(లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షిప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వం ఈ వారం ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్‌లు జిల్లావాసులను నిరాశ, నిస్పృహలకు గురి చేశాయి. రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ పలు హామీలు గుప్పించింది. వాటిలో కొన్ని జిల్లాకు సంబంధించినవీ ఉన్నాయి. అయితే ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క దానికీ ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయలేదు. కేంద్ర సర్కార్‌తో జతకట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా ఒత్తిడి తీసుకు రాలేకపోవడమే బడ్జెట్‌లలో కేటాయింపులు లేకపోవడానికి కారణంగా విజ్ఞులు విశ్లేషిస్తున్నారు.
కాకినాడ రైల్వేలైన్‌ను మెయిన్ లైన్‌తో అనుసంధానానికి, కోటిపల్లి లైనును కోనసీమ మీదుగా నరసాపురం వరకు విస్తరణకు రైల్వే బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తారని ఎదురుచూసిన జనానికి కేంద్రం నిరాశనే మిగిల్చింది. పార్లమెంటులో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు ఎంపీలు అధికార పార్టీ వారే అయినా పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేకపోయారనే చెప్పాలి. శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కూడా జిల్లావాసులకు మొండిచేయే ఎదురైంది. బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరానికి కూడా మొక్కుబడిగానే నిధులు కేటాయించడం రైతులను నిరాశకు గురిచేసింది.
రూ.16 వేల కోట్ల ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ.100 కోట్లే. వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేస్తామంటున్న చంద్రబాబు సర్కారే ఈ ప్రాజెక్టుకు కేటాయించిన నిధులు ఎంతవరకు సరిపోతాయో సమాధానం చెపాల్సి ఉంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని రైతులు వద్దన్నా చేపట్టడంతోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే చిత్తశుద్ధి చంద్రబాబు సర్కార్‌కు లేదనే విషయం స్పష్టమైపోయింది. పోలవరం ఇప్పట్లో పూర్తి చేయడం ఎలాగూ అసాధ్యమేననే అభిప్రాయంతో రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ఐఐఐటీ, హార్డ్‌వేర్ పార్కు, పెట్రో యూనివర్సిటీ వంటి వరాలను ప్రకటించింది. కానీ బడ్జెట్‌లో వీటిలో ఏ ఒక్క ప్రాజెక్టు ఊసెత్తలేదు.
వ్యూహాలకు పదును పెడుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు
ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నిలుస్తోంది. మొత్తం 16 మంది దాఖలు చేసిన నామినేషన్‌లన్నీ సక్రమంగానే ఉన్నట్టు ఎన్నికల అధికారి, కలెక్టర్ అరుణ్‌కుమార్ ప్రకటించారు. యూటీఎఫ్ బలపరిచిన రాము సూర్యారావు, తెలుగుదేశం బలపరిచిన కేవీవీ సత్యనారాయణరాజు(చైతన్యరాజు), ప్రగతి విద్యా సంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు సహా 16 మంది పోటీపడున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులంతా బలాబలాలను బేరీజు వేసుకుంటూ వ్యూహాలకు పదునుపెడుతున్నారు.
సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండటం, వివిధ పార్టీల నేతలతో ఉన్న సంబంధాలు, తాను, తన కుమారుడి ఎమ్మెల్సీ ఎన్నికలతో ఉభయగోదావరి జిల్లాల్లో ఏర్పడ్డ పరిచయాలు, మండలి విప్‌గా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి తాజాగా తెచ్చిన పలు జీఓలు తనకు సానుకూలమవుతాయని చైతన్యరాజు అంచనా వేస్తున్నారు. పాతికేళ్లు పైబడి ప్రగతి విద్యా సంస్థలు నిర్వహిస్తూ ఉపాధ్యాయ వర్గాలతో ఉన్న పరిచయాలు, నేరుగా ఉపాధ్యాయ ఓటర్లను కలిసి ప్రసన్నం చేసుకోవడం, ఆర్థిక, సామాజిక నేపథ్యం కలిసి వస్తుందని పరుచూరి కృష్ణారావు ఆశిస్తుండగా రెండు పర్యాయాలు ఓటమి తరువాత మూడోసారి బరిలోకి దిగుతున్న యూటీఎఫ్ గెలవాలని పట్టుదలతో ఉంది. రాము సూర్యారావుకు దాతృత్వంతో కూడిన సౌమ్యుడనే పేరు, రెండు ఓటముల నేపథ్యంలో సానుభూతి కలిసి వస్తుందని ఆ సంఘం గట్టి నమ్మకంతో ఉంది.
విమర్శల పాలైన ప్రజాభిప్రాయ సేకరణ
ఆ రకంగా రెండు బడ్జెట్‌లు నిరాశ పరచగా, శనివారం పెట్రోలు, డీజిల్ ఆయిల్ ధరలు కూడా పెంచేసి సాధారణ, మధ్యతరగతులపై కేంద్రం వాత పెట్టింది. పెట్రోలు లీటరుకు రూ.3.18, డీజిల్‌కు రూ.3.09 పెంచి, శనివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి తెచ్చింది. కాగా విద్యుత్ చార్జీల మోత మోగించే ఉదేశంతో గత బుధవారం కాకినాడ జేఎన్‌టీయూ అల్యుమినా ఆడిటోరియం వేదికగా ఈపీడీసీఎల్ ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో నాలుగు గోడల మధ్య సమావేశం నిర్వహించడం విమర్శలపాలైంది. ప్రజాభిప్రాయం నిర్వహించిన జేఎన్‌టీయూ బయట పెద్దఎత్తున పోలీసులను మోహరించడాన్ని వామపక్షాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఆక్షేపించాయి. విద్యుత్ చార్జీల పెంపు సామాన్య, మధ్యతరగతులకు మరింత భారమవుతుందన్న ప్రజాభిప్రాయాన్ని సర్కార్ గౌరవిస్తుందా లేదా బుట్టదాఖలు చేస్తుందా అనేది వేచిచూడాల్సిందే.
ఆవిరైన ఆశలు
Published Sun, Mar 1 2015 12:46 AM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM
Advertisement
Advertisement