ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
‘జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (ఢిల్లీ) ప్రాంగణం అన్ని రకాల రాజకీయ అభిప్రాయాల వ్యక్తీకరణకీ అవకాశం కల్పించే వేదిక. న్యాయ సమ్మతమైన భిన్నాభిప్రాయాలకు కేంద్ర బిందువు. జాతీయత/ జాతీయవాదం గురించి పాలకవర్గాల అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయాలు ఇత రులకు ఉన్నంత మాత్రాన అది దేశద్రోహ నేరంగా పరిగణించడానికి వీలులేదు. బహుశా కొంతమంది దృష్టిలో - భిన్నాభిప్రాయానికీ, రాజద్రోహ నేరానికీ మధ్య భేదం స్వల్పాతిస్వల్పంగా కనిపించవచ్చు. కానీ ఈ రెండింటికీ మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం అనేది ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యత అనేది మరచిపోరాదు. ఈ సందర్భంగా సీపీఐ అనుబంధ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్‌కు అనుబంధ సంస్థగా ఉన్న యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్‌కుమార్‌ను రాజకీయంగా, సిద్ధాంత రీత్యా ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ఏబీవీపీ విధానాలకు వ్యతిరేకం అయినందున దేశద్రోహ నేరాన్ని ఆపాదించడం సమర్థనీయం కాదు. వలస పాలనలో అవతరించిన భారత శిక్షాస్మృతిలోని 124-ఎ సెక్షన్ దుర్వినియోగమైన చరిత్ర తీరును గమనిస్తే అది ఆధునిక రాజ్యాంగ లక్ష్యాలకు పొసగదని గ్రహించాలి. ఆ సెక్షన్‌ను మొత్తంగానే తొలగించాలి.’
- ది హిందూ (15-2-2016)
తొండ ముదిరి ఊసరవెల్లి అయిందంటారు. అలాంటి ప్రవర్తనకే బీజేపీ పాలకవర్గాలు అలవాటు పడుతుండడం విచారకరం. మోదీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన కొద్ది మాసాలకే ఆ పార్టీ అగ్రనేత, మాజీ హోంమంత్రి లాల్ కిషన్ అద్వానీ రాబోయే పరిణామాల గురించి దేశాన్నీ, పాలకులనూ హెచ్చరించారు. ‘మరోసారి దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించే దిశగా పాలనా వ్యవహారాలు సాగుతున్నా’యని ఆయన చెప్పడం గమనార్హం. తాజాగా జరుగుతున్న ప్రభుత్వ నిర్ణయాలు, విద్యాసంస్థలలో, చరిత్ర పరిశోధన, అధ్యయన కేంద్రాలలో, విశ్వవిద్యాలయాలలో, పాఠ్య ప్రణాళికలలో ప్రవేశపెడుతున్న మార్పులే ఆ ప్రకటన ఆంతర్యం కొంతైనా అర్థమయ్యేటట్టు చేస్తున్నాయి. విద్వత్ సంబంధమైన గోష్టులలోనే కాదు, ఏకత్వంలో భిన్నత్వ భావనను సహించలేని ధోరణి కూడా వ్యక్తమవుతోంది. భిన్నాభిప్రాయానికీ, రాజ్యాంగం గుర్తించిన భావ ప్రకటనా స్వేచ్ఛకూ సంకెళ్లు తొడిగే ప్రయత్నం జేఎన్‌యూ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న ఘటనల ద్వారా అనుభవంలోకి వస్తోంది. ఈ రెండు పరిణామాలను బట్టి ఇప్పుడు విశ్వవిద్యాలయాలలో తలెత్తిన అలజడికి కారణాలను అన్వేషించకుండా, పాలక వర్గాలు విద్వల్లోకాన్ని కల్లోల పరిచే నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరం.
గతంలోకి వెళితే...
‘స్వాతంత్య్రం నా జన్మహక్కు’ అని లోకమాన్య తిలక్, గాంధీజీ, మదన్‌మోహన్ మాలవీయ వంటి స్వాతంత్య్రోద్యమ నేతల సంప్రదాయంలో ఎదిగిన జాతీయత, జాతీయవాదం వేరు. నేడు మనం వింటున్న వాదం వేరు. నాడు విద్యా కేంద్రాలన్నీ విద్యార్థి ఉద్యమాలకూ, స్వాత ంత్య్ర పిపాస రగుల్కొల్పడానికి జాతీయ నాయకుల స్థాయిలోనే కాకుండా, విద్యార్థి స్థాయిలో కూడా ఉద్యమించడం జరిగింది. ఆనాటి చర్చలు, విరుద్ధ భావాల సంఘర్షణ, మితవాద, అతివాద భావాల సంఘర్షణ విద్యా సంస్థలకే కాకుండా అన్ని స్థాయిలలోనూ స్వేచ్ఛగా సాగిన వాతావరణం, పాత తరాలన్నింటికీ గుర్తున్న సన్నివేశాలేనని కలలో కూడా మరచిపోరాదు. ఆ మాటకొస్తే హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోనూ, జేఎన్‌యూలోనూ ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ సంస్థల మధ్య సిద్ధాంతపరమైన సంఘర్షణలకు ఉప్పందించినవి జాతీయోద్యమ సంప్రదాయాలే. ఆ భావ సంఘర్షణ వెలుగులు ప్రసరించకుండా విద్యాలయాలకే కాదు; రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలకీ ప్రగతీ లేదు. ఇది పాలకులు గుర్తించాలి. ఇప్పుడు రాజకీయ స్వాతంత్య్రాన్ని మనం అనుభవిస్తూ ఉండవచ్చు. కానీ త్యాగాలతో, రక్తతర్పణలతో సాధించిన స్వాతంత్య్ర ప్రకటనను నిరంతరం జాగరూకతతో కాపాడుకోవాలి. నిత్యం ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాన్ని చూడడంలో పలాయనం చిత్తగించినంతవరకు, దేశ సంపద మీద కొద్దిమంది గుత్తాధిపత్యానికి చరమగీతం పాడి, రాజ్యాంగం ఇచ్చిన సప్త స్వాతంత్య్రాల పరిరక్షణ కోసం సంఘర్షించక తప్పదు. ఒక్క విద్యాకేంద్రాలలోనే కాదు, అన్ని స్థాయిలలోనూ చర్చలు, ఆందోళనలు, దగాపడిన వారి నిరసనలు, బడుగు బలహీన వర్గాల, కార్మిక కర్షక మహిళాశక్తులలో అసంతృప్తి జ్వాలలు అనివార్యం. నిజానికి నిరసనలూ, అలజడులూ పరిస్థితుల ప్రభావంతో పుట్టుకొస్తాయి గానీ, రెచ్చగొట్టడం ద్వారా వచ్చేవి కావు. ఇది ప్రపంచంలోని చాలా విశ్వవిద్యాలయాలలో నిరూపణైంది.
సంఘర్షణ అనివార్యం
సమకాలీన రాజకీయ, భావ సంఘర్షణలకు మన దేశంలోనే కాదు; ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు కేంద్ర బిందువులయ్యాయి. ఇందుకు ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లుముంబా, బీజింగ్, నాన్‌తెరే వంటి విశ్వ విఖ్యాత విశ్వవిద్యాలయాలు కూడా మినహాయింపు కావు. 1980లలో ఫ్రెంచ్ పాలకులు ఇంటాబయటా చేపట్టిన పోలీస్ చర్యలకు నిరసనగా, నాటి అధ్యక్షుడు చార్లెస్ డీగోల్‌కు వ్యతిరేకంగా నాన్‌తెరే విశ్వవిద్యాలయ విద్యార్థులు మహోద్యమం నడిపారు. భారత స్వాతంత్య్రోద్యమ కాలం నాటి క్విట్ ఇండియా ఉద్యమానికి వెన్నెముకగా నిలిచినది విద్యార్థి, యువతేనని మరచిపోరాదు. భారత రైతాంగ పోరాటాలు, సత్యాగ్రహాలకు గాంధీజీ, పటేల్ అండగా నిలిచారు. వీరి స్ఫూర్తి నుంచి పాఠాలు నేర్చుకోవలసిన ఇవాళ్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నేతలు చేస్తున్నదేమిటి? ప్రజల సాగుభూములను స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు వ్యాపార ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టడానికి తహతహలాడుతున్నారు. ఆ క్రమంలో పంట భూములను చట్టాలు, ఆర్డినెన్స్‌ల ద్వారా బలవంతంగా ‘స్వాధీనం లేదా సమీకరణ’ మంత్రాలతో రైతాంగాన్ని మభ్యపరిచే ప్రయత్నం చేస్తున్నారు. బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించిన, వేషధారణలో కూడా బ్రిటిష్ కాలం నాటి పోలీసులనే అనుకరించిన వారు జాతీయవాదులేనా? జాతీయవాదులు, సెక్యులరిస్టులు, హేతువాదులైన ప్రసిద్ధ ఆచార్యులపై దాడి చేసి పొట్టన పెట్టుకున్నవారిని ఏమనాలి? హిందువు ముద్ర లేని అన్య మతస్తులను పౌరహక్కులకు అనర్హులనుచే యాలని చూస్తున్నవారు ధర్మశాస్త్రాలను వల్లె వేయడానికి అర్హులు కాగలరా? నన్ను ముట్టుకోకు అనే వేర్పాటు ధోరణికి మూలం స్వప్రయోజనాలు. ఈ ధోరణికి తెలుపు, నలుపు వర్ణాలతో గానీ, హిందూ ముస్లిం విభజనతో గానీ అసలు మతంతోగానీ సంబంధం లేదు. ‘అణచివేత లేదా నిర్బంధ విధానం సమాజంలో ఆగ్రహజ్వాలలనూ, తిరుగుబాట్లనూ రెచ్చగొడతాయన్న లోకమాన్యుడి బోధనలను మన పాలకులు ఎక్కడ పాతారు? తిలక్ మీద మోపిన దేశద్రోహ నేర విచారణలో ఆయన తరఫున విచారించిన న్యాయవాదుల బృందానికి నాయకుడు మహ్మదాలీ జిన్నా అన్న వాస్తవాన్ని తెలుసుకుంటే మనలో ప్రకంపనలు ఎలా ఉంటాయి? నిర్బంధం, దాని ఫలితాల గురించి నాడు తిలక్ రాసిన వ్యాసాల కారణంగానే దేశద్రోహ అభియోగానికి ఆయన గురైనారు. అప్పుడు ఆయన అన్న మాటలేమిటి? ‘ప్రభుత్వ యావత్తు దేశాన్నీ జైలు కింద మార్చే పక్షంలో మనమంతా ఖైదీలమే. వీరంతా జైలుకు వెళ్లడం అంటే- ఓ పెద్ద సెల్ నుంచి చిన్న సెల్‌కు బదలీ కావడమనే అర్థం’ అని తిలక్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతేగాదు, నాడు నిద్రాణమై ఉన్న భారత జాతిని చైతన్యవంతం చేయడానికి గణపతి, శివాజీ ఉత్సవాలను ప్రారంభిస్తే తరువాతి కాలాలలో వాటిని మతోద్రిక్తతలను రెచ్చగొట్టడానికి కొందరు వినియోగిస్తారని గుర్తించలేకపోయానని కూడా ఆయన ఒక సభలో బాధ పడిన సంగతిని ప్రసిద్ధ చరిత్రకారుడు బిపిన్‌చంద్ర నమోదు చేశారు.
ఇంకా బ్రిటిష్ చట్టాలేనా?
హింసకు పురిగొల్పే ప్రసంగాలు చేస్తే తప్ప, కేవల విమర్శకూ, ప్రసంగానికీ పరిమితమైన ఉపన్యాసాలకు దేశద్రోహ నేరం వర్తించదని భారత న్యాయస్థానాలు పలుసార్లు తీర్పులు ఇచ్చాయని మరచిపోరాదు. స్వతంత్ర భారతదేశంలో సొంత రాజ్యాంగ వ్యవస్థ, స్వపరిపాలన, న్యాయ వ్యవస్థ ఏర్పడి; మనదీ ప్రజాస్వామ్యమేనని చాటుకుంటున్నాం. అయినప్పటికీ ఈ ఆధునిక ప్రజాస్వామ్య చట్రంలో కూడా ప్రజలు నోరెత్తకుండా చేయడం కోసం బ్రిటిష్‌వాడు ప్రవేశపెట్టిన చట్టాలనే మన పాలకులు కూడా ఔదల దాల్చారు. అభ్యుదయకర భావనా స్రవంతిని అడ్డుకొని మనసులను మరుభూములుగా మార్చేయడమే యాంటీ రాడికలైజేషన్ పథకం లక్ష్యం. దాని ప్రతిరూపమే జాతి వ్యతిరేక కార్యకలాపాల ముద్ర. నిజమైన ఆధునిక ప్రజాస్వామ్యంలో రాజద్రోహ/దేశద్రోహ నేరారోపణలకు తావులేదు. ఉండరాదు. భావ సంఘర్షణనూ, విభేదించే ప్రయత్నాన్నీ క్రిమినల్ నేరంగా పరిగణించి మేధావుల, ప్రజల నోళ్లకు ప్లాస్టర్ అంటించే విధానం ఒక చేదు అనుభవంగానే మిగులుతుంది. దీనిని గుర్తించి సకాలంలో జ్ఞానోదయం పొందాలి. తలపండిన కొందరు నాయకుల మాదిరిగానే విద్యార్థి యువతలోనూ వెనుక చూపు ఉన్న వారు, సంకుచిత దృష్టి ఉన్న వారు ఉంటారు. విశాలమైన చింతనాపరులు ఉంటారు. అభ్యుదయ కాముకులు ఉంటారు. ఈ లక్షణాలన్నింటినీ సమన్వయ పూర్వకంగా దర్శించగలిగిన శ్రీశ్రీ అన్నాడు-
కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు
పేర్లకీ పకీర్లకీ పుకార్లకీ నిబద్ధులు...
abkprasad2006@yahoo.co.in