ముప్పాళ్ల భార్గవశ్రీ
భూసమీకరణ చేస్తున్నది ప్రభుత్వం కాగా రైతులే తమ భూమిని సమీకరించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు దరఖాస్తును రూపొందించడమంటే వారికి న్యాయస్థానాలకు వెళ్లే అవకాశాలను మూసివేయటమే.
ఆంధ్రపదేశ్ రాజధాని ప్రాం త అభివృద్ధి సాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ఏర్పాటుకు ఉద్దే శించిన ముసాయిదా బిల్లును పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ డిసెంబర్ 20న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 9 చాప్టర్లు, 132 సెక్షన్లతో ఉన్న 116 పేజీల బిల్లులో పొందుపరచిన అంశాలు రైతులకు నష్టం చేసేలా ఉన్నాయంటూ వైఎస్సార్‌సీపీ దానిని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. అయితే అధికార టీడీపీ మూజువాణీ ఓటుతో డిసెంబర్ 22న ఆ బిల్లును ఆమోదింపచేసుకుంది.
బిల్లును ప్రకటించక ముందు చంద్రబాబు ప్రభుత్వం రైతుల్ని ఆశపెట్టే విధంగా అనేక రకాల ప్యాకేజీలు ప్రకటించింది. ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడిన వేలాది వ్యవసాయ కూలీల కుటుంబాలకు నెలకి రూ.2,500 చొప్పున పదేళ్లపాటు చెల్లిస్తామని, భూసమీకరణ ప్రాంతంలో రైతులు, కౌలుదారులందరికీ రూ.200 కోట్లు రుణమాఫీ చేస్తామని చేసిన వాగ్దానాల ప్రస్తావనే బిల్లులో లేదు. అంటే చేసిన వాగ్దానాలకు చట్టబద్ధత కల్పించలేదు. గ్రామీణ ప్రాంతంలో చేతి వృత్తులు చేసుకునే కమ్మరి, కుమ్మరి, మంగలి, రజకులు, చేనేత తదితరుల భవిష్యత్తు గురించి ఊసే లేదు.
చంద్రబాబు ప్రభుత్వం గుంటూరు జిల్లాలో కృష్ణానదికి పక్కనే ఉన్న తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల్లోని 53 వేల ఎకరాల్లో నూతన రాజధాని నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. విజయవాడ - గుంటూరుకు మధ్య వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉండగా కృష్ణానది పక్కనే బంగారం లాంటి మాగాణి భూములనే తీసుకోవాలని నిర్ణయించటం వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభం లోకి నెట్టడమే అవుతుంది. రాజధానికి కావాల్సిన భూమిని భూసమీకరణ ద్వారానే సేకరించాలని నిర్ణయించారు. అందులోనే అసలు దగా దాగి ఉంది.
భూసమీకరణ ద్వారా రూపాయి ఖర్చుపెట్టకుండా వేలాది ఎకరాల భూమిని రాబట్టుకోవచ్చు. తుళ్లూరు ప్రాంతంలో రాజధానిని ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి ఆ ప్రాంతంలో గతంలో ఎకరం రూ.10-15 లక్షలు ఉన్న పొలం కోటిన్నర రూపాయలకు అమాం తంగా పెరిగిపోయింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపింది. అదే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూమిని సేకరిస్తే రైతులతో ఒప్పందం కుదిరిన వెంటనే మార్కెట్ రేటుకంటే మూడు, నాలుగు రెట్లు విలువ గల మొత్తాన్ని రైతులకు చెల్లించాలి. ఇంతటి ‘భారం’ మోయటం కంటే రైతుల మీదనే భారం వేసే భూసమీకరణ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. అందుకే 2013 భూసేకరణ చట్టాన్ని రైతులకు బూచిగా చూపించింది.
బిల్లులోని 130వ సెక్షన్ ప్రకారం రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పథకాలను అమలుపరచటానికి కావాల్సిన నిబంధనలను తుంగలో తొక్కి డెవలపర్స్ పేరుతో బడా కాంట్రాక్టర్లకు తలుపులు బార్లా తెరిచారు. ఆ విధంగా భూసమీకరణ ద్వారా సమీకరించిన భూమి ని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు దోచిపెట్టేవిధంగా బిల్లును రూపొందించారు. బిల్లులోని 105, 107 సెక్షన్ ప్రకారం రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చార్జీలపైన లెవీ వసూళ్లు, లెసైన్స్ పొందిన డెవలపర్స్ లేక కాంట్రాక్టర్ లేక ఏజన్సీలు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం క్రింద నిర్మించిన కొత్త రోడ్లు, టూరిస్టు స్థలాలు, పార్క్‌లు తదితరాలను ఉపయోగించుకునే వారి నుంచి యూజర్ చార్జీలను వసూలు చేస్తారు. సెక్షన్ 128 ప్రకారం ప్రభుత్వంపై గాని, సీఆర్‌డీఏపైన గాని, ఉన్నతాధికారి లేక ప్రభుత్వానికి చెందిన వ్యక్తిపైన ఎటువంటి దావా, విచారణ అనుమతించరు అన్న నిబంధనను చేర్చి మొత్తంగా న్యాయ వ్యవస్థనే అవమానించే నియంతృత్వ విధానాన్ని ఆశ్రయించారు. దీనిపై న్యాయ నిపుణులు ఇప్పటికే తమ తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సీఆర్‌డీఏ బిల్లును అసెంబ్లీలో డిసెంబర్ 22న ఆమోదింపచేసుకొన్న వారం రోజుల్లోనే అనగా డిసెం బర్ 28వ తేదీ రాత్రి భూసమీకరణను వ్యతిరేకిస్తున్న గ్రామాల రైతుల తోటల దహనం తదుపరి రాజధాని ప్రాంత గ్రామాల్లో పోలీసు రాజ్యానికి తెరలేచింది. వందల సంఖ్యలో అమాయక రైతులపై అక్రమ కేసులు బనాయించి పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పారు. తోటల దహనం కేసు అనుమానితుల పేరిట కొందరు రైతులను రాత్రింబవళ్లు పోలీస్‌స్టేషన్‌లో ఉంచి ‘నిజం’ ఒప్పు కోవాలని చిత్రహింసలకు గురి చేశారు. అసలు ఈ విచారణ తంతు ప్రారంభం కాకముందే, ఆ వార్త వచ్చిన వెంటనే అధికార పార్టీలోని మంత్రులు ప్రతిపక్ష పార్టీపై బురద చల్లటానికి శాయశక్తుల ప్రయత్నించారు.
ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ భూ సమీకరణ ప్రారంభించిన ఇరవై రోజుల తరువాత కూడా ఆరువేల ఎకరాలకు మించి భూములను సమీకరించలేక పోయారు. భూసమీకరణ తరువాత ఏర్పడే పరిణామాలపై రైతుల్ని వేధిస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వ వర్గాల నుంచి సరైన సమాధానాలు రాకపో వటమే దీనికి ప్రధాన కారణం. ఇప్పటి వరకు సమీ కరించిన ఆరువేల ఎకరాల్లో నాలుగు వేల ఎకరాలు ఈ మధ్య రైతుల నుంచి భూములు కొన్న వారేనన్నది బహిరంగ రహస్యం.
భూసమీకరణకు నోటిఫికేషన్లు వెలువడక ముందు రాజధాని ప్రాంత మెట్ట గ్రామాల్లో ఎకరం కోటిన్నరకు పైగా అమ్ముడుపోయిన భూములు ఇప్పుడు కోటి రూపాయలకు కూడా కొనేవారు లేరు. పదేళ్ల తరువాత తమకు ప్రభుత్వం ప్యాకేజీ కింద ఇచ్చే భూములకు ప్రభుత్వం చెబుతున్నట్లుగా కనీసం వెయ్యి గజాలకు రెండు కోట్ల ధర వస్తుందా? అన్న రైతుల సందేహం మరో ముఖ్య కారణం. రాజధాని ప్రాంత గ్రామాల్లో రుణమాఫీ కింద వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో రూ.1.5 లక్షల రుణమాఫీ ఈ ప్రాంత రైతులకు ఏ మా త్రం ఉపశమనం కలిగించక పోగా మరింత ఆందోళనకు గురి చేస్తున్నమాట వాస్తవం. ఇన్ని సందేహాలు, ఆందో ళనలు రైతులను పట్టిపీడుస్తుంటే భూసమీకరణ రైతుకి ఎలా ‘లాభం’ కాబోతున్నదో ప్రభుత్వమే చెప్పాలి.
అసెంబ్లీలో ఆమోదింపచేసుకున్న సీఆర్‌డీఏ బిల్లు చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు అద్దం పడుతుంది. మొత్తంగా చూస్తే బిల్లు లో రూపొందించిన నిబంధనలు నూతన రాజధాని ప్రజలపాలిట శాపాలుగా మారబోతున్నాయి. ముఖ్యం గా రాజధాని నిర్మాణం కింద భూములు కోల్పోయే సన్నకారు రైతులు, వ్యవసాయంపై ఆధారపడిన వ్యవ సాయ కూలీలు, కౌలు రైతులు, వివిధ వృత్తుల వారి సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక జీవ న విధానాలు విచ్ఛిన్నం కాబోతున్నాయి.
ప్రపంచంలోనే నంబర్ వన్ రాజధా నిని నిర్మించటమంటే వీరి జీవితాలను పణంగా పెట్టి నిర్మించటానికి సాహసించటమే అవుతుంది. భూసమీకరణ విధానం పేరుతో చంద్రబాబు ప్రభు త్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా, రైతులకు నష్టదాయకమైన భూసమీకరణ విధానాన్ని విరమించు కోవాలని రాజధాని ప్రాంతంలోని వివిధ రంగాల, వర్గాల ప్రజలందరూ ఇప్పటికే సాగిస్తున్న ఆందోళనను మరింత సమైక్యంగా సాగించటానికి సమాయత్తం కావాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది.
వ్యాసకర్త సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కమిటీ సభ్యులు
సెల్ : 98481 20105