దూరం తగ్గేదెన్నడు? | Jammu and Kashmir ruling critical | Sakshi
Sakshi News home page

దూరం తగ్గేదెన్నడు?

Published Sun, Apr 17 2016 3:08 AM | Last Updated on Sun, Sep 3 2017 10:04 PM

దూరం తగ్గేదెన్నడు?

దూరం తగ్గేదెన్నడు?

త్రికాలమ్
ఆగ్రహంతో ఊగిపోతున్న కశ్మీర్‌లో అగ్ని రగల్చడానికి అగ్గిపుల్ల అక్కరలేదు. చిన్న సంఘటన జరిగినా, జరిగినట్టు వదంతి వినిపించినా వీధుల్లోకి వచ్చి భద్రతాదళాలతో తలపడటానికి నేటి యువత సంకోచించడం లేదు. తుపాకీ నీడలో పుట్టిపెరిగిన నవతరం కశ్మీరీలు మరతుపాకులు ధరించిన సైనికులను రాళ్ళతో ఎదుర్కోవడం 2010లో చూశాం. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం.

ఉత్తర కశ్మీర్‌లోని హండ్వారా పట్టణంలో పదహారేళ్ళ బాలికతో ఒక సైనికుడు అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణ రావడంతో యువకులు నిరసన ప్రదర్శనకు దిగారు. పరిమితంగా బలం ప్రయోగించి యువకులను అదుపు చేయవలసిన పోలీసులు గుంపుపైన కాల్పులు జరిపారు. నిరసన ప్రదర్శనను కెమెరాలో బంధిస్తున్న ఔత్సాహిక క్రికెటర్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘట నలోనే ఇంకో యువకుడు, మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం నాడు కుప్వారాలో నాలుగో అమాయకుడు భద్రతాదళాల బుల్లెట్లకు నేలకొరిగాడు.

ఇది ఒక విషవలయం. ఏదో ఒక ఘటన జరగడం, యువకులు రెచ్చి పోయి వీధుల్లో ప్రదర్శనలకు దిగడం, సాయుధ పోలీసులు అవసరానికి మించి బల ప్రయోగం చేయడం, ప్రదర్శకులు కొందరు చనిపోవడం, కశ్మీర్ లోయలో ముఖ్యమైన పట్టణాలన్నీ కోపంతో అట్టుడికిపోవడం, జనజీవనం స్తంభిం చడం, ఈ దశలో వేర్పాటువాదులు రంగ ప్రవేశం చేసి అసమ్మతినీ, ఆగ్రహాన్నీ పెంచే విధంగా రాజకీయ నాయకత్వం అందించడం, సంక్షోభానికి దారి తీయడం ఆనవాయితీ. అదే క్రమం ఇప్పుడు చూస్తున్నాం.

భద్రతాబలగాలతో పేచీ
ఉత్తర, దక్షిణ కశ్మీరంలో పెరుగుతున్న అశాంతిని అణచివేయడానికి అదనపు భద్రతాబలగాలని పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మోతాదు మించిన బలప్రయోగం ఫలితాలు ఎట్లా ఉంటాయో కశ్మీరీలకూ, వారి ప్రయా ణాన్ని పరిశీలిస్తున్నవారికీ స్పష్టంగా తెలుసు. కశ్మీర్ గురించి అంతగా తెలియ నివారు వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలంటే బషారత్ పీర్ రాసిన ‘కర్ఫ్యూడ్ నైట్’ చదవాలి. అతను కథ, స్క్రీన్‌ప్లే రాసిన ‘హైదర్’ సినిమా చూడాలి. తన స్వగ్రామం అనంతనాగ్‌కి షేక్‌స్పియర్ రచించిన హేమ్లెట్ నాటకాన్ని అన్వయించాడు ‘హైదర్’లో బషారత్ పీర్.

హేమ్లెట్ వలెనే ‘టుబీ ఆర్ నాట్ టుబీ’ అని తేల్చుకోలేని దుస్థితిలో కశ్మీర్ యువతీయువకులు ఉన్నారని చెప్పడానికి హీరో హైదర్ ద్వారా చేసిన ప్రయత్నం కశ్మీరీలకు విపరీతంగా నచ్చింది. తెలుగు రాష్ట్రాలలో ఉన్నన్ని సినిమా హాళ్ళు కశ్మీర్‌లో లేవు. కశ్మీరీలు ఈ సినిమాను కంప్యూటర్లలో చూశారు. ‘హైదర్’ సినిమా తమ నిజజీవితాలకు అద్దం పట్టిందంటూ పీర్‌ను వేనోళ్ళా అభినందించారు. భారత ప్రభుత్వం కశ్మీర్‌ను గట్టిగా పట్టుకొని ఉన్నది కానీ అక్కడ పరిపాలించడం లేదని ‘గ్రేటర్ కశ్మీర్’ అనే పత్రిక ఇటీవలి పరిణామాలపైన వ్యాఖ్యానిస్తూ దుయ్య పట్టింది. మెహబూబా ముఫ్తీకి అధికారంలో ఉండే అర్హత లేదనీ, ప్రజల తీర్పును ఆమె మంటగలిపారనీ ‘కశ్మీర్ రీడర్’ అనే పత్రిక సంపాదకీయంలో నిప్పులు చెరిగింది.

బాధితురాలైన బాలిక, ఆమె తండ్రి, పిన్ని భద్రతాదళాల అదుపులోనే ఉన్నారు. వారిని రక్షించేందుకే తమ అదుపులో ఉంచుకున్నామంటూ అధికా రులు చెబుతున్నారు. తనతో ఎవరూ అసభ్యంగా ప్రవర్తించలేదని బాలిక చెప్పిన విడియోను సైనికాధికారులు విడుదల చేశారు. బాలిక చేత బలవంతంగా ఆ మాటలు చెప్పించారంటూ ఆమె తల్లి తాజాబేగం ఆరోపించింది. రాజ్యాంగం 21వ అధికరణ కింద సామాన్య పౌరులకు ప్రసాదించిన హక్కులను భద్రతా దళాలు కాలరాశాయంటూ ఆమె జమ్మూ-కశ్మీర్ హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. ఏ చట్టం కింద బాలికనూ, ఆమె బంధువులనూ నిర్బంధంలో ఉంచారో చెప్పా లంటూ సైనికాధికారులను ఆదేశించిన న్యాయస్థానం కేసు విచారణను ఈ నెల 20 వ తేదీకి వాయిదా వేసింది.

ముఫ్తీ మహమ్మద్ సయీద్ మృతి తర్వాత మూడు మాసాలు తటపటా యించి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మెహబూబా ముఫ్తీకి ఆదిలోనే హంస పాదు అన్నట్టు పదవి స్వీకరించి పదిరోజులైనా గడవక ముందే సంకట స్థితి దాపురించింది. పీపుల్స్ డెమాక్రాటిక్ పార్టీ (పీడీపీ)ని గెలిపించింది ఆ పార్టీ అధ్యక్షురాలు మెహబూబానే అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆమె తండ్రి సయీద్. బీజేపీతో కలిసి పీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న సయీద్ నిర్ణయానికి అయిష్టంగానే అంగీకరించారు ఆమె. ఎందుకంటే బీజేపీని కశ్మీర్ లోయలో అడుగు పెట్టనీయరాద నేది ఆమె ఎన్నికల ప్రచారంలో ముఖ్యమైన రెండు నినాదాలలో ఒకటి.

రెండో నినాదం ఏఎఫ్‌ఎస్‌పీఏ (ఆర్మడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్)ని రద్దు చేయాలన్నది. భద్రతాదళాలకు అసాధారణమైన అధికారాలు దఖలు పరచడం ద్వారా కశ్మీర్‌లో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగిపోతోందంటూ ఆమె ఎన్నికల సమయంలో విస్తృతంగా, శక్తిమంతంగా ప్రచారం చేశారు. అటువంటి వ్యక్తి బీజేపీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వచ్చింది. లేకపోతే శాసనసభను రద్దు చేయించి మధ్యంతర ఎన్నికలకు సిద్ధపడాలి. పార్టీలో తిరుగుబాటును తట్టుకొని నిలబడాలి. అధికారం ఉంటే పార్టీ నేతలనూ, శ్రేణులనూ సంతృప్తి పరచడం సాధ్యం. ఏ పార్టీని లోయలోనికి రానీయవద్దంటూ ప్రచారం చేశారో అదే పార్టీతో అధికారం పంచుకోవడం, ఏ చట్టాన్ని అయితే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారో అదే చట్టం కింద భద్రతాదళాలు ప్రత్యేకాధికారాలు చెలా యిస్తూ జనసమూహంపైన కాల్పులు జరిపితే ఖండించలేక మౌన ప్రేక్షక పాత్ర పోషించవలసి రావడంతో  మెహబూబా అడకత్తెరలో నలిగిపోతున్నట్టు విలవిల లాడుతున్నారు.

12వ తేదీ మంగళవారంనాడు కాల్పులలో ముగ్గురు మరణిస్తే బుధవారంనాడు ఢిల్లీలో మెహబూబా రక్షణమంత్రినీ, ఆర్థికమంత్రినీ కలుసు కొని విన్నపాలు చేసుకోవడం కశ్మీరీలకు అవమానకరంగా తోచింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు నిధులు విడుదల చేయలంటూ ఆర్థిక మంత్రి జైట్లీనీ, భద్రతాదళాలు అధికారాలను దుర్వినియోగం చేసి కాల్పులు జరిపిన సందర్భాలలో గడువు ప్రకారం దర్యాప్తు జరిపించాలంటూ రక్షణమంత్రి మనోహర్ పరీకర్‌నీ అభ్యర్థించడం సిగ్గుచేటంటూ వేర్పాటువాదులు విమర్శిస్తున్నారు. ఏడాది కిందట ఏ చిన్న ఘటన జరిగినా పరుగుపరుగున వెళ్ళి ‘మొసలి కన్నీరు’ కార్చిన మెహబూబా ఇప్పుడు మౌనంగా ఎందుకున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎద్దేవా చేస్తూ ట్వీట్లు ఇస్తున్నారు.

మెహబూబా నిస్సహాయత
అసభ్య ప్రవర్తన ఆరోపణపైనా, కాల్పుల ఘటనపైనా దర్యాప్తు జరిపించాలని భద్రతాదళాల అధికారులు ఆదేశించారు. ఆ దర్యాప్తు సక్రమంగా, నిర్విఘ్నంగా జరిగేటట్టు చూడటంతో పాటు యువతను శాంతింపజేయడానికీ, హింసను అరి కట్టడానికీ, వేర్పాటువాదుల వాదనను దీటుగా ఎదుర్కోవటానికీ మెహబూబా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ ప్రయత్నంలో భాగంగానే పీడీపీ యువ విభాగం అధ్యక్షుడు వాహిద్ పారా శనివారంనాడు ఒక ప్రకటన చేశారు. ఆర్థిక ప్రగతిని అడ్డుకునే దురుద్దేశంతోనే స్వార్థశక్తులు కుట్ర పన్నాయనీ, అస్థిరతను సృష్టించి కశ్మీర్‌ను అతలాకుతలం చేసే ప్రయత్నాలను వమ్ము చేయాలనీ ప్రజలకు పారా విజ్ఞప్తి చేశారు. నిరంతర సంక్షోభం సృష్టించిన హింసాకాండలో ఇప్పటికే ఒక తరం బలైపోయిందని గుర్తు చేశారు. వాహిద్ రాజకీయ పరిజ్ఞానం కలిగిన యువకుడు. సయీద్ ముఫ్తీకి సలహాదారు. కానీ అతడి స్థాయి సరిపోదు.

మెహబూబా హితబోధను సైతం ఆలకించే స్థితితో కశ్మీరీలు లేరు. ఆమెను అనరాని మాటలు అంటున్నారు. సైన్యం అవసరానికి మించి బలం ప్రదర్శిస్తు న్నదనే ఫిర్యాదు మొదటి నుంచీ ఉన్నది. సైన్యం నిగ్రహం పాటించాలనీ,  సహనం ప్రదర్శించాలనీ ఆదేశించవచ్చు. కానీ ఆచరణలో అది సాధ్యం కాదు.  ఒక వైపు సైన్యానికి విశేషాధికారాలు కొనసాగిస్తూనే మరోవైపు శాంతి, సుస్థిరతలు నెలకొల్పాలని పాటుపడటం వృధా ప్రయాస. ఎప్పుడో ఒకసారి ఒకటి, రెండు రోజులు కర్ఫ్యూ విధిస్తే జీవితం పరాధీనమైనట్టు మనం భావిస్తాం.  నిత్యం సైనికుల కనుసన్నలలో  జీవించడం ఎంత దుర్భరమో దేశ ప్రజలు ఆలోచించ గలగాలి. దాదాపు ఏడు దశాబ్దాలుగా కశ్మీరీల హృదయాలను గెలుచుకోలేక పోయిన మన పాలకులు ఎక్కడ పొరబాటు జరిగిందో సమీక్షిం చుకోవాలి. కశ్మీరీలకు మరింత దూరం కాకుండా జాగ్రత్తపడాలి. భారతదేశంలో అంత ర్భాగంగా కశ్మీర్ ఉండటం వల్ల కశ్మీరీ యువతకు ఎటువంటి ప్రయోజ నాలు ఉంటాయో తెలియజెప్పాలి. వారి భవిష్యత్తుకు హామీ లభించినట్లయితే వేర్పాటువాదుల ఆట కట్టినట్టే.

పీడీపీ-బీజేపీ ప్రభుత్వం కొనసాగినంత మాత్రాన కశ్మీరీలు భారత్ పట్ల సానుకూలంగా ఉన్నారని భావించడం పొరబాటు. ఎన్నికలలో కశ్మీరీలు పాల్గొం టున్నది  రోడ్లు, నీరు, విద్యుచ్ఛక్తి వంటి ప్రాథమిక సదుపాయాలు సమకూరు తాయన్న ఉద్దేశంతోనే. తమ హక్కులకు భంగం కలిగితే తెగించి పోరాడటానికి వారు వెనకాడరు. రాళ్ళతో శతఘు్నలపై యుద్ధం చేయడానికి సిద్ధమైన ప్రజలను ఏ శక్తీ నిలువరించలేదు. యువతరాన్ని సుముఖం చేసుకునేందుకు ప్రధాన మంత్రి స్థాయిలోనే కొత్త ప్రయత్నం ఏమైనా జరగాలి. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా కశ్మీర్ లోయలో అత్యధికులు స్వాతంత్య్రం కోరుకుంటున్నారన్న మాట నిజం. మత ప్రాతిపదికన ఆలోచించేవారు కొందరు పాకిస్తాన్‌లో విలీనమైనా పర్వాలేదను కుంటున్నారు. అంతకంటే తక్కువ శాతం మంది ఇండియాలో కొనసాగాలని అనుకుంటు న్నారు. ఇండియాలో అంతర్భాగంగా కొనసాగాలని మనస్పూర్తిగా  కోరుకునే వారి  శాతం పెరగడానికి ఏమి చేయాలో ఒక్క కేంద్ర ప్రభుత్వమే కాదు భారత సమాజం యావత్తూ ఆలోచించాలి. ఇది కేవలం మెహబూబా లేదా నరేంద్ర మోదీ సమస్య కాదు. దేశ ప్రజలందరిదీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement