బీజేపీది ద్వంద్వ వైఖరి
ఎన్నికల ప్రచార ర్యాలీలో జైరాం రమేష్
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శించిందని కేంద్ర మంత్రి జైరాం రమేష్ ధ్వజమెత్తారు. బుధవారం సీతాఫల్‌మండిలో ఆయన సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అంజన్‌కుమార్ యాదవ్, అసెంబ్లీ అభ్యర్థి జయసుధకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జైరాంరమేష్ మాట్లాడుతూ, చిన్నమ్మగా చెప్పుకునే బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ తెలంగాణ బిల్లును బలపరుస్తున్నట్లు చెప్పారని, అయితే పెద్దన్నగా వ్యవహరించిన వెంకయ్యనాయుడు మాత్రం బిల్లును రాజ్యసభలో అడుగడుగునా అడ్డుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల స్వప్నాన్ని నిజం చేసిన ఘనత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీదేనన్నారు. గత నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్లమెంట్‌లో ఎప్పుడూ మాట్లాడిన దాఖలాల్లేవని, తోటి ఎంపీ విజయశాంతిని కూడా తనతో కలుపుకోలేకపోయారని విమర్శించారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. మహిళలకు, స్వయం సహాయక బృందాలకు రూ. లక్ష చొప్పున వడ్డీ లేని రుణాలిస్తామన్నారు.
30 తర్వాత కారు టైరుకు పంక్చర్ ఖాయం
నేటి స్పీడు యుగంలో 50 ఏళ్ల క్రితం నాటి అంబాసిడర్ కారును (టీఆర్‌ఎస్ ఎన్నికల గుర్తు) నడపడం ఎవరికీ నప్పదని, 30వ తేదీ తర్వాత కారు టైరుకు పంక్చర్ కావడం ఖాయమని కేంద్ర మంత్రి జైరాంరమేష్ అన్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డువద్ద బుధవారం ఆయన ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని అంజన్‌కుమార్, ముషీరాబాద్ అసెంబ్లీ అభ్యర్థి వినయ్‌కుమార్‌తో కలసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ కోసం యువకులు ఆత్మ బలిదానాలు చేసుకోవడం చూసి చలించిన సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడం ద్వారా నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చారన్నారు.