బుఖారీ బడాయి మాటలు | Petition in Allahabad High Court seeking removal of Syed Ahmed Bukhari as Imam | Sakshi
Sakshi News home page

బుఖారీ బడాయి మాటలు

Published Mon, Nov 10 2014 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM

బుఖారీ బడాయి మాటలు

బుఖారీ బడాయి మాటలు

ఢిల్లీ జామా మసీదులో వారసత్వ పాలన  కొనసాగుతున్నది. ఇది ఇస్లాం సంప్రదాయానికి విరుద్ధం. అహ్మద్ బుఖారీ వంటి వ్యక్తి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా వ్యవహరించే తీరును...అతనికి ఎనలేని ప్రాముఖ్యమిచ్చే వైఖరిని మీడియా, రాజకీయ నాయకులు కూడా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆయన తనకు తాను తప్ప ఎవరికైనా ప్రాతినిధ్యం వహించగలడా? తన నివాస ప్రాంతంలోని ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం చేయగలడా? అలా చేస్తే ఆ ప్రాంతంలో ఆయనకెంత మద్దతు ఉన్నదీ తెలిసిపోతుంది.
 
అజ్ఞానం, ఆగ్రహం కలగలిస్తే మిగిలేది తప్పుల కుప్పే. దారీ తెన్నూ లేని తీరుకైనా ఏదో రకమైన నియంత్రణ అవసరం. కానీ, దుర్భల మానసిక స్థితిలో జనించే అహంకారానికి మానవనైజం బానిసై పోతుంది. ఎడారి నగరం మక్కాలో ప్రవక్త మహమ్మ ద్‌కు వచ్చిన సందేశం పర్యవసానంగా మానవజాతిని పీడిస్తున్న అజ్ఞానం (జహిలియా) అంతరించిందని ముస్లింలు ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. కానీ, దురదృష్టవశాత్తూ ఆ అజ్ఞానం ఇవాళ కొందరిలో రాజ్యమేలుతోంది. ప్రస్తుతం భారత ముస్లింలకు ప్రతీక అయిన ఢిల్లీ జామా మసీదులో అది తాత్కాలికంగా తలదాచుకుంది.

ఇమామ్ పదవి వంశపారంపర్యమా?
జామా మసీదు ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీది అకారణ ఆగ్రహం అయినప్పుడు దానికంత ప్రాము ఖ్యత ఉండకూడదు. కానీ, ఆయనగారి స్థానంవల్ల మీడియాలో దానికి చోటు దొరుకుతున్నది. అందువల్ల భారతీయ ముస్లింలపై ఒక అభిప్రాయం ఏర్పడటానికి ఆస్కారం కలుగుతున్నది. తన కుమారుడు 19 ఏళ్ల షాబాన్ బుఖారీని ఇమామ్‌గా ప్రతిష్టించే ఉత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని పిలువబోనని, కానీ పాక్ ప్రధానికి ఆహ్వానం పంపిస్తానని అహ్మద్ బుఖారీ ప్రకటించారు. ఇలా చెప్పడం ద్వారా అనేక రకాలైన మూర్ఖత్వాన్ని ఆయన ప్రదర్శించారు.

భారతీయ ముస్లింలు తమ దేశ నాయకులను తమవారిగా భావిస్తారు తప్ప పరాయి దేశంవారిని కాదు. అయితే, ఈ సందర్భంలో మరో ప్రశ్న అడగాల్సి ఉంది. ఇస్లాం సిద్ధాంతంలో మసీదు ప్రైవేటు ఆస్తి ఎప్పుడైంది? దేశం గర్వించదగ్గ మసీదుపై బుఖారీకి వారసత్వ హక్కులు ఎవరిచ్చారు? సంస్థకొచ్చే ఆదాయాన్నంతా సొంతంచేసుకునే హక్కు ఎవరిచ్చా రు? ఆ మసీదు వక్ఫ్ ఆస్తి. కనుక అది ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు చెందుతుంది. ఆ మసీదును కట్టించిన షాజహాన్ చక్రవర్తి తన పూర్వీకుడొకరికి ఇమామ్ పదవినిచ్చాడు గనుక ఆ పదవి తమ సొంతమని బుఖారీ భావిస్తుం టారు. మత సంప్రదాయం ప్రకారం చూసినా, ప్రజా స్వామ్య వాతావరణాన్నిబట్టి చూసినా ఇది తప్పుడు వాదన. ఈ వాదననే అంగీకరిస్తే షాజహాన్ వారసు లు తమను ఢిల్లీ పాలకులుగా నియమించమని దరఖాస్తు చేసుకోవచ్చుననుకోవాలి.
 
చరిత్రలోకెళ్తే...
ఏ మసీదునైనా ముస్లింలందరూ తమ సొంతమని భావిస్తారు. మదీనా నగరంలో ప్రవక్త మహమ్మద్ అంతటి విశిష్ట వ్యక్తి తొలి మసీదు నిర్మించారు. ప్రపంచంలో ఏమూల నివసించే ముస్లింలకైనా అది ఇప్పటికీ పవిత్రమైన ప్రాంతం. ఆ మసీదును ప్రవక్త తన అల్లుడు హజరత్ అలీకి, కుమార్తె బీబీ ఫాతిమాకు సంక్రమింపజేశాడా? లేదు. ప్రవక్త నిర్దేశించిన నియమా న్ని భారతీయ ముస్లింలు ఎందుకు వదులుకుంటారు? ముస్లింలు హజ్ యాత్ర కెళ్లే మక్కా, మదీనా రెండూ కూడా పవిత్ర మసీదులు. ఖలీఫాలు, సుల్తాన్‌లు పద్నా లుగు శతాబ్దాలపాటు బయటి దాడులనుంచి, ఆంత రంగిక కల్లోలాలనుంచి వాటిని కాపాడారు.

ఇస్లాం సంప్రదాయానికి ఇది విరుద్ధం
ప్రతి పాలకుడూ మసీదుకు సేవకుణ్ణి లేదా సంరక్ష కుడిని అని మాత్రమే ప్రకటించుకున్నాడు. మామె లూక్స్‌ను ఓడించి తొలి ఖలీఫ్ అయ్యాక ఒటోమాన్ సుల్తాన్ సలీమ్ అలెప్పోలోని మసీదు కు వెళ్లి శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొ న్నాడు. ఆ సందర్భంగా తడబా టుకులోనైన ఇమామ్... సలీం ను దైవంగా సంబోధించిన ప్పుడు తాను సేవకుడిని మాత్రమేనని వెనువెంటనే ఆయన సరిదిద్దాడు. మక్కా, మదీనా ఇమామ్‌లు తమ కు వారసత్వ హక్కులున్నాయని చెప్పరు. వారిని సౌదీ కోర్టు నియమిస్తుంది. ఎప్పుడైనా వారిని మార్చవచ్చు. ఖురాన్, సునాలకు సంబంధించిన పరిజ్ఞానం, ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవారు ఆ పదవికి అర్హులు. కానీ, ఢిల్లీ జామా  మసీదులో వారసత్వ పాలన  కొనసాగుతున్నది. ఇది ఇస్లాం సంప్రదాయానికి విరుద్ధం.
 
ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి
ఎందుకిలా? ఎవరికీ తెలియదు. బహుశా ఇక్కడి ముస్లింలలో ఉన్న పట్టించుకోని తత్వం కారణం కావొచ్చు. దేశంలోని అనేక నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మసీదులున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ముస్లిం సమాజం మసీదుకు చెందిన కమిటీ ద్వారా  ఆ మసీదులకు ఇమామ్‌లను ఎంపిక చేసుకుంటుంది. అదే సూత్రం ఢిల్లీ జామా మసీదుకూ వర్తిస్తుంది. ఆ మసీదు ప్రార్థనలు చేయించేవారిది కాదని, అది పాత ఢిల్లీలోని ముస్లిం సమాజానికంతకూ చెందుతుందని వారు నొక్కిచెప్పాలి. మసీదు నిర్వహణకు ప్రజాస్వామ్య బద్ధంగా ఒక కమిటీని ఎన్నుకుని... ఇమామ్‌ను ఎంపిక చేసే అధికారాన్ని ఆ ఎన్నికైన కమిటీకి ఇవ్వాలి.

బుఖారీకి అంత ప్రాముఖ్యతా?
అహ్మద్ బుఖారీ వంటి వ్యక్తి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా వ్యవహరించే తీరును...అతనికి ఎనలేని ప్రాముఖ్యమిచ్చే వైఖరిని మీడియా, రాజకీయ నాయకు లు కూడా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆయన తనకు తాను తప్ప ఎవరికైనా ప్రాతినిధ్యం వహించగలడా? తన నివాస ప్రాంతంలోని ఒక నియో జకవర్గాన్ని ఎంచుకుని ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం ఆయన చేయగలడా? అలా చేస్తే ఆ ప్రాంతంలో ఆయ నకెంత మద్దతు ఉన్నదీ తెలిసిపోతుంది. అంతేకాదు తన మతస్తుల్లో ఆయన ఎందరి విశ్వాసం చూరగొన్నా రో కూడా మనం పరీక్షించవచ్చు. ఆయన ఓటమిపై నాకెలాంటి సందేహమూ లేదు.

సంస్థాగత విధానాల ద్వారానే సంస్థల పరిరక్షణ సాధ్యమవుతుంది. అయితే సయ్యద్ అహ్మద్ బుఖారీ తనను తాను ప్రజలకు సేవకుడైన ఇమామ్‌గా కాక జామా మసీదు నవాబులా భావించుకుంటున్నారు. ఏం చేయాలో, ఎలా ముందు కెళ్లాలో తెలియక చాలామంది ఇందులో జోక్యం చేసుకో వడానికి సందేహిస్తున్నారు. ఫలితంగా కబ్జాదా రులే హక్కుదారులుగా చలామణి అవుతున్నారు. ఎవరు మంచి ముస్లిమో నిర్ణయించే అధికారాన్ని వంచక ఇమామ్ చేతుల్లో పెట్టడం మాని ఎవరు మంచి ఇమామో తామే తేల్చాల్సిన సమయం ఆసన్నమైందని నిజమైన భారతీయ ముస్లింలు గ్రహిస్తే మంచిది.    

ఎం.జె.అక్బర్, సీనియర్ సంపాదకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement