మన్మోహన దౌత్య విషాదం | Manmohan Singh Diplomatic Tragedy | Sakshi
Sakshi News home page

మన్మోహన దౌత్య విషాదం

Published Wed, Sep 25 2013 2:20 AM | Last Updated on Fri, Sep 1 2017 11:00 PM

మన్మోహన దౌత్య విషాదం

మన్మోహన దౌత్య విషాదం

బైలైన్: ఏదైనా దేశంతో సమస్య ఉంటేనే భారత్ దాన్ని పట్టించుకుంటుంది, అంతేగానీ స్నేహ హస్తాన్ని చాపితే మాత్రం కాదు. దక్షిణాసియా అంతటా భారత్‌పట్ల కనిపించే మూతి విరుపు ధోరణికి కారణం ఇదే. ఈ వ్యవహారం చూసి లోతుగా ఆలోచించే చైనా, భారత ప్రభుత్వం నుంచి తాను రాబట్టగలిగినదంతా రాబట్టుకుంటుంది, కోరుకున్నప్పుడల్లా అవమానిస్తుంటుంది. అది చూసి పాకిస్థాన్ సంతోషంతో నవ్వుకుంటుంది.
 
ప్రతి దేశానికి దాని సొంత ఇరుగుపొరుగులు ఉండనే ఉంటా రు. దేశ భూభాగంతో పాటే దానికి ఆ ఇరుగుపొరుగులు కూడా సంక్రమిస్తారు. భౌగోళిక రాజకీయాలు ముడిపడి ఉన్నప్పుడు ఒక దేశపు ఇరుగుపొరుగులు మరొక దేశానికి ఆత్మీయులు కావడం జరుగుతుం టుంది. అలాంటప్పుడే సమస్య సంక్లిష్టంగా మారుతుంది.

శత్రుత్వమే వాస్తవానికి అత్యంత సూటిగా ఉంటుంది. రెచ్చగొట్టడమనే దానికి స్పష్టమైన కొలబద్దలు ఉంటాయి. దానికి ప్రతిస్పందన కూడా సాధారణంగా ఊహించదగినదిగానే ఉంటుంది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు ఇందుకు అత్యుత్తమ ఉదాహరణ. ఇంతపాటి అతిక్రమణకు ఈ మోతాదు మందుగుండు అంటూ రెండు దేశాల విదేశాంగశాఖల కార్యాలయాలు, సైన్యాలు కచ్చితమైన కొలమానాలతో కూడిన సూత్రాలను రూపొందించుకున్నాయి. ఖడ్గం ఖంగున మోగుతుంది, ఒక్కోసారి ఓ వేటును కూడా వేస్తుంది. అయితే గాటు మాత్రం ఎప్పుడూ ముందుగా నిర్ణయించుకున్న మేరకు మాత్రమే పడుతుంది. తప్పు ఎవరిదైనా గానీ అంతకు మించిన గాయం మాత్రం చేయరు. విరామచిహ్నాల్లాగా అప్పుడప్పుడూ మృత్యువు దర్శనమిస్తున్నా జీవితం సాగిపోతూనే ఉంటుంది.
 
 అధిక సందర్భాల్లో బాధిత దేశంగా ఉండే భారత్ గతి తప్పిన గడియారపు లోలకం డోలనాలను పరిగణనలోకి తీసుకుంటుంది. శాంతి ప్రయత్నాల వల్ల నెలకొనే సానుకూల వాతావరణం కంటే భారత పటాన్ని మార్చాలనే సంకల్పంతో ఉన్నవారు ప్రేరేపించే సంఘర్షణ ఎక్కువ కావడం జరుగుతూనే ఉంటుంది. అలా అని ఇరు దేశాల మధ్య వైషమ్య భావన ప్రబలంగా ఉండటానికి అది కారణం కాదు. ఇరువైపులా ఉండే బాధ్యతాయుత ప్రభుత్వాలు ఆత్మవిశ్వాసంతోనే ఉంటాయి. అయినాగానీ ఏ పరిస్థితిలోనైనాగానీ తిరుగులేని విజయంతో ఆటకట్టింపు జరగదని ఇరుపక్షాలు గుర్తిస్తాయి. కాబట్టే ప్రతిష్టంభన ప్రమాదకర యుద్ధంగా దిగజారిపోకుండా జాగ్రత్తవహిం చటానికి అవి బాధ్యత వహిస్తాయి.
 
 మిత్రులతో అనుబంధం విషయంలోనే ఊహాశక్తి, కఠోర శ్రమ రెండూ ఎక్కువగా అవసరమవుతాయి. మన దౌత్యవేత్తలు ఉపఖండంలోని ఉన్నతాధికారుల నుంచి ఆశించదగినంత స్థాయిలో వళ్లు వంచి పనిచేసేవారే. అయినాగానీ గత ఐదేళ్ల కాలంలో వాళ్లు ఎలాంటి ప్రయోజనమూ లేకుండానే పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రయోజనం అనేది ఎప్పుడూ విధానపు పర్యవసానమే. భారత ప్రభుత్వం తన విదేశాంగ విధానాన్ని దాటుళ్లు, గెంతులు, దుంకుళ్ల క్రీడగా మార్చింది. ఫలితాలు కళ్లకు కడుతూనే ఉన్నాయి. మనకు మిత్రులు కాదగినవాళ్లలో లేదా కావాల్సినవాళ్లలో కలవరపాటును లేదా సంశయం కలగడం కనిపిస్తూనే ఉంది.
 
 శ్రీలంక, బంగ్లాదేశ్‌లు అందుకు కొట్టవచ్చినట్టుగా కనిపించే రెండు ఉదాహరణలు. ఆ రెండు పొరుగు దేశాలతో ఒకప్పుడు మన సంబంధాలు చరిత్రలోనే అత్యంత అధ్వాన్న స్థితిలో ఉండేవి. అలాంటిది ఐదేళ్ల క్రితం ఆ దేశాలతో సంబంధాలు మునుపెన్నడూ ఎరుగనంతటి స్నేహపూర్వకమైనవిగా మారడానికి చేరువయ్యాయి.

రాజీవ్‌గాంధీ ఆదేశాలపై అరకొర సన్నాహాలతో మన దేశం శ్రీలంకలో చేపట్టిన సైనిక జోక్యంతో రెండు దేశాల మధ్య సంబంధాలు అథఃపాతాళానికి దిగజారాయి. ఇంది రాగాంధీ ప్రభుత్వం ప్రభాకరన్ నేతృత్వంలోని తమిళ వేర్పాటువాద ఉద్యమానికి ఆయుధాలను, శిక్షణను అం దించినప్పటి లక్ష్యానికి పూర్తిగా విరుద్ధమైన లక్ష్యంతో రాజీవ్‌గాంధీ ఆ సైనిక చర్యను చేపట్టారు. ఆ విరోదాభాసాత్మకత తారస్థాయికి చేరి భారత్ భయానకమైన ఉచ్చు లో ఇరుక్కుపోయింది. అటు సింహళులు, ఇటు తమిళులు కూడా భారత్‌ను ద్వేషించారు. ఆ విషమ పరిస్థితి నుంచి 2009లో నాటి విదేశాంగ మంత్రి ప్రణబ్‌ముఖర్జీ మార్గదర్శకత్వంలో మనం బయటపడగలిగాం. తమిళ వేర్పాటువాదులకు వ్యతిరేకంగా శ్రీలంక ప్రభుత్వం చేపట్టిన చివరి నిర్ణయాత్మకమైన పోరాటానికి ప్రణబ్ దృఢంగా, సుస్పష్టంగా, పూర్తిగా మద్దతును తెలిపారు. ఏ ప్రచారార్భాటం లేకుండానే అది జరిగింది. శ్రీలంక సైన్యం ఎల్‌టీటీఈని ఓడిస్తున్నా, ప్రభాకరన్‌ను హతమారుస్తున్నా యూపీఏ ప్రభుత్వం మౌనం వహించింది. తన ముఖ్య మిత్రపక్షమై న డీఎంకే ఎంతగా వత్తిడి తెస్తున్నా అది పట్టించుకోలేదు.
 
 ఆనాడు మనం శ్రీలంక ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతు రెండు దేశాల మధ్య పరస్పరం లాభసాటియైన సంబంధాలను విస్తరింపజేసుకోడానికి గొప్ప పెట్టుబడిగా ఉపయోగపడాల్సింది. అందుకు బదులుగా దాదాపు ఐదేళ్ల తర్వాత ప్రధాని మన్మోహన్‌సింగ్ నవంబర్‌లో జరగనున్న కామన్‌వెల్త్ దేశాధినేతల సమావేశానికి హాజరుకాకుండా ఉండాలేమో అనిపించేంత దుస్థితి నెలకొంది. కారణం? శ్రీలంక మానవ హక్కుల ఉల్లంఘన చర్చకు వచ్చే ఆ సమావేశానికి ప్రధాని హాజరుకావడం తమిళనాడుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని యూపీఏ ఆందోళన చెందుతుండటమేనని స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఎల్టీటీఈపై యుద్ధంలో లంక సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిందన్న ఆరోపణల విషయమై తమిళనాట భావోద్వేగాలు వ్యాపించి ఉన్నాయి. మన్మోహన్ వైఖరి ఏమంత అర్థవంతమైనది కాదు అనిపిస్తుంది. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, లంక యుద్ధం చివరి దశలో ఏమైతే జరిగిందో ఆ విషయంలో భారత్‌కు భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే ఏమి జరుగుతుందో తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగానే మన ప్రభుత్వం ఏమీ చేయరాదని నిర్ణయించింది. రెండోది, దేశంలోని ఎన్నికల లెక్కలకు విదేశాంగ విధానం బందీ అయ్యేట్టయితే ఓటర్లకు లేదా జాతీయ ప్రయోజనాలను ఎన్నటికీ మేలు కలగదు.
 
 బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా తిరిగి ప్రధానిగా ఎన్నిక కావడం కూడా అంతే నాటకీయమైన విస్తృతిగల అవకాశాలను కల్పించింది. బంగ్లాదేశ్‌లో మనకు షేక్ హసీనా కంటే ఉత్తమమైన మిత్రులు దొరకరు. ఎందుకంటే ఆమె 1971 బంగ్లాదేశ్ విముక్తి నేత ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె. అయినాగానీ అవకాశాల నుంచి అనర్థాలను రాబట్టడం ఎలాగనే పాఠ్యపుస్తకంలోని పాఠంలాగా మన ప్రభుత్వం సున్నితమైన నదీ జలాల సమస్యపై హసీనాను వంచించింది. మన్మోహన్ ఏమి వాగ్దానం చేశారనేదే తప్ప షేక్ హసీనా ఏం కావాలని కోరారు అనేది ఇక్కడ గీటురాయి కానేకాదు, అటు ఢాకాలోనూ, ఇటు కోల్‌కతాలోనూ కూడా భారత ప్రభుత్వ నిర్వహణ నైపుణ్యం దయనీయమైనంత అధ్వాన్నంగా ఉండటం వల్లనే మన్మోహన్ ప్రభుత్వం తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. కాబట్టి భారత్ పట్ల శ్రీలంక ఆందోళనకు, బంగ్లాదేశ్ సంశయానికి తగిన కారణమే ఉంది. అయితే అవి భారత్‌పట్ల ఆగ్రహంతో లేకపోవచ్చుననేది వేరే సంగతి.
 
 భారత్ అనుసరిస్తున్నది తుపాకీని ఎటుబడితే అటు విచక్షణారహితంగా గురిపెట్టే వైఖరి. భారత్‌కు సర్వకాల సర్వావస్థల మిత్ర దేశం ఏదైనా ఉందంటే అది భూటానే.  ఆ దేశంతో సంబంధాలలోని శాశ్వతమైన వసంతం కాస్తా ఎప్పుడూ ఉరుములతో భయపెట్టే తుఫానుల వానాకాలంగా దిగజారిపోయింది. అయితే అది ఇంతవరకు ఎప్పుడూ కుంభవృష్టిగా మారింది లేదనే మాట నిజమే. ఏదేమైనా భూటాన్‌తో సంబంధాలను చెడగొట్టుకోడానికి అసాధారణమైన నేర్పు ఎంతో అవసరం. గత కొన్నేళ్లుగా మనం దాన్ని సైతం సాధించగలిగాం.
 
 మన్మోహన్ ప్రభుత్వం ఏ పొరుగు దేశం కోసమైనా సమయం వెచ్చించగలుగుతోందంటే అంటే అది అమిత్ర వైఖరిగల పాకిస్థాన్ లేదా నిరాశావహమైన చైనాల కోసం మాత్రమే. మిగతా దేశాలకు మన ప్రభుత్వం పంపే సందేశం సరళమైనది: ఏదైనా సమస్య ఉంటేనే భారత్ దాన్ని పట్టించుకుంటుంది, అంతేగానీ స్నేహ హస్తాన్ని చాపితే మాత్రం కాదు. దక్షిణ ఆసియా అంతటా భారత్‌పట్ల కనిపించే మూతి విరుపు ధోరణికి కారణాలను ఇది విశదం చేయగలుగుతుంది. ఈ వ్యవహారం చూసి లోతుగా ఆలోచించే చైనా, భారత ప్రభుత్వం నుంచి తాను రాబట్టగలిగినదంతా రాబట్టుకుంటుంది, కోరుకున్నప్పుడల్లా అవమానిస్తుంటుంది. అది చూసి సంతోషించే పాకిస్థాన్ నవ్వుకుంటూ సార్క్ దేశాల సౌహార్ద్రతను కూడగట్టుకుంటుంది.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement