
వెరపులేని వెన్నుపోటు వీరుడు
బొటాబొటీ ఆధిక్యం ఉన్న చంద్రబాబు పక్షం చట్టాలు చేయాల్సివస్తే మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. అందుకు కావలసిన 116 మంది సభ్యులకుగాను ఇప్పుడున్న సంఖ్య (మతతత్వపార్టీతో జోడుకట్టినా కూడా) 106 మాత్రమే! కాబట్టి మిగిలిన 10 స్థానాలు ఎక్కడి నుంచి తోడుకొస్తారట?! వైఎస్సార్‌సీపీని ఫిరాయింపుల ద్వారా, ప్రలోభాలతో చీల్చడం ద్వారా!
‘‘పార్లమెంట్‌కు లేదా శాసనసభకు ఏ రాజకీయ పార్టీ నుంచి అయినా పోటీ చేసి గెలిచిన సభ్యుడు అదే పార్టీ శాసనసభా పక్షంలో ఒకరనే అర్థం. లేదా ఆ రాజకీయ పార్టీకి చెందిన సభ్యుల బృందంలో ఒకరనే అర్థం. అలాంటి సభ్యుడు మరొక పార్టీలోకి ఫిరాయిస్తే అది చెల్లదు. చట్టం ప్రకారం ఆ వ్యక్తి సభ్యునిగా అనర్హుడే. అలాంటి సభ్యుడు అప్పటిదాకా ఏ పార్టీకి చెంది ఉన్నాడో, ఆ పార్టీ శాసనసభాపక్షం, లేదా ఆ పార్టీ నాయకుడు, ఆ నాయకుని తరఫున నియమితుడైన అధికారిక ప్రతినిధి ఫలానా సభ్యుడు ఓటింగ్‌లో పాల్గొనరాదని ఆదేశించినప్పటికీ ఓటింగ్‌లో పాల్గొన్నపుడు కూడా అనర్హుడిగానే పరిగణించాలి. లేదా ఓటింగ్ నుంచి గైరుహాజరైనప్పుడు కూడా ఆ సభ్యుడికి ఈ అనర్హత వ ర్తిస్తుంది. కానీ ఏదైనా ఒక రాజకీయ పక్షం మరొక పక్షంతో విలీనమైనపుడు మౌలిక రాజకీయ పక్షానికి చెందిన సభ్యుడు లేదా సభ్యులు కొత్త పక్షంలో సభ్యులైతే చట్టం కింద అనర్హత వేటు పడదు’’
రాజ్యాంగంలోని పదో షెడ్యూలు (102(2), 191(2) అధికరణలలో)నిర్దేశిస్తున్న నిబంధన స్థూలంగా ఇదే. ఒకడు తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నాడట. మరొకామె ఆడలేక గజ్జెలు పాతవని వంక చూపిందట. ఇంకా కొందరు ఉంటారు. మూడేళ్ల వయసులో ఎలాంటి బుద్ధులు ప్రదర్శిస్తారో, ముప్పయ్ ఏళ్లకు కూడా అవే బుద్ధులు ప్రదర్శిస్తారు. పదేళ్ల తరువాత మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్న నారా చంద్రబాబు నాయుడు ప్రతికూల ఆలోచనలకూ బుద్ధులకూ ప్రసిద్ధుడు. రాష్ట్రాన్ని ఇంటాబయటా అవమానాల పాల్జేసిన కాంగ్రెస్ పార్టీని తొమ్మిది మాసాల కాలంలోనే శంకరగిరి మన్యాలకు పంపినవారు నందమూరి తారకరామారావు. తెలుగుతేజం, తెలుగుదేశాన్ని స్థాపించిన తెలుగుతేజం ఆయన. దేశ రాజధానిలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ తెలుగువారి ఘనకీర్తిని ప్రతిష్టించిన వారు ఎన్టీఆర్. తాను గద్దెనెక్కడం కోసం ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడానికి చంద్రబాబు పన్నిన కుట్రలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.
ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడానికి కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్ నాయకులతో కలసి చంద్రబాబు పన్నిన కుట్రల గురించీ ప్రజలు మరిచిపోరు. నాటి సంఘటనలన్నింటికీ సాక్షిని, నేను బతికే ఉన్నాను. తానొక లాయర్‌నని అనుకునే యనమల రామకృష్ణుడు నాడు శాసనసభాపతి. యనమల, ఆయనతో పాటు ఇంకొందరు ప్రబుద్ధులు కూడా వెన్నుపోటులో భాగస్వాములన్న సంగతి అందరికీ తెలుసు. ఇదంతా గతం గతంః అనుకున్నా బాబుని గత ‘బుద్ధు’ల నుంచి సన్మార్గానికి మరలించడం సాధ్యం కాదని తెలుసుకోవడంతోనే రేపటికి తగిన గుణపాఠాలను రాజకీయ పక్షాలు నేర్వగలుగుతాయి!
హేయమైన పంథా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నెలకొల్పి, అనతికాలంలోనే పొత్తులతో నిమిత్తం లేకుండానే ఏకైక పార్టీగా ఎన్నికలలో ప్రతిష్టాత్మక ప్రతిపక్షంగా (సంఖ్య రీత్యానూ, పోలైన ఓట్ల శాతంలోనూ) నిలబెట్టుకున్న నాయకుడు జగన్. విజయంపై నమ్మకం లేకనే చంద్రబాబు మత ఛాందస శక్తితో పొత్తు పెట్టుకోవలసి వచ్చింది. రెండు దినపత్రికలను, డబ్బు కోసం ప్రసారాలు చేసే మరికొన్ని చానళ్ల అండదండలతో జగన్‌పైన, ఆయన పార్టీపైన కులం, మతం పరంగా కనీ వినీ ఎరుగని విషప్రచారం చేశారు ‘దేశం’ నాయకులు. అయినా ఎన్నికల్లో జగన్ పార్టీ వేగాన్ని నిలవరించలేక పోయారు.
దామాషా ఎన్నికల పద్ధతిని పాలకపక్షాలు ఎందుకు నిరాకరిస్తున్నాయో తెలుసుకోవడానికి ఈ ఎన్నికల్లో జగన్ పార్టీ, చంద్రబాబు పార్టీ సాధించిన ఫలితాలు, ఓట్ల శాతాన్ని బేరీజు వేసుకొన్న వాళ్లందరికీ బహిర్గతమైపోయింది! మొత్తం ఓట్లలో కేవలం 76 వేల ఓట్ల తేడాతో ‘దేశం’ పార్టీ 102 అసెంబ్లీ స్థానాలు ఎలా గెల్చుకోగలిగింది? అదే వైఎస్సార్ పార్టీ వీసం తేడా లేకుండా అంతే ఓట్ల తేడాతో 67 స్థానాలు ఎలా గెల్చుకోగలిగింది! ఇప్పుడే సీట్ల వ్యత్యాసాన్ని కూడా వైఎస్సార్ సీపీకి దక్కకుండా చేసి, దాని ప్రతిష్టాత్మక ప్రతిపక్ష స్థాయిని కూడా దొంగ పద్ధతుల ద్వారా, ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా కుదించడం ఎలా అన్నదే చంద్రబాబు వర్గం రంధి.
దీనికి తగ్గట్టుగానే యనమల వారు లాయర్ ఎలా అయ్యారో తెలియదు గాని, వైఎస్సార్ సీపీ ‘గుర్తింపు పొందిన’ పార్టీ కాదనీ, అందువల్ల ఆ పార్టీ నుంచి వేరే పార్టీలోకి వచ్చి చేరే వారికి ఫిరాయింపుల చట్టం వర్తించదనీ వాచాలత్వానికి దిగాడు. ‘దేశం’ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు అవతరించగానే రాలేదు సుమా! రాజ్యాంగ చట్టమూ, దాని నిబంధనలూ అందులోని 10వ షెడ్యూలూ యనమల ఊకదంపుడు కబుర్లని తూర్పారబడుతున్నాయని కూడా గ్రహించలేదు!
గోడ దూకుళ్లకు చేయూత!
సమర్థుడైన నాయకుడు బలమైన ప్రతిపక్షాన్ని చూసి బెదరడు. చేసిన వాగ్దానాలు కాదు, మౌలిక విధానాలు ప్రజారంజకమైనపుడు ప్రతిపక్ష విమర్శలను సయితం గౌరవించి తప్పుల్ని దిద్దుకుంటాడు! న్యాయ కోవిదుడు, నా పాత్రికేయ సహచరుడు, శిష్యుడు, సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, కేంద్ర ఎన్నికల కమిషనర్ సంపత్ ఒకటికి పదిసార్లు చెప్పినట్టుగా ‘‘10వ షెడ్యూల్ ప్రకారం (దీని సారాంశాన్ని వ్యాస ప్రారంభంలోనే ఇచ్చాను) ఒక రాజకీయ పార్టీయా, ఫలానా పార్టీ లెజిస్లేచర్ పార్టీయా అని నిబంధనలో ఉందే తప్ప ఆ పార్టీ ఎన్నికల సంఘం గుర్తింపు (రికగ్నైజ్డ్) ఉన్న పార్టీయా లేక గుర్తించని పార్టీయా అన్న విషయాన్ని ప్రస్తావించలేదు.
ఒక పార్టీపైన, దాని గుర్తుపైన గెల్చిన అభ్యర్థి మరొక పార్టీలోకి గెంతితే అతడు సభ్యుడుగా అనర్హుడవుతాడు’’! ఈ మాత్రం ఇంగితజ్ఞానం స్పీకర్‌గా చేసిన వాడికి గాని, ‘గోడ దూకే’ అభ్యర్థులకు గాని, అందులోనూ అభ్యర్థి దరఖాస్తు పత్రంపై చేసిన సంతకం కూడా ఆరకముందే, ఎన్నికై నాలుగు రోజులు కూడా గడవకుండానే ప్లేట్లు ఫిరాయించే వాళ్లకు గానీ లేకపోయింది. పైగా, తమ సభ్యత్వం రద్దయితే మళ్లీ పోటీ చేసి అసెంబ్లీలో ప్రవేశిస్తానని బెదిరిస్తున్న పైపుల వ్యాపారి ఓటర్లను ఎంతగా అవమానిస్తున్నాడో గమనించాలి! బొటాబొటీ ఆధిక్యం మాత్రమే ఉన్న చంద్రబాబు పక్షం చట్టాలు చేయాల్సి వస్తే మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమవుతుంది. అందుకు కావలసిన 116 మంది సభ్యుల సంఖ్యకుగాను ఇప్పుడున్న సంఖ్య (మతతత్వపార్టీతో జోడు కట్టినా కూడా) 106 మాత్రమే! కాబట్టి మిగిలిన 10 స్థానాలు ఎక్కడి నుంచి తోడుకొస్తారట?! వైఎస్సార్ పార్టీని ఫిరాయింపుల ద్వారా, ప్రలోభాలతో చీల్చడం ద్వారా! అందుకే అటు వైఎస్సార్ పార్టీలోని 9 మంది పార్లమెంటు సభ్యులలో ఇద్దరినీ, ఇటు శాసనసభా పార్టీ నుంచి ఒక పది మందినీ ఎరవేయటం పైన చంద్రబాబు పార్టీ బతుకు ఆధారపడి ఉంది.
అంతిమ విజయం వైఎస్‌ఆర్‌సీపీదే
పార్లమెంటు స్థానాల్లో పొందిన ఓట్ల శాతంలో ‘దేశం’ పార్టీకి, వైఎస్సార్ పార్టీకి తేడా లేదు. చెరి 2.9 శాతం ఓట్లు పొందాయి! ఏడుపనండి, గుర్రు అనండి - అసలు కథ అది! రాష్ట్ర విభజనకు ‘రెండు కళ్ల సిద్ధాంతం’తో తోడ్పడిన చంద్రబాబు కేవలం అధికారం కోసమే ఎన్నికల్లో ‘అందని మ్రానిపండ్ల’ మాదిరి హామీలు ఇచ్చారు. ఇచ్చిన తరువాత వెనక్కి వెళ్లలేక ఒక తాజా ప్రకటన విడుదల చేశాడు. ‘‘ఆంధ్రప్రదేశ్, ఆర్థిక లోటుతోనే కార్యకలాపాలు మొదలు పెట్టబోతోంది. ఇంతకూ వనరులూ లేవు. అందుకు ఆదాయం పెరిగే అవకాశమూ లేదు’’ (24.5.2014). కొత్త పార్టీ అయినప్పటికీ మొదటిసారిగా 9 స్థానాలు పార్లమెంటులోనూ, 67 స్థానాలు శాసనసభలోనూ గెలుపొందిన వైఎస్సార్ పార్టీ సభ్యులు సగర్వంగా నిలబడగలరు. చంద్రబాబు పార్టీ చేసే దగుల్బాజీ ప్రయత్నాలకు అడ్డుకట్ట తప్పదు!
- (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)
ఏబీకే ప్రసాద్