల్స్ మూతపడాలి. కోట్లు గుమ్మరించి సీట్లు కొని, ఎన్నికల్లో పోటీచేయొచ్చనే భావన అంతరించిపోవాలి. అప్పుడే ఆర్థిక ప్రజాస్వామ్యం వైపు సమాజం అడుగులువేస్తుంది. దీంతో కొంతమేరకైనా రాజకీయ ప్రజాస్వామ్యం, సామాజిక ప్రజాస్వామ్యం మనుగడలో ఉండవచ్చు.
(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు)
- మల్లెపల్లి లక్ష్మయ్య