మోదీ రాజకీయానికి శ్రీనగర్‌లో అగ్నిపరీక్ష | Modi's political game in srinagar | Sakshi
Sakshi News home page

మోదీ రాజకీయానికి శ్రీనగర్‌లో అగ్నిపరీక్ష

Published Sun, Dec 7 2014 12:08 AM | Last Updated on Wed, Aug 15 2018 8:02 PM

మోదీ రాజకీయానికి శ్రీనగర్‌లో అగ్నిపరీక్ష - Sakshi

మోదీ రాజకీయానికి శ్రీనగర్‌లో అగ్నిపరీక్ష

త్రికాలమ్
కె. రామచంద్రమూర్తి
 
ఆరు మాసాల కిందట దేశం అంతటా ప్రభంజనం సృష్టిం చిన నరేంద్రమోదీ కశ్మీర్‌లోయలో కూడా నవశకానికి నాంది పలకబోతున్నారా? దేశవ్యాప్తంగా మోదీ సమ్మోహనాస్త్రం పని చేసినట్టు కశ్మీర్ లోయలోనూ మహత్తరమైన ప్రభావం చూపి స్తుందా? జమ్మూ-క శ్మీర్‌లో భారతీయ జనతా పార్టీ (భాజపా) పతాకం ఎగరబోతోందా? రేపు శ్రీనగర్‌లోని చారిత్రక షేర్- ఇ-కశ్మీర్ స్టేడియంలో మోదీ చేయబోయే ప్రసంగం ఆయనను రాజనీతిజ్ఞుడుగా ప్రపంచానికి పరిచయం చేస్తుందా లేక ఫక్తు రాజకీయవాదిగానే మిగిలిపోయినట్టు నిరూపిస్తుందా? కశ్మీర్ లోయలో ఆకస్మికంగా జరిగిన తాజా ఉగ్రవాద దాడులలో పన్నెండు గంటల వ్యవధిలో ఎనిమిది మంది సైనికులూ, ఎనిమిది మంది ఉగ్రవాదులూ, ముగ్గురు పోలీసు ఉద్యోగులూ, ఇద్దరు పౌరులూ మరణించారు.
 
ఆరేడేళ్లుగా ఇంత మంది సైనికులు ఉగ్రవా దుల దాడిలో మరణించడం ఇదే ప్రథమం. యురి, శ్రీనగర్, సోపియాన్, పుల్వామాలలో జరిగిన ఉగ్రవాదుల దాడులకు మూలకారణం కశ్మీర్‌లో క్రమంగా మెరుగవుతున్న పరిస్థి తులు కావచ్చు. మునుపెన్నడూ లేనంతగా మొదటి రెండు దశల పోలింగ్‌లో అధికంగా ఓటర్లు పాల్గొనడం కావచ్చు. పాకిస్తాన్‌తో భారత్ దౌత్యం నెరపి కశ్మీర్ సమస్యకు పరిష్కా రం కోసం ప్రయత్నం చేసే అవకాశం ఉన్నదనే అంచనా కావచ్చు. మొత్తం మీద ఎప్పుడు తలచుకుంటే అప్పుడు కశ్మీర్‌లో చిచ్చుబెట్టగల శక్తి ఉగ్రవాదులకూ, వారి మద్దతుదారు లకూ ఉన్నదనే విషయం మరోసారి రుజువైంది.
 
 మార్పును సహించని శక్తులు
 ఇది కొత్త కాదు. తొలి ఎన్‌డీఏ సర్కార్ హయాంలో నాటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో చర్చలకోసం వాజపేయి అసాధారణమైన చొరవ ప్రదర్శించి లాహోర్‌కు బస్సులో (ఢిల్లీ-లాహోర్ బస్సుయాత్ర ఫిబ్రవరి 19, 1999) వెళ్లిన తర్వాత కార్గిల్‌లో దురాక్రమణకు అప్పటి పాక్ సైన్యాధిపతి జనరల్ ముషార్రఫ్ పన్నాగం పన్నిన సంగతి తెలిసిందే. 2005, ఏప్రిల్ 7న నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ శ్రీనగర్-ముజఫరాబాద్ బస్సు సర్వీస్‌ను ప్రారంభించేందుకు శ్రీనగర్ పర్యటించిన సందర్భంలో కూడా టూరిస్టు కార్యాలయంలో ఇద్దరు ఉగ్రవాదులు దూరి కలకలం సృష్టించారు.
 
కశ్మీర్ సమస్యను పరిష్కరించుకునే ప్రయ త్నంలో ఇండియా, పాకిస్తాన్‌లు సమాలోచనలు జరిపే అవకాశాలున్నప్పుడూ, కశ్మీర్ లోయలో ప్రశాంత వాతావరణం నెలకొనే సూచనలు కనిపించినప్పుడూ ఉగ్రవా దులు తెగబడటం సర్వసాధారణమైపోయింది. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో మొదటి రెండు దశల పోలింగ్‌లో 70 శాతానికి పైగా ఓటర్లు పాల్గొన్నారు. జార్ఖండ్‌లో పోలింగ్ శాతం కంటే ఇది ఎక్కువ. ఈ పరిణామం ప్రజాస్వామ్యవాదులకు ఆనందం కలిగిస్తే ఉగ్రవాదులకు ఆందోళన కలిగించడం సహజం. ఇదే మాదిరి మూడో ఘట్టంలో కూడా అధిక సంఖ్యాకులు పోలింగ్‌లో పాల్గొంటే అంతర్జాతీయ సమాజానికి ఏ సందేశం వెడుతుంది? కశ్మీర్ ప్రజలు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారనీ, ఎన్నికల ప్రక్రియ పట్ల విశ్వాసం ప్రదర్శిస్తున్నారనీ.
 
ఇది పాకిస్తాన్ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది. పాకి స్తాన్‌తో అంటకాగుతున్న హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ అలీ షా గిలానీ వంటి వేర్పాటువాదులకూ చెమటలు పట్టిస్తుంది. నాలుగవ ఘట్టం పోలింగ్ హురియత్‌కు బలం ఉన్న శ్రీనగర్ లో జరుగుతుంది. ఈ ప్రాంతంలో పోలింగ్ ఎప్పుడూ అంతంతమాత్రమే. ఈ సారి కూడా పోలింగ్ పెద్దగా జరగకపోయినా మొదటి మూడు దశలలో పోలింగ్ ఆధారం గానే కశ్మీర్ ప్రజల ధోరణి మారుతున్నదనే అంచనాకు అంతర్జాతీయ సమాజం వచ్చే అవ కాశం ఉంది. అందుకే మంగళవారంనాడు మూడో ఘట్టం జరగడానికి ముందుగానే ఓటర్లను బెదరగొట్టాలని ఉగ్రవాదుల ఎత్తుగడ. అందుకోసమే వరుస దాడులు. ఉగ్రవాదం పంజా విప్పినంత మాత్రాన మన్మోహన్‌సింగ్ తన శ్రీనగర్ ప్రయాణం వాయిదా వేసు కోలేదు. బస్సు సర్వీసును ప్రారంభించడం మానలేదు. రేపు ఉదయం మోదీ సైతం శ్రీనగర్ వె ళ్లడం మానుకోరు.
 
 వాజపేయి 2003లో శ్రీనగర్ సందర్శించినప్పటి పరిస్థితులకూ, ఇప్పటి పరిస్థితులకూ గణనీయమైన వ్యత్యాసం ఉంది. కశ్మీర్ అస్తిత్వానికి సంబంధించి సరళమైన సమాఖ్య స్వభావం ఆపాదించిన 370వ రాజ్యాంగ అధికరణను రద్దు చేసే ఆలోచన భాజపాకు ఉన్నదనే అనుమానం వాజపేయి హయాంలో లేదు. అటువంటి పని వాజపేయి చేయరనే నమ్మకం జమ్మూ-కశ్మీర్ ప్రజలకు ఉండేది (వాస్తవానికి వాజపేయి హయాంని స్వర్ణయు గంగా అభివర్ణించేవారు ఇప్పటికీ లోయలో ఉన్నారు). అప్పుడు ముఫ్తీ మహమ్మద్ సయీద్ జమ్మూ-కశ్మీర్ ముఖ్యమంత్రి. వాజపేయి పక్కనే దన్నుగా నిలబడి ఉన్నారు.

సయీద్ మూడో కుమార్తె డాక్టర్ రుబయాను జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాదులు నవగాంలో ఆమె పని చేస్తున్న ఆస్పత్రి నుంచి మినీ బస్‌లో తిరిగి వస్తుండగా అపహరించి నప్పుడు ఆయన కేంద్ర హోంమంత్రి. షేక్ అబ్దుల్ హమీద్, గులాంనబీ భట్, నూర్ మహ్మద్ కల్వాల్, మహ్మద్ అల్తాఫ్, జావెద్ అహ్మద్ జర్గార్ అనే ఉగ్రవాదులను విడిపించుకుని కిడ్నాపర్లు ఆమెను వదిలిపెట్టారు. సయీద్ వాజపేయిని ఆప్తమిత్రుడుగా పరిగణించేవారు.
 
 అటువంటి సయీద్ స్థాపించిన పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ), తనయ మెహబూబా సారథ్యంలో ఇప్పుడు కశ్మీర్ లోయలో భాజపా ప్రవేశాన్ని నిరోధించేందుకు శక్తివంచన లేకుండా పోరాటం చేస్తోంది. వాజపేయి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకుడు. మోదీ నడిపిస్తున్నది మాటవరుసకు సంకీర్ణ ప్రభుత్వమే అయినా స్వయంగా భాజపాకు లోక్‌సభలో పూర్తి మెజారిటీ సంపాదించిన విజయోత్సాహంలో ఆయన ఉన్నారు. శ్రీనగర్‌లో జెండా పాతాలనే సంకల్పం ప్రకటించారు. వేర్పాటువాద నాయకులలో ఒకరైన సజ్జాద్ లోన్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. శ్రీనగర్ నడిబొడ్డు లాల్‌చౌక్‌లో భాజపా కార్యాలయం ఉనికి సాధ్యమని కొన్ని సంవత్సరాల కిందట ఊహకందని విషయం.
 
 ఇప్పుడు అక్కడ కార్యాలయం ఉండటమే కాకుండా జమ్మూ-కశ్మీర్ భాజపా ప్రతినిధి ఖాలిద్ జహంగీర్ ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయంటూ ప్రకటిస్తున్నారు. జమ్మూలోనూ, లద్దాఖ్‌లోనూ భాజపా దాదాపు అన్ని స్థానాలనూ గెలుచుకుంటుందనీ, కశ్మీర్‌లో కనీసం అయిదు నియోజకవర్గాలలో తమ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయనీ, ప్రభుత్వం తప్పకుండా ఏర్పాటు చేస్తామనీ జహంగీర్ అంటున్నారు. ఓటర్లు క్యూలలో నిలబడి పట్టుదలగా ఓటు వేయడాన్ని భాజపా నాయకులు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలపైన పనిచేసినట్టే కశ్మీర్ ప్రజల మీద కూడా మోదీ ఆకర్షణ మంత్రం పనిచేస్తోందని చెబుతున్నారు. ఇది నిజమే కావచ్చు. మోదీనీ, భాజపానీ లోయలో అడుగుపెట్టకుండా నిలువరించడానికి ప్రజలు పట్టుదలగా సయీద్ నాయకత్వంలోని పీడీపీకి ఓటు చేస్తూ ఉండవచ్చు. రెండోది నిజమయ్యే అవకాశాలే ఎక్కువని నా అభిప్రాయం.
 
 మోదీలో కశ్మీరీలు వాజపేయిని చూస్తారా?
 మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో సార్క్ దేశాధినేతలను ఆహ్వానించడం అద్భుతమైన దౌత్యపరమైన చొరవ అని అందరూ ప్రశంసించారు. పాక్ ప్రధాని షరీఫ్ కూడా వచ్చారు. మోదీ, షరీఫ్ లాంఛనంగా చర్చలు జరిపారు. కానీ త్వరలో శిఖరాగ్ర సమావేశం జరుగుతుందని దౌత్యవర్గాలు భావిస్తున్న తరుణంలో రె ండు దేశాల మధ్య సంబంధాలు అనూహ్యంగా క్షీణించాయి. హురియత్ నాయకులతో, ఇతర వేర్పాటువాద నాయకులతో పాకిస్తాన్ రాయబారి సమాలోచనలు జరిపే ప్రయత్నం చేయడాన్ని మోదీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. వాస్తవానికి వాజపేయి శ్రీనగర్ సభలో ప్రసంగించిన తర్వాతనే పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాల పునరుద్ధరణ జరిగింది.
 
 కశ్మీర్ వేర్పాటువాదులతో కేంద్ర ప్రభుత్వం నేరుగా చర్చలు జరపడానికి కూడా అప్పుడే శ్రీకారం చుట్టారు. ఇరవై నుంచి ముప్పయ్ వేలమంది హాజరైన సభలో వాజపేయి చేసిన అమోఘమైన ప్రసంగం ఆయనను ఒక రాజనీతిజ్ఞుడుగా కశ్మీరీల హృదయాలలో నిల బెట్టింది. వాజపేయి నాడు త్రిసూత్ర పథకం ప్రకటించారు. ఇన్సానియత్ (మానవత్వం), జమ్హూరియత్ (ప్రజాస్వామ్యం), కశ్మీరియత్ (కశ్మీరీలకు సహజ సంపద అయిన స్నేహ స్వభావం)-ఈ మూడూ తమ కశ్మీర్ విధానాన్ని నియంత్రిస్తాయని ఆయన చెప్పారు. ఉప ఖండంలో శాంతి నెలకొల్పడానికి సహకరించవలసిందిగా పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆ సమా వేశంలోనే స్నేహహస్తం అందించారు. మండుతున్న మంచులోయకు మళ్లీ వసంతం వస్తుం దనీ, కోయిలలు తిరిగి వస్తాయనీ, పూలు వికసిస్తాయనీ ఆశ్వాసన పలికారు. కశ్మీర్‌లో కమల వికాసం గురించి ఆయన ఆలోచించలేదు. మోదీ ఆ సాహసం చేస్తున్నారు.
 
నలిగిపోతున్న లోయ వాసులు
 మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘ఆపరేషన్ పరాక్రమ్’ అమెరికా ఆమోదంతోనే జరిగిందనీ, కశ్మీర్ వివాదంలో భారత్‌కు అమెరికా అండ ఉంటుందనీ అనుమానించిన కారణంగానే కశ్మీర్ వేర్పాటువాదాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలూ పాకిస్తాన్ తీసుకుంటున్నది. ఇటీవల లాహోర్‌లో గురువారం నాడు పోలీసుల భారీ బందోబస్తు మధ్య పేరుమోసిన ఉగ్రవాద నాయకుడు హఫీజ్ సయీద్ పెద్ద బహిరంగ సభ నిర్వహించడం, అందులో భారత్‌పైనా, అమెరికాపైనా విషం కక్కడం పాకిస్తాన్ పాలకుల సమ్మతితోనే, మద్దతుతోనే జరిగాయని అనుకోవాలి.
 
 హఫీజ్ సయీద్‌ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, తదితర దేశాలు ప్రకటించాయి. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి 1267వ తీర్మానం ద్వారా సయీద్‌ని ఉగ్రవాదిగానూ, ఆయన నాయకత్వంలోని జమాత్-ఉద్-దవాను ఉగ్రవాద సంస్థగానూ గుర్తించింది. అటువంటి బహిష్కృత సంస్థనూ, నాయకుడినీ బహిరంగంగా భారత విద్వేష ప్రచారం సాగించడానికి అనుమతించడమే కాకుండా ఆయన నాయకత్వంలో మహాసభ నిర్వహణకు సహకరించడం పాకిస్తాన్ పాలకుల నైజానికి అద్దం పడుతోంది. ఉగ్రవాదంతో భారత్ కన్ను పొడవడానికి పాకిస్తాన్ రెండు కళ్లనూ పొడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఉగ్రవాదం కారణంగా పాకిస్తాన్‌లో జనజీవనం అల్లకల్లోలమైపోతున్నా, వేలాది మంది దుర్మరణం పాలవుతున్నా పాకిస్తాన్ పాలకులలో కానీ పాకిస్తాన్‌లో సర్వాధికారాలూ చలాయిస్తున్న సైన్యాధికారులలో కానీ హృదయపరివర్తన రావడం లేదు.
 
 కశ్మీర్‌ను సాధించుకోవడం కోసం పాకిస్తాన్ ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధం. కశ్మీర్‌ను కాపాడుకోవడంకోసం భారత్ ఎంతటి త్యాగానికైనా, ఎంతమంది సైనికుల ప్రాణాలను అర్పించడానికైనా వెనుదీయదు. రాజీలేని రెండు బలమైన దేశాల మధ్య కశ్మీర్ ప్రజలు నలిగిపోతున్నారు. ఉగ్రవాదుల దాడుల సందర్భంలో కూడా అమెరికా ప్రభుత్వ ప్రతినిధి వెనుకటి వలెనే స్పందించారు. కశ్మీర్ సమస్యను భారత్, పాకిస్తాన్‌లు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటిం చారు.
 
 ఎప్పటికైనా చర్చలే శరణ్యం. ఈ నేపథ్యంలో జరగనున్న మోదీ శ్రీనగర్ సభకు లక్షమంది హాజరవుతారని భాజపా నాయకుల అంచనా. ఇది నిజమే అయినా సభికుల సంఖ్యకంటే మోదీ సభలో ఏమి చెబుతారన్నది ముఖ్యం. కశ్మీర్ ప్రజలకు ఎటువంటి సందేశం ఇస్తారు? పాకిస్తాన్ పాల కులకు ఏరకమైన సంకేతం పంపిస్తారు? ఈ రెండు సందేహాలకూ మోదీ ఇచ్చే సమాధా నాలపైనే ఆయన రాబోయే ఎన్నికల గురించి ఆలోచించే రాజకీయ నాయకుడుగా మిగిలి పోతారా లేక రాబోయే తరాల గురించి తలబోసే రాజనీతిజ్ఞుడవుతారా అన్న ప్రశ్నకు జవాబు దొరుకుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement