దేశీ కాదు, పరదేశీ హబ్ | country's foreign monopoly investments | Sakshi
Sakshi News home page

దేశీ కాదు, పరదేశీ హబ్

Published Tue, Apr 21 2015 1:05 AM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

దేశీ కాదు, పరదేశీ హబ్ - Sakshi

దేశీ కాదు, పరదేశీ హబ్

రెండోమాట
 
దేశ, విదేశీ గుత్త పెట్టుబడులకు ఇక్కడి ప్రభుత్వాల విధానాలు ప్రజా ఉద్యమాల ద్వారా వెనుకంజ వేసినప్పుడల్లా మన నామమాత్రపు అభివృద్ధిని కూడా ఈ సంస్థలు తగ్గించి చూపుతాయి. పాలక వర్గాలు, గుత్తాధిపతుల అనుకూల విధానాల వైపు మొగ్గినప్పుడల్లా మన అభివృద్ధి రేటు, ద్రవ్యోల్బణం రేటు పడిపోయినా గానీ, దాన్ని పెట్టుబడి ప్రయోజనాల కోసం ఎక్కువ చేసి చూపుతుంటాయి. సంక్షోభాల చదరంగంలో వృద్ధి, క్షీణ దశలు ప్రపంచ రేటింగ్ సంస్థల చేతి చలువ!
 
‘భారత ఆర్థికరంగం నేడు అనేక బలహీనతలతో ఉంది. ఫలితంగా ఏ చిన్న షాక్ తగిలినా ఆర్థిక వ్యవస్థకే ముప్పు కలగనుంది. ఈ పరిణామం దేశ సార్వ భౌమాధికార సత్తాకు వెలగట్టగల (రేటింగ్) పరిస్థితికే ఇప్పుడు ప్రమాదకరం గా పరిణమించనుంది.’
 ‘స్టాండర్డ్ అండ్ పూర్’ (అమెరికా, ప్రపంచ బ్యాంక్ కనుసన్నలలో పనిచేసే రేటింగ్ సంస్థ) 14-4-2015న విడుదల చేసిన నివేదిక.
 ‘రూకలు పదివేలున్నా, చారెడు నూకలే గతి’ అంటారు. అంటే అంతర్జాతీ య మార్కెట్‌లో డాలర్‌తో పీటముడి పడిన రూపాయి విలువను నిర్ణయిం చేది ఆ కరెన్సీయే. డాలర్‌కు ఆ సౌరు తగ్గినా, ఇతర ఆర్థిక వ్యవస్థలను అస్తవ్య స్తం చేసే చిట్కాలతో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నదీ ఆ డాలరు కరెన్సీ యే. అయినా సరే, మనదేశం మాత్రం బీజేపీ సంకీర్ణపాలనలో వస్తూత్పత్తికి ప్రపంచ తయారీ కేంద్రం (హబ్)గా రాణించబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారు. ఆ ఊదర ఆయన అమెరికా యాత్రతోనే ఆరంభమైం ది. ఇంకా, ప్రపంచవ్యాప్తంగా బహుళజాతి గుత్త పెట్టుబడులకూ, ప్రభుత్వాల స్థాయిలో పెట్టుబడులకూ స్వాగతం పలకడంతో ఆ ఊదర మొదలైందని కూడా చెప్పవచ్చు. సామ్రాజ్యవాద దేశాల పెట్టుబడులు అంటే ప్రైవేట్ పెట్టు బడులే. ప్రపంచ బడా పారిశ్రామిక పెట్టుబడిదారులంతా ‘వాస్కోడిగామాలై తరలిరండి!’ అని మోదీ ఆహ్వానించారు.

హబ్‌ల మతలబు

 అశేష త్యాగాలు చేసి భారతీయులు దేశానికి స్వాతంత్య్రం తెచ్చుకున్నారు. కానీ, అంతకుముందటి పరాధార స్థితి నుంచి దేశాన్ని స్వతంత్ర ప్రతిపత్తితో బయటపడవేయడానికి ఏ ప్రభుత్వాధినేతలూ మనసు పెట్టి పనిచేయలేదు. తొలినాళ్లలో రాజీబేరాల మధ్య రాజకీయార్థిక, సామాజిక రంగాలలో సాధిం చిన అరకొర విజయాలు మినహాయిస్తే స్వతంత్ర భారతాన్ని పరాధారస్థితి నుంచి విముక్తం చేయడానికి గట్టిగా ప్రయత్నించలేదు. కాంగ్రెస్, బీజేపీ సంకీ ర్ణాలు ఆ పరాధీనతను కొనసాగించి, ఆ పరాధారస్థితికి ప్రజలను మరింతగా గురి చేసి కూర్చున్నాయి. ఇటీవల మన నేతలు కెనడా, ఫ్రాన్స్, జర్మనీలలో పర్యటించినపుడు ‘హబ్’ గురించి కొత్త సంగతులు కూడా జోడించారు. భార త్‌ను ప్రపంచ వస్తూత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దడానికి అనువైన పరిస్థితులను ప్రపంచ వ్యాప్త పెట్టుబడుదారులందరికీ కల్పిస్తారట. అందుకు అవసరమైన మార్పుల కోసం చట్టాలను మారుస్తామని భరోసా కూడా ఇచ్చారు.

నిజానికి జరుగుతున్నదేమిటి? దేశవాళీ యంత్రాలు, రక్షణ పరికరాలు వంటి సరుకుల ఉత్పత్తి వ్యూహరచన కానేకాదు. ఇందుకు భిన్నంగా యంత్రాలకూ, సరుకు లకూ పరాయి దేశాలపై ఆధారపడే ‘పరదేశీ హబ్’కు రూపకల్పన చేయడం. ఫ్రెంచ్ రాఫెల్ యుద్ధ విమానాల భారీ కొనుగోళ్లకు ఒప్పందాలు చేసుకోవ డమే ఇందుకు తాజా ఉదాహరణ. అంటే, దేశ రక్షణకూ, సార్వభౌమాధికార పరిరక్షణకీ కీలకమైన రక్షణోత్పత్తులనూ యుద్ధ విమానాలనూ- ఇంకా చెప్పా లంటే, స్వతంత్ర రక్షణ పాటవానికి చేటు చేసే పద్ధతులకు స్వాగతం పలుకు తున్నారు. ‘వేలు విడిచిన’ మన పరాయి దేశాల నుంచి జరిగే భారీ దిగుమ తుల మీదనే ఈ నాటికీ మనం ఆధారపడుతున్నాం.
 
అంతా అమెరికా మాయ


మన పాత, కొత్త పాలక సంకీర్ణాలు అమెరికా దాని మిత్ర రాజ్యాల కనుసన్న లలో మనుగడ సాగించవలసి వస్తున్నది ఈ క్రమంలోనే. మనకు తూర్పున ఉన్న ఆస్ట్రేలియా నుంచి ఇజ్రాయెల్ వరకు; పశ్చిమాసియాలోని టర్కీ, ఆఫ్రికాలోని మొరాకో దాకా ఉన్న ప్రభుత్వాలు అమెరికా ప్రభావిత రాజ్యాలే. అలాగే బీజేపీకి ఇజ్రాయెల్‌తో దీర్ఘకాలంగా సంబంధాలు ఉన్న సంగతిని కూడా విస్మరించలేం. ఇజ్రాయెల్ అరబ్బులకు వ్యతిరేకి. ఈ బంధమే దేశంలో ముస్లిం మైనారిటీల వేర్పాటువాద ధోరణులకు బలం చేకూరుస్తున్నది. రాజ్యాంగంలోని సెక్యులర్ స్వభావాన్ని తారుమారు చేయడానికి వీలైనప్పు డల్లా పాలకులు ప్రయత్నిస్తూ, మైనారిటీలను అభద్రతా భావానికి గురిచేస్తు న్నారు. దేశంలో తొలిసారి బీజేపీ అధికారం చేపట్టడానికి కొంచెం ముందు ఆ పార్టీ నాయకులు అద్వానీ ప్రభృతులు ఇజ్రాయెల్‌లో పర్యటించారు. కార్గిల్ యుద్ధ సమయంలో ఈ సంబంధాలు మరింత బలపడడమూ జరిగింది! చివరికి ఇండో-ఇజ్రాయెల్ అణు సహకార ఒప్పందానికి సానుకూల సంకేతా లు వెలువడ్డాయి. 2000 సంవత్సరంలో విదేశాంగ మంత్రి హోదాలో జశ్వం త్‌సింగ్ పాలస్తీనా ప్రజల స్వతంత్ర రాజ్య ప్రతిపత్తిని లోపాయికారిగా వ్యతిరే కించడమూ జరిగింది! ఇండో-పాక్ సంబంధాలు, కాంగ్రెస్- బీజేపీ సంకీర్ణా లలో ఒక ‘కొరకరాని కొయ్య’గా మారాయి. అలాగే భారత్-చైనా సంబంధా లూనూ! ఆ మాటకొస్తే మన ఇరుగు-పొరుగులో ఏ దేశంతో సఖ్యతా సంబం ధాలు సంపూర్ణంగా నెలకొని ఉన్నాయో తేల్చుకోవడం అందరికీ ఒక ప్రశ్నగా, అగ్నిపరీక్షగా మారింది. అందుకే ఆర్థికశక్తిగా భారతదేశం పటిష్టమైన శక్తిగా ఉన్నప్పుడే అంతర్జాతీయ సంబంధాలలో కూడా సర్వతంత్ర, స్వతంత్ర పాత్రను నిర్వహించగలుగుతుందన్న తొలి ప్రధాని జవహర్‌లాల్ విశ్వాసం ఆచరణలో నేటిదాకా ‘గుంటపూలు పూస్తూనే’ వచ్చింది!

రేటింగుల గొడవ

 ఈ అస్వతంత్ర వైఖరుల వల్లనే మన పాలకులు (ఏ ‘బ్రాండ్’ అయినా) దేశీ య ఆర్థిక వ్యవస్థను అమెరికా ‘ఎత్తు బిడ్డలైన’ ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ సంస్థల ప్రజావ్యతిరేక సంస్కరణలను బేషరతుగా అంగీకరించి సంతకాలు పెట్టవలసి వచ్చింది! కనుకనే ఈ క్షణం దాకా సామ్రాజ్యవాద గుత్తపెట్టుబడి సంస్థల తాఖీదులకు తలొగ్గుతున్నందు వల్లనే మన ఆర్థికాభివృద్ధి ఎన్ని ఒడి దుడుకులలో ఉన్నా, ‘స్టాండర్డ్ అండ్ పూర్’, ‘మూడీస్’ లాంటి రేటింగ్ ఏజె న్సీలు గుత్తపెట్టుబడుల ప్రయోజనాలకు అనుకూలంగా మదింపు నివేదిక లను తారుమారు చేస్తూ ఉంటాయి. విధానాలను ప్రజావ్యతిరేక సంస్కర ణల వైపునకు నెట్టడమే ఈ సంస్థల నివేదికలలోని మతలబంతా! అంటే, దేశ, విదేశీ గుత్త పెట్టుబడులకు ఇక్కడి ప్రభుత్వాల విధానాలు ప్రజా ఉద్యమాల ద్వారా వెనుకంజ వేసినప్పుడల్లా మన నామమాత్రపు అభివృద్ధిని కూడా ఈ సంస్థలు తగ్గించి చూపుతాయి. పాలక వర్గాలు గుత్తాధిపతుల అనుకూల విధానాల వైపు మొగ్గినప్పుడల్లా మన అభివృద్ధి రేటు, ద్రవ్యోల్బణం రేటు పడిపోయినా గానీ, దాన్ని పెట్టుబడి ప్రయోజనాల కోసం ఎక్కువ చేసి చూపు తుంటాయి. సంక్షోభాల చదరంగంలో వృద్ధి, క్షీణ దశలు ప్రపంచ రేటింగ్ సం స్థల చేతి చలువ! అందుకే అంతర్జాతీయ సామ్రాజ్యవాద గుత్త పెట్టుబడుల లక్షణాన్ని, స్వతంత్ర దేశాల ఆర్థికాభివృద్ధి గురించి విశ్లేషించిన ‘‘సౌత్ కమి షన్’’ నూతన స్వతంత్ర దేశాధిపతులను 1990లోనే హెచ్చరించింది. సం పన్న దేశాలకు భిన్నంగా అనేక త్యాగాలతో పునీతమైన స్వతంత్ర దేశాల ప్రభుత్వాలకు ఈ కమిషన్ సరికొత్త ‘ఎజెండా’ అందించింది. ఈ కమిషన్‌కు మన్మోహన్ సింగ్ ప్రధాన కార్యదర్శిగా, టాంజానియా రిపబ్లిక్ నాయకుడూ జూలియస్ నైరేరి అధ్యక్షునిగా ఉన్నారు. ఆ కమిషన్ హెచ్చరికను సవరించ వలసిన అవసరం ఈ క్షణం దాకా రాలేదు. ఆ కమిషన్ నివేదికలో ఏముందో చూస్తే అదెందుకో అర్థమవుతుంది.
 ‘‘బాధలు పడిన వలస దేశాల ప్రజలు ఆ సామ్రాజ్యవాద ప్రభుత్వాల విధానాలను తిరస్కరించారు. కాబట్టే ఆ విధానాలను వారు పాతిపెట్టాల్సి వచ్చింది. స్వాతంత్య్రం పొందిన దేశాలు ఉన్న వనరుల సహాయంతోనే విదేశీ పెత్తనానికి వ్యతిరేకంగా సమరానికి సమాయత్తం కాగలిగాయి. తమకు నచ్చిన, తమ స్వాతంత్య్ర విలువలను గౌరవించగల షరతులపైన మాత్రమే బయటివారి సహాయాన్ని ఆమోదించాయి. నేటి వర్ధమాన దేశాల్లో విదేశీ ఆర్థిక పెత్తనాన్ని వివిధ రూపాలలో అనుభవిస్తున్న దేశాలు కూడా అలాంటి దృఢచిత్తంతో, స్వావలంబనపైన ఆధారపడిన కార్యాచరణ ద్వారానే విదేశీ ఆర్థిక పెత్తనాన్ని వదిలించుకోవచ్చు... స్వతంత్ర దేశాల నిరంతరాభివృద్ధి అనేది దిగుమతి చేసుకునే వస్తువు కాదు. వర్ధమాన దేశాల అభివృద్ధి బాధ్యత వర్ధమాన దేశాల చేతుల్లోనే ఉందని మరచిపోవద్దు’’.
 
ఒబామా కితాబు వెనుక...

 ఇందుకు కావలసింది నిజంగానే స్వదేశీ చైతన్యంతో సాగవలసిన దేశీయోత్ప త్తుల కేంద్రం (మేక్ ఇన్ ఇండియా). కాని ఆ మాట అనబోయి ప్రధాని మోదీ చేస్తున్న పని - ఇండియాకు వచ్చి ఇక్కడ ఉత్పత్తులు ప్రారంభించమని! లాభం లేనిదే వ్యాపారి (చిన్న వ్యాపారి - ‘ఘంజీ’ అయినా, బడా బాబుల యినా) వరదనపోడని మోదీ తెలుసుకోవడం మంచిది! ఈ బాపతు ‘తయా రీ’ ఎలాంటిదో బ్రిటిష్ వాడు నిరూపించాడు! మన పొగాకును పట్టుకుపోయి ఇంగ్లండ్‌లో చుట్టలు తయారు చేసి తిరిగి ఆ చుట్టలనే మన నోట్లో పెట్టిపో యాడు! నీ వనరులపైన నీకే అదుపు ఉంటే ‘మేక్ ఇన్ ఇండియా’ అని మరొ కడిని దేబిరించాల్సిన అవసరం ఉండదు! ఇప్పుడు తాజా పరిణామం - రిజ ర్వు బ్యాంక్ గవర్నర్ రాజన్‌తో విభేదిస్తూ విదేశీ పెట్టుబడుల ఉధృతి కోసం మోదీ సర్కార్ తలపట్లకు దిగడం! అందుకే మోదీకి సామ్రాజ్యవాద ప్రతినిధి ఒబామా కితాబులు!  (వ్యాసకర్త మొబైల్: 9848318414)
 
 ఏబీకే ప్రసాద్  సీనియర్ సంపాదకులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement