మెడిసిన్‌కు పాత ఫీజులే | no changes for fee of medicine | Sakshi
Sakshi News home page

మెడిసిన్‌కు పాత ఫీజులే

Published Sat, Jun 21 2014 1:39 AM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM

మెడిసిన్‌కు పాత ఫీజులే - Sakshi

మెడిసిన్‌కు పాత ఫీజులే

సాక్షి, హైదరాబాద్:ఈ విద్యా సంవత్సరంలోనూ మెడిసిన్‌లో పాత ఫీజుల విధానాన్నే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కామన్‌ఫీజు విధానాన్ని ఈ ఏడాది అమలు చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం ఏర్పాటైనందున ఈసారికి పాత ఫీజులతోనే సర్దుకుపోవాలని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు సూచించింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ల వరకు పాత ఫీజును కొనసాగించేందుకు యాజమాన్యాల అంగీకరించాయి. సచివాలయంలో శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ కార్యాలయంలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో జరిగిన సమావేశంలో ఈమేరకు పీజీ మెడిసిన్ ఫీజుల అంశం కొలిక్కి వచ్చింది. దీంతో పీజీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌కు అడ్డంకులు తొలగినట్లయింది. జూలై 10 లోపు పీజీ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో అందుకు అనుగుణంగానే సీట్ల భర్తీ ప్రక్రియను ముగించనున్నారు.
 
 ఈనెల 25 నుంచి 30 వరకు పీజీ మెడికల్ అడ్మిషన్లు జరుగుతాయని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం ప్రకటించింది. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ వృత్తి విద్యా కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఉమ్మడిగానే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల్లో 28 ప్రైవేటు కళాశాలలుండగా వాటిలో మొత్తం 1,292 పీజీ సీట్లున్నాయి. తెలంగాణలో 611, ఆంధ్రప్రదేశ్‌లో 681 సీట్లున్నాయి. పాత విధానం ప్రకారం కన్వీనర్ కోటా సీటుకు రూ.2.75 లక్షలు, మేనేజ్‌మెంట్ కోటా సీటుకు రూ. 5.5 లక్షల చొప్పున ఫీజు వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా ఇవే ఫీజులు కొనసాగనున్నాయి.
 
 ఎంబీబీఎస్ ఫీజు పెంపుపై ప్రతిష్టంభన
 
 పీజీ ఫీజుల అంశం కొలిక్కి వచ్చినప్పటికీ ఎంబీబీఎస్ ఫీజు ఖరారుపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. శుక్రవారం నాటి సమావేశంలో ప్రభుత్వం తరపున సీఎస్ రాజీవ్‌శర్మ, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషితోపాటు డీఎంఈ ఉన్నతాధికారులు పాల్గొనగా, ప్రైవేటు మెడికల్ కళాశాలల యాజమాన్యాల తరపున మల్లారెడ్డి (సీఎమ్మార్), కృష్ణారెడ్డి (ఎస్వీస్), శశిధర్ (కామినేని), అక్బరుద్దీన్ ఒవైసీ (ఒవైసీ)సహా మొత్తం 15 మంది ప్రతినిధులు హాజరయ్యారు. పీజీ ఫీజుల విషయంలో ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించిన యాజమాన్యాలు ఎంబీబీఎస్ ఫీజును మాత్రం పెంచాల్సిందేనని డిమాండ్ చేశాయి. ఎంబీబీఎస్ ఫీజుల పెంపుపై అడ్మిషన్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) సిఫారసులను అమలు చేయాలని కోరాయి. న్యాయస్థానం తీర్పు మేరకు ప్రైవేటు కళాశాలలు సొంతంగా ఎంసెట్‌ను నిర్వహించుకునే అవకాశం కూడా ఇవ్వాలని కోరాయి. ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సెప్టెంబర్ వరకు గడువు ఉన్నందున దీనిపై మరోసారి చర్చిస్తామని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్ర కుమార్‌జోషి మీడియాతో చెప్పారు. తమ డిమాండ్లపై చర్చించేందుకు రెండు, మూడు రోజుల్లో మరో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారని యాజామాన్యాల ప్రతినిధులు చెప్పారు.
 
 25 నుంచి పీజీ మెడికల్ కౌన్సిలింగ్
 
 విజయవాడ: మెడికల్ పోస్టు గ్రాడ్యుయేషన్ (ఎండీ, ఎంఎస్), డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి (2014-15 సంవత్సరానికి) ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకూ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు. శుక్రవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేశారు. నాన్ సర్వీస్ ఓపెన్ కేటగిరీ విద్యార్థులకు ఈ నెల 25న 1 నుంచి 900 ర్యాంకు వరకు, 26న 901-4,000వ ర్యాంకు వరకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు ఈ నెల 27న 1-1,500 ర్యాంకు వరకు, 28న 1,501 నుంచి చివరి ర్యాంకు వరకు కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. సర్వీస్ కేటగిరీ ఓపెన్ అభ్యర్థులకు సంబంధించి ఈ నెల 29న 1వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వ రకు, రిజర్వేషన్ అభ్యర్థులకు 30వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ వివరించారు. మొదటి విడత కౌన్సిలింగ్ అనంతరం, రెండవ విడత కౌన్సిలింగ్‌కు ముందు వికలాంగులైన విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి  వివరాలకు http;//ntruhs.ap.nic.inలో చూడవచ్చునని ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement