నటుడు, జనసంక్షేమ నేత కోన ప్రభాకరరావు | Kona prabhakar rao to become a familer actor, leader | Sakshi
Sakshi News home page

నటుడు, జనసంక్షేమ నేత కోన ప్రభాకరరావు

Published Tue, Oct 20 2015 1:35 AM | Last Updated on Sun, Sep 3 2017 11:12 AM

నటుడు, జనసంక్షేమ నేత కోన ప్రభాకరరావు

నటుడు, జనసంక్షేమ నేత కోన ప్రభాకరరావు

క్రీడాకారుడుగా, సినీనటుడిగా, రాజకీయనేతగా మూడు విభిన్నరంగాల్లో తనదైన శైలితో రాణించిన కోన ప్రభాకరరావు తాను నిర్వహించిన పదవులకు వన్నెతెచ్చారు.  నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు సినిమాలో ప్రతిభను చాటి, రాజకీయాల్లోకి వచ్చిన తొలి నటుడిగా గుర్తింపు పొందారు. కోన ప్రభాకరరావు స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల. 1910 జూలై 10న జన్మించారు. అప్పటి మద్రాస్ లయోలాలో డిగ్రీ, పుణేలోని ఐఎల్‌ఎస్ లా కాలేజిలో న్యాయవాద కోర్సు చేశారు.
 
 ఆంధ్ర టెన్నిస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. చిన్నవయసులోనే కళలంటే ఆపేక్ష కలిగిన ప్రభాకరరావు నటుడిగా రాణించాలని తపనపడ్డారు. స్వస్థలంలో 1940 నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే నాటక సంఘాలు, నటులతో అనుబంధం పెంచుకున్నారు. దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు పాత్రల్లో తన పద్యగానంతో కళాభిమానుల్ని రంజింపజేశారు. 1946లో తాను హీరోగా ‘మంగళసూత్రం’ అనే సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించారు. ఎల్‌వీ ప్రసాద్ నటించిన ‘ద్రోహి’ సినిమాలో బుర్రమీసాలు, బుగ్గన గాటు, పులిపిరితో కనిపించే విలన్‌కు భిన్నంగా సూటూబూటుతో పాలిష్డ్ విలన్‌గా అద్భుతంగా నటించారు. 1951లో ‘సౌదామిని’ సినిమాను స్వీయదర్శకత్వంలో నిర్మించారు. ‘నిరపరాధి’, ‘నిర్దోషి’తో సహా 28 సినిమాల్లో నటించారు. ‘రక్తకన్నీరు’ నాగభూషణంను సినీ రంగానికి పరిచయం చేశారు.
 
 కాంగ్రెస్ నేత పీవీ నరసింహారావుతో గల పరిచయంతో ప్రభాకరరావు రాజకీ యాల్లోకి వచ్చారు. 1967లో బాపట్ల నుంచి రాష్ట్ర శాసనసభకు ఎన్నిక య్యారు. 1983 వరకు ఓటమి ఎరుగని నాయకుడిగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. రాష్ట్ర శాసనసభ స్పీకరు, ఆర్థికమంత్రి సహా పలు మంత్రి పదవులను చేపట్టారు. బాపట్లకు తాగునీరు, సాగునీటి వసతిని కల్పించిన ఘనత ప్రభాకరరావుదే. చివరిభూములకు సాగు నీటికని పంటకాల్వలకు సిమెంట్ లైనింగ్‌ను తొలిసారిగా అమలుచేశారు.
 
 1963లో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించి విద్యాసంస్థలను నడిపిస్తూ మార్గదర్శనం చేశారు. 1983లో పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరుగా నియమితులయిన ప్రభాకరరావు, సిక్కిం, మహారాష్ట్ర గవర్నరుగానూ పనిచేశారు. వివిధ నాట్య రీతుల్లో ప్రసిద్ధులైన రంగరాజన్, వెంపటి చిన సత్యం, బ్రిజుమహరాజ్, పాణిగ్రాహి వంటి నాట్యగురువులు, నర్తకీమణులను రప్పించి సికింద్రాబాద్ రైల్ కళారంగ్‌లో ఆ నాలుగు ఫార్మాట్లలోనూ ‘శ్రీకృష్ణపారిజాతం’ నృత్య రూపకాన్ని ప్రదర్శింపజేశారు. 1990 అక్టోబర్ 20న గుండెపోటుతో కన్నుమూశారు. కళా, రాజకీయరంగాల్లో ప్రభాకరరావు వారసత్వం కొనసాగుతోంది. ఆయన కుమా రుల్లో ఒకరైన కోన రఘుపతి బాపట్ల నుంచి రాష్ట్ర శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. రఘుపతి కుమార్తె కోన నీరజ సినీరంగంలో స్టైలిస్ట్‌గా ఉన్నారు. రఘుపతి సోదరుడి కొడుకు కోన వెంకట్ సినీరంగంలో రచయితగా జైత్రయాత్ర సాగిస్తున్నారు.  
 (నేడు కోన ప్రభాకరరావు వర్ధంతి)
 - బి.ఎల్.నారాయణ  సాక్షి, తెనాలి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement