ప్రమాదంలో ప్రజాభిప్రాయం
సందర్భం
అవును, నిజం! బిహార్ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం చిత్తయింది. జాతీయ మీడియా ఎంపిరికల్ డాటాను పట్టేసి, సైంటిఫిక్ మెథడాలజీని ధగధగ పట్టించేసి అంతా సరిగ్గా లెక్కేసి చెప్పిన ప్రజాభిప్రాయం కట్టుదప్పింది. గత ఆదివారంనాడు కచ్చితంగా జనం నాడిని ఇట్టే పట్టేసి, ప్రజాభిప్రాయాన్ని విప్పి చెప్పేసే జాతీయ టీవీ చానళ్లను అటూ ఇటూ మార్చేస్తూ కూచున్నవాళ్లకు... అనుకున్నట్టే మోదీ అభివృద్ధి మంత్రాన్ని బిహారీ జనం మెచ్చారని అర్ధమైంది. నిట్టూర్చిన వాళ్లు, సంబరపడ్డవాళ్లు కూడా అనుకున్నట్టే జరుగుతుందనుకున్నారు తప్ప... మిన్ను విరిగి మీద పడినంత పనవుతుందని ఊహించలేదు. ఎన్నికల లెక్కల చిక్కులు విప్పడంలో దిట్ట ప్రణయ్‌రాయ్ అంతటివాడే ఎన్నడూ కనీవినీ ఎరుగని విడ్డూరమని విస్తుపోయి నోరెళ్లపెట్టాడంటే పెట్టడా?
చద్ది వార్తలకు పేరు మోసిన దూరదర్శన్ సహా జాతీయ చానళ్లన్నీ మోదీ విజయభేరీని మోగిస్తుండగా... కథ అడ్డం తిరిగింది. ఈసీవోళ్లు ఏ దయ్యపు మెషిన్లు పెట్టారో, బిహారీలు జాతీయ మీడియాకు మస్కాకొట్టి ఎలా అంతుపట్టకుండా ఓటేశారోగానీ నితీశ్, లాలూ బ్రదర్స్ చేతుల్లో మోదీ ఓడిపోయారు!
ఓటర్ల తీర్పులపై పోస్ట్‌మార్టమ్‌లు మీడియా పండితులు, విశ్లేషకులకు అలవాటే. సదరు పండితమ్మన్యులంతా చాపుదప్పి కన్నులొట్టపడ్డాక... ఇప్పుడు స్వీయ పోస్ట్‌మార్టమ్‌లు చేసుకోవాల్సి వస్తోంది. ఐదు దశల్లో జరిగిన ఎన్నికల్లో మొదటి రెండు దశల ఎగ్జిట్ పోల్స్ ఆధారంగానే అంచనాలు వేశామని అంతా తేల్చారు. రెండు నెలలుగా డొంక తిరుగుడుగానో, సూటిగానో మోదీ అభివృద్ధి నాగస్వరానికి బిహారీలు నాట్యమాడేస్తున్నారని... కుల, మతాల సంకుచిత రాజకీయాలకు తెరదించేస్తున్నారని ప్రజాభిప్రాయాన్ని జాతీయ చానెళ్లవారు వినిపిస్తూనే ఉన్నారు. అయినా ప్రజలు పెడచెవిని పెట్టి, రెండు దఫాలు తలలూగిస్తున్నట్టే కనిపించి ఆ తర్వాత అలా జెల్లకాయలు కొట్టేస్తే ఎలా?
ఆదివారం ఉదయం జాతీయ చానెళ్లు ఎన్డీయే సాధించబోయే విజయంపై అంచనాలు కడుతూ లొట్టలేసి...ఆ కూటమి నేతలను అభినందిస్తూ, అధికారంలోకొస్తే ఏం చేయబోతారో వారిచేత చెప్పిస్తుంటే...అక్కడ అభివృద్ధి వెలుగేలేని బిహార్‌లో స్థానిక చానళ్లకు చెందిన రిపోర్టర్లు, స్ట్రింగర్లు సామాన్య జనంతో మాట్లాడి, వారి మనోగతాలను అందరికీ తెలియజెప్పారు. కనుకనే నితీష్, లాలూ కూటమి విజయం సాధించబోతున్నదని ఆ చానెళ్లు చాలా ముందుగానే అంచనా వేశాయి. ఆఖరికి రాజ్యసభ టీవీ సైతం ఆదినుంచీ మహా కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తున్నదని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
మన జాతీయ చానెళ్లు మాత్రం అందుకు భిన్నంగా ఎన్‌డీఏ కూటమి ఓట్ల లెక్కింపులో విజయపథంలో దూసుకుపోతున్నదని జంకూ గొంకూ లేకుండా ప్రకటించేశాయి. స్థానిక భాషా చానళ్ల సంగతలా ఉంచి రాజ్యసభ టీవీ అందరిలాగే 243 నియోజకవర్గాల్లో స్ట్రింగర్లను మోహరించింది. వారు పంపిన డేటాను 40మంది నిపుణులు విశ్లేషించారు. ‘మేం నిష్పాక్షికంగా ఉండటంవల్లే విజయం సాధించగలిగామ’ని ఆ చానెల్ నిర్వాహకులు గర్వంగా చెప్పుకోగలిగారు. సమస్త వనరులూ ఉన్న జాతీయ చానెళ్లు మాత్రం ఘోరంగా విఫలమయ్యాయి.
సీఎన్‌ఎన్-ఐబీఎన్ వాళ్లు అత్యంత విశ్వసనీయమైనదిగా చెప్పుకునే ఓ సంస్థతో ఎగ్జిట్‌పోల్ సర్వే చేయించి లాలూ, నితీశ్‌ల కూటమికి కూటమికి 160 నుంచి 180 సీట్లు వస్తాయని ఎక్కడో ఓ వైబ్‌సైట్‌లో ఇలా పెట్టేసి, అలా తీసేశారు. అతి నమ్మకంగా చివరిదాకా, గూట్లోని ప్రజాభిప్రాయం చెట్టెక్కి కూచోడానికి ముందు వరకూ ఇతర సంస్థల సర్వేలనే ఏకరువు పెడుతూ... ఇప్పుడు అందరితో పాటు తామూ స్వీయ పోస్ట్‌మార్టమ్ నిర్వహించుకుంటున్నారు. ఎందుకు? ఢిల్లీ దర్బారుకు కోపం వస్తుందేమోనని దడుచుకున్నారని, అంతా ఒక దారై, తమది మరో దారై.. చివరికి తామే తప్పని తేలితేనో? అని భయపడ్డారని ఊహగానాలు వినవస్తున్నాయి. ఏది ఏమైనా నిజాన్ని నిర్భయంగా చెబుతామని ప్రకటించుకునే జాతీయ మీడియా తన ఖ్యాతిని పొగొట్టుకోవాల్సి వచ్చింది.
జాతీయ మీడియా దృష్టిలో స్థానిక భాషా చానళ్లు, పేవర్లు నాసిరకానివి. అవి ప్రజాభిప్రాయానికి తూట్లు పొడుస్తుంటాయి. వాటి దృష్టిలో గ్యాస్ సబ్సిడీలనుంచి రైతులకిచ్చే సబ్సిడీలవరకూ అన్నీ వృథా. స్థానిక మీడియా వాటికి అనుకూలంగా మాట్లాడుతూ అభివృద్ధికి అడ్డుతగులుతున్నదని జాతీయ మీడియా తరచు చెప్పే అభిప్రాయం. ఆ బాపతు విశ్లేషణలే వాటిల్లో కనిపిస్తాయి. బిహార్ ఎన్నికల విషయంలోనూ అవి ఇలాగే వ్యవహరించాయి. జనాభిప్రాయానికి వేరే భాష్యం చెప్పుకుని తప్పు మీద తప్పు చేసుకుంటూ సాగిపోయాయి.
బిహార్ ఎన్నికల్లో ఎక్కువగా నష్టపోయింది ఎవరూ అంటే జాతీయ మీడియానే. దాని ప్రజాభిప్రాయ సేకరణలను ఇక ప్రజలు విశ్వసనీయమైనవిగా పరిగణించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకు అవి ఎవరినో తప్పు పట్టి ప్రయోజనం లేదు. నేల విడిచి సాము చేసినట్టుగా క్షేత్ర స్థాయి, ఓటరు స్థాయి సర్వేలను నిష్పాక్షికంగా, తటస్థంగా ఉండి జరిపించడంలో అవి విఫలమయ్యాయి. ప్రజల నాడిని పట్టుకోవడం కంటే ముందస్తు నిర్ణయాలకు సాక్ష్యాలను వెతికే దిశగా విశ్లేషణలు, సర్వేలు సాగాయి. మహానగరాల్లోని టీవీ స్టూడియోల ఆలోచనలకు భిన్నమైన ఓటర్లు గ్రామాల్లో, బస్తీల్లో నిశ్శబ్దంగానే గడిపేస్తుంటారు. వారి నాడిని పట్టుకునే దిగువస్థాయి రిపోర్టర్ల స్ట్రింగర్ల వ్యవస్థలు సువ్యవస్థితమై లేకుండా తాత్కాలిక ప్రాతిపదికపై సాగించే సర్వేలు జాతీయ మీడియా విశ్వసనీయతను, స్వతంత్ర తను ఇప్పటికే దెబ్ప తీశాయి. బిహార్ తల బొప్పితోనైనా ఈ తీరు మారేనా?
- ఎస్. కమలాకర్