ప్రచార ఊదర, ‘మూడేళ్ల’ జాతర | Three years of NDA government | Sakshi
Sakshi News home page

ప్రచార ఊదర, ‘మూడేళ్ల’ జాతర

Published Tue, May 30 2017 12:36 AM | Last Updated on Tue, Aug 28 2018 7:09 PM

ప్రచార ఊదర, ‘మూడేళ్ల’ జాతర - Sakshi

ప్రచార ఊదర, ‘మూడేళ్ల’ జాతర

రెండో మాట
రైతాంగం ఆరుగాలం కష్టపడి పండించే పంటలకు, ధాన్యం సేకరణకు ఉపకరించే భారత ఆహార సంస్థను నిర్వీర్యం చేసే ప్రక్రియను ఎందుకు ప్రారంభించారో కూడా ఎన్డీఏ వివరించాలి. అధికారంలోకి రాగానే కోటి ఉద్యోగాల కల్పనకు హామీ పడ్డారు. కానీ ఆచరణలో ఎందుకు మొండి చేయి చూపారు? ఈ హామీని నెరవేర్చే దిశగా చర్యలు కొనసాగడం లేదని 2016–2017 ఆర్థిక సర్వే సైతం వెల్లడించింది. బీజేపీ పాలకులు అధికారంలోకి వచ్చిన తరువాత అంతకు ముందు మూడేళ్లనాడున్న ఉపాధి కల్పన స్థాయి 39 శాతం పడిపోయింది.

‘నా మనసులో మాటను (మన్‌కీ బాత్‌) రెండేళ్లుగా నా ఇంటి వద్ద నుంచే నెలవారీ రేడియో ప్రసారం ద్వారా ప్రజలతో పంచుకుంటున్నాను. గాంధీ జయంతి రోజున ఈ మనసులో మాటను ప్రారంభించాను. దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం ప్రారంభించానని నేనెన్నడూ భావించలేదు. దేశ ప్రజ  లంతా నా సొంత కుటుంబమనుకునే వారితో సంభాషిస్తున్నాననుకున్నాను. కొంతమంది దీన్ని ఏకపాత్రాభినయం అనుకున్నారు. మరికొంతమంది దీనిని రాజకీయ దృష్టితో చూశారు. కానీ ఇంట్లోనే కూర్చొని ఈ మనసులో మాట ద్వారా నా కుటుంబంతోనే సంభాషిస్తున్నానని తామూ భావిస్తున్నట్టు అనేక కుటుంబాలవారు నాకు ఉత్తరాలు రాశారు.’ – నరేంద్ర మోదీ, 28–5–2017 (ఎన్డీఏ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా, రంజాన్‌ శుభాకాంక్షలు కూడా చెబుతూ)

‘అందరూ నావాళ్లే’నని అనుకోవడంలో ఉన్నంత సుఖం, సౌందర్యం మరెక్కడా ఉండవు. కానీ ‘నోట్లో చక్కెర, కడుపులో కత్తెర’పెట్టుకునే వాళ్లు ఈ లోకంలో కొందరుంటారు. గతంలో మనకి 200, 300, 365 రోజులు ప్రదర్శించిన సినిమాలు ఉండేవి. తరువాత శత దినోత్సవాలకీ, ఆపై70–50 రోజులు ప్రదర్శించే ‘బొమ్మ’ల స్థాయికి చేరాయి. ఆ తరువాత నాలుగు వారాలు బొమ్మ ఆడితే చాలునని దర్శకనిర్మాతలూ, పంపిణీదారులూ తృప్తిపడే స్థితిని చూస్తున్నాం. అలాగే కేంద్రంలో, రాష్ట్రాలలో ప్రభుత్వాల ప్రదర్శన స్థాయి కూడా దిగజారింది. సినిమాను ఆ కొద్దిగా అయినా ఆడించేందుకు ఊహకు అందని రీతిలో ప్రచార పటాటోపం కనిపిస్తుంది. ప్రభుత్వాల ఏర్పా టుకు కొన్ని పార్టీలు చేస్తున్న ప్రచార పటాటోపం అలాగే ఉంది.

అంతా ప్రచార పటాటోపం
ప్రచార, ప్రసార, డిజిటల్‌ సాంకేతిక వ్యవస్థలలో శరవేగంగా వస్తున్న మార్పుల ఆసరాగా ఫలానా పార్టీ అధికారంలోకి వస్తోందని ఊదర (ఒకటిని పదిగా, పదిని వందగా, వందను వేలాదిగా, వేలను లక్షలుగా, ఆపై కోట్లుగా) కొట్టడం, తద్వారా అధికార పగ్గాలు చేపట్టే విద్యను ఒక రాజకీయ చిట్కాగా కనిపెట్టిన అత్యాధునిక సమాచార, సాంకేతిక రంగ నిపుణుడు అరవింద్‌ గుప్తా. బీజేపీ మూడేళ్ల పాలన జయప్రదంగా సాగిందంటూ చేసుకుంటున్న ప్రచారం వెనుక అలాంటి ఊదరే ఎక్కువ. బీజేపీ విజయ, పాలనా రహస్యం మొత్తం ఇదే. 2014 ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకూ, నెరవేర్చిన హామీలకూ మధ్య అంతరం ఎంతో పెరిగింది. రెండు మూడు నెలలకు ముందునుంచే తృతీయ సంవత్సర వేడుకలకు సమాయత్తం కావడం ఈ అంతరం కారణంగానే.

ప్రజా ప్రయోజనాల రక్షణకు సంబంధించిన ఏ కీలక రంగాన్ని తీసుకున్నా– హామీలకూ ఆచరణకూ పొంతనే లేదు. సంక్షేమ పథకాల అమలు మొదలుకొని, రాజ్యాంగ చట్ట నిబంధనల పరిరక్షణ, సెక్యులర్‌ వ్యవస్థ రక్షణ ద్వారా వివిధ మతాల మధ్య సామరస్యాన్ని నిలబెట్టలేకపోయింది. వివిధ జాతుల, మైనారిటీల, పీడిత తాడిత వర్గాల ప్రయోజనాల రక్షణకూ చిత్తశుద్ధితో కృషి చేయలేకపోయింది. అసలు గాంధీ జయంతి నాడు (అక్టోబర్‌ 2, 2014) మనసులో మాటను ప్రారంభించిన పార్టీ– ప్రభుత్వ నేత ఆ గాంధీజీ పేరుతోనే యూపీఏ హయాంలో ప్రారంభించిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గండి కొట్టే ప్రయత్నం ఎందుకు చేయవలసి వచ్చిందో జాతికి వివరణ ఇవ్వవలసి ఉంది.

రైతాంగం ఆరుగాలం కష్టపడి పండించే పంటలకు, ధాన్యం సేకరణకు ఉపకరించే ప్రభుత్వ రంగ సంస్థ భారత ఆహార సంస్థను నిర్వీర్యం చేసే ప్రక్రియను ఎందుకు ప్రారంభించారో కూడా ఎన్డీఏ వివరించాలి. అధికారంలోకి రాగానే కోటి ఉద్యోగాల కల్పనకు హామీ పడ్డారు. కానీ ఆచరణలో ఎందుకు మొండి చేయి చూపారు? ఈ హామీని నెరవేర్చే దిశగా చర్యలు కొనసాగడం లేదని 2016–2017 ఆర్థిక సర్వే సైతం వెల్లడించింది. బీజేపీ పాలకులు అధికారంలోకి వచ్చిన తరువాత అంతకు ముందు మూడేళ్ల నాడున్న ఉపాధి కల్పన 39 శాతం పడిపోయింది.

నల్లధనం రప్పించారా?!
దేశీయ కుబేర వర్గాలు విదేశీ బ్యాంకులలో దాచుకున్న లక్షల కోట్ల నల్లధనాన్ని ఆగమేఘాల మీద స్వదేశానికి రప్పిస్తానని మోదీ ఆర్భాటంగా ప్రకటించారు. అంతేకాదు, భారతీయుల ఖాతాలలోకి 15–20 లక్షల రూపాయల వంతున ఆ ధనాన్ని బదలాయిస్తామని కూడా చెప్పారు. ఇవన్నీ మూడేళ్లుగా నీటి మీది రాతలుగానే మిగిలి ఉన్నాయి. స్విస్, పనామా పేపర్స్‌ ద్వారా వెల్ల డైన భారతీయ కుబేర వర్గాల విదేశీ బ్యాంకు ఖాతాలలో దాగిన రూ. 24 లక్షల కోట్ల నల్లధనాన్ని రాబట్టడానికి బీజేపీ పాలకులు నాటకీయంగా జస్టిస్‌ ఎం. బి. షా నాయకత్వంలో ‘సిట్‌’ను నియమించారు. కానీ ఈ సంఘం సిఫారసులు ఇంతవరకు ఎందుకు అమలు కాలేదో కూడా జాతికి వివరించాలి.

కేవలం మూడు సంవత్సరాలలో 60 దేశాలు పర్యటించిన స్వతంత్ర దేశాల పాలకులు కూడా కానరారు. ఈ పర్యటనలకు వెచ్చించిన ప్రజాధనం ఎంతో కనీసం ముచ్చటగా అయినా ప్రజలకు నివేదించిన దాఖలాలు లేవు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. యూపీఏ హోంమంత్రి చిదంబరం హయాంలో ఎన్ని లోపాలు జరిగినా బీజేపీ పాలన మూడు సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా చెప్పిన మాటలో నిజాయితీ ఉందనిపిస్తోంది: ‘బీజేపీ పాలనలో, రాజ్యాంగ పరిరక్షణలో ఉన్న సెక్యులరిజం అభాసుపాలైంది. ఉదారవాదం కాస్తా పెక్కు సవాళ్లను ఎదుర్కొంటోంది.

ప్రభుత్వాన్ని ప్రశ్నించగల పౌరహక్కు పెక్కు సవాళ్లను ఎదుర్కొంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించగల పౌర హక్కు జాతి విద్రోహనేరం అయింది’. అన్నింటికన్నా మించి దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేస్తూ పండిట్‌ నెహ్రూ ఏర్పాటుచేసిన సెక్యులర్‌ ప్లానింగ్‌ కమిషన్‌ను∙మెరుగు పరచవలసిందిపోయి బీజేపీ పాలకులు రద్దుచేశారు. ముక్కూముఖంలేని, విధాన పరిపక్వతలేని ‘నీతి ఆయోగ్‌’ను తెచ్చారు. దీని లక్ష్యం ప్రధానంగా భారత ఆర్థిక వ్యవస్థను ప్రజా వ్యతిరేక విధానాలకు పెద్దపీట వేసే ప్రపంచ బ్యాంక్‌–ఐఎంఎఫ్‌ల కార్పొరేట్‌ సంస్కృతికి మరింతగా ద్వారాలు తెరవడమే.

‘సమాచార హక్కు చట్టం’ దశాబ్దంన్నరకుపైగా సామాజిక కార్యకర్తలు, మానవతావాదులు ఉద్యమస్ఫూర్తి ద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధుల్లోనే సాధిం చుకున్న విజయం. పాలకవర్గాలలోని కొందరు పెద్దలు తమ డిగ్రీల సాధికారతను సామాజిక కార్యకర్తలు, లాయర్లు రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ యాక్టు కింద రుజువుల కోసం ప్రశ్నించడంతో అలాంటి చట్టాన్ని నీరు కార్చడానికి ఈ మూడేళ్లలోనే ప్రయత్నాలు జరిగాయి. ఆ మాటకొస్తే అసలు ‘ప్రజా ప్రయోజ నాల వ్యాజ్యం’ (పిల్‌) అవకాశాన్నే తుంచివేసే ప్రయత్నాలు న్యాయవ్యవస్థ ద్వారా అమలులోకి తెచ్చే ప్రయత్నాలూ సాగకపోలేదు.

సుప్రీంకోర్టు సుప్రసిద్ధ న్యాయవాది ప్రశాంత భూషణ్‌ కేంద్ర పాలకుల్లో కొందరి అవినీతిపై పెల్లుబుకిన సమాచారాన్ని సుప్రీంలో పిల్‌ ద్వారా రాబట్టే ప్రయత్నాన్ని ఎలా నీరుకార్చారో పత్రికల ద్వారా లోకానికి తెలిసింది. యూపీ ఎన్నికల్లో లబ్ధి కోసం హడావుడిగా అర్థంతరంగా కేంద్రం ప్రకటించిన ‘నోట్ల రద్దు’ చర్య వల్ల కుబేర వర్గాలేవీ నష్టపోకపోగా.. పాలకవర్గ పార్టీ, దానిపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న టీడీపీ, టీఆర్‌ఎస్‌లు ఎలా లాభించాయో కూడా పత్రికలు తెలిపాయి. నోట్ల రద్దు నిర్ణయాన్ని మోదీకన్నా 10 రోజుల ముందుగానే చంద్రబాబు ప్రకటించి, ముందు జాగ్రత్తగా నల్లధనాన్ని ఎలా ‘వైట్‌’గా, లీగల్‌ టెండర్‌గా మార్చుకునేందుకు సహకరించారో మోదీకి తెలియాలి లేదా బాబుకి తెలియాలి.

125 కోట్లమంది దేశ జనాభాలో ఇతోధికంగా జనం నిరక్షరాస్యులు. దీనికి తోడు అనేక రకాల సైబర్‌ దాడులకు తట్టుకోలేని, భద్రతలేని దేశీయ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ద్వారా, డిజిటలైజేషన్‌ ద్వారా ప్రజా బాహుళ్యం ప్రయోజనం నోట్ల రద్దుతో ఎలా నెరవేరుతుంది? ఉత్తర భారత దేశంలోని కొన్ని రాష్ట్రాల ఎన్నికలు, ఉప ఎన్నికలలో లబ్ధిని ఆశించి బీజేపీ పాలకులు స్వల్పకాల ప్రయోజనాల కోసం బ్యాంకుల్లో, ఏటీఎంల ద్వారా నామమాత్రపు లావాదేవీల్ని కూడా సంవత్సరంగా స్తంభింపజేయడం ద్వారా కోట్లాదిమంది ప్రజలు, ఉద్యోగ వర్గాలు, కూలినాలి వర్గాలు వెచ్చాలకు కూడా డబ్బులు లేక దుర్భరమైన బాధలు అనుభవించారు, అనుభవిస్తున్నారు.

పేటీఎం ప్రహసనం
అంతకంటే విచిత్రమైన విషయం ఈ సంకటం నుంచి బీజేపీ పాలకుల్ని బయట పడ వేయడానికి విజయ శేఖర్‌ శర్మ అనే ఒక ఔత్సాహిక పారిశ్రామిక వేత్త, ‘పేటీఎం’సంస్థ నిర్వాహకుడు గాలివాటుగా దొరికాడు. కానీ టెక్నాలజిస్టు అయిన శర్మకి ‘పేటీఎం’తో సంబంధం ఏమిటి? ఆలీబాబా కంపెనీకి శర్మ ‘పేటీఎం’లో 40 శాతం వాటాలున్నాయి. రూ. 500–1000 నోట్ల రద్దు నిర్ణయాన్ని బీజేపీ పాలకులు ప్రకటించిన మరుక్షణంలోనే ‘పేటీఎం’భారీ స్థాయిలో (మొబైల్‌ వాలెట్‌ సర్వీసు) ప్రకటనలు జారీ చేసింది. అది తన వ్యాపార ప్రయోజనాల కోసం బీజేపీ పాలకుల ఆశీస్సులతో హడావుడిగా ‘‘నోట్ల రద్దు వల్ల ఇండియాకే లబ్ధి’’అంటూ ప్రచార ప్రకటనలు విడుదల చేసింది, ఆ వెంటనే మరుసటి రోజునే ప్రధాని మోదీ ఆశీస్సులతో దేశీయ పెద్ద దినపత్రికల్లో ‘పేటీఎం’ప్రకటనను మొదటి పేజీల్లో విడుదల చేసింది.

అంటే రూ. 500–1000 నోట్లను లీగల్‌ టెండర్‌గా పనికిరావని రద్దు చేసినప్పుడు రూ. 2,000 నోట్లను ప్రవేశ పెట్టడంలో రహస్యమేమిటి? యూపీ ఎన్నికలకు ఒక వారం రోజులకు ముందుగా రూ. 2,000 నోట్లు ప్రవేశపెట్టడంలో పరమార్థం ఏమై ఉండాలి? అవినీతిని పెంచగల్గిన స్థోమతు రూ. 1000 నోటు కన్నా రూ. 2,000 నోటుకే ఎక్కువ ఉంటుందిగదా? బ్లాక్‌మనీ ఆధారిత ఆర్థిక చట్రం కావాలంటే ఇదే అదుననుకున్నారు. దీనికి ఉదాహరణగానే పశ్చిమ బెంగాల్‌ బ్యాంకుల్లో ‘నోట్ల రద్దు’చర్యకు సరిగ్గా రెండే రెండు రోజులు ముందుగా బీజేపీ నాయకత్వం 3 లక్షల కోట్ల రూపాయల మేరకు పాత నోట్లను జమ చేసేసుకుందని నాటి పత్రికల వార్తలు.

ఏది ఎలా ఉన్నా ఈ మూడేళ్ల పాలనలో బాహాటంగానూ, నర్మగర్భం గానూ మైనారిటీల మీద, చర్చిల మీద, దర్గాల మీద, కందామహల్‌ లాంటి దళితవాడల మీద ఘోర కృత్యాలు అనేకం నిత్యం జరుగుతూనే వస్తున్నాయి. మళ్లీ ఇవన్నీ– గాంధీజీ సాక్షిగా, ఆయన కళ్లజోడు సాక్షిగా, ‘స్వచ్ఛ్‌ భారత్‌’సాక్షిగా, ‘అచ్చేదిన్‌’(మంచి రోజులొచ్చాయన్న) భరోసా నీడనే స్వేచ్ఛగా సాగి పోతున్నాయి. సెభాశ్‌! నోట్ల రద్దుతో చడీచప్పుడు లేకుండా పడి ఉన్న జనాల మధ్య ఎలాంటి ప్రయోగాన్నైనా జయప్రదంగా నెరవేర్చుకోవచ్చన్న దిలాసాలో పాలకులున్నారు.
ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement