‘యత్నాలు’ పరుగులు పెట్టిస్తాయేమో!
ఆత్మహత్యాయత్నం నేరం కాదంటూ తీర్మానించిన కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)లోని సెక్షన్ 309 తొలగించాలని తీసుకున్న నిర్ణయంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వాస్తవానికి లా కమిషన్ నాలుగేళ్ల క్రితమే ఈ సిఫార్సు చేసింది. అప్పటి నుంచి స్తబ్దుగా ఉండిపోయిన ఈ దస్త్రం ఒక్కసారిగా తెరపైకి వచ్చి కేంద్రం ఆమోదాన్ని సైతం పొందడం అధికారులకు మింగుడు పడటం లేదు. పబ్లిక్ ప్లేసుల్లో జరిగే ఆత్మహత్యాయత్నాల్లో అనేకం కేవలం హల్‌చల్ కోసమే జరిగేవి ఉంటాయి. ఎన్నికల సందర్భాల్లో, ఉద్యమాలు, నిరసనలప్పుడు ఈ ధోరణి మరీ ఎక్కువగా ఉంటోంది. ఎక్కువగా ఎత్తయిన చెట్లు, టవర్లు, హోర్డింగ్స్‌తో పాటు చేతిలో పెట్రోల్, కిరోసిన్‌తో హంగామా సృష్టిస్తున్నారు.
ఇలా ఓ హైడ్రామా ప్రారంభమైనప్పుడు ‘హల్‌చల్’ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ఒక్కోసారి 10-12 గంటలు కూడా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి వారిపై పోలీసులు కేసుల అస్త్రం ప్రయోగిస్తున్నారు. ఈ కారణంగానే అనేక మంది వెనక్కు తగ్గుతున్నారు. ఇప్పుడు ‘309’ తొలగింపు నిర్ణయంతో వీరికి అడ్డుకట్ట వేయడం కష్టసాధ్యమన్నది పోలీసు అధికారుల మాట. తాజా నిర్ణయం నేపథ్యంలో ఇక ‘హల్‌చల్‌గాళ్లను’ అడ్డుకోవడానికి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.