సహ చట్టం కదిలిస్తుంది | Corruption, revanges more in Cooperatives commitees | Sakshi
Sakshi News home page

సహ చట్టం కదిలిస్తుంది

Published Fri, Feb 12 2016 1:10 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 PM

సహ చట్టం కదిలిస్తుంది

సహ చట్టం కదిలిస్తుంది

సహకార సంఘాలలో సహకారం తక్కువ. అవినీతి, ప్రతీకారాలెక్కువ. ప్రతి సొసైటీలో రెండు లేదా అంతకు మించి వర్గాలు ఉంటాయి. వారు ఒకరి మీద ఒకరు కారాలూ మిరియాలూ నూరుతుంటారు. సహకార సంఘాల రిజిస్ట్రార్ ఈ సంఘాల కార్యక లాపాలను నియంత్రించాలి. వచ్చిన ఫిర్యాదులు విని తగిన చర్యలు తీసుకోవాలి. కాని వారి కష్టాలు వారివి. తగిన సిబ్బంది ఉండరు. అక్కడా అవినీతి, అసమర్థత, నిష్క్రియ కనిపిస్తాయి. ఏంచేసినా పని చేయబోమనే వైఖరి.  ఈ సంఘాల పనిపట్టాలనీ, సర్కారు శాఖతో పనిచేయించాలని అనుకునే వారికి దొరికిన సాధనం ఆర్టీఐ. ఇప్పుడు విరివిగా పడు తున్న ఆర్టీఐ ప్రశ్నల పరంపరతో సర్కారు వారి సహకార శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. చర్య తీసుకోక తప్పని పరిస్థితి.  

పాపం, ఒక సహకార గృహ నిర్మాణ సంఘ కార్యదర్శి బెహల్ 65 సంవత్సరాల వయసులో రెండేళ్ల నుంచి రిజిస్ట్రార్  చుట్టూ తిరుగుతున్నారు. సభ్యుడు కాని ఒక వ్యక్తి అన్యాయంగా ఫ్లాట్‌ను ఆక్రమించినందుకు ఆరు లక్షల రూపాయలు వసూలు చేయాలన్న ఉత్తర్వును ఆర్‌సీఎస్ (రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్) ఎందుకు అమలు చేయడం లేదని, ఎప్పుడు వసూలు చేస్తారని ఆర్టీఐ కింద అడిగారు. సొసైటీకి ఎన్ని ఉత్తరాలు రాసినా దిక్కులేదు. ఆర్టీఐ దరఖాస్తు గతీ అంతే. మొదటి అప్పీలు అధికారి సమాచారం ఇవ్వాలని  ఆదేశించినా అతీ గతీ లేదు.  సీపీఐఓ కనీసం కేసు విచారణ నోటీసుకు కూడా ప్రతిస్పం దించలేదు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా రాలేదు. షోకాజ్ నోటీసుకు జవాబేలేదు.  సమాచారం ఇవ్వాలన్న కమిషనర్ ఉత్తర్వులూ పాటించలేదు. మరో నోటీసు, మరి కొంత గడువు ఇచ్చినా ప్రయోజనం లేదు.
 
 కొత్తగా సీపీఐఓ (సమాచార అధికారి) పదవిని స్వీకరించిన అశోక్ కుమార్ తనకు ఫైలు దొరకలే దని, అయినా అదనపు గడువు ఇస్తే, విషయం తెలు సుకుని తగిన సమాచారం ఇస్తానని హామీ ఇచ్చారు. మరోసారి విఫలమైతే జరిమానా విధించ డానికి  చర్యలు తీసుకోవలసి ఉంటుందని రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కమిషన్ హెచ్చరించింది. సెక్షన్ 20 కింద తప్పుచేసిన అధికారిపైన జరిమానా విధించే అధికారం సమాచార కమిషనర్‌కు ఉంది. రోజుకు రూ.250  చొప్పున, గరిష్టం రూ. 25 వేల దాకా జరిమానా విధిస్తూ క్రమశిక్షణ  చర్య తీసుకోవాలని సిఫార్సుకూడా చేయవచ్చు. ఈ అధికారాన్ని ఏ విధంగా వినియోగించాలో, పద్ధతి ప్రక్రియలు ఏమిటో న్యాయస్థానాలు అనేక తీర్పులలో వివరిం చాయి. తమ ఉత్తర్వును తాము అమలు చేసుకునే బలం, శక్తి ట్రిబ్యునల్స్‌కు ఉంటాయని జి. బసవరాజు వర్సెస్ శ్రీమతి అరుంధతి కేసులో (సీసీసీ నంబర్ 525, 2008 సివిల్ (తేదీ 27.1.2009) కర్ణాటక హైకోర్టు వివరించింది. సమగ్రమైన ఆర్టీఐ చట్టంలో సెక్షన్ 20 ద్వారా, సమాచార కమిషన్ తన ఉత్తర్వులను తానే అమలు చేయించుకునే వీలుందని హైకోర్టు నిర్ధారించింది.  ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా, ఇటువంటి అధికారాలు ట్రిబ్యునల్స్‌కు ఉంటాయని స్పష్టం చేసింది.
 
 మాజీ సమాచార అధికారి జవాబులు ఇవ్వక పోవడం, సీఐసీ ఆదేశాలు పాటించకపోవడం, కమిషన్ విచారణకు హాజరు కాకపోవడంవంటి తప్పులకు పాల్పడ్డారు. ఆఫీసులో ఫైలు ఉన్నప్పటికీ దొరకడం లేదని బుకాయిస్తున్నారని, కమిషన్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని, మొత్తానికి ఆర్‌సీఎస్ కార్యాలయంలో కొందరికి సమాచారం ఇవ్వాలనే లేదని బెహల్ వాదించారు.  దాదాపు రెండేళ్ల నుంచి  తిరుగుతున్నా, వినతిపత్రాలు ఇస్తున్నా ఎవరూ చర్య తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 
 ఒక సంఘానికి కార్యదర్శి అయి ఉండి కూడా నివాస గృహాన్ని ఆక్రమించుకున్న వ్యక్తి నుంచి పరిహారం వసూలు చేయలేకపోవడం పట్ల బెహల్ కలత చెందారు. తనకు సర్కారు శాఖ ఏ మాత్రం సహకరించడం లేదని విమర్శించారు. తన తప్పు ఏమీ లేదని, కేవలం రిజిస్ట్రార్ విభాగం వారు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందని అన్నారు.
 పీఐఓ కృష్ణకుమార్ అసలు పట్టించుకోని అంశాలు, పాటించని ఆదేశాలు ఇవి. 1. ఆర్‌సీఎస్‌కు బెహల్ చేసిన ఫిర్యాదు, 2. ఆర్టీఐ దరఖాస్తు, 3. మొదటి అప్పీలు అధికారి ఆదేశాలు, 4. కేంద్ర సమాచార కమిషన్ కేసు విచారణ నోటీసు, 5. కమిషన్ షోకాజ్ నోటీసు, 6. సమాచారం ఇవ్వాలని కమిషన్ జారీ చేసిన ఆదేశాలు. ఇందువల్ల బెహల్ అనవసరంగా వేధింపులకు గురైనాడు. ఆయనకు పదివేల రూపాయల నష్టపరి హారం చెల్లించాలని కమిషన్ సహకార సంఘాల రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. మరొక రెండు సార్లు పెంచిన గడువులో కూడా సమాధానం చెప్పనం దుకు పీఐఓ కృష్ణమూర్తికి రూ. 25 వేలు  జరిమా నాను కమిషన్ విధించింది.
 
పిడుగులు పడినా పనిచేయని అధికారుల చేత పని చేయించే కొరడా సమాచార హక్కు. కొందరు అధికారులు జరిమానా విధించినా చలించరు. వారిపైన చర్య తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వ సంస్థల పైన ఉంటుంది. లేకపోతే వారు బాధితుడికి నష్టపరిహారం చెల్లించవలసి వస్తుంది. ఈ కేసులో పనిచేయని అధికారి పాతిక వేలు జరిమానా కమి షన్‌కు చెల్లిస్తే, అటువంటి అధికారులపైన ఏ చర్యా తీసుకోనందుకు ఆర్‌సీఎస్ వారు బెహల్‌కు పదివేలు పరిహారం చెల్లించాలి. జరిమానాలు, పరిహారాల ద్వారా సహ చట్టం పనిచేయిస్తుంది. (ఆర్ ఎల్ బెహల్ వర్సెస్ ఆర్‌సీఎస్, ఇఐఇఅఅ 2015000224 కేసులో ఫిబ్రవరి 1న ఇచ్చిన తీర్పు ఆధారంగా)
 వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
 - మాడభూషి శ్రీధర్
 professorsridhar@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement