సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ లబ్ధి కోసమే ఏపీకి ప్రత్యేకహోదా కేటాయింపు, ఆంధ్రప్రదేశ విభజన చట్టంలోని అంశాల అమలు విషయంలో బీజేపీ కాలయాపన చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ ఆరోపించారు. ‘కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్నా..విభజన హామీల అమలు దిశగా బీజేపీని ప్రభావితం చేయడంలో టీడీపీ ఎందుకు విఫలమవుతోంది. ఇందుకు నిరసనగా కేంద్ర కేబినెట్‌లోని తమ మంత్రులతో ఎందుకు రాజీనామా చేయించడం లేదు’ అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుకు డిమాండ్ చేస్తూ పలువురు కాంగ్రెస్ ఎంపీలు, పార్టీ ముఖ్య నాయకులు సోమవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి జైరాంరమేశ్, ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, మాజీ ఎంపీలు పళ్లంరాజు, కనుమూరి బాపిరాజు, సి రామచంద్రయ్య, మాజీ మంత్రులు కాసు వెంకట కృష్ణారెడ్డి శైలజానాథ్, కొండ్రు మురళిలు మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంలో ఏపీకి ‘ప్రత్యేక హోదా’అంశాన్ని చేర్చకపోవడం నిరాశ క లిగించిందన్నారు. దీనిని సాధించుకునేందుకు అన్ని పార్టీల మద్దతు కూడగతామన్నారు. కాగా, ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే హామీ ఇచ్చారు.