వంటగ్యాస్ రాయితీని వదులుకోవడం దేశభక్తి కాదా? | Is it patriotic of LPG subsidy ? | Sakshi
Sakshi News home page

వంటగ్యాస్ రాయితీని వదులుకోవడం దేశభక్తి కాదా?

Published Sun, Jun 28 2015 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

వంటగ్యాస్ రాయితీని వదులుకోవడం దేశభక్తి కాదా?

వంటగ్యాస్ రాయితీని వదులుకోవడం దేశభక్తి కాదా?

వంటగ్యాస్ రాయితీని వదులుకుని నిరుపేదలకు ప్రయోజనం కలిగించడంలో మధ్యతరగతి ప్రజలు చొరవ చూపటం లేదు. దీనిపై ప్రధానమంత్రి కేంపెయిన్ మొదలుపెట్టాక వినియోగదారుల్లో 0.35 శాతం మంది మాత్రమే అనుకూలంగా స్పందించారు. దేశంలోని 15 కోట్ల కుటుంబాల్లో 6 లక్షల కుటుంబాలు మాత్రమే వంటగ్యాస్‌ను మార్కెట్ ధరతో కొనేందుకు స్వచ్ఛందంగా సమ్మతించాయి.
 
 కొన్ని నెలల క్రితం, బెంగళూరులో ఉన్న మా ఇంటికి గ్యాస్ సిలిండర్ ను బుక్ చేయడానికి ప్రయత్నించాను. ప్రస్తుతం ఇండియాలో ఈ పని చేయడం చాలా సులువని మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మీరు ఒక నంబర్‌కు కాల్ చేస్తారు. వెంటనే ఒక సాంకేతిక పరిజ్ఞాన వ్యవస్థ మీ అభ్యర్థనను నమోదు చేసుకుంటుంది. తమ సేవను ఉపయోగించుకున్నందుకు మీకు కృతజ్ఞతలు చేస్తుంది. ఇదంతా కేవలం 15 సెకనుల కంటే తక్కువ సమయంలోనే ముగిసి పోతుంది. మరికొద్ది రోజుల్లో సిలిండర్ మీ ఇంటికి వస్తుంది. అయితే ఈసారి సిలిండర్ అంత సులువుగా మా ఇంటికి రాలేదు. నాకు ఆశ్చర్యమేసింది. భారత్ గ్యాస్ కార్యాలయానికి ఫోన్ చేశాను. నేను సబ్సిడీ గ్యాస్ పొందాలంటే కొన్ని ఆర్థిక దస్తావేజులు సమర్పించాలని వారు చెప్పారు. దాంతో సబ్సిడీకి నేను అర్హుడిని కానని, గ్యాస్ పూర్తి ధరతో పొందాలంటే ఏం చేయాల్సి ఉంటుందని అడిగాను. సబ్సిడీ గ్యాస్ రద్దు ప్రక్రియను పూర్తి చేయడం కోసం తమ ఆఫీసుకు రావాలని వారు చెప్పారు. అక్కడికి వెళ్లాను కూడా. (అలా చేయడం ఇదే తొలిసారి).
 
 భారత్ గ్యాస్ కార్యాలయం రద్దీగా ఉంది. ఫారం 5 అనే పేరున్న డీ రిజి స్ట్రేషన్ పత్రం గురించే అక్కడున్న కొంతమంది సిబ్బందికి తెలీదు. పెద్దగా డిమాండ్ లేకపోవడంతో ఆ పత్రాలు ఒకచోట కుప్పలాగా పడి ఉన్నాయి. ఫారం 5ని పూరించడం, మరోసారి గ్యాస్ కంపెనీ కార్యాలయానికి రావడం జరిగాక, ఎట్టకేలకు నా గ్యాస్ సబ్సిడీ సౌకర్యాన్ని డీ రిజిస్టర్ చేయించుకోగలిగాను. పూర్తి ధరతో సిలిండర్ పొందగలిగాను. కొద్ది రోజుల తర్వాత, ఒక వ్యక్తి నుంచి నేను ఫోన్ కాల్ అందుకున్నాను. ఆయన చాలా చక్కగా మాట్లాడారు. అతనెవరో నాకు తెలీదు కానీ నన్ను పేరు పెట్టి మరీ పలకరించారు. తను ఇలా గ్యాస్ రాయితీని డీ రిజిస్టర్ (ఉపసంహరించుకోవడం) చేసుకున్న వ్యక్తులకు కాల్ చేసే అధికారి అట. వినియోగదారులు తాము స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకుంటున్నట్లుగా బహి రంగంగా ఒక పత్రంపై సంతకం చేయడం కోసం (అదీ మంత్రి సమక్షంలో) మరుసటి దినం అంటే ఆదివారం నాడు ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని ఆ అధికారి చెప్పారు. నేను ఇదివరకే అలా సంతకం చేశానని చెప్పాను. ఆ విషయం తనకు తెలుసనీ, అయితే మరోసారి బహిరంగంగా అలా చేయడానికి మీరు తప్పనిసరిగా రావాల్సి ఉందని ఆ అధికారి సౌమ్యంగానే అభ్యర్థించారు. అలా రాలేనని ఆయనకు చెప్పేశాను.
 
 నేనీ విషయాన్ని ఇప్పుడెందుకు రాస్తున్నానంటే, స్వచ్ఛందంగా వంట గ్యాస్ సబ్సిడీని వదులుకోవాల్సిందిగా ప్రధానమంత్రి కేంపెయిన్ మొదలుపెట్టి మూడు నెలలు గడిచిన తర్వాత కూడా వినియోగదారుల్లో 0.35 శాతం మంది మాత్రమే వంట గ్యాస్‌పై రాయితీని వదులుకున్నారు. దేశంలోని 15 కోట్ల  గృహాల్లో కేవలం 6 లక్షల గృహాలు మాత్రమే మార్కెట్ ధరకు వంట గ్యాస్‌ను కొనేందుకు స్వచ్ఛం దంగా సమ్మతించాయి. మధ్యతరగతి భారతీయులు వంట గ్యాస్ రాయితీని వదులుకోవాలనీ, అప్పుడే రాయితీ ధరతో పేదలకు అందించవచ్చనీ కేంద్ర చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  ఈ సంవత్సరం జనవరి నుంచి పదే పదే అభ్యర్థిస్తూ వచ్చారు. రాయితీ వల్ల ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌పై రూ. 207లు నష్టపోతోంది. వంట గ్యాస్ రాయితీ వల్ల కేంద్ర ప్రభుత్వానికి మొత్తం మీద రూ.40,000 కోట్లు నష్టం సంభవిస్తోంది. కాబట్టి ప్రభుత్వం నష్టపోకుండా తాము కాస్త దోహద పడటం అనేది మధ్యతరగతికి సులువైన పనే. కానీ ఇంతవరకు వీరు ఈ విషయంలో పెద్దగా చొరవ చూపటం లేదు. చివరకు కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఇంతవరకు తమ వంట గ్యాస్ రాయితీని వదులుకోలేదంటే ఆశ్చర్యంగా ఉంది.
 
 ఎందుకిలా జరుగుతోంది? నాకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. చిన్న కారణం ఏమిటంటే, వినియోగదారులు తమ రాయితీ సౌకర్యాన్ని డీరిజిస్టర్ చేసుకోవడాన్ని ప్రభుత్వం కష్టసాధ్యంగా చేయడం. నా అనుభవం ద్వారా నాకు ఇదే విషయం బోధపడింది. వంట గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేయడం చాలా సులువు. ఎందుకంటే నమోదైన మొబైల్ నంబర్ ద్వారా సబ్‌స్క్రయిబర్లను సిస్టమ్ గుర్తించగలదు. (ఇదెంత సులువంటే నా సబ్‌స్క్రయిబర్ సంఖ్య తెలీకు న్నప్పటికీ ఆటోమేటెడ్ సిస్టమ్ (స్వయం చాలక వ్యవస్థ) ద్వారా నేను గ్యాస్‌ను సులువుగా బుక్ చేసుకోగలను).
 
 రాయితీ వంట గ్యాస్ సౌకర్యాన్ని కూడా ఇంతే సులువుగా డీరిజిస్టర్ చేసుకోగలగాలి. కాని అలా సాధ్యం కావటం లేదు. ఇక్కడ కూడా ఆటోమేటెడ్ సిస్టమ్‌ను అమలుచేయడానికి బదులుగా దస్తావేజులు, క్యూలు అవసరం అవుతున్నాయి.. ఇలా రాయితీ గ్యాస్ సౌకర్యాన్ని డీరిజిస్టర్ చేయడానికి ఒక వెబ్‌సైట్ ఉంది. www.MyLPG.in.  నేను అందులోకి వెళ్లి ప్రయ త్నించాను. కాని ఆ వెబ్‌సైట్ డిజైన్‌ను ఎంత ఘోరంగా రూపొందించారంటే, ఆన్‌లైన్‌లో డీరిజిస్టర్ చేసుకోవడానికి ఎలాంటి ఐచ్ఛికాన్ని నేను అక్కడ కనుగొన లేకపోయాను. ఆ సమయంలో నేను నా గ్యాస్ సిలిండర్‌ను పొందటంలో సమ స్యను ఎదుర్కోనట్లయితే, గ్యాస్ కంపెనీ వద్దకు బహుశా వెళ్లి ఉండేవాడిని కాదు. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారం గొప్ప అసౌకర్యంగా తయారై ఉంది. కాబట్టి వంట గ్యాస్ రాయితీ ఉపసంహరణ విషయంలో ప్రధానమంత్రి పథకం విఫలమైందని కేంద్ర మంత్రి ఆరోపిస్తున్నట్లయితే, ఆ వైఫల్యంలో కొంత శాతాన్ని ఆయన సైతం పంచుకోవాల్సి ఉంటుంది.
 
 అయితే నేను ఇదివరకే చెప్పినట్లు ఇది ఒక చిన్న కారణం. తమ వంతు భారం మోసే విషయంలో భారతీయ పౌరులు ప్రత్యేకించి మధ్యతరగతి ప్రజల అయిష్టత ప్రధాన కారణంగా కనబడుతోంది. ఇది మరీ సాధారణ ప్రకటనలా కనిపించవచ్చు కానీ ఈ వాదనకు తగిన ఆధారాలను చూపించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. భారతీయులలో కేవలం మూడు శాతం మంది మాత్రమే ఏదో ఒక రకంగా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. వీరిలో కూడా ఎక్కువమంది ఉద్యోగులు. వీరి వేతనాల్లోంచి పన్నులను స్వయంచాలకంగా తీసివేసుకుంటారు. అందుకే మనది దొంగల జాతి అని నేను చాలా తరచుగా భావిస్తుంటాను. మనం మన ప్రభుత్వం నుంచి దొంగిలిస్తున్నాము.
 
అదే సమయంలో మనం అత్యంత దేశభక్తిపరులమని మనకు మనమే జబ్బలు చరుచుకుంటుంటాము. ‘ఏ మేరే ప్యారే వతన్’ అంటూ దేశభక్తి గేయాన్ని లేదా మన జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సందర్భంగా మనం కన్నీళ్లు కారుస్తుంటాము. కాని అవసరమైన సందర్భాల్లో మాత్రం మన దేశభక్తి  స్థాయి ఇలా ఉంటోంది మరి. పేదల నుంచి డబ్బును మనం ఇలా దొంగిలిస్తుండటం, కాస్త సహకరిం చమంటూ ప్రభుత్వం మనల్ని ప్రాధేయపడుతుండటం వంటి సందర్భాలను చూస్తున్నప్పుడు మనం చాలా వెలితి మనుషులుగా కనబడతాం. అంతేకాకుండా మన దేశం పరువు కూడా తీసేస్తున్నాం.
 (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com)
 - ఆకార్ పటేల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement