ప్రత్యేక హోదాయే ప్రాణవాయువు | Oxygen to special status for Andhra pradesh state | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదాయే ప్రాణవాయువు

Published Mon, Oct 19 2015 12:32 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ప్రత్యేక హోదాయే ప్రాణవాయువు - Sakshi

ప్రత్యేక హోదాయే ప్రాణవాయువు

రాష్ట్రాల విభజన సమయంలో ఆర్థిక, భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతోంది. ప్రత్యేక హోదాను కలిగిన రాష్ట్రాలన్నింటికీ ఒకే గీటురాయి కానీ, కొలబద్ద కానీ లేదు. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క అంశానికో లేక మరికొన్ని అంశాలకో లోబడి ప్రత్యేక హోదా పొంది ఉండవచ్చు. అయితే ప్రత్యేక హోదా కల్పించినంత మాత్రానే సకలం సమున్నతం కాకపోవచ్చు. అయితే ఆ హోదా ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడానికి చేయూతనిస్తుంది.
 
 ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై చర్చల సందర్భంలో అనేక అంశాలను అటు పాలకపక్ష సభ్యులు, ఇటు ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. బిల్లులో పొందుపర్చని అంశం ప్రత్యేక హోదా. అందువల్ల దాన్ని హామీ రూపంలో నాటి  ప్రధాని పార్లమెంటులో ప్రకటించారు (20-2-2014). ఆ మేరకు 2014 మార్చి ఒకటవ  తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మా నించారు. నిర్ణయాన్ని అమలు చేయాలని  ప్రణాళికా సంఘాన్ని ఆదేశించారు.

నాటి ప్రతిపక్ష పార్టీ, నేటి పాలకపక్షమైన బి.జె.పి.లో సీనియర్ నేత వెంకయ్య నాయుడు వంటివారు కూడా దీన్ని స్వాగతించి, ఒక అడుగు ముందుకేసి పదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని, రెవెన్యూ లోటును భర్తీ చేయాలనీ, నూతన రాజధానికి సహాయం చేయాలని, పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలనీ, జాతీయ విద్యాలయాలను నెలకొల్పాలని, ప్రత్యేక రైల్వే జోన్‌ను ఏర్పాటు  చేయాలనే డిమాండ్ చేశారు. అలాగే రాజ్యసభలో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, బి.జె.పి సీనియర్ నేత, నేటి కేంద్ర ప్రభుత్వం లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సైతం వెంకయ్య నాయుడి డిమాండ్లకు మద్దతు పలుకుతూ, ఆదాయం రీత్యా నష్టపోతున్న సీమాంధ్రకు పరిపూర్ణ న్యాయం చేయాలని, అవసరమైతే చట్టాన్ని కూడా సవరించాలని డిమాండ్ చేశారు.
 
 ఢిల్లీలో మౌనమేల?
 తర్వాత బీజేపీ నేతలు తమ ఎన్నికల ప్రణాళికల్లో ఆ విషయాలను ్రపస్తావించి జనానికి ఎనలేని ఆశలను కలిగించారు. ప్రస్తుత ప్రధాని మోదీ, ఆనాటి ఎన్ని కల ప్రచారంలో ఈ విషయాన్ని ప్రస్తావించి, పార్లమెంటులో నాటి ప్రభుత్వం చేసిన వాగ్దానాలన్నిటికీ కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం బీజేపీ నేతలు ఆంధ్రలో అరుస్తున్నారు. కేంద్రంలో మౌనం పాటిస్తున్నారు. ‘‘ఏ రాష్ట్రానికీ చేయనంత సాయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు అందిం చామని’’ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామాత్యులు వెంకయ్య నాయుడు అంటు న్నారు. ఏ.ిపీకీ హోదా కంటే... రావాల్సిన ప్రాజెక్టులు ముఖ్యమని, ప్రత్యేక హోదాపై అనవసర రాజకీయాలను చేసి అడ్డంకులు సృష్టించవద్దని’’ ఆయన హితవు పలుకుతున్నారు. ఒకవైపున రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందం టూనే, ప్రత్యేక హోదా వద్దంటున్నారు, ప్రాజెక్టులు చాలంటున్నారు.
 
 ఈ క్రమంలోనే, పార్లమెంటులో ఒక సభ్యుడు ఏప్రిల్ 24, 2015న  లేవ నెత్తిన ప్రశ్నకు కేంద్ర ప్రణాళికా మంత్రి జవాబు చెప్తూ, ఆంధ్రకు ప్రత్యేక హోదా దాదాపుగా లేనట్లేనని ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం ఆంధ్ర ప్రదేశ్‌తోపాటుగా తెలంగాణా, ఒడిశా, రాజస్థాన్, బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా విజ్ఞప్తులు వచ్చాయని ఆయన చెప్పారు. అంటే, మిగతా రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయి కాబట్టి ప్రత్యేక హోదా అసాధ్యమన్నట్లు సూటిగా చెప్పకపోయినా, ఆ అర్ధంలోనే జవాబు చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని గతంలో జాతీయ అభివృద్ధి మండలి పలు రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కల్పించిందని మంత్రి చెప్పారు.
 
 అయితే రాష్ట్రాల విభజన జరిగినప్పుడు ఆర్థిక, భౌగోళిక, సామాజిక, సాంస్కృతికాంశాలతో పాటుగా రాజకీయ అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని మన దేశంలోని పలు రాష్ట్రాల ఏర్పాటులో మనం చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ విభజన కూడా ఆ అంశాలకు అతీతమైంది కాదు. ప్రత్యేక హోదాను కలిగిన రాష్ట్రాలు అన్నింటికీ ఒకే గీటురాయి కానీ, కొలబద్ద కానీ లేదు. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క అంశానికో లేక మరికొన్ని అంశాలకో లోబడి ప్రత్యేక హోదా పొంది ఉండవచ్చు.
 
 మిగతా రాష్ట్రాలతో పోటీ పెట్టడం దేనికి?
 రాజ్యాంగంలోని అనేక ఆర్టికల్స్ రాష్ట్రాలకు గ్రాంట్లను మంజూరు చేయడానికి అవకాశాన్ని కలిగిస్తున్నాయి. ఉదాహరణకు ఆర్టికల్స్ 258, 275. వీటి క్రింద కొన్ని రాష్ట్రాలకు అదనపు గ్రాంట్లు మంజూరు చేయవచ్చు.  ఆర్టికల్ 280, 281, 282 క్రింద కూడా ఆర్థిక సంఘం ద్వారా గ్రాంట్లు మంజూరు చేయ వచ్చు. అయినప్పటికీ ఆర్టికల్ 370 క్రింద అనేక రాష్ట్రాలకు ప్రత్యేక సెక్షన్‌లను వర్తింపచేశారు. ప్రత్యేక గ్రాంట్లకు జాతీయాభివృద్ధి మండలి ద్వారా గానీ, ప్రణాళికా సంఘం ద్వారా గానీ హోదాను కల్పించారు. ఆ విధంగా చూసినప్పుడు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌కూ వర్తిస్తాయి. మిగిలిన రాష్ట్రాలను ఏపీకి పోటీపెట్టడం, సరిపోల్చడం పాలకులకు తగదు.
 
 ప్రత్యేక హోదాతో కలిగే లాభాలు....
 ప్రస్తుతం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు : 1. అరుణాచల్‌ప్రదేశ్, 2. అస్సాం, 3. హిమాచల్‌ప్రదేశ్, 4. జమ్మూ- కశ్మీర్, 5. మణిపూర్, 6.మేఘాలయ, 7. మిజోరం, 8. నాగాలాండ్, 9. సిక్కిం, 10. త్రిపుర, 11. ఉత్తరాఖండ్. ఈ 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వల్ల కలుగుతున్న ప్రయోజనాలు ఏమిటంటే..
 
 1) సాధారణ కేంద్ర సహాయం: దీనిలో అధిక భాగం ప్రత్యేక హోదా కలి గిన 11 రాష్ట్రాలకు అందుతుంది. ఉదా: 2011-12 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 56శాతం నిధులు ఈ రాష్ట్రాలకు అందాయి. మిగతా 17 రాష్ట్రాలకు కేవలం 44శాతం అందాయి. 2) అదనపు కేంద్ర సహాయం: విదేశాల నుంచి వచ్చే నిధుల ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రాజెక్టులకు ఇచ్చే నిధులలో సుమారుగా 90 శాతం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు గ్రాంటుగా ఇస్తే, ఇతర రాష్ట్రాలకు అప్పుగా ఇస్తారు. అనగా గ్రాంట్లు తిరిగి చెల్లించనవసరం లేదు.
 
 రుణం తిరిగి వడ్డీతో సహా చెల్లించాలి. 3) ప్రత్యేక కేంద్ర సహాయం: ఇది ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు సింహభాగం దక్కుతుంది. 4) కేంద్ర ప్రాయోజిత పథకాలు: ఈ విధమైన పథకాలలో రాష్ట్రాలు భరించవలసిన భాగంలో వ్యత్యాసముంటుంది. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు భరించేది చాలా తక్కువగా, సుమారుగా 10శాతానికి మించదు. మిగతా 90శాతం కేంద్రం భరించవచ్చు. 5) కేంద్ర పన్నుల్లో రాయితీలు: ఎక్సైజ్ పన్నులు, ఆదాయం పన్నుల్లాంటి వాటిలో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపులివ్వవచ్చు. కొత్తగా పరిశ్రమలు స్థాపించడానికి, పెట్టుబడిదారులను ఆకర్షించడానికి, ఇతర ప్రాంతాల నుంచి పరిశ్రమలు తరలించడానికి ఈ పథకం తోడ్పడుతుంది.
 
 హోదాతో స్వర్గం దిగిరాదు కానీ....
 రాష్ట్ర విభజన పర్యవసానంగా ఆంధ్ర ప్రాంతం రాజధానిని కోల్పోయింది. రాజధాని లేకుండా పాలనా యంత్రాంగం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇది తక్షణావశ్యకత. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు అవసరమవుతాయని ఆర్థికవేత్తల, పాలనాదక్షుల అభిప్రాయం. ఆధునిక హంగులతో రాజధాని నిర్మాణం జరగాలి. ఆంధ్ర ప్రాంతం నలుమూలలకు రాజధాని రాస్తాలు ఏర్పడాలి. దేశంలోని ఇతర ప్రాంతాలతోనూ అనుసంధానించాలి. అందుకు అవసరమైన వనరులను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సమకూర్చుకోలేదు. దశలవారీగా , త్వరితగతిన సాయానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. సహాయక గ్రాంట్లు మంజూరు చేయాలి. కేవలం ఆర్థిక సంఘాల ద్వారా ఆ పని జరగదు. అందువల్ల ప్రత్యేక హోదా కావాలి.
 
విభజన పూర్వం, తర్వాత కూడా ఆంధ్రదేశంలో అభివృద్ధి చెప్పుకోదగిం దిగా లేదు. పారిశ్రామిక రంగం పతనమైంది. లక్షల సంఖ్యలో నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. చిన్న పరిశ్రమలు చితికిపోయాయి. కొన్ని పరిశ్రమలు, ఇక్కడ రాజకీయ పరిస్థితుల రీత్యా ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. సెజ్‌ల ఆస్తులు నిరర్ధక ఆస్తులుగా మారిపోయాయి. అక్కడ పొలాలు బీళ్లుగా  మారి పోయాయి. ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే పరిశ్రమలు రావాలి. వాటికి పెట్టుబడులు కావాలి.

వ్యవసాయం లాభ సాటిగా మారాలంటే నీటి పారుదల  సౌకర్యాలు పెరగాలి. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. అందుకు ప్రత్యేక హోదా ఉపకరిస్తుంది. అయితే ప్రత్యేక హోదా కల్పించినంత మాత్రానే సకలం సమున్నతం కాకపోవచ్చు. అయితే ఆ హోదా ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడానికి చేయూతనిస్తుంది. అందువల్లే ఏపీలోని అన్ని రాజకీయ పక్షాలూ విభేదాలు మరిచి ప్రత్యేక హోదా కోసం కలిసికట్టుగా పోరాడాలి.
-  వ్యాసకర్త మాజీ అధ్యక్షులు  కళాశాలల,
విశ్వవిద్యాలయాల అధ్యాపక సంఘాల సమాఖ్య  సెల్ : 9849435142.

- గడ్డం కోటేశ్వరరావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement