
కులం హజంపై ఎలుగెత్తిన గళం
కొత్త కోణం
మనుషులందరూ సమానమేననే భావన ఫూలే సంస్కరణ మార్గానికి ప్రాతిపదిక. కుల ఆధిపత్యం నిరాకరించిన విద్యను శూద్రులకు, మహిళలకు, అంటరాని కులాలకు అందించడం ద్వారానే వారిని చీకటి బతుకుల నుంచి బయటపడేయగలమని ఆయన విశ్వసించారు. శూద్రులను బానిసలుగా దిగజార్చిన మన కుల వ్యవస్థ, అమెరికాలో అమలైన బానిసత్వానికి తీసిపోదని విశ్లేషించారు. తల్లిదండ్రులకు, బిడ్డలకు మధ్య లేని దళారులు... భగవంతునికి, భక్తులకు మధ్య ఎందుకు? అంటూ ఫూలే ప్రశ్నించారు.
పెళ్ళి భజంత్రీలు మోగుతున్నాయి. పెళ్ళి కొడుకుని ఊరేగిస్తున్నారు. అంతలో ఎవరిదోగానీ ‘నువ్వెవరివి?’ అనే ప్రశ్న దూసుకొచ్చింది. ‘నేను పెళ్ళి కొడుకు స్నేహితుడిని’ అన్నాడతను. ‘నీదేకులం?’ మళ్ళీ ప్రశ్న. అవహేళనని దిగమింగుకుంటూ ‘మాలి’ అని సమాధానమిచ్చాడా యువకుడు. బ్రాహ్మణ పెళ్ళి ఊరేగింపులో మాలివాడా? అంతా అతన్ని నానా మాటలూ అన్నారు. ఊరేగింపు ముందుకు పోయింది. ఆ యువకుని పాదాలు విముక్తిబాట పట్టాయి. ఇలాంటి అవమానాలు అతనికి కొత్త కాదు, కానీ వందలాది మందిలో జరిగిన ఈ అవమానం తన జాతిజనులకు జరిగిన అవమానంగా అతడు భావించాడు. శూద్ర, అతిశూద్రుల పట్ల సమాజానికున్న తప్పుడు భావజాలాన్ని ఎలాగైనా మార్చాలనుకున్నాడు. సమానత్వ భావనలేని సమాజం ప్రగతివిరోధంగా భావించాడు. ఆనాడు ఆయన మదిలో మొలకెత్తిన ఈ భావన కులవ్యవస్థపై పోరాటానికి పునాది వేసింది. అతడా మహత్తర పోరాటానికే జీవిత సర్వస్వం ధారపోశాడు. కుల వ్యతిరేక పోరాటానికి ఒక సైద్ధాంతిక భూమికను అందించాడు. ఆయనే మహాత్మాజ్యోతిబా ఫూలే. బాబా సాహెబ్ అంబేడ్కర్, తన ముగ్గురు గురువుల్లో ఒకరిగా పేర్కొన్న దార్శనికుడాయన (మిగతా ఇద్దరు గౌతమ బుద్ధుడు, కబీర్).
మహారాష్ట్రకే చెందిన ఫూలే మరణించిన ఏడాదికి అంబేడ్కర్ జన్మించారు. ఫూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని పూనాలో జన్మించారు. జ్యోతిబా ఫూలే తండ్రి గోవిందరావు అక్కడ కాయగూరల వర్తకం చేసేవారు. సతారా జిల్లాకు చెందిన ఫూలే పూర్వీకులు పూనాకు బతుకుదెరువుకోసం వచ్చారు. ఫూలే వారి ఇంటి పేరుగా మారడానికి కారణం వారు పూలవర్తకం కూడా చేయడమేనని భావిస్తున్నారు. అంతకు ముందు వారి ఇంటిపేరు గొర్హాయి. ప్రాథమిక విద్యతో చదువుకు స్వస్తి పలికి ఫూలే తండ్రికి తోటపనిలో సహాయ పడటం మొదలు పెట్టారు. అయితే ఫూలేకు చదువు పట్ల ఉన్న తపనను చూసిన ఒక ముస్లిం ఉపాధ్యాయుడు, ఒక క్రిస్టియన్ ఫాదర్ ఆ పిల్లాడిని చదివించేలా తండ్రిపై ఒత్తిడి తెచ్చారు. . దానితో 1841లో జ్యోతిబా ఫూలే పూనాలోని స్కాటిష్ మిషన్ హైస్కూల్‌లో చదువు కొనసాగించాడు. అక్కడే సదాశివ్ బల్లాల్ గొవాండే ఆయనకు మిత్రుడయ్యాడు. పుట్టుకతో బ్రాహ్మణుడైనా సదాశివ్, ఫూలే కుల వ్యతిరేక పోరాటానికి చివరి దాకా అండదండలు అందించాడు.
సంస్కరణాస్త్రంగా విద్య
విద్యార్థి దశలోనే ఫూలే ఒక తాత్విక దృక్పథం ఏర్పర్చుకోవడానికి ప్రముఖ సామాజికవేత్త థామస్ పెయిన్ రాసిన ‘ద రైట్స్ ఆఫ్ మ్యాన్’ ఉపయోగపడింది. అది, యూరప్, అమెరికా హక్కుల ఉద్యమాలకు గొప్ప దిశానిర్దేశం చేసింది. భూమి పైన పుట్టిన మనుషులందరూ సమానమేననే భావనను ఫూలే ఒంటబట్టించుకున్నాడు. కుల అసమానతలను అధిగమించాలంటే కుల ఆధిపత్యం నిరాకరించిన విద్యను శూద్రులకు, మహిళలకు, అంటరాని కులాలకు అందించాలనీ, అదొక్కటే వారిని చీకటి బతుకుల నుంచి బయటపడవేయగలదనీ ఫూలే దృఢ విశ్వాసం. అందుకే ముందుగా తన జీవిత భాగస్వామి సావిత్రీబాయిని విద్యావంతురాలిని చేశారు. ఆయన నేర్పిన ఆ అక్షరాలే ఆమెకు ఫూలే పోరాటంలో జీవితాంతం తోడునీడగా నిలవగలిగే చైతన్యాన్ని అందించాయి. సావిత్రీబాయి నేర్చుకున్న విద్యాబుద్ధులు ఆమెను భారత దేశంలోనే తొట్టతొలి మహిళా ఉపాధ్యాయిని చేశాయి. సావిత్రీబాయితో కలిసి జ్యోతిబా ఫూలే తన ఇంటిలోనే 1851లో ప్రత్యేకించి బాలికలకోసం ఒక పాఠశాలను ప్రారంభించారు. ఫూలే చేసిన ఈ సాహసాన్ని ఆధిపత్య కులాలు, ప్రత్యేకించి బ్రాహ్మణులు తీవ్రంగా వ్యతిరేకించారు.
దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దుష్ర్పచారం చేశారు, ఇతరులెవ్వరూ అందులో పనిచేయకుండా అడ్డుకున్నారు. అయినా పాఠశాలను నడపడానికి నిర్ణయించుకొన్న ఫూలే దంపతులపై భౌతిక దాడులకు కూడా తెగబడ్డారు. అయినా ఫూలే దంపతులు తమ విద్యా ఉద్యమాన్ని ఆపలేదు. ‘‘అవిద్య వల్ల అవివేకం, అవివేకం వల్ల అనైతికత, అనైతికత వల్ల వెనుకబాటుతనం, వెనుకబాటుతనం వల్ల పేదరికం, పేదరికం వల్ల నిమ్న కులాలు వివక్షకు, అణచివేతకు గురికావడం జరుగుతోంది. అందుకే అన్ని రుగ్మతలకు అవిద్యే కారణమని ఫూలే బలంగా విశ్వసించారు. అందువల్లనే కింది కులాలకు, అన్ని కులాల మహిళలకు విద్యను అందించాలనే దృఢ నిశ్చయంతో ఫూలే ముందుకు సాగారు. ఈ క్రమంలోనే 1851-52 మధ్య కాలంలో మరో రెండు బాలికల పాఠశాలలను ప్రారంభించారు. ఇందులో అంటరానికులాలైన మహర్, మాంగ్ బాలికలకు ఒక పాఠశాలను ప్రత్యేకించారు. 1882లో, విద్యా విషయాలపై బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన హంటర్ కమిషన్ ముందు ఇచ్చిన ఉపన్యాసంలో ఫూలే తన విద్యాపోరాటాన్ని వివరించారు. అంటరాని కులాల కోసం, ప్రత్యేకించి బాలికల కోసం పాఠశాలను నడిపిన మొట్టమొదటి సంఘసంస్కర్త జ్యోతిబా ఫూలే. శూద్రులు, అంటరాని కులాల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు అవసరమని మొట్టమొదటగా చెప్పింది కూడా ఆయనే.
మన కులం ఆధునిక అమెరికన్ బానిసత్వం
ఫూలే కుల వ్యవస్థపై, ముఖ్యంగా బ్రాహ్మణ పురోహిత వర్గం ఆధిపత్యం పై రెండు సిద్ధాంత గ్రంథాలను కూడా రాశారు. 1873లో‘గులాంగిరి’, 1881లో రైతుల అవస్థలపై ‘సేద్యగాని చర్నాకోల’ (షేఠ్ కార్యాంచా అసూడ్) అనే పుస్తకాలను రాసి... పురోహిత వర్గం ఇతర కులాలపై సాగిస్తున్న ఆధిపత్యాన్ని, దాని ప్రభావాలను వివరించారు. ‘గులాంగిరి’ పుస్తక ం భారత ఇతిహాసాలను, పురాణాలను మరొక కోణంలో చూపెట్టింది. భారత దేశంలోని ఆదివాసులను, స్థానిక ప్రజలను జయించడానికి ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చిన ఆర్యులు జరిపిన దాడులే మహా విష్ణువు దశావతారని ఫూలే ఆధారసహితంగా వివరించారు. బౌద్ధ మతాన్ని ధ్వంసం చేసే కుట్రలో భాగంగానే పరుశురాముడు ఆనాటి క్షేత్రియులను (స్థానికులను) వేలాదిగా హతమార్చాడని ఫూలే ధ్రువీకరించాడు.
దీనినే బ్రాహ్మణ, క్షత్రియ వైరంగా కూడా చరిత్ర కారులు విశ్లేషించారు. ఈ పుస్తకానికి ముందు మాట రాస్తూ ‘‘బ్రాహ్మణులు శూద్రులను బానిసలుగా దిగజార్చిన వ్యవస్థ, కొన్నేళ్ల క్రితం వరకు అమెరికాలో అమలులో ఉన్న బానిసత్వ విధానానికి ఏ మాత్రం తీసిపోదు. కఠినాతి కఠినమైన బ్రాహ్మణ ఆధిపత్యంతో ఉన్న పీష్వాల కాలం వరకు నా శూద్ర సహోదరులు అమెరికాలో నీగ్రో బానిసలు అనుభవించిన వాటిని మించిన ఎన్నో కష్టాలను అనుభవించారు’’ అని ఆయన అన్నారు. భారత కుల వ్యవస్థను, కుల వివక్షను అమెరికాలోని బానిస వ్యవస్థతో పోల్చిన ఫూలే... ఈ పుస్తకాన్ని అమెరికన్ నీగ్రోల బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వీరులకు అంకితమిచ్చారు. అంతర్జాతీయంగా సాగుతున్న మానవ హక్కుల ఉద్యమాలను ఫూలే సన్నిహితంగా పరిశీలించారని ఇది స్పష్టం చేస్తోంది.
దైవానికి పూజారులనే దళారులు అవసరమా?
రైతుల దీన స్థితి, పేదరికం, వెనుకబాటుతనానికి కారణమైన పురోహిత వర్గ దోపిడీ, అణచివేతలను వివరిస్తూ, ఈ విషయంలో బ్రిటిష్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని చెండాడుతూ రాసిన ‘‘ సేద్యగాని చెర్నాకోల’’ నాడు సంచలనాన్ని సృష్టించింది. ఆ పుస్తకం మొదటి అధ్యాయంలోనే పూజారి వర్గం నిలువుదోపిడీని రకరకాల పూజలు, కర్మకాండల పేరుతో రైతులను పీల్చి పిప్పి చేయడాన్ని ఆయన సోదాహరణంగా వివరించారు. మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వానికి పన్నుల వసూళ్ళ మీద ఉన్న శ్రద్ధ రైతుల సంక్షేమం మీద లేదని కూడా ఫూలే ఆ పుస్తకంలో తెలిపారు.
ఫూలే మూడవ కార్యాచరణ, ప్రత్యక్ష ఉద్యమం-యుద్ధం. అందు కోసం ఆయన 1873న సత్యశోధక్ అనే సంస్థను స్థాపించారు.‘‘మానవులంతా ఒకే తండ్రి బిడ్డలు. ఆ తండ్రి దేవుడు మాత్రమే. అందరికీ ఆయనే తండ్రి. తల్లి దండ్రులకూ పిల్లలకూ మధ్య సంభాషణ జరగడానికి బ్రోకర్లుగానీ, అనువాదకులుగానీ అవసరం లేనట్టే, దేవుడికీ మనుషులకూ మధ్య పూజారుల అడ్డు అక్కర్లేదు. ఈ సిద్ధాంతాన్ని అంగీకరించినవాడే సత్యశోధకుడు’’ అని సత్యశోధక్ సమాజ్ చాటింది. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం, అనాథలను సంరక్షించడం వంటి కార్యక్రమాలను ఫూలే దంపతులు అంకితభావంతో నిర్వహించారు. సార్వజనిక్ ధర్మ్ అనే సంస్థను స్థాపించి చాతుర్‌వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేశారు. 1827లో జన్మించి 1890లో మరణించిన జ్యోతిబా ఫూలే సాగించిన ఉద్యమం మహారాష్ట్రలోనేగాక దేశమంతటా ప్రభావాన్ని కలుగజేసింది. ముఖ్యంగా కొల్లాపూర్ సంస్థానాధీశుడైన సాహు మహరాజ్ పైన ఫూలే ప్రభావం చాలా ఎక్కువగా కన్పిస్తున్నది.
ఫూలే ఆశయాలకనుగుణంగా సాహు మహరాజ్ బ్రాహ్మణేతర ఉద్యమం కొనసాగించారు. 1902లో సాహు మహారాజ్ ప్రకటించిన రిజర్వేషన్లు దేశ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం. అంతేకాదు అంబేడ్కర్ చదువుకు, ఆయన నడిపిన పత్రికకు ఆర్థిక సహకారం సైతం ఆయన అందించారు. ‘‘తాము అనుభవిస్తున్న బానిసత్వానికి వ్యతిరేకంగా శూద్రులను మేల్కొల్పిన మహాత్మా ఫూలే ఆధునిక భారత దేశ చరిత్రలో మరపురాని సామాజిక ఉద్యమ నాయకుడు. పరాయి పాలకుల నుంచి విముక్తికన్నా, భారత సామాజిక ప్రజాస్వామ్యం చాలా గొప్పదని చాటిచెప్పిన దార్శనికుడు మహాత్మా ఫూలే’’ అంటూ అంబేడ్కర్ మహాత్మా ఫూలే నిర్వహించిన గురుతర చారిత్రక, సామాజిక పాత్రను సరిగ్గా అంచనా కట్టారు.
మల్లెపల్లి లక్ష్మయ్య
ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతిబా ఫూలే 189వ జయంతి సందర్భంగా వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213