చరిత్రను మార్చిన ‘చాయ్‌వాలా’ | Narendra Modi changes history to became chaiwala | Sakshi
Sakshi News home page

చరిత్రను మార్చిన ‘చాయ్‌వాలా’

Published Sun, May 18 2014 1:25 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

చరిత్రను మార్చిన ‘చాయ్‌వాలా’ - Sakshi

చరిత్రను మార్చిన ‘చాయ్‌వాలా’

పారిశ్రామిక, వ్యాపార వర్గాల నుంచి పేదల వరకు అన్ని వర్గాల్లోనూ మోడీ ఆశలను రేకెత్తించారు. మోడీ తన జీవితమంతా ప్రతికూల పరిస్థితుల మధ్య సమస్యలను ఎదుర్కొంటూ విజయపథంలో సాగారు.

పారిశ్రామిక, వ్యాపార వర్గాల నుంచి పేదల వరకు అన్ని వర్గాల్లోనూ మోడీ ఆశలను రేకెత్తించారు. మోడీ తన జీవితమంతా ప్రతికూల పరిస్థితుల మధ్య సమస్యలను ఎదుర్కొంటూ విజయపథంలో సాగారు. ఇప్పుడు మాత్రం ఆయన సమస్యలను చూసి బెంబేలెత్తుతారని ఎందుకు అనుకోవాలి? విఫలమవుతారని ఎందుకు నిర్ధారించాలి?
 
 ‘విజయానికి ఎందరో తండ్రుల’నే నానుడికి కాల దోషం పట్టిపోయింది. స్వతంత్ర భారత రాజకీయ చరిత్రను కీలకమైన మలుపును తిప్పిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన ఘన విజయానికి కర్త, కర్మ, క్రియ ఒక్కరే... నరేంద్ర దామోదర మోడీ! దేశ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా లోక్‌సభలో పూర్తి ఆధిక్యతను కలిగిన మొట్ట మొదటి కాంగ్రెసేతర పార్టీగా బీజేపీ ఎదగడానికి కారణం రెండక్షరాలు! మో...డీ అనే రెండక్షరాలు గుజరాత్ తీరంలో చిరుగాలిగా మొదలై దేశవ్యాప్త పెను దుమారంగా మారి, చి వరికి జాతీయ రాజకీయ సునామీగా మారాయి. మోడీకి ప ర్యాయ పదంగా మారిన ‘నమో’ జపం చేసిన పార్టీలు తప్ప దాదాపు ఇతర పార్టీలన్నీ దాని తాకిడికి గురికాక తప్పలేదు.
 
 జాతీయ పార్టీలకు కాలం చెల్లిపోయిందని, ప్రాంతీయ పార్టీలు కింగ్ మేకర్లుగా, కింగ్స్‌గా మారే కాలం వచ్చేసిందనేది తిరుగులేని వాస్తవంగా చలామణి అవుతుండగా...  మోడీ సునామీ తిరిగి జాతీయ రాజకీయ పార్టీలకు పూర్వ ప్రాభవం సాధ్యమేనని రుజువు చేసింది. యూపీఏ, దానికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ లెక్కకు మించి చేస్తూ వచ్చిన అపరాధాల పరంపరతో దేశవ్యాప్తంగా పేరుకుంటున్న కాంగ్రెస్ వ్యతిరేకత పవనాలు గత ఏడాదిలోనే ప్రస్ఫుటమయ్యాయి. కేంద్రంలో అధికారం చేతులు మారక తప్పదని రూఢి అయింది. అయినాగానీ ఎన్‌డీఏ 330 స్థానాలను సాధించడం కాదుగదా... మ్యేజిక్ ఫిగర్ 272 స్థానాలను సాధిస్తుందని కూడా ఎవరూ ఊహించలేదు. అలాంటిది బీజేపీ సొంతంగా 282 స్థానాలను సాధిస్తుందని, ఎన్‌డీఏ బలం 334కు చేరుతుందని ఎవరు ఊహించగలరు? అందుకే  ఎన్‌డీఏకు 300కు పైగా స్థానాలను అంచనా కట్టిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అనుమానాస్పదంగా చూశారు. కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వాటికవే మోడీ సునామీగా మారలేదు. మోడీ మార్చారు. అదే నేటి మోడీ విజయగాథ.
 
 ఇంట గెలిచి...
 అవకాశాలను సద్వినియోగ పరచుకునేవాడినే విజయం వరిస్తుంది. 2002లో ‘అవకాశం’ మోడీ తలుపు తట్టింది. మోడీ రాజకీయ గురువు ఎల్‌కే అద్వానీ మోడీని గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా పంపారు. అస్తవ్యస్తంగా ఉన్న పార్టీకి, అసమర్థతకు నెలవైన ప్రభుత్వానికి నేతగా వరుస దుర్భిక్షాలు, భూకంప విధ్వంసాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యతలను స్వీకరించిన ఆయన... వరుసగా మూడు విజయాలను సాధించిపెడతారని ఎవరూ ఊహించలేదు. 2014 ఎన్నికల నాటికి గుజరాత్ రాష్ట్రాన్ని దేశ అభివృద్ధికి మార్గాన్ని చూపగల ఆర్థిక వృద్ధి నమూనాగా మారుస్తారని అంతకంటే ఊహించలేదు. అదే చేశారు. 8 శాతానికి పైగా వార్షిక వృద్ధితో దేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద అర్థిక శక్తిగా మార్చిన ఆర్థిక మాంత్రికుడు మన్మోహన్‌సింగ్ యూపీఏ ప్రధానిగా ఉండగా... గుజరాత్‌ను అభివృద్ధి నమానాగా చూపి ప్రశంసలందుకున్న ఖ్యాతి ఆయనదే. ఆ నమూనాపై విశ్వాసం ఉంచే అభివృద్ధిని ప్రధాన నినాదంగా చేసుకుని బీజేపీ బరిలోకి దిగాలని నిర్ణయించింది.  మోడీ రాజకీయ గురువు అద్వానీ సహా పలువురు సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నా నమో మంత్రం బీజేపీ శ్రేణుల్లో మోగింది. విజయానికి మారు పేరుగా మారింది. గత ఏడాది జూన్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గం... అద్వానీ సమావేశాన్ని బహిష్కరించినా లెక్క చేయక  మోడీని లోక్‌సభ ఎన్నికల ప్రచార సారథిని చేసింది. సెప్టెంబర్‌లో ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం ఇక లాంఛనమే అయింది.
 
 ఇంట గెలవలేని వాడు రచ్చగెలవలేడ ని మోడీకి తెలుసు. అద్వానీ, మురళీమనోహర్ జోషి, గడ్కారీ తదితర సీనియర్ నేతలతో మోడీ ఓర్పుతోనూ నేర్పుతోనూ వ్యవహరించారు. గడ్కారీని తనకు గట్టి మద్దతుదారుగా మలచుకోగలిగారు కూడా. సీనియర్లను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మీడియా, కాంగ్రెస్‌లు చేస్తున్న గోలలో అయన ఎక్కడా సంయమనం కోల్పోయి మాట్లాడలేదు. ఆధిపత్య ధోరణితో వ్యవహరించే నేతగా పేరున్న  మోడీ ఈ విషయంలో గొప్ప పరిణితిని చూపగలిగారు. ఆయన తన గురువు అద్వానీకి పంగనామాలు పెట్టారని వినిపించిన  విమర్శల్లో సహేతుకత కనబడదు. అద్వానీ పాకిస్థాన్‌కు వెళ్లి మరీ మొహ్మదాలీ జిన్నా లౌకికవాది అంటూ చేసిన వ్యాఖ్యలే ఆయనను ప్రధాని పదవికి అనర్హుణ్ని చేశాయి. కాబట్టే మోడీ పేరు తెరపైకి రాక ముందు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్ వంటి పేర్లు కూ డా చక్కర్లు కొట్టాయి. అద్వానీ తదితర సీనియర్లంతా మోడీలా ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వానికి విధేయులే.
 
 బీజేపీ విజయానికి హామీని ఇవ్వగల శక్తి సామర్థ్యాలు గల సీనియర్ నేతలు ఎవరూ లేనందునే సంఘ్ మోడీని ఎంచుకుంది. పైగా 2009లో బీజేపీ పరాజయానికి కారణం స్వయంకృతాపరాధాలు, నాయకత్వ లోపాలే తప్ప యూపీఏ అభివృద్ధి మంత్రం కాదనేది సంఘ్ అంచనా. అది చాలా వరకు నిజమే. ఆ ఎన్నికల్లో రాజస్థాన్‌లో పార్టీ అంతర్గత కలహాల వల్లే అధికారం కోల్పోయింది. అలాగే బీజేపీ దక్షిణాదిలో అధికారం దక్కించుకున్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలో యడ్యూరప్ప వ్యవహారం దాని పర్యవసానాలు ఎంత మాత్రం దానికి మింగుడు పడకపోవడం సహజమే.  ఇక మిగతా పలు రాష్టాల్లోనూ అదే తీరు. బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ దొందూ దొందేననే భావన ప్రజల్లో బలపడసాగింది. అలాంటి స్థితిలో దృఢమైన నాయకత్వాన్ని అందించగల వ్యక్తి నేతృత్వాన్ని శ్రేణులు కోరతాయి. అదే సంఘ్ చేసింది. మోడీ ఎంపిక సరైనదా కాదా అనే చర్చకు అవకాశమే లేకండా దిగ్భ్రాంతికరమైన ఫలితాలతో మోడీ తన విమర్శకులకు సమాధానం చెప్పారు. అదే మోడీ శైలి.
 
వాజ్‌పేయీతో పోలికలతో...
 ప్రధాని అభ్యర్థిత్వంపై జరిగిన రచ్చలో పదే పదే వాజ్‌పేయీ పేరు చర్చకు వచ్చింది. ఎన్‌డీఏకి ఉదారవాద స్వభావే ప్రధాని కాగలుగుతారనే వాదన రేగింది. ఎవరిపైనా ఆధారపడకుండా తన సొంత ఆర్థిక, రాజకీయ, సామాజిక ఎజెండాను అమలు చేయగల సత్తా ఇప్పుడు బీజేపీకి ఉంది.  గెలుపు ఖాయమేనని తేలినా జయలలిత, మమతల వంటి విమర్శకులకు ఆయన స్నేహ హస్తం చూపడం, ములాయం వంటి నేతలతో వ్యవహరించే తీరుకు భిన్నంగా వ్యవహరించడం మోడీలోని మనకు తెలియని మరో పార్శ్వాన్ని వెలుగులోకి తెచ్చింది. వాజ్‌పేయీ మిత్రపక్షాలను సంతృప్తి పరచగలిగారేగానీ ప్రత్యర్థులను మట్టిగరిపించే కటువుదనాన్ని, శత్రువులను మిత్రులుగా మార్చుకునే నైపుణ్యాన్ని చూపలేకపోయారు. అందుకే 2004లో కాంగ్రెస్‌కు అధికారాన్ని అప్పగించాల్సి వచ్చింది. ప్రధానిగా ప్రత్యేకించి విదేశాంగ విధానం విషయంలో మోడీని ఆయనతో పోల్చి చూసే అవకాశం ఉంది. పాకిస్థాన్, శ్రీలంక, చైనాలతో ఆయన ఎలా వ్యవహరిస్తారనేదానికి వాజ్‌పేయీ విదేశాంగ విధానమే కొలబద్ద కావచ్చు, బీజేపీ ఇప్పటికే వాజ్‌పేయీ విదేశాంగ విధానంలోని పలు అంశాలను స్వీకరించినట్టు తెలుస్తోంది. విదేశాంగ విధానంలో మోడీ వాజ్‌పేయీ చూపిన పరిణితిని, సంయమనాన్ని చూపలేరని అప్పుడే తీసిపారేయడం అర్థరహితం. ఎన్నికల ప్రచార సభలు విధాన ప్రకటనలకు వేదికలు కావు. ప్రభుత్వ విధానాలు అంతకంటే కావు. ఆ విషయం మోడీ విమర్శకుల కంటే మోడీకే ఎక్కువగా తెలుసు.
 
 జాతీయ పార్టీలపై ‘నమో’ ముద్ర
 మోడీ సైతం ఊహించారో లేదో గానీ ఆయన ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను రెంటినీ పెను మార్పులకు లోనయ్యేలా చేశారు. కాంగ్రెస్ చరిత్రలోనే మొదటిసారిగా 44 స్థానాలకు కుచించుకుపోయి, ప్రతిపక్ష నాయక హోదాను కోల్పోయే స్థితికి చేరింది. అంతకు మించి గాంధీ-నెహ్రూ వారసత్వ పాలనకు రోజులు చెల్లిపోయే స్థితి ఏర్పడింది. అది జరగకపోతే కాంగ్రెస్ పార్టీయే ఒక చిన్న ప్రాంతీయ పార్టీ స్థాయికి కుచించుకోపోయే దుస్థితి నెలకొంది. అందుకేనేమో పలువురు విశ్లేషకులు ఈ ఓటమిని 1977లో ఇందిరాగాంధీ ఓటమి కంటే తీవ్రమైనదిగా పేర్కొంటున్నారు.
 
 మూడేళ్లు తిరక్కుండానే నాడు కాంగ్రెస్ తిరిగి అధికారం దక్కించుకోడానికి కారణం ఇందిర! సోనియా, రాహుల్‌గాంధీలకు ఆ సత్తా లేదని తేలిపోయింది. ప్రియాంక ఆ స్థాయిని అందుకోగలరనడం ఆత్యాశ . కాంగ్రెస్ అస్తిత్వమే ప్రమాదంలో పడింది. మరో వంక బీజేపీని మోడీ మొట్ట మొదటి సారిగా దక్షిణాదికి,  తూర్పు, ఈశాన్య ప్రాంతాలకు విస్తరింపజేయగలిగారు. ఉత్తరాది పార్టీగా ఉన్న పేరును చెరిపివేయడానికి మంచి అవకాశం కల్పిం చారు. బీజేపీపై ఉన్న అగ్రకులాల పార్టీ ముద్రను చెరిపేశారు. ప్రచారంలో మోడీ పదే పదే తనను ఓబీసీగా చెప్పుకున్నారు. ఆయన ఐదేళ్లు అధికారంలో ఉంటారనడం నిస్సందేహం. మరో ఐదేళ్లు ఉండరనడం నిరాధారం.
 
 పరిచి ఉన్న ముళ్ల బాట...
 పారిశ్రామిక, వ్యాపార వర్గాల నుంచి గ్రామీణ, పట్టణ పేదల వరకు అన్ని వర్గాల్లోనూ మోడీ ఆశలను రేకెత్తించారు. 5 శాతానికి లోబడిన వృద్ధి రేట్లతో, నిరాశామయమైన పారిశ్రామిక వృద్ధితో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది.  ధరల పెరుగుదల సమస్యను తక్షణమే ఆయన పరిష్కరించాలని ప్రజలు భావిస్తారు. పైగా తక్షణమే లక్షల్లో ఉద్యోగాలను సృష్టించి నిరుద్యోగులను సంతృప్తి పరచాలి. పారిశ్రామిక వ్యాపార వర్గాలు సబ్సిడీల బిల్లును తగ్గించి ప్రభుత్వ వ్యయాలను అదుపులో పెట్టి ప్రోత్సాహకాలను అందించాలని, కార్మిక చట్టాలను సడలించాలని కోరుతున్నాయి. సేవారంగంలో ప్రత్యేకించి ఐటీ, బీపీఓ రంగాల్లో ఉద్యోగావకాశాలు సన్నగిల్లడం మధ్యతరగతి విద్యావంతుల్లో సైతం ఆందోళనను రేకెత్తిస్తోంది.
 
 మరోవంక అవినీతిని మోడీ యూపీఏపై ప్రధాన అస్త్రంగా సంధించారు. కోట్లకు కోట్లు ఖర్చు పెడితే తప్ప లోక్‌సభకు ఎన్నిక కాలేని స్థితి నెలకొంది. బీజేపీ అందుకు అతీతం కాదు. మన్మోహన్ నిష్కళంక చరితుడు కావడం ఆయన ప్రభుత్వంలోని అవినీతికి సమాధానం కాలేదు. మోడీ విషయంలోనైనా అది అంతే. అవినీతి సమస్యపై పార్టీలోనూ ప్రభుత్వంలోనూ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది.  అన్నిటికి మించి మతతత్వవాదిగా తనపై ఉన్న ముద్రను వదుల్చుకోడానికి ఆయన ఉద్దేశ పూర్వకమైన కృషిని చేయాల్సి ఉంటుంది. మోడీ జీవితమంతా సమస్యలను ఎదుర్కొని, ప్రతికూల పరిస్థితుల మధ్య సాగిన చరిత్రే. ఇప్పుడు మాత్రం ఆయన సమస్యలను చూసి బెంబేలెత్తుతారని ఎందుకు అనుకోవాలి? విఫలమవుతారని ఎందుకు నిర్ధారించాలి?   -  ఎస్. కమలాకర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement