త్రిభాషా సూత్రానికి తిలోదకాలు! | abkprasad article on Three-language formula | Sakshi
Sakshi News home page

త్రిభాషా సూత్రానికి తిలోదకాలు!

Published Tue, May 16 2017 1:09 AM | Last Updated on Tue, Aug 28 2018 7:14 PM

త్రిభాషా సూత్రానికి తిలోదకాలు! - Sakshi

త్రిభాషా సూత్రానికి తిలోదకాలు!

రెండో మాట
‘దేశవ్యాప్తంగా అన్ని (కేంద్ర, రాష్ట్ర) ప్రభుత్వ శాఖలలోనూ, ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు పాఠశాలల్లోనూ హిందీ భాషాధ్యయనాన్ని నిర్బం ధం చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ అధికార భాషా శాఖ రాష్ట్రపతి ముద్ర కోసం ప్రతిపాదన పంపించింది. ప్రభుత్వోద్యోగాలన్నింటికి హిందీ భాషా పరి జ్ఞానం విధిగా ఉండాలి. ఇంగ్లిష్‌లో వ్యాపార ప్రకటనల కన్నా హిందీ భాషలో వెలువరించే ప్రకటనలకే ప్రభుత్వం అధికంగా ఖర్చు చేయాలి. దేవనాగరి లిపిలోనే రైల్వే టికెట్ల ముద్రణ సాగాలి. ఐఏఎస్, ఐపీఎస్‌ లాంటి ఉద్యోగాలలో ప్రవేశాలు కోరుకునే అభ్యర్థులు హిందీని ఎంచుకోవాలి. కేంద్రమంత్రులు సాధ్యమైనంతవరకు హిందీలోనే ప్రసంగించాలి. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ వంటి హిందీయేతర రాష్ట్రాల వంటి మూడో తరగతి రాష్ట్రాలలోని రైల్వే స్టేషన్‌లలో రైళ్ల రాకపోకల ప్రకటనలను హిందీలోనే విధిగా జారీ చేయాలి.’
రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రం పంపిన పత్రం పేరుతో కిరణ్‌ రిజిజు చేసిన ప్రకటన (25–4–17, ది హిందు)

ఈ ప్రకటన పత్రం మరోసారి భాషాకాష్టాన్ని రగిలించే (ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాలలో) ప్రమాదం ఉంది. ఉత్తరప్రదేశ్‌లో సాధించిన విజయగర్వంతో, ఇక దక్షిణ భారతదేశంలో కూడా విజయ ఢంకా మోగించాలని బీజేపీ–ఎన్డీఏ చూస్తోంది. ఇంతవరకు త్రిభాషా సూత్రం అమలు జరుగుతూ ఎలాంటి గొడవలకు తావు లేకుండా సాగుతోంది. ఇప్పుడు స్థానిక భాష, ఆంగ్లం, హిందీ–ఈ మూడు భాషలలోను సమాచారం అందుతోంది. ఈ త్రిభాషా సూత్రాన్ని అకస్మాత్తుగా తోసిపుచ్చి మళ్లీ సర్వత్రా హిందీ రుద్దుడు వైపుగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది.

భాష చాటున దండయాత్ర
దక్షిణ భారతావనిని రాజకీయంగా గెలవడం అంత సులభం కాదు. ఎన్నికల విజయాలనేవి పాదరసం వంటివి. కాబట్టి వేల సంవత్సరాల లిపి, భాష, చారిత్రక, సాంస్కృతిక వైభవంతో, స్వతంత్ర ప్రతిపత్తితో మనుగడ సాగి స్తున్న దక్షిణ భారతదేశం మీద హిందీని శిష్టాది గురువుగా రుద్ది, తద్వారా రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలన్న ఆశే దీనికంతటికీ కారణం. ఎవరైనా ఎన్ని భాషలనైనా ఆసక్తి మేరకు, అవసరార్థం నేర్చుకోవచ్చు. కానీ తల్లివేళ్లు ఉన్న నేలకు కోత పెడితే మొదలు చెడ్డ బేరమే అవుతుంది. ఒకవైపున ప్రపంచీకరణ విధానాల ద్వారా ప్రపంచ బ్యాంక్‌ సంస్కరణల ద్వారా ఇంగ్లిష్‌ పేరిట వేలు విడిచిన వలస మామయ్య దాష్టీకం, మరొకవైపు జాతీయ సమైక్యతా రాగం పేరుతో హిందీ మూర్ఖత్వం. 177 భాషలు, 500 మాండలీకాలు మనకు ఉన్నాయి. అంటే అనేక భాషలతో, మాండలీకాలతో వెలుగొందుతున్నది–125 కోట్ల మంది ఉన్న భారతీయ సమాజం. కానీ ఇందులో40–45 కోట్లకు మించని ప్రజల భాషను అన్ని ప్రాంతాల మీద రుద్దే యత్నం చేస్తున్నారు. నిజానికి హిందీ భాషా ప్రాంతంలో ప్రజలు మాట్లాడేవన్నీ ఒకే కుదు రుకు సంబంధించినవి కావు.

ఏ హిందీ మాండలీకాన్ని రుద్దుతారు?
ఏ భాషనైనా ప్రజల మీద నిర్బంధంగా అమలు చేసే యత్నం మంచిది కాదు. భాషలను ఐచ్ఛికంగా మాత్రమే నేర్వాలి. నేర్పాలి. అదీగాక ఉర్దూ హిందీకి ఏమాత్రం తీసిపోనిదే. హిందీ భాషా కుటుంబంలో ఉన్నది ఒకే ఒక్క హిందీ కాదు. దానికి అనేక రూపాలు. అందుకే పండిత హిందీ భాష నుంచి గాంధీజీ దూరమై సరళమైన హిందూస్థానీని ఆశ్రయించారు. ఆ క్రమంలోనే గాంధీజీ, విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగోర్‌ మాతృభాషల నిరంతరాభివృద్ధికి చేదోడువాదోడుగా నిలిచారు. హిందీకి అనేక రూపాలు ఉన్నాయి. ఢిల్లీ ప్రాంతంలో అది ఖడీబోరీ, దాని ఇరుగుపొరుగు మాండలీకాలు ‘బజ్‌ భాష’లేదా బ్రజ్‌– ఖాఖా. ఇదే ఇప్పుడు పశ్చిమ్‌ హిందీ అయింది. ఇది పంజాబీలో కలసిపోయింది. అవధి మాండలీకాన్ని హిందీ మింగేసింది. దీనితో తులసీదాస్‌ వంటి కవులకు హిందీ సంసారంలో చోటు లేకుండా పోయింది. కనుకనే మై«థిలి, భోజ్‌పురి భాషలు ‘హిందీ సంసార్‌’లో కలవడానికి ఇష్టపడలేదన్న చరిత్రను కూడా విస్మరించలేం. ఏ భాషనూ నేర్చుకోవద్దని ఎవరూ శాసించరు, శాసించలేరు. ఎందుకని? శ్రీశ్రీ అన్నట్లు.. ‘‘జనన, ప్రాదుర్భావ దశలన్నీ సకల భాషలకూ ఒకటే–అందుకే పశువుకొక్క భాష/శిశువుకొక్క భాష/మానవునకు మాత్రం/సంఖ్యానంతపు పలుకుబళ్లు’’

ఇప్పుడెందుకు గుర్తొచ్చినట్టు?
ఇంతకూ అధికార భాషా వినియోగం గురించి 2011లో నాటి పార్లమెంటు కమిటీ సమర్పించిన ఒక నివేదికను బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు బయటికి లాగి రాష్ట్రపతి ఆమోదానికి పంపాల్సి వచ్చింది? 1963 నాటి అధికార భాషా చట్టం ప్రకారం ప్రతి పదేళ్లకు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో హిందీ భాషాభివృద్ధిని పార్లమెంట్‌ కమిటీ సమీక్షించాలి. ఆ సమీక్షలు వాయిదా పడటానికి కారణం–అన్ని రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన ‘త్రి భాషా సూత్రం’ ఆటంకాలు లేకుండా కొనసాగడమే. ఈ సమతుల్యతను ప్రస్తుత బీజేపీ పాలకులు చెదరగొట్టాలని సంకల్పించి దక్షిణ భారత రాష్ట్రాల్లో రాజకీయ ప్రాబల్యం కోసం హిందీ భాషను ఒక పావుగా ప్రయోగిస్తున్నారని భావించాలి. కనుకనే మంత్రి రిజిజు, ‘మేం కొత్తగా చేస్తున్నదేమీ లేదు, కాంగ్రెస్‌–యూపీఏ ప్రభుత్వ కమిటీ సిఫారసు ప్రకారమే హిందీని ప్రమోట్‌ చేయదలచాం’అన్న సాకు చాటున దాగజూశారు. భారత రాజ్యాంగ సమీక్షకులలో ఒకరు ప్రొఫెసర్‌ ఎం.పి. జైన్‌ రాజ్యాంగంలో హిందీ సహా ఎనిమిదవ షెడ్యూల్‌లో పేర్కొని గుర్తింపు పొందిన 22 భాషల ప్రతిపత్తి గురించి ప్రస్తావిస్తూ అధికార భాషగా పరివర్తనా దశలో హిందీ స్థానాన్ని గురించి ఇలా వివరించాల్సి వచ్చింది: ‘‘ఇంగ్లిష్‌ భాష స్థానంలో పరివర్తనా దశలోని హిందీని ప్రోత్సహించి దాని వ్యాప్తికి తోడ్పడకపోతే, అనుకున్నట్టుగా 15 ఏళ్ల తర్వాత (అధికరణ 342(2) ప్రకారం) ఇంగ్లిష్‌ స్థానాన్ని హిందీ భర్తీ చేయలేదు. కానీ వాస్తవం– ఈ వాదనలోని తర్కాన్ని ఆమోదిస్తూనే రాజ్యాంగం, పరివర్తనా దశలో హిందీని పరిమితంగానే, ప్రయోగశీలంగా మాత్రమే వాడాల్సి ఉంది, కానీ ఇంగ్లిష్‌ను తోసి రాజనకుండా దానికి తోడుగా వాడే భాషగానే హిందీని వాడుకోవచ్చని రాజ్యాంగం నిర్దేశించింది. దేవనాగరిలో ఇంగ్లిష్‌ అంకెలనే వాడాలని ఉంది. అంతేగానీ, ఇంగ్లిష్‌ భాషకు బదులుగా కాకుండా కేవలం సహభాషగా మాత్రమే హిందీ ఉపయోగంలో ఉంటుంద’’ని జైన్‌ వివరిం చారు (‘ఇండియన్‌ కాన్‌స్టిట్యూషనల్‌ లా’, పేజి:842).

ఇదిలా ఉండగా, రిజిజు ప్రకటనకు 20 రోజుల ముందు అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘త్రిభాషా సూత్రం’రాజ్యాంగ సమ్మతంగా అనుభవంలోకి వచ్చినా ఎందుకు అమలు జరగటం లేదో సమాధానం కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై సుప్రీం కోర్టు స్పందిస్తూ ‘‘జాతీయ సమైక్యత పేరిట పాఠశాల విద్యార్థులందరికీ హిందీ భాషను నిర్బంధంగా బోధించాలన్న విజ్ఞాపనను ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్‌. ఖేహర్‌ తిరస్కరించాల్సి వచ్చింది. అదే అనుమతిస్తే, తమ తమ భాషలను కూడా నిర్బంధ బోధనా భాషలుగా చేయాలని, ఇతర రాష్ట్రాల ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమిస్తారని జస్టిస్‌ ఖేహర్‌ గుర్తు చేయాల్సి వచ్చింది (4.5.17). పైగా 2015 మే నెలలోనే బీజేపీ ప్రభుత్వం రహస్యంగా ఒక ఉత్తర్వు జారీ చేస్తూ ప్రభుత్వ ఫైళ్లన్నీ హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో మాత్రమే ఉండాలని ఆదేశించిన సంగతి మరచిపోరాదు. ఈ పరిస్థితి ఇతర భారతీయ మాతృభాషల ఉనికికే ప్రమాదకరంగా పరిణమించవచ్చునని ఇప్పటికే కార్పొరేట్‌ స్కూళ్ల, అర్ధ కార్పొరేట్‌ సంస్థలుగా మారిన ప్రభుత్వ స్కూళ్లలో అధమస్థాయికి చేరిన మాతృభాషల ఉనికిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రాథమిక, మాధ్యమిక విద్యా సంస్థలను టీడీపీ–టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు దిగజార్చడమేగాక తెలుగు ప్రశ్నపత్రాల స్థానే ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రాలు పంచే కొత్త ‘సంస్కారానికి’శ్రీకారం చుట్టాయి. ‘సందోయ్‌ సందోయ్‌’ అంటూ హిందీ భాష మాధ్యమాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అధికారంలో పాగా వేయజూస్తున్న బీజేపీ కూటమి, దశాబ్దాల క్రితమే బీజేపీ కాకినాడ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ విచ్ఛిత్తికి ఒక తీర్మానం ద్వారా బీజాలు నాటిందని మరచిపోరాదు. రాజకీయులు ముందు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాంతాల ప్రజల మధ్య తంపులు పెడతారు, అది వీలు కానప్పుడు సరాసరి రాష్ట్రాలను విభజించి తమాషా చూస్తారు. అదీ కుదరనప్పుడు కుల, మత, వర్గ, భాషా, మాండలిక భేదాలను సృష్టిస్తారు.

ఇంతకుముందు పాలనా చరిత్రలు అవే, ఇప్పుడు నడుస్తున్న రాజకీయ, భాషా చరిత్రలూ అవే. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ దక్షిణ భారతానికి హైదరాబాద్‌ రాజధానిగానూ, మొత్తం దేశానికి రెండవ రాజధానిగానూ ప్రకటించాలని అర్ధ శతాబ్దం క్రితమే ఎందుకు ప్రతిపాదించి ఉంటారో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. దక్షిణ భారత రాష్ట్రాలపై ఉత్తరాది రాష్ట్రాల నాయకత్వాల పెత్తనం, వివక్షే తన ప్రతిపాదనకు కారణమని ఆయన ఒకటికి పదిమార్లు చెప్పారు. ఈ దాష్టీకానికి ప్రధాన కారణం దేశ పాలనా చట్రం స్వాధీనం చేసుకోవడానికి ఆయువుపట్టంతా ఉత్తరప్రదేశ్‌ ఒక్కటే 84 పార్లమెంట్‌ స్థానాలలో కేంద్రీకరించి ఉంది కాబట్టి. ఈ ‘సీట్ల’మాయాజాలంలో ‘చీట్లాట’లో మాతృభాషల ఉనికిని రాజకీయ పార్టీలు స్వప్రయోజనాల కోసం చిందరవందర చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను చీల్చి దాని దురవస్థకు కారకులైన కేంద్ర, రాష్ట్ర పాలకులు ప్రత్యేక హోదా ద్వారా దాని ప్రగతి సమృద్ధికి తోడ్పడ్డానికి నిరాకరిస్తున్న బాపతు, తెలుగు భాషకు ప్రాచీన హోదాను ప్రకటించి కూడా తరువాతి నిధులను సమకూర్చడంలో విఫలమయ్యారు. అందుకే, ఏనాడో దశాబ్దాల క్రితమే మహాకవి విశ్వనాథ తొల్లింటి తెలుగు ఉషోదయ రేఖలను తలచుకుంటూ దాని వైభవ ప్రాభవాలకు పునాదిని జ్ఞాపకం చేసుకుంటూ ఇలా అని ఉంటాడు: ‘‘ఇచ్చటి మట్టిగడ్డలు సైతమ్ము/నవ మృగీమద వాసనలు విదుర్చు’’ ద్వారబంధాలపై వ్రాయబడిన తొంటి/తెలుగు లిపి పోల్చుకుని కూడబలుకుకొనెడు/నా మహా మాతృ దేశ బద్ధానురాగు/లెవరో నా గుండె నెత్తురు అట్లు కదుపు!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement