ఆగస్టు 20, 2015 నుంచి తెలంగాణ సారస్వత పరిషత్తుగా వ్యవహారంలోకి వచ్చిన ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ తెలంగాణ చరిత్ర, భాషా సాహిత్యాలు, సంస్కృతిపై 12 పుస్తకాలను ప్రచురించింది. తెలంగాణ మూలాలను కొత్తగా తెలుసుకోగోరేవారికీ, పరిశోధించేవారికీ ఇవి చాలా విలువైనవి. వీటికి ప్రధాన సంపాదకులుగా సి.నారాయణరెడ్డి, సంపాదకులుగా జె.చెన్నయ్య వ్యవహరించారు. వీటిలో ‘సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు’, ‘యాభై సంవత్సరాల జ్ఞాపకాలు’(దేవులపల్లి రామానుజరావు), ‘తెలంగాణ మాండలికాలు కావ్యప్రయోగాలు’(రవ్వా శ్రీహరి), ‘తెలుగు జానపద సాహిత్యము’(చింతపల్లి వసుంధరారెడ్డి), ‘మా వూరు మాట్లాడింది’(సినారె) పునర్ముద్రణలు. ఇక కొత్తగా ముద్రించినవి: ‘తెలంగాణ గిరిజన భాషా సాహిత్యాలు’(వ్యాస సంకలనం), ‘బంజారాల వివాహ ఆచార పద్ధతులు’(అజ్మీర సిల్మానాయక్), ‘తెలంగాణ చరిత్ర’ (జి.వెంకట రామారావు), ‘ప్రాచీన తెలంగాణ కవుల కవితా ప్రాభవం’ (వ్యాస సంకలనం), ‘తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర’ (ముదిగంటి సుజాతారెడ్డి), ‘పరిణత వాణి’(ఆత్మకథ ప్రసంగ వ్యాసాలు), ‘కుతుబ్‌షాహీల తెలుగు సాహిత్య సేవ’ (వ్యాస సంకలనం). వీటి ప్రతులకు: తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్ రోడ్, హైదరాబాద్; ఫోన్: 040-24753724
మాంత్రిక వినిర్మాణం
కుమార్ కవిత్వం చదివే క్రమంలో... ఒక పేజీ నుంచి మరో పేజీకీ ప్రయాణించే క్రమంలో అడుగులు తడబడవచ్చు. అంతమాత్రాన ప్రయాణాన్ని రద్దు చేసుకోలేము, వాయిదా వేసుకోలేము, పునఃప్రయాణాలు ప్రారంభిస్తూనే ఉంటాము.
అతని వాక్యాల్లో సంక్లిష్టత ఉండొచ్చుగానీ భావాల్లో లేదు. అర్థం చేసుకున్నకొద్దీ అర్థం చేసుకున్నంత భావం మనసుకు అందుతుంది.
ప్రకృతి నుంచి ప్రపంచీకరణ వరకు, ఆకాశంలోని తెల్లటి కొంగల నుంచి భూమ్మీది టీ గరగరల వరకు అన్నీ కొత్తగానే అనిపిస్తాయి. వినిపిస్తాయి. మౌనంగా దాక్కున్న మనోసంగీతం... వాక్యాల వెంట పరుగులు తీస్తూ... కొత్త రాగమై పలకరిస్తూనే ఉంటుంది.
‘అతని మాంత్రిక వినిర్మాణ పదచిత్రాలని అర్థం చేసుకోవటం ద్వారా గొప్ప కవిత్వ అనుభూతిని సాధించగలుగుతాం’ అని కుమార్ కవిత్వం గురించి సాగర్ శ్రీరామకవచం చెప్పిన మాట అక్షర సత్యం.
1. సాకీ వృత్తాలు... పరిపూర్ణ మృత్యు శిల్పం
పేజీలు: 166; వెల: 100
2.దేవుడు చనిపోయిన టీ టేబుల్
పేజీలు: 170; వెల: 100
కవి: బి.ఎస్.ఎం.కుమార్
ప్రతులకు: కవి, 14-179/1, గణేశ్‌నగర్ కాలనీ, ఆర్.ఎన్.రెడ్డినగర్, హైదరాబాద్-97;
ఫోన్: 9705085143
ఈ సి.చేతన్
స్మృతి కవిత
ఆగనిపాట
ఆమెకి ఇష్టమైన పాటలు
లోలోపల కిక్కిరిసి వినిపిస్తున్నాయి,
తెలిసీతెలియని రాగాలతో
వచ్చీరాని సంగీతంతో నేను ఆలపించడం
ఆమె మళ్ళీమళ్ళీ పాడమనడం;
ఆమె గునగునమనే భక్తిగీతాలు
ఒకటో రెండో, ముక్కలు ముక్కలై
అనంతంగా తీగసాగుతున్నట్టు ఇంకా నాలోపల,
ఏదో సాంప్రదాయిక వాయిద్యం మోగిస్తూ
పిల్లగాలి తుంపరలతో గొంతుకలిపి పాడుతున్న
ఒక అరేబియా సుందరిలా ఆమె
నా శ్రావ్యలోకంలో రాగఝరులు పొంగిస్తూ
నాలుగు దశాబ్దాలు నాతో
కలిసి చేసిన ఆలాపన ఇంకా
సాధనలా కొనసాగుతున్నట్టు
ఇంకా ఆమెకి ఇష్టమైన ఆ పాటలు
నా లోపల కిక్కిరిసి వినిపిస్తున్నాయి,
కొత్త మేఘాలు కమ్ముకుంటున్నా
పాత వేసవి ఉక్కిరిబిక్కిరి చేస్తూనేవుంది,
కొత్త జల్లులు, కొత్త చినుకులు, కొత్త వానలు
అయినా ఆ పాత మట్టివాసన
ఆమె కిష్టమైన పాటలా నన్ను
పెనవేసుకుంటూనే వుంది
ఆమె ఒక పాటగా మారి
నా శ్రవణేంద్రియాలను సదా
ఆవహిస్తూనే వుంది, ఇంకా!
(9 సెప్టెంబర్ 2015 రాజీ తొలి వర్ధంతికి)
ఈ దేవిప్రియ
9866111874
కథతో ఒకరోజు
‘కథాసాహితి’, ‘ప్రజ్వలిత’ సంయుక్త నిర్వహణలో ‘కథ-2014’ ఆవిష్కరణ నేడు ఉదయం 9.45కి గౌతమ్ గ్రాండ్ హోటల్, రైల్వేస్టేషన్ దగ్గర, తెనాలిలో జరగనుంది. కథాసాహితి సంకలనాల పరంపరలో ఇది 25వది. ఆవిష్కర్త: వంశీ. వక్తలు: మృణాళిని, కె.శివారెడ్డి, పెనుగొండ లక్ష్మీనారాయణ. సంపాదకులు వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ పుస్తకాన్ని పరిచయం చేస్తారు. సంకలనంలోని కథకులతో ముఖాముఖిని ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు నిర్వహిస్తారు. లావు నరేంద్రనాథ్, ఇంద్రగంటి మోహనకృష్ణ, ఎన్.జె.భిక్షు, ఆర్.వి.రామారావు, ఎం.వి.రాయుడు, సంధ్య కథతో తమ అనుబంధాన్ని వివరిస్తారు. ప్రేక్షకులతో ముఖాముఖిని అంబటి మురళీకృష్ణ నిర్వహిస్తారు. పాపినేని రచన ‘ద్రవాధునికత’ను బి.తిరుపతిరావు, ‘సాహిత్య బాటసారి శారద’ వెబ్‌సైటును పాటిబండ్ల దక్షిణామూర్తి ఆవిష్కరిస్తారు. రోజంతా జరిగే ఈ కార్యక్రమాల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్, నాగళ్ల వెంకటదుర్గాప్రసాద్, అప్పాజోస్యుల సత్యనారాయణ పాల్గొంటారు.
గురజాడ జయంతి సభ
గురజాడ జయంతి సందర్భంగా, మొజాయిక్ సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో విశాఖ పౌరగ్రంథాలయంలో సెప్టెంబర్ 21న మధ్యాహ్నం 3 గంటలకు ‘ముప్పయ్యేళ్ల తెలుగు - వర్తమానం- భవిష్యత్తు’ సదస్సు జరగనుంది. అధ్యక్షత: ఎల్.ఆర్.స్వామి. వక్తలు: ఎ.మల్లేశ్వరరావు, జగద్ధాత్రి, దుప్పల రవికుమార్, విజయభాను కోటే, చాగంటి తులసి. అనంతరం అయ్యగారి సీతారత్నం ‘సాధిత’, పత్తి సుమతి ‘యావత్తు మన వేదంలో వున్నాయిష’ పుస్తకావిష్కరణలుంటాయి.
సమీక్ష: చందు సుబ్బారావు, రామతీర్థ.
జాషువా సాహిత్య సదస్సు
గుర్రం జాషువా 120వ జయంతి సందర్భంగా, గుంటూరు ఏసీ కాలేజీ ఆడిటోరియంలో సెప్టెంబర్ 27న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సదస్సు జరగనుంది. తెలుగు సాహిత్యంలో జాషువా విశిష్టత, జాషువా శైలి-వస్తు వైవిధ్యం, జాషువా సాహిత్యం- సామాజిక వాస్తవికత అంశాలపై సమావేశాలుంటాయి. డొక్కా మాణిక్యవరప్రసాద్, జె.డి.శీలం, ఎం.వి.ఎస్.శర్మ, బి.వి.రాఘవులు, కొలకలూరి ఇనాక్, కె.శ్రీనివాస్, గోరటి వెంకన్న, పి.ముత్యం, కె.ఎస్.లక్ష్మణరావు, తెలకపల్లి రవి, కత్తి పద్మారావు, అద్దేపల్లి రామమోహన్‌రావు, రావెల సాంబశివరావు, రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, ఎండ్లూరి సుధాకర్, బి.వేదయ్య, ఖాదర్ మొహియుద్దీన్, కోయి కోటేశ్వరరావు, ఆండ్ర మాల్యాద్రి, కొలకలూరి మధుజ్యోతి,సి.ఎస్.ఆర్.ప్రసాద్, ఎం.ఎం.వినోదిని, పెనుగొండ లక్ష్మీనారాయణ, ఎం.స్వర్ణలతాదేవి, మోదుగుల రవికృష్ణ పాల్గొంటారు. మరిన్ని వివరాలకు ఉత్సవ
కమిటీ ప్రధాన కార్యదర్శి పి.వి.రమణ
ఫోన్: 7396493100
‘రంగినేని’ పురస్కారం కోసం...
గత పదకొండేళ్లుగా ఇస్తున్న ‘రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం’ కోసం 2013, 2014, 2015 సంవత్సరాల్లో ప్రచురించిన కవితా సంకలనాలు 5 ప్రతుల్ని అక్టోబర్ 26 లోపు కింది చిరునామాకు పంపాలని ‘ట్రస్టు’ అధ్యక్షులు రంగినేని మోహన్‌రావు కోరుతున్నారు. అవార్డు కింద 15 వేల నగదు, జ్ఞాపిక, పురస్కార పత్రం ఇస్తారు. రంగినేని సుజాత మోహన్‌రావు ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్, బాలాజి నగర్, సిరిసిల్ల-505301. మరిన్ని వివరాలకు కన్వీనర్ మద్దికుంట లక్ష్మణ్ ఫోన్: 9441677373
‘మల్లెతీగ’ ఆహ్వానం
మల్లెతీగ పురస్కారం(2015) కోసం కవితల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రధాన పురస్కారం 5 వేల నగదు, మరి ఐదుగురికి వెయ్యి చొప్పున ఆత్మీయ పురస్కారాలిచ్చే దీనికోసం ప్రత్యేకంగా రాసిన సామాజిక స్పృహతో కూడిన కవితల్ని ఫొటోతో సహా అక్టోబర్ 31లోగా కింది చిరునామాకు పంపాలి. కలిమిశ్రీ, మల్లెతీగ సాహిత్య వేదిక, డోర్ నం. 41-20/3-24, మన్నవవారివీధి, కృష్ణలంక, విజయవాడ-520013. ఫోన్: 9246415150
మచ్చు తునకలు
(జీవితపు లోగిళ్ళకు అద్దం పట్టే కథలు)
పేజీలు: 272; వెల: 150
ప్రతులకు: కవిత పబ్లికేషన్స్, 3/75, రాయవరం, ఖాదరాబాద్ పోస్ట్, ప్రొద్దుటూరు - 516 362
ఫోన్: 9063077367
తెలంగాణ భాష, చరిత్ర పుస్తకాలు
Published Sun, Sep 20 2015 3:04 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM
Advertisement
Advertisement