జయసుధ మళ్లీ మెప్పిస్తారా?
సహజ నటి అనగానే టక్కున గుర్తొచ్చేది జయసుధ. తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించిన ఆమె రాజకీయ తెరపై మాత్రం జనాన్ని మెప్పించలేకపోతున్నారట. రీల్ లైఫ్లో ఏం నటించినా మురిసిపోయే జనం... రియల్ లైఫ్లో మాత్రం సారీ అంటున్నారు. సికింద్రాబాద్ నియోజక వర్గం నుంచి మరోసారి పోటీ చేస్తోన్న జయసుధకు ఎదురుగాలి ఓ ప్రభంజనంలా వీస్తోందని కాంగ్రెస్ శ్రేణులే గుసగుసలాడుకోవటం గమనార్హం.
2009 ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో వెండి తెర నుంచి రాజకీయ తెరపై జయసుధ ఆరంగేట్రం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంతో ఆమె గత ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే ఈ అయిదేళ్లలోనూ జయసుధ పార్టీ సహచరులతోనూ..కార్యకర్తలతోనూ అంటీ ముట్టనట్లు వ్యవహరించారని విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా నియోజకవర్గాన్ని జయసుధ చేసింది ఏమీ లేదంటూ స్థానికులు కూడా పెదవి విరుస్తున్నారు.
ఇక జయసుధ ఈసారి లోక్సభ సీటుపై కన్నేసినా ...కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమెకు సికింద్రాబాద్ అసెంబ్లీకే టికెట్ కేటాయించింది. దాంతో జయసుధ ఎన్నికల ప్రచారం మొదలెట్టారు.అయితే ఈసారి మాత్రం ఆమె గెలుపు కష్టమేనని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. పార్టీ శ్రేణులే జయసుధ గెలుపుకు సమిష్టిగా కృషి చేసే పరిస్థితులు లేవని సమాచారం. అంతేకాకుండా సికింద్రాబాద్ నుంచి త్రిముఖ పోటీ ఉండటంతో ఆమె ఈసారి గట్టెక్కేనా అనేది అనుమానమే.
జయసుధ, సికింద్రాబాద్, కాంగ్రెస్, ప్రచారం, Jaya sudha, secunderabad, congress, compaigning