వొయినం; రచన: జాజుల గౌరి; ప్రచురణ: విశాల సాహిత్య అకాడెమీ; పేజీలు: 200; వెల: 50; రచయిత్రి చిరునామా: 3-16-5, నెహ్రూ నగర్, రామంతాపూర్, హైదరాబాద్; ఫోన్: 8519923199 కష్టాలను ఎదుర్కొని, కన్నీళ్లను దిగమింగి భూమిని కాపాడుకునేందుకు ఓ మహిళ పోరాటం, ఆమె పడిన ఆరాటానికి అద్దం పడుతుంది జాజుల గౌరి నవల ‘వొయినం’. ఆద్యంతం తెలంగాణ మాండలికంలో సాగి, అక్షరాల వెంట పరుగులు పెట్టిస్తుంది.
చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయి చిన్నాన్న, చిన్నమ్మల పెంపకంలో ఎన్నో ఆరళ్లను చవిచూసిన మొగిలయ్య పాత్ర హృదయాలను కదిలింపజేస్తుంది. నీలమ్మను పెళ్లాడి ఇద్దరు పిల్లలను కన్న మొగిలయ్య తన భూమిని కాపాడుకునే ప్రయత్నంలో తనువు చాలిస్తాడు. పాలివాళ్ల నుంచి ఆ పొలాన్ని దక్కించుకునేందుకు నీలమ్మ ఎన్నో కష్టాలను చవిచూస్తుంది. అన్ని ఆటుపోట్లను తట్టుకుని, అయినవారే ఇబ్బందులకు గురి చేసినా చివరకు తన వాటాగా వచ్చే భూమిని సొంతం చేసుకుంటుంది. సికింద్రాబాద్ సమీపంలోని లోతుకుంట ప్రాంతంలో 1970- 80ల్లో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసిన ఈ నవల ఒంటరి మహిళ గుండె దిటవును కళ్లకు కడుతుంది.
మొగిలయ్య పాత్ర వాసిరెడ్డి సీతాదేవి ‘మట్టిమనిషి’లోని సాంబయ్యను గుర్తుకు తెస్తుంది. అక్కడక్కడా తెలంగాణ జానపదాలు పాఠకుల మనోముకురంలో తారట్లాడుతాయి. ఈ రచన ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’, శివరామ కారంత్ ‘తిరిగి మరల సేద్యానికి’ స్థాయిలో సాగిందని బీఎస్ రాములు రాసిన ముందుమాట అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. ఓ దళిత మహిళ ధీరోదాత్త, వీరోచిత పోరాట గాథకు దర్పణంగా నిలుస్తుందీ రచన. తెలంగాణ మాగాణంలో పండిన అక్షర, నానుడుల సిరుల పంట ‘వొయినం’.
- మైల కుమార్
మట్టి రూపాయి
పొద్దంతా మొక్కజొన్న చేనుకు
చిరిగిన చీర
ఎరువును వెన్నముద్దల్లా అందిస్తుంటే
ఖాళీ ప్లేట్లో బిస్కెట్ పుట్టుకొస్తుంది
విరిగిన చేతికర్ర
గడ్డి మేస్తున్న చీకటిముద్దలకు
కాపలా కాస్తుంటే
కాఫీకప్పులో వెన్నెల విరగకాస్తుంది
చొక్కాలేని చెమట దేహం
పచ్చని వరిపైరుకై నీరైపోతుంటే
ఆకలి కడుపున
సన్నబియ్యం ఉడుకుతుంది
మసకబారిన కళ్లద్దం
పచ్చి పళ్లను పక్కనెట్టి
పండిన టమాటో సూరీళ్లను ఏరుతుంటే
బ్రెడ్డుపై జామ్ కూర్చుంటుంది
మాసికల నిక్కరు మాసిన గౌను
మండుటెండలో మగ్గిన
మామిడిపళ్లవుతుంటే
ఎండిన గొంతున జూసై జారుతుంది
పల్లె మట్టిలో చిందిన ప్రతి చెమటబొట్టు
రెక్కలొచ్చిన రూపాయి కాసై మొలిచి
మార్కెట్ సరుకులను మోస్తూ
నిత్యం నగరానికెగిరిపోతుంటుంది
- మొయిద శ్రీనివాసరావు
9908256267
మంగళవాచకం
విద్యావంతులు, ఎందరో సివిల్ సర్వీస్ విజేతలను తయారుచేసిన కె.సర్వమంగళగౌరి జ్యోతిలక్ష్మీ సినిమాను పుస్తకరూపంలో సమీక్షించారు. పురాణాలు, ఇతిహాసాలు, స్త్రీ ఉద్ధరణ రచనలు అన్నీ చదివిన మంగళగౌరి వాటి ఊతంతోనే జ్యోతిలక్ష్మీని పోల్చారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన జ్యోతిలక్ష్మీలో కథావస్తువు వేశ్యవృత్తిలోని ఓ మహిళ, ఆమె పట్ల సమాజ ప్రవర్తన, వాళ్ల విషయంలో ఆ మహిళ ప్రతిస్పందన. ‘సమాజం స్వార్థంతో తయారుచేసిన అభాగ్య వేశ్య’ అన్న రచయిత్రి మాటలు అక్షర సత్యాలు. గురజాడ కన్యాశుల్కంతో జ్యోతిలక్ష్మీని పోల్చడం రచయిత్రి చేసిన మరో సాహసం.
షాండీ కొంతవరకు గిరీశం అంటూ జ్యోతిలక్ష్మీని మధురవాణితో పోల్చారు. ‘సానిదాని జీవితానికి బతుకనేదే లేదు కదా’ అంటుంది మధురవాణి. కానీ, ఆ నిస్పృహలోకి జ్యోతిలక్ష్మీ ఎప్పుడూ పోలేదనీ, ఆమెకు తన వృత్తిపట్ల గౌరవం, వాస్తవిక దృష్టి, తనను గౌరవించలేని సమాజాన్ని ఎదిరించే గుణం మూడు ఎక్కువేననీ అంటారు రచయిత్రి. సమీక్ష అంటే కేవలం, కథా సన్నివేశాల వర్ణనే కాదనీ, సినిమా ఆత్మను దర్శింపజేయడమనీ నిరూపించారు.
(జ్యోతిలక్ష్మీ; రచన: కె.సర్వమంగళగౌరి; రచయిత్రి ఫోన్: 09866222978)ృ
- రమేష్ గోపిశెట్టి
పసి ప్రార్థన
బడులు తెరిచారు
పసి తరగతి
ప్రారంభమయ్యింది
పిల్లలు
బోరు బోరున
విలపించారు
ఆ రోజుకి
అదే తొలి ప్రార్థన
- కొండూరి రామరాజు
9542042003
రెక్కలు
రహదారి అనకొండ
చెట్లు మింగింది
తారు తాగిన రోడ్డు
ప్రాణాల్ని తీసింది
మనిషి నీడ సైతం ఏడుస్తోంది
మట్టి మనసు
మొక్క కెరుక
మొక్క మనసు
నీటి కెరుక
మనసు లేని మనిషి
ప్రకృతి కెరుక
- డా॥రమణ యశస్వి
9848078807
ఈవెంట్
దేశ రాజధానిలో కువ్వ ఆవిష్కరణ
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఎం.ఆర్.పి.ఎస్. చేస్తున్న దీక్షల్లో భాగంగా నేడు డప్పోల్ల రమేష్ సంపాదకత్వం వహించిన వర్గీకరణ సంఘీభావ కవిత్వ సంకలనం ‘కువ్వ’ను ఆవిష్కరించనున్నారని బహుజన సాంస్కృతిక వేదిక ఉపాధ్యక్షులు సొన్నాయిల బాల్‌రాజ్ తెలియజేస్తున్నారు. ఆవిష్కర్త: మంద కృష్ణ మాదిగ. వక్తలు: పసునూరి రవీందర్, మాతంగి చిరంజీవి, కాకాని సుధాకర్.
భాషా బోధనలో సవాళ్లు- సదస్సు
నేడు విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యూజీసీ నిధులతో ‘భాషా బోధనలో సవాళ్లు’ అంశంపై జాతీయ సదస్సు జరగనుందని ప్రిన్సిపల్ వల్లూరుపల్లి రవి తెలియజేస్తున్నారు. ఆచార్యులు వి.లక్ష్మి, ఎన్.ఉష, వి.శంకరరావు, కోయి కోటేశ్వరరావు, డి.నాగేశ్వరరావు, పి.శ్రీనివాసరావు, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ముఖ్య వక్తలు.
రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్ ప్రారంభం
‘తెలుగు ఆధునిక సాహిత్యంలో విశాఖపట్నం తన కార్యక్షేత్రంగా విస్తారమైన సాహిత్య సృజనకు పేరు మోసిన’ రావిశాస్త్రి పేరుమీదుగా అదే విశాఖలో రావిశాస్త్రి సోదరుడు రాచకొండ నరసింహశర్మ ఛైర్మన్‌గా ‘రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్’ ఏర్పాటైంది. వారి కుటుంబ సభ్యులు ముగ్గురు ఈ ట్రస్టులో కొనసాగుతారు. సాహిత్య రంగం తరఫున చందు సుబ్బారావు, ఎల్.ఆర్.స్వామి, వి.కల్యాణ రామారావు, పి.జయశీలారావు, జగద్ధాత్రి బాధ్యతలు వహిస్తారు. ఈ ట్రస్ట్ ప్రతి ఏటా జూలై 30న రావిశాస్త్రి జయంతి సందర్భంగా పది వేల నగదుతో ‘రావిశాస్త్రి అవార్డు’ ఇవ్వనుంది.
రామతీర్థకు రావిశాస్త్రి అవార్డు
రావిశాస్త్రి జయంతి వేడుకలు జూలై 30న సాయంత్రం 5:30కు విశాఖ పౌర గ్రంథాలయంలో జరగనున్నాయి. ఇందులో భాగంగా, రావిశాస్త్రి లిటరరీ ట్రస్టును కె.రామచంద్రమూర్తి ప్రారంభిస్తారు. రావిసారాలు, ఖ్చఛిౌ్ట్ఛఠట ఖ్చఛిజ్చిజుౌఛ్చీ పుస్తకాల ఆవిష్కరణ కూడా ఉంటుంది. అలాగే, తొలి రావిశాస్త్రి అవార్డును రామతీర్థకు ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా, ‘రామతీర్థ సృజన రేఖలు’ గురించి నండూరి రాజగోపాల్ ప్రసంగిస్తారు. ఈ వేడుకల్లో మాటూరి శ్రీనివాస్, రాచకొండ ఉమాకుమార శర్మ, జి.శిబానంద, గరిమెళ్ళ నాగేశ్వరరావు, డి.వి.సూర్యారావు, పేరి రవికుమార్, మంగు శివరామప్రసాద్, చింతకింది శ్రీనివాసరావు, పి.అనంతరావు, ఎ.వి.ఆర్.మూర్తి, డి.సహదేవరావు, కె.జి.వేణు, పి.రాజేశ్ పాల్గొంటారు.
రమణజీవి కథలపై సమీక్షా సమావేశం
ప్రజా పర్యవేక్షణ కమిటీ ఆధ్వర్యంలో రమణజీవి కథల సంకలనం ‘సింహాలపేట’పై సమీక్షా సమావేశం జూలై 31న ఉదయం 10 గంటలకు అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో జరగనుంది. నగ్నముని, ఆర్కే, సీతారాం, ఎస్.నారాయణ, కె.ఎం.రాయుడు, బోస్ పాల్గొంటారు.
జీలానీ బానూ కథల ఆవిష్కరణ
మెహక్ హైదరాబాదీ తెలుగులోకి అనువదించగా ‘నవచేతన’ ప్రచురించిన జీలానీ బానూ కథల సంకలనం ‘గుప్పిట జారే ఇసుక’ ఆవిష్కరణ సభ జూలై 31న సాయంత్రం 5 గంటలకు ఎన్టీఆర్ కళామందిరం, తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లిలో జరగనుంది. అధ్యక్షత: కె.శ్రీనివాస్. ఆవిష్కర్త: ఓల్గా. జీలానీ బానూ, అషఫ్ ్రరఫీ, తెలిదేవర భానుమూర్తి, ఎన్.మధుకర్ పాల్గొంటారు. సమావేశకర్త: సమ్మెట నాగమల్లేశ్వరరావు.
కొత్త పుస్తకాలు
దొంగ తల్లిదండ్రులుంటారు జాగ్రత్త!
రచన: రంగనాయకమ్మ; పేజీలు: 408(హార్డుబౌండు); వెల: 150; ప్రతులకు: అరుణా పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్డు, విజయవాడ-2; ఫోన్: 0866-2431181
‘తల్లిదండ్రులు నిర్దయులైతే, మూర్ఖులైతే, జాగ్రత్తలు పడవలసింది ఎవరు? -ఇంకెవరు? వాళ్ళ చేతుల్లో చిక్కి వున్న పిల్లలే’ అంటారు రచయిత్రి. ‘దొంగ తల్లిదండ్రుల పిల్లలు, తమ అవమానాలన్నీ ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. పెద్ద వాళ్ళయ్యాక, దేన్ని సహించాలో, దేన్ని తిరస్కరించాలో, ఆ రకంగా నడవాలి. తమ ప్రవర్తనలోకి క్రూర లక్షణాలు చేరనివ్వకుండా తమని తాము దృఢ పరచుకోవాలి’ అని హితవు చెబుతూ సాగే ‘నవ్య’ నవల ఇది.
ఒక్కపదం - అర్థాలెన్నో
రచన: రాజావాసిరెడ్డి మల్లీశ్వరి; పేజీలు: 196; వెల: 140; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, గిరిప్రసాద్ భవన్, బండ్లగూడ(నాగోల్), జి.ఎస్.ఐ., హైదరాబాద్-68; ఫోన్: 24224453
‘ఒక్కోపదం అనేక అర్థాలతో అనేక సందర్భాలలో వాడబడుతూ ఉంటుంది. ఉదాహరణకు ‘మాపు’ అనే పదాన్ని తీసుకుందాం. ‘బట్టలు మాపుకోవద్దు’, ‘రేపు మాపు’, ‘చేపలను పట్టటానికి పెట్టే మాపు’ అనే విధాలుగా వాడబడుతుంది. ఇలాంటి మన తెలుగు భాషా పదాల అందాన్ని, ప్రత్యేకతను పిల్లలకు తెలియజేసే సంకల్పము’తో వెలువరించిన పుస్తకం ఇది.
శ్రమ జీవన విద్యా విప్లవ కావ్యం
రచన: ఎం.శివరాం; పేజీలు: 280; వెల: 112; ప్రతులకు: మంచి పుస్తకం, 12-13-439, వీధి నం.1, తార్నాక, సికింద్రాబాద్-17; ఫోన్: 9490746614
‘(జిడ్డు) కృష్ణమూర్తి గారి టీచింగ్‌ను పూర్తిగా’ జీవిస్తున్న శివరాం, ‘ప్రేమే ఈ ప్రపంచాన్ని నివాస యోగ్యంగా చేయగలదని- అనేక మంది పిల్లలతో, పెద్దలతో మాట్లాడుతూ పోవటమే తన పని అంటారు’. అదే ఫిలాసఫీతో, ‘ఏమిటీ విద్యా అంటే, మార్కులు, ర్యాంకులేనా? శ్రామికత, పనీపాటా విద్యలోకి రావా? శుభ్రతని గురించిన స్పందనకి, స్వచ్ఛందమయిన శ్రమప్రవృత్తికీ స్కూల్స్‌లో, టీచర్స్‌లో ఏ విధమైన మన్నింపు ఉంది?’ లాంటివి ఈ పుస్తకంలో చర్చిస్తున్నారు.
తెలంగాణ మాండలిక మాగాణం వొయినం
Published Mon, Jul 25 2016 1:34 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM
Advertisement
Advertisement