మార్పు తప్పదు కానీ... మారింది వాళ్లా మనమా? | Narendra modi to change his attitude for caused | Sakshi
Sakshi News home page

మార్పు తప్పదు కానీ... మారింది వాళ్లా మనమా?

Published Sun, Jul 12 2015 12:47 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

మార్పు తప్పదు కానీ... మారింది వాళ్లా మనమా? - Sakshi

మార్పు తప్పదు కానీ... మారింది వాళ్లా మనమా?

మధ్య ఆసియా ప్రాంత సహజ వనరులను ఉపయోగించుకోవడంలో ఎలాంటి వ్యవహారాన్ని కుదుర్చుకోవాలనుకున్నా సరే, అది పాకిస్తాన్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని మోదీకి తెలిసి వచ్చింది. ఆ దేశాలతో మనం మంచి, బలమైన సంబంధాలను కోరుకుంటున్నట్లయితే, పాకిస్తాన్‌తో సత్సంబంధాలను ఏర్పర్చుకోవడం దీనికి ముందు షరతు. పాక్ పట్ల మోదీ వైఖరిలో మార్పుకు ఇదే కారణం.  
 
 పాకిస్తాన్‌ను సందర్శిస్తానని ప్రకటించడంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రదర్శిం చిన సాహస చర్యకుగాను ఆయనను తప్పక అభినందించాలి. కేవలం భౌతిక పరమైన సాహస చర్య అనే దృక్కోణంలోంచి మాత్రమే నేనిలా చెప్పటం లేదు. పాకిస్తాన్‌ను నేను అనేకసార్లు సందర్శించి ఉన్నాను కానీ ఎన్నడూ నాకు అక్కడ అభద్రతా భావం స్ఫురించలేదు. అక్కడ తనకూ అత్యున్నత ప్రమాణాలతో కూడిన భద్రతను ఇస్తారని మోదీ గ్రహిస్తారు. ఇది స్పష్టం కూడా. అయితే పాకి స్తాన్‌లో అత్యంత భద్రతాచ్ఛాయలో ఉన్న నాటి అధ్యక్షుడు పెర్వేజ్ ముషారఫ్ కాన్వాయ్ కూడా రెండుసార్లు బాంబుదాడికి గురయింది. పైగా పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో బహిరంగ సభలోనే హత్యకు గురై చాలా కాలం కాలేదు. అందుకే, క్రికెట్ టీమ్‌లు కూడా వెళ్లడానికి తిరస్కరిస్తున్న చోటికి వెళ్లడా నికి అంగీకరించిన మోదీని సాహసి అనే చెప్పాలి.
 
 మోదీ సాహస ప్రవృత్తికి రెండో ఉదాహరణ కూడా ఉంది. పాకిస్తాన్‌ను సందర్శించాలని నిర్ణయించుకున్న సందర్భంగా ఆయన మన మీడియాలో చాలా మంది హెచ్చరికలను తిరస్కరించారు. అదే సమయంలో మన వ్యూహాత్మక వ్యవ హారాల నిపుణుల అభిప్రాయాలనూ తోసిపుచ్చారు. అంతకంటే ముఖ్యమైన దేమిటంటే, పాకిస్తాన్‌తో కఠినంగా వ్యవహరించాలని ఒత్తిడి చేసిన భారతీయ జనతాపార్టీ మద్దతుదారులను కూడా ఆయన పక్కన పెట్టారు.
 చాలాకాలంగా నవాజ్ షరీఫ్‌ను తక్కువగా చూడటంలో మోదీ సఫలీకృతు లవుతూ వస్తున్నారు. తానెలా చెబితే అలా చేసేలా పాకిస్తాన్‌ను లొంగదీసుకు న్నట్లు భారత్ గత సంవత్సర కాలంగా చెప్పుకుంటూ వస్తోంది.
 
 పాకిస్తాన్ హై కమిషనర్‌ను హురియత్ కలవడం వంటి అప్రాధాన్య అంశం వ్యవహారంలో భారత్ రుసరుసలాడటానికి ఇదే కారణం. అధీన రేఖ పొడవునా నిరంతరం కాల్పులు జరుగుతుండటం వంటి  ఇతర వ్యవహారాలకు వస్తే, పాకిస్తాన్‌ను అధిగ మించడానికి తగినంత సైనిక సామర్థ్యం భారత్‌కు ఉందన్న ధీమాను బీజేపీ నిల బెట్టుకోలేకపోతున్న విషయమూ స్పష్టమే. మనం పాకిస్తాన్‌పై ఆధిక్యత ప్రదర్శిం చలేకపోయాం. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ పట్ల భారత్ తన వైఖరిని మార్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. నేను ముందే చెప్పినట్లు మోదీ ఇక్కడే నిర్ణయాత్మకంగా వ్యవహరించారు. పాకిస్తాన్‌ను శాశ్వత శత్రువుగా భావి స్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నుంచి వచ్చిన వ్యక్తి పాకిస్తాన్‌ను సంద ర్శించడం అనేదే ఒక అసాధారణ విషయం.
 
 ప్రస్తుతం బీజేపీ జాతీయ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా మునుపటి బాస్ ఎంజే అక్బర్.. మోదీ తీసుకున్న యూటర్న్‌పై వ్యాఖ్యానించడానికి తెగ సాహసం ప్రదర్శించారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఎదుర్కోవడంపై పాకిస్తాన్ తొలిసా రిగా తన ఆమోదాన్ని తెలిపిందని ఆయన పేర్కొన్నారు. ఇదొక అబద్ధం. పాకి స్తాన్ ఈ అంశంపై చేసిన వాస్తవ సూత్రీకరణ ఏదంటే 2001 సెప్టెంబర్ 9న (9/11) అమెరికాలో అల్‌ఖైదా దాడులు జరిగినప్పటినుంచి ఉగ్రవాదాన్ని ‘దాని అన్ని రూపాల్లో’ తిరస్కరిస్తున్నట్లు మాత్రమే ఆ దేశం పేర్కొంటూ వచ్చింది. నిజా నికి కశ్మీర్‌లో భారత ప్రభుత్వ ఉగ్రవాదాన్ని కూడా ఈ ‘ఉగ్రవాదపు అన్ని రూపాలు’ పదబంధంలో పొందుపర్చి పాకిస్తాన్ ఉపయోగిస్తూ వచ్చింది. దాన్ని ఇప్పుడు బీజేపీ తన విజయంగా పేర్కొనడం కేవలం కపటత్వమే కాగలదు.
 
 అసలు వాస్తవం ఏమిటంటే మోదీ ఈ వారం మధ్య ఆసియా ప్రాంతంలో పర్యటించారు. గ్యాస్‌తో సహా ఆ దేశాల సహజ వనరులను ఉపయోగించుకునే విషయంలో ఎలాంటి వ్యవహారాన్ని కుదుర్చుకోవాలనుకున్నా సరే, అది పాకి స్తాన్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని మోదీకి తొలిసారిగా తెలిసి వచ్చింది. మధ్య ఆసియా తనకు తానుగా స్థాన చలనం పొంది అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ మీదుగా తనకోసం ఎగిరి వస్తుందని భారత్ భావించలేదు. తుర్క్‌మెనిస్తాన్, తజ కిస్తాన్, ఉబ్జెకిస్తాన్, కజకిస్తాన్ దేశాలతో మనం మంచి, బలమైన సంబంధాలను కోరుకుంటున్నట్లయితే, పాకిస్తాన్‌తో మంచి, సత్సంబంధాలను ఏర్పర్చుకున్న తర్వాతే అందుకు పూనుకోగలం.
 
 భౌగోళిక పరిధులను మనం ఎన్నటికీ అధిగమించలేము. బీజేపీ నేత, అటల్ బిహారీ వాజ్‌పేయి తరచుగా ఎంతో వివేకంతో దీన్ని ప్రస్తావించేవారు. ఆయన అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. అయితే నేనిప్పుడు ఈ విషయంపై బాకా ఊదడం లేదు. కానీ,  పాకిస్తాన్ పట్ల వైఖరిని గత నవంబర్‌లోనే మోదీ మార్చుకున్న సందర్భంగా నేను ఇలా రాశాను.
 
 ‘‘నా అభిప్రాయం ప్రకారం తన చర్యల పర్యవసానం గురించి పెద్దగా ఆలోచించకుండానే పాకిస్తాన్‌తో తన సంప్రదింపులను మోదీ రద్దు చేసుకున్నారు. పాకిస్తాన్ గురించి ఆయన గట్టిగానే మాట్లాడారు కానీ, ఈ వారం మాత్రం (అంటే గత నవంబర్‌లో) తన శత్రువైన నవాజ్ షరీఫ్‌తో తప్పనిసరై మోదీ చేతులు కలపాల్సి వచ్చింది. మోదీ గత్యంతరం లేని పరిస్థితుల్లో అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఇది తప్పనిసరి. ఇది వినా మరొక మార్గం లేదు. కొందరు ఊహిస్తున్నట్లు మోదీ విధానం ఇక్కడా లేదు అక్కడా లేదు. అది కేవలం అంగ విన్యాసం మాత్రమే. ఇలాంటి వైఖరిని భరించడమనేది ఆచరణ సాధ్యం కాని సందర్భంలో కఠినంగానూ, పెడసరం గానూ వ్యవహరించడం భారతీయులకు తెచ్చిపెట్టే ప్రయోజనం ఏమిటో మరి?’’
 
 బీజేపీలోకానీ, మీడియాలోని దాని బలమైన మద్దతుదారులలో కాని ఏ ఒక్కరూ దీన్ని వివరించలేరు. సరిహద్దులలో మన పౌరులను పాక్ సైన్యం చంపుతున్న దానికంటే ఎక్కువగా పాక్ పౌరులను హతమార్చడం ద్వారా పాకి స్తాన్‌కు గుణపాఠం చెప్పానని నాటి రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దీన్ని గుణపాఠమనే చెబుదామా? పలువురు భారతీయులు దీంతో ఏకీభవించక పోవచ్చు. అలా చేస్తే సరిహద్దుల్లో కాల్పులు శాశ్వతంగా ఆగిపోతాయని జైట్లీ ఏద యినా హామీ ఇవ్వగలరా? ఇలా కుదరనట్లయితే, పరిణామాలు తీవ్రస్థాయికి చేరినప్పుడు వాటిని చల్లబర్చేలా వ్యవహరించకుండా పాకిస్తాన్‌తో సంభాషణలు జరపకుండా ఉండటంలో అర్థం ఏమిటి?
 
 కఠినంగా వ్యవహరించాలనే ఆలోచనా విధానం తనకు తానుగా చేసిన ప్రతి పాదనలు ఏవీ లేవు. గత 20 ఏళ్లుగా ఇది పదే పదే స్పష్టమవుతూ వచ్చింది. వాస్త వాలు దీన్ని నిరూపిస్తాయి. ఉపఖండాన్ని ఒక అణు యుద్ధరంగంగా బీజేపీ రూపొందించింది నిజమే.. అంతమాత్రాన, పాకిస్తాన్‌పై తన కండబలం ప్రదర్శిం చేటంత బలమైన స్థితిలో భారత్ లేదు. కశ్మీర్‌పై అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని అది తిరస్కరిస్తోంది. పైగా.. ఈ సమయంలో కూడా భారత్, పాక్‌తో మాట్లా డటం లేదు. ఈ పరిస్థితి మారుతుంది. చివరకు.. భారత్, దాని కాఠిన్యపు బృం దమే లోబడవలసి వస్తుంది.
 
 ఎంజే అక్బర్  సాహసోపేతమైన, నిరర్థక ప్రసంగాలను పక్కనబెట్టి చూస్తే బీజేపీ ఇప్పటికే కాస్త తగ్గింది. దీంట్లో ఏ తప్పూ లేదు. పాకిస్తాన్ ఏ ఒక్క విషయం లోనూ మారలేదు. మారిందల్లా బీజేపీ, దాని దాపరికంలేని మద్దతుదారులే. వాస్తవంగా చూస్తే ఇది మంచి విషయం కూడా.
 (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత)
 - ఆకార్ పటేల్
 aakar.patel@icloud.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement