ఈ సంక్షోభం స్వయంకృతాపరాధం
విశ్లేషణ
నరేంద్రమోదీ, అమిత్ షాలు కాంగ్రెస్ ముక్తి భారత్ గురించి ఎంత గట్టిగా చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ నుంచి ఈ దేశాన్ని విముక్తి చేయాలని వారు కోరుకోవడం లేదు. కాంగ్రెస్ అలా నామమాత్రపు జవజీవాలతో కొనసాగితేనే, బీజేపీకి వ్యతిరేకంగా నిజమైన ప్రత్యామ్నాయం ఏర్పడకుండా ఉంటుంది.
చేదు వాస్తవం మాట్లాడితే కలిగే ప్రభావం ఏదంటే... అలా మాట్లాడినవారు చాలా బాధపడాల్సి వస్తుంది. నిజాన్ని ఎంత గట్టిగా చెప్పితే అంత ఎక్కువ నొప్పి కలుగుతుంది కూడా. జైరాం రమేష్ విషయంలో ఇలాంటిదే జరిగింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, కాంగ్రెస్ మనుగడకు సంబంధించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని జైరాం అంగీకరించారు. ఈ సంక్షోభం 1977లో లేదా 1989లో లేదా 1998లో కాంగ్రెస్ ఎదుర్కొన్న ఎన్నికల్లో పరాజయానికి సంబంధించిన సంక్షోభం లాంటిది కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేతిలో రాజ్యాధికారం లేదుకానీ, కాంగ్రెస్ వాదుల్లో రాచరిక పోకడలు ఏమాత్రం తొలగిపోలేదని కూడా జైరాం అన్నారు.
ఏ జర్నలిస్టుతోనైనా, రాజకీయవాదితోనైనా లేక ఏ కాంగ్రెస్ కార్యకర్తతో అయినా మాట్లాడండి.. ఇదే విషయాన్ని వీరంతా మాట్లాడటం మీరు చూస్తారు. జైరాం రమేష్ చేసిన తప్పు ఏదంటే.. తన అభిప్రాయాన్ని నాలుగ్గోడల మధ్య చెప్పి ఉంటే బాగుండేది. కానీ ఆయన బహిరంగంగా చెప్పారు. ఆయన మాట్లాడింది నిజమే కాబట్టి ఇరుకున పడ్డారు. అందుకే ప్రతి ఛోటా మోటా కాంగ్రెస్ నేత కూడా ఇప్పుడు జైరాంపై దాడి చేస్తున్నారు. వాస్తవానికి జైరాం రమేషే అసలు సిసలు సుల్తాన్ అంటూ కొంతమంది చెబుతున్నారు. ఎన్నికల్లో గెలిచి కాకుండా దొడ్డి తోవ ద్వారా అధికారంలోకి వచ్చాడు కాబట్టే జైరాం ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, తనపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలని కొంతమంది వ్యాఖ్యానించారు. కానీ జైరాం రమేష్ చెప్పింది నిజం కాదని ఏ ఒక్కరూ ఇంతవరకు పేర్కొనలేదు.
కాంగ్రెస్ ఈ ప్రశ్నను ఎదుర్కోవడానికి ముందుకు రాకపోవచ్చు కానీ కాంగ్రెస్ మినహా తక్కిన దేశం ఈ ప్రశ్నను తృణీకరించలేదు. ఈ దేశ భవిష్యత్తులో కాంగ్రెస్ పాత్ర ఎలా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ ఇకపై ఈ దేశ రాజకీయాల్లో ఒక అర్థవంతమైన ప్రత్యామ్నాయంగా ఉండగలుగుతుందా? తన పునాదులపై జరుగుతున్న దాడులనుంచి ఈ దేశాన్ని కాపాడటంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందా? ఇది కాంగ్రెస్‌కు సంబంధించిన ప్రశ్నే కాదు. ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న.
అయితే ఈ ప్రశ్నకు సమాధానమిచ్చేముందు ఎవరైనా సరే దురవగాహనల నుంచి బయటపడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సమస్య దాని నాయకత్వమే అని చాలామంది భావిస్తున్నారు. రాహుల్ గాంధీని విమర్శించే కాంగ్రెస్ కార్యకర్తలకు కొదవ లేదు. సోషల్ మీడియాకేసి చూస్తే, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు మూల కారణం రాహుల్ గాంధీయే అని వ్యాఖ్యలు కనబడతాయి. కానీ ఇలాంటి వాదనల్లో వివేచన కనిపించదు. రాహుల్ గాంధీ.. మీడియా చిత్రిస్తున్నంత అపరిణిత, నిజాయితీ రహిత వ్యక్తి కాదు. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అవసరమైన రాజకీయ అవగాహన రాహుల్‌లో లోపించిందనడంలో సందేహమే లేదు. రాహుల్ గాంధీ వంటి నేత కాంగ్రెస్ పార్టీ అత్యున్నత స్థానంలో ఉండటంలో సంక్షోభం లేదు. కానీ నిజమైన సంక్షోభం ఏమిటంటే, రాహుల్ వంటి నేత మాత్రమే కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థానంలో ఉండటమే. ప్రజల్లో పలుకుబడి కలిగిన నేతలు కానీ, సైద్ధాంతిక విశ్వాసం కలిగిన వ్యక్తులుకానీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నత స్థానాలను అలంకరించలేరు. కాంగ్రెస్ సంక్షోభం వెనుక ఉన్న కారణం రాహుల్ కాదు. తాను ఆ సంక్షోభపు ప్రతిఫలనం మాత్రమే. వాస్తవం ఏమిటంటే పైనుంచి కింది స్థాయి వరకు కాంగ్రెస్ నేడు సంక్షోభంలో ఉంది. అగ్రనేతల నుంచి క్షేత్రస్థాయి వలంటీర్ల వరకు పార్టీ పట్ల అంకితభావం లోపించింది.
కాంగ్రెస్ పార్టీలోని సంక్షోభం భవిష్యత్తుపై దాని దార్శనికతకు సంబంధించిన సంక్షోభం. ఈరోజు ఏ అంశంలోనైనా పార్టీ వైఖరి ఏమిటన్నది కాంగ్రెస్‌కే తెలీడం లేదు. మోదీ ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను వ్యతిరేకించడం చాలా సులభం. కానీ ఎమర్జెన్సీకి కారకురాలైన, గాంధీ కుటుంబానికి పరిమితమైపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి నిజంగా దోహదపడుతుందా? పెద్ద నోట్ల రద్దు లేదా జీఎస్టీపై బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం ఒక అంశం మాత్రమే. కానీ బీజేపీ విధానాలకు ఒక ప్రత్యామ్నాయమైనా కాంగ్రెస్ పార్టీలో ఉందా? మన్మోహన్, మోదీ ఇద్దరి ఆర్థిక విధానాలను తీర్చిదిద్దిన ఆర్థిక చింతననుంచి బయటకు రావడానికి కాంగ్రెస్ నిజంగా సిద్ధంగా ఉందా?
నేడు బీజేపీకి కాంగ్రెస్‌కు మధ్య ఒకే ఒక్క వ్యత్యాసం ఉంది. బీజేపీ ముస్లిం వ్యతిరేక వైఖరిని బహిరంగంగా ప్రదర్శిస్తూ, అన్ని మైనారిటీ వర్గాల పట్ల ద్వేషాన్ని బహిరంగంగా ప్రోత్సహిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మనస్తత్వం దీనికి భిన్నంగా లేదు కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం మైనారిటీలకు అనుకూలంగా ఉంటూ తమను లౌకికవాదులుగా పిలవాలని కోరుకుంటున్నారు. ఈ లౌకిక వైఖరి ముసుగు వెనుక సైద్ధాంతిక విశ్వాసం కంటే ఓట్లకోసం నిస్సహాయతే ఎక్కువగా కనిపిస్తుంటుంది. లౌకిక భారతం కోసం హిందువులలో స్పందనను కాంగ్రెస్ ఇప్పుడు కూడగట్టలేదు. అదే సమయంలో మైనారిటీలలో భద్రతా భావాన్ని పెంపొందించలేదు. లౌకిక భారత స్వప్నాన్ని కాపాడటం కంటే ఈ భావనకే అప్రదిష్ట తెచ్చే సాధనంగా కాంగ్రెస్ మారిపోయింది.
ఏం చేయాలనే దానిపై దార్శనికతే లేనప్పుడు ఏ పార్టీకయినా ఒక పంథా ఎలా ఉంటుంది? బిహార్ సంకీర్ణంలో కానీ లేదా 2019 ఎన్నికల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ వద్ద ఒక వ్యూహం లాంటిది కూడా లేదు. గుజరాత్‌లో తన సొంత పార్టీ సభ్యులను తమ నాయకుడికి ఓట్లు వేసేలా చేయడమే కాంగ్రెస్ పార్టీకి పెద్ద విజయమైపోయింది.
బీజేపీ అధికారంలో కొనసాగడానికి నేటి కాంగ్రెస్ పార్టీ ఒక ఉత్తమ హామీదారుగా ఉంటోంది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ మారలేదు. అదేసమయంలో ఏ ఇతర ప్రత్యామ్నాయాన్ని అది తయారు చేయలేదు. ఈరోజు దేశం నలుమూలలా రైతులు, యువత, దళితులు, ఆదివాసీలు, విద్యార్థులు ఆందోళన బాట పడుతున్నారు. ఈ ఆందోళనల్లోంచి కొత్త రాజకీయ ఉద్యమం ఆవిర్భవించడానికి కాంగ్రెస్ అనుమ తించలేదు. మోదీ, అమిత్ షాలు కాంగ్రెస్ ముక్తి భారత్ గురించి ఎంత గట్టిగా చెబుతున్నప్పటికీ కాంగ్రెస్‌నుంచి ఈ దేశాన్ని విముక్తి చేయాలని వారిద్దరూ కోరుకోవడం లేదు. కాంగ్రెస్ నామమాత్రపు జవజీవాలతో కొనసాగడాన్నే వారు ఇష్టపడుతున్నారు. అప్పుడు మాత్రమే బీజేపీకి వ్యతిరేకంగా నిజమైన ప్రత్యామ్నాయం ఏర్పడకుండా ఉంటుంది మరి.
జాతి హితం కోసం కాంగ్రెస్ పార్టీని రద్దుపర్చాలంటూ స్వాతంత్య్రానికి ముందు గాంధీ ఇచ్చిన సూచననే నేటి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సి ఉంది. నేటి కాంగ్రెస్ పార్టీని రద్దు చేయడమే దేశానికి ఉత్తమ ప్రయోజనకారి.
వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు
యోగేంద్ర యాదవ్
మొబైల్ : 98688 88986
Twitter: @_YogendraYadav