మన వైద్య విద్యకు ‘కేన్సర్’ | Government negligence on Medicine | Sakshi
Sakshi News home page

మన వైద్య విద్యకు ‘కేన్సర్’

Published Sun, Apr 27 2014 12:54 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM

మన వైద్య విద్యకు ‘కేన్సర్’ - Sakshi

మన వైద్య విద్యకు ‘కేన్సర్’

రాష్ట్రంలో వైద్య విద్యను పటిష్టం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. సకాలంలో అవకాశాలు రాక మన అభ్యర్థులు క్షోభ పడుతున్నారు. అయినా వైద్య విద్య అభివృద్ధికి అంది వస్తున్న అవకాశాలను వినియోగించుకోవడానికి మన ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. వైద్యాన్నీ, వైద్య విద్యనూ రోగగ్రస్తం చేసి ఎన్ని ‘విజన్’లు పెట్టుకున్నా వ్యర్థం.
 
 రాజ్యాంగం ప్రకారం ఆరోగ్యం ప్రాథమిక హక్కు. అయినా ఆ రంగాన్ని సర్కార్లు ఘోరమైన స్థితికి నెట్టివేస్తున్నాయి. వైద్య విద్యనూ సంక్షోభం వైపు తీసుకు వెళుతున్నాయి. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం నిర్వహించిన ఏపీ పీజీ సెట్ లీకేజీ వ్యవహారం, కోర్టు తీర్పు ఇందుకు తాజా తార్కాణం. వైద్య విద్య మీద చూపుతున్న నిర్లక్ష్యం అంతిమంగా వైద్య రంగం మీద పడుతోంది. ఈ పరిణామాలన్నీ కలిసి వైద్య విద్యనూ, వైద్యాన్నీ సామాన్యులకు అందకుం డా చేస్తున్నాయి. వైద్య విద్యలో, ప్రవేశ పరీక్షలలో  అవకతవకలు సర్వసాధార ణమయ్యాయంటే అందుకు బాధ్యత ప్రభుత్వాలదే. ప్రవేశ పరీక్షలో జరిగిన అక్రమాల తీరును న్యాయమూర్తి  ‘ముదిరిన కేన్సర్’గా వ్యాఖ్యా నించారంటే అంతా సిగ్గుపడాలి. కోర్టు దోషులను శిక్షించడం న్యాయమే. కానీ నిజాయితీగా పరీక్షరాసి, ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులను ప్రభుత్వం అకారణంగా శిక్షిస్తోంది.

 ్రప్రైవేటు వైద్య విద్యదే పెద్ద పీట

 స్వాతంత్య్రం సాధించుకున్ననాటికి దేశంలో ఉన్న వైద్య కళాశా లలు 23. వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ మినహా మిగిలినవి ప్రభుత్వ కళాశాలలే. ప్రస్తుతం వీటి సంఖ్య 381. వాటిలో ఏటా  లభిస్తున్న ఎంబీబీఎస్ సీట్లు 50,068. మొత్తం వైద్య కళాశాలల్లో 176 ప్రభుత్వం నిర్వహిస్తూ ఉండగా, 205 కళాశాలలు ప్రైవేటు యాజమాన్యాలకు చెందినవి. ప్రభుత్వ కళాశాలల్లో లభిస్తున్న ఎంబీబీఎస్ సీట్లు 24,163. ప్రైవేటు కళాశాలల్లో ఉన్న సీట్లు 25,905. ప్రైవేటు వైద్య విద్యను ప్రోత్సహించే విధానాన్ని 1980 దశకంలో ఏడు, ఎనిమిది పంచవర్ష ప్రణాళికల కాలంలో ప్రభుత్వం ప్రారంభించింది.

 రాష్ట్రంలో ఆదినుంచీ నిర్లక్ష్యం

 తెలంగాణ, సీమాంధ్ర కలిసిన ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 43 వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఏటా లభిస్తున్న ఎంబీబీఎస్ సీట్లు 6,200. మొత్తం 43 వైద్య కళాశాలల్లో 15 మాత్రమే ప్రభుత్వ కళాశాలలు. ఆంధ్రప్రదేశ్ అవతరణ సమయంలో ఉన్న కళాశాలలు కేవలం నాలుగే. అవన్నీ ప్రభుత్వ కళాశాలలే. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కూడా వైద్య విద్యనూ, వైద్యాన్నీ కూడా నిర్లక్ష్యం చేయడం కనిపిస్తుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వైద్యులను ని యమించే పద్ధతికి 1986 నుంచి స్వస్తి చెప్పారు. దీనితో ప్రభుత్వ కళాశాలల్లో నిపుణుల కొరత మొదలయింది. రాష్ట్రంలో చాలా కళాశాలలు భారత వైద్య మండలి గుర్తింపునకు నోచుకోలేకపోవడమూ దీని ఫలితమే. పీజీ కోర్సులకు కోట్లు వెచ్చించి విద్యార్థులు ప్రైవేటు వైద్య కళాశాల గుమ్మం తొక్కక తప్పని దుస్థితిని సృష్టించినది కూడా ఈ పరిణామమే.

 పీజీలకే విలువంతా

 కేవలం ఎంబీబీఎస్‌తోనే డాక్టర్‌గా గుర్తింపు పొందడానికి ఏ మాత్రం అవకా శం లేని ఒక వింత వాతావారణం ఇప్పుడు ఉంది. కానీ ఎంబీబీఎస్ సీట్లకూ,  పీజీ కోర్సులలో సీట్లకూ పొంతన లేదు. మన రాష్ట్రమే తీసుకుంటే 6,200 మంది ఏటా ఎంబీబీఎస్‌లో చేరుతుండగా, దాదాపు 5,500 మంది పట్టాలతో బయటకు వస్తున్నారు. కానీ ఇక్కడ అందుబాటులో ఉన్న పీజీ సీట్లు 2,450 నుంచి 2,530. అంటే సగం కంటే తక్కువ. అఖిల భారత స్థాయిలో ఎయిమ్స్ (ఢిల్లీ), జిప్‌మర్(పుదుచ్చేరి) వంటి సంస్థలకు వెళుతున్న దాదాపు 400 మందిని మినహాయించిన తరువాత ఆ సంఖ్యను చెప్పుకోవచ్చు.

 నిర్లక్ష్యానికి పరాకాష్ట

 పీజీ వైద్య విద్యను  అభివృద్ధి చేయడంలో రాష్ట్రానికి అందిస్తున్న సహకారాన్ని కొనసాగించాలని ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహా రాల సంఘం నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా 4,000 పీజీ సీట్లు పెంచుతూ, అందులో మూడు వందలు రాష్ట్రానికీ కేటాయించింది. కానీ ఆ వెంటనే, మార్చి మూడో వారంలో, భారత వైద్య మండలి (ఎంసీఐ) తనిఖీ బృందం రాష్ట్రంలో పర్యటించిన మీదట వెల్లడైన సంగతులు అవమానకరంగా ఉన్నా యి. పెంచిన పీజీ సీట్లకు తగ్గట్టు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం పట్ల, ఫ్యాకల్టీని మెరుగుపరచక పోవడం పట్ల ఆ బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రా మెడికల్ కాలేజీ (విశాఖపట్నం)లో ఎండీ (పీడియాట్రిక్స్), ఎంఎస్ (ఈఎన్‌టీ) ఐదేసి సీట్ల వంతున కోత విధించాలని తనిఖీ బృందం సిఫారసు చేయడం దీని ఫలితమే. ఇవి గతేడాది మంజూరైన సీట్లు. నిరుడే సా ధించి తెచ్చుకున్న పీజీ సీట్ల విషయంలో ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాల లకు కూడా ఇలాంటి ప్రమాదమే పొంచి ఉంది. దీనికి ప్రధాన కారణం- రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిధులు అందించకపోవడమే. రాష్ట్రంలో వైద్య విద్యను పటిష్టం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. సకాలంలో అవకాశాలు రాక మన అభ్యర్థులు క్షోభ పడుతున్నారు. అయినా వైద్య విద్య అభివృద్ధికి అంది వస్తున్న అవకాశాలను వినియోగించుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు.

 జాతీయ స్థాయిలో గందరగోళమే

  జాతీయ స్థాయిలో డీఎన్‌బీ సీట్ల భర్తీ వ్యవహారం కూడా వైద్య విద్యార్థులను క్షోభ పెట్టే విధంగానే ఉంది. ఆరుమాసాల క్రితం నిర్వహించిన డీఎన్‌బీ పరీక్షకు సంబంధించి ఖాళీలను భర్తీ చేసే పని ఇప్పటికీ పూర్తికాలేదు. కానీ మళ్లీ ఖాళీల భర్తీకి డీఎన్‌బీ తాజా ప్రకటన వెలువడడం విశేషం. ఎన్‌బీఈ - నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది. వేతనం, ప్రమాణాల విషయంలో భారీ అంతరాలు ఉన్నప్పటికీ డీఎన్‌బీ అభ్యర్థుల పాలిట కల్పవృక్షమే. వైద్య విద్యలోని 72 విభాగాలలో దీనితో ప్రవేశం పొందవచ్చు. పార్లమెంట్ చట్టం మేరకు పీజీతో సమంగా గుర్తిస్తున్న డీఎన్‌బీ వల్ల పెద్ద సంఖ్యలో లబ్ధి పొందుతున్నారు. కానీ న్యాయస్థానాలు ఎన్నిసార్లు హెచ్చరించినా ఎన్‌ఈబీ పని తీరు మెరుగుపడడం లేదు. జరిగిన జాప్యం వల్ల ఇతర కౌన్సెలింగ్‌లకు ఈసారి కూడా డీఎన్‌బీ అడ్డంకిగా మారింది. ఆ కౌన్సెలింగ్  ఢిల్లీలోనే జరుగుతుంది. దీని రెండో కౌన్సెలింగ్ ఈ 29 నుంచి మొదలవుతోంది. కోర్టు తీర్పు మేరకు ఈ 27వ తేదీన ఏపీ పీజీ మెట్ రాయాలి. తక్కువ మందికి సంబంధించినది కావచ్చు, 28న రాష్ట్రంలో ‘నిమ్స్’ రెండో కౌన్సెలింగ్‌ను ప్రకటించారు. మరి, అభ్యర్థి దేని మీద దృష్టి సారించాలి?   ఏఐపీజీ (అఖిల భారత పీజీ ప్రవేశ పరీక్ష) వ్యవహారం ఇంకొకటి. దీని పరిధిలో ఆంధ్రప్రదేశ్ లేదు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు సమయంలోనే ఈ మినహాయింపు తీసుకున్నారు. దీని విధానం ప్రకారం ఏఐపీజీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రతి రాష్ట్రం సీట్లు కేటాయించాలి. అలాగే ప్రతి రాష్ట్రానికి ఇచ్చిపుచ్చుకునే తీరులో ఏఐపీజీ చేసే కేటాయింపు ఉంటుంది. ఆ పూల్ ప్రకారం మనం కొన్ని సీట్లు ఇతర రాష్ట్రాల వారికి కేటాయించినా, మన అభ్యర్థులకు దేశమంతటా సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇది కూడా కొన్ని వేల సీట్లను భర్తీ చేసేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష.

 ఎంబీబీఎస్‌కు పీజీ కోర్సు మానసిక, సామాజిక అవసరంగా మారింది.  దీనితో జరుగుతున్న నష్టం దారుణం. పీజీలకే గుర్తింపు ఉండడం వల్ల ప్రతి ఎంబీబీఎస్ అభ్యర్థి పీజీలో చేరే వరకు, మళ్లీ చదవక తప్పడం లేదు. దీనితో ఒక ఏడాది మొదలు ఆరేళ్ల వరకు సమాజానికి ఉపయోగపడలేక పోతు న్నాడు. కానీ, వైద్యుల కొరత దారుణంగా ఉన్న దేశంలో, ఆయుః ప్రమా ణాలు హీనంగా ఉన్న వ్యవస్థలో ఇలాంటి పరిస్థితిని నివారించడానికి తీసుకుంటున్న చర్యలు ఏమీ లేవు. ఈ పరిణామాలన్నీ వైద్య విద్యను తీవ్రంగా నిరుత్సాహ పరుస్తున్నాయి. వైద్యాన్నీ, దానికి గుండె వంటి వైద్య విద్యనూ రోగగ్రస్తం చేసి ఎన్ని ‘విజన్’లు పెట్టుకున్నా వ్యర్థం.    
 
 డాక్టర్ దేమె రాజారెడ్డి (వ్యాసకర్త ప్రఖ్యాత వైద్యులు)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement