
న్యూఢిల్లీ: పెట్టుబడులకు పునరుత్తేజం, ఎగుమతులు భారీగా పెంచుకోగలిగితేనే భారత్ నిలకడగా 8 శాతం జీడీపీ వృద్ధి రేటును సాధించగలుగుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) పేర్కొంది. ‘ప్రస్తుతం పెట్టుబడులు, ఎగుమతులు ఇంకా పూర్తిస్థాయిలో పట్టాలెక్కలేదు. ఈ రెండు చోదకాలు గనుక జోరందుకుంటే 8 శాతం వృద్ధి సాధ్యమే. వ్యవసాయ మార్కెటింగ్‌ను గాడిలోపెట్టడం, సరఫరాపరమైన అడ్డంకులను తొలగించడం వంటివి కూడా చాలా కీలకం. ఈ రెండు అంశాల్లో మరిన్ని సంస్కరణలకు ఆస్కారం ఉంది’ అని ఏడీబీ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ గుప్తా వ్యాఖ్యానించారు. తాజాగా విడుదల చేసిన ఆసియా అభివృద్ధి అంచనా–2018 నివేదికలో భారత్ ఈ ఆర్థిక సంవత్సరం(2018–19)లో 7.3 శాతం, వచ్చే ఏడాది(2019–20)లో 7.6 శాతం చొప్పున వృద్ధి రేటును నమోదు చేయొచ్చని ఏడీబీ పేర్కొన్న సంగతి తెలిసిందే.
అవకాశాలు అపారం...
ప్రపంచ వాణిజ్యంలో భారత్ వాటా ఇంకా చాలా తక్కువేనని, రానున్నకాలంలో దీన్ని పెంచుకోవడానికి అపారమైన అవకాశాలున్నాయని సేన్ తెలిపారు. ‘వేతనాల పెరుగుదల కారణంగా చైనా ఎగుమతులు ఖరీదైనవిగా మారుతున్నాయి. భారత్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎగుమతుల పెంపుపై దృష్టిపెట్టాలి. దీనికోసం వ్యాపార సానుకూలత, మౌలిక సదుపాయాలను పెంచుకోవాల్సి ఉంటుంది’ అన్నారు. కాగా, భారత్ రెండంకెల వృద్ధిని సాధించగలదా అన్న ప్రశ్నకు... ఇదేమీ అసాధ్యం కాదు. అయితే, ఇప్పుడున్న మౌలిక సదుపాయాలు, నియంత్రణ పాలసీలతో దీర్ఘకాలంలోనైనా దీన్ని అందుకోగలుగుతుందా లేదా అనేది నా సందేహం. అనేక కీలక సంస్కరణలు దీనికి అవసరమవుతాయి’ అని సేన్ వివరించారు. ఇన్‌ఫ్రా, పారిశ్రామిక రంగానికి రుణాలు నెమ్మదిగా పుంజుకుంటున్నాయని.. ఇది సానుకూల పరిణామమని ఆయన చెప్పారు. అయితే, పెట్టుబడులు మరింత పెరిగేందుకు చాలా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని సేన్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment