జయసుధపై చర్య తప్పదా?
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధపై పార్టీ పరంగా చర్యలు తీసుకునే విషయంపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం తర్జనభర్జన పడుతోంది. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆమెపై చర్య తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సికింద్రబాద్ ఇన్ చార్జిగా ఉన్న ఆమెను తొలగించి మరొకరిని నియమించాలని యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సీనియర్ నాయకుడు జానారెడ్డి సోమవారం సికింద్రాబాద్ నియోజకవర్గ ముఖ్యనేతలతో పరిస్థితిని సమీక్షించడంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది.
మరోవైపు నేడు సికింద్రాబాద్ లో జరగాల్సిన కాంగ్రెస్ పార్టీ సమావేశం వాయిదా పడింది. కాగా, తన కుమారుడు హీరోగా పరిచయమవుతున్న 'బస్తీ' సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ను ముఖ్యఅతిథిగా జయసుధ ఆహ్వానించడంపై కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తోంది.