దబాయింపే దిద్దుబాటా?
బైలైన్
సూటిగా ఉన్న ఆ అవినీతి ఆరోపణపై దబాయింపు మాటలతో పార్లమెంటును స్తంభింపజేసిన మొదటి రోజునే కాంగ్రెస్ తాను ఏకాకినైపోతానని గుర్తించి ఉండాల్సింది. ఏ ఒక్క ప్రతిపక్షమూ దానికి మద్దతుగా రాలేదు.
రాజకీయ చర్చ వెర్రిగా దిగజారే రోజు మనం అను కుంటున్నంత కంటే ఇంకా ముందే వచ్చేట్టుంది. అయితే, ఒక పార్టీ స్వీయ రక్షణ కోసమో లేక ప్రత్యర్థిపై దాడి కోసమో ఇచ్చే వివరణలు మరీ విపరీతంగా సాగేట్టయితే, దాన్ని కోర్టు ధిక్కారంగా కాదు ప్రజాధిక్కారంగా పరిగణిస్తారు.
ఈ ఉదయం (గత శనివారం) ‘టైమ్స్ ఆఫ్ ఇండియా' మొదటి పేజీలో ఒక అసాధారణ కథనాన్ని ప్రచురించింది. పార్లమెంటు ఉభయ సభలను నాలుగు రోజులపాటూ కాంగ్రెస్ నిరంతరాయంగా విచ్ఛిన్నం చేయడానికి కారణం... సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను విచారణకు హాజరు కావాలని కోర్టులు సమన్లు పంపినందుకు కాదని ఇద్దరు ప్రముఖ కాంగ్రెస్ నేతలు పేర్కొనడాన్ని అది ఉల్లేఖించింది. ప్రస్తుతం వారి అధీనంలో ఉన్న ‘నేషనల్ హెరాల్డ్'పత్రిక ఆస్తుల విలువ రూ.2,000 కోట్లు కాగా, దాన్ని కేవలం రూ.50 లక్షలుగా వక్రీకరించారనే ఆరోపణలపై ఆ సమన్లు జారీ అయ్యాయి. ఆ సమస్యపై గాక, పాత కారణాల రీత్యానే అరుపులు, కేకలతో కాంగ్రెస్ ఎంపీలు ఉభయ సభలను స్తంభింపజేయడానికి అనుమతినిచ్చారని ఆ నేతలు తెలిపారు.
ఆ నేతలకు పట్టబోయే దుర్గతి దృష్ట్యా నేను వారి పేర్లను ఇవ్వడం లేదు. వారు మాట్లాడుతున్నది రాజ ప్రాసాదం నుంచి వచ్చిన ఆదేశాల గురించి. ‘నేషనల్ హెరాల్డ్'కేసు విచారించదగినదిగా భావించి న్యాయ మూర్తి ప్రధాన నిందితులకు సమన్లు జారీ చేయడానికి ముందే పార్లమెంటుకు ఈ ఆదేశాలు అందాయని అందరిలాగే వారికీ తెలుసు. వాస్తవానికి రాజ్యసభలో నేపాల్పై అద్భుతమైన చర్చ జరిగింది. సభ ఎలా జరగాలో అలా జరిగిన పాత రోజులను అది జ్ఞప్తికి తెచ్చింది కూడా. ప్రతిపక్షం తన శక్తినంతటినీ సమీకరించి మరీ ప్రశ్నలను సంధించింది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రతి అంశానికి సమాధానం చెప్పి, ఆ కీలక సమస్యపై మన వైఖరికి సంబంధించి ఎలాంటి అనుమానాలు లేకుండా చేశారు. పార్లమెంటు ఉన్నది ఇందుకే. ఆచరణలో పెట్టాల్సిన ప్రజాస్వామ్యం ఇదే. కాంగ్రెస్ ఆ చర్చలో పాల్గొంది.
గోవా వార్తా పత్రికల పతాక శీర్షిక ‘‘నేషనల్ హెరాల్డ్: నాలుగో రోజున కూడా రాజ్యసభను స్తంభింపజేసిన కాంగ్రెస్’’. తమ పార్టీ ప్రధాన సమస్య ఆ పత్రిక కేసేనని పదే పదే స్పష్టం చేసినది మరెవరో కాదు, రాహుల్ గాంధీ. ప్రభుత్వం ‘‘100% కక్ష సాధింపు’'రాజకీయాలకు పాల్పడుతోందంటూ ఆయన పదే పదే గాలిలోకి కత్తి ఝులిపించారు. ప్రతిసారీ ఆయన అజరామరమైన ఆ పదబంధాన్ని ప్రయోగించారు.
సహజంగానే ఆయన అదెలాగో వివరించే శ్రమ తీసుకోలేదు. ఎందుకంటే దానికి ఎలాంటి వివరణా లేనే లేదు కాబట్టి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బ్లాగులోనూ, ఒక పత్రికా సమావేశంలోనూ తెలిపిన ట్టుగా ప్రభుత్వం ఆ కేసులో ఎవరికీ, ఏ ఒక్క నోటీసును పంపలేదు. డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి ప్రైవేటు ఫిర్యాదు విచారణా యోగ్యమైనదిగా కోర్టు భావించింది. ఆ క్రమంలో అది కొన్ని సునిశిత వ్యాఖ్యలు చేసిన మాట నిజమే. సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదులపై కోర్టులు ఎప్పుడూ అంత శక్తివంతంగా స్పందించలేదనే విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. ప్రతి కేసు విషయంలోనూ అవి వాటి యోగ్యతలను బట్టే వ్యవహరిస్తుంటాయి. అవి చేయాల్సింది కూడా అదే. రాహుల్ పదేపదే ఆ మాట అన్నారంటే, కోర్టులు పక్షపాత పూరితమైనవని ఆయన అంతరార్థం కావాలి. అంటే ఆయన మన న్యాయ వ్యవస్థనే సవాలు చేస్తున్నారు.
సూటిగా ఉన్న ఆ అవినీతి ఆరోపణపై దబాయింపు మాటలతో పార్లమెంటును స్తంభింపజేసిన మొదటి రోజునే కాంగ్రెస్ తాను ఏకాకినైపోతానని గుర్తించి ఉండాల్సింది. ఏ ఒక్క ప్రతిపక్షమూ దానికి మద్దతుగా రాలేదు. బిహార్ మిత్రులు జేడీ(యూ), ఆర్జేడీలు సైతం దూరంగా నిలిచాయి. రానున్న బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో వామపక్షాలతో జతకట్టకుండా ఉండేలా కాంగ్రెస్ను మెప్పించాలనే ఆశతో తృణమూల్ కాం గ్రెస్ చెవులు రిక్కించి, తలదించుకుని ఉండిపో యింది. అంతే తప్ప, స్పష్టంగానే కనిపిస్తున్న లేదా ఆరోపిస్తున్న అవినీతి విషయంలో దానికి మద్దతుగా నిలిచే వారు ఎవరూ కనిపించలేదు.
ప్రజా నాడిని పసిగట్టినప్పుడు మాత్రమే రాజ కీయ పార్టీలు విజయాలు సాధిస్తాయి. కాంగ్రెస్ వాదనను ఆమోదించేవారు ఎవరూ లేరని ప్రజలు గుర్తించారు. వంశపారంపర్య విధేయతకు బందీగా ఉన్నం దున, ఈ విషయాన్ని గ్రహించడానికి కాంగ్రెస్కు ఎక్కువ సమయం పట్టింది. ప్రముఖ నానుడి చెప్పే ట్టు, రాజకీయాల్లో వారం అంటే సుదీర్ఘ కాలం. ఈ వారం కాలంలో కాంగ్రెస్ జాతీయ చర్చను తిరిగి అత్యున్నత స్థాయిలోని అవినీతిపైకి, ఒక కుటుంబం ఇష్టాయిష్టాలకు, అవసరాలకు అనుగుణంగా ఒక జాతీయ పార్టీని ధ్వంసం చేయడంపైకి మరల్చింది.
పార్లమెంటు తిరిగి మొదలయ్యాక కాంగ్రెస్ ఎలా ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలియదు. ఈసారి ఇంకా పాత సమస్యలపై పార్లమెంటు విచ్ఛి న్నాన్ని కొనసాగించాలని కరడుగట్టిన గాంధీ కుటుంబ విధేయులు వాదించే అవకాశం ఉంది. అయితే ‘ఎలీస్ ఇన్ ద వండర్ లాండ్'రాజకీయాల కాలం గతించిపో యింది. ఆ అద్భుతమైన ఆ కాల్పనిక నవలలో ఎలీస్ అనే బాలిక పదాలను మనం కోరుకున్న అర్థాన్నిచ్చే విగా చేయగలుగుతుంది. అలా మీరు ఇప్పుడు చేయ లేరు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయమే అతిశక్తివం తమైన న్యాయస్థానం అయ్యేట్టయితే కాంగ్రెస్ వాదన ఇప్పటికే వీగిపోయింది. రాజకీయ వర్గం చేతుల్లో ఉంచడం కంటే న్యాయవ్యవస్థకు వదిలేయడమే ఉత్త మమైన సమస్యపై రచ్చజేసి కాంగ్రెస్.. పేదలకు, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వేతన జీవులకు ఉపయోగ పడే ముఖ్యమైన బిల్లులకు వెన్నుపోటు పొడిచిందని ఓటర్లకు తెలిసిపోయింది. దబాయింపు దిద్దుబాటు బాట కాదు.
వ్యాసకర్త, పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి, సీనియర్ సంపాదకులు: ఎం.జె. అక్బర్