రాజకీయమంటే ఇదేనా?!
రాజకీయమంటే ఇదేనా?!
Published Wed, Mar 2 2016 1:48 PM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
ఏపీలో వైఎస్సార్‌సీపీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. అయినా అధికార పార్టీ వలసలను ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎవరైనా పార్టీ మారేటప్పుడు తమ పదవులకు రాజీనామా చేసి, ప్రజల్లోకి వెళ్తేనే ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలుస్తుంది.
నేటి రాజకీయాల్లో పార్టీ సిద్ధాంతాలు, నైతిక విలువలు, నిజాయితీ, క్రమశిక్షణ అన్న మాటలు రోజురోజుకు కనుమ రుగవుతున్నాయి. గతంలో ఉన్న ఈ విలువలు నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలకు అస్సలే తెలియదు. కొత్తగా ఎన్నికైన అనేక మంది ప్రజా ప్రతినిధులకు పార్టీ సిద్ధాంతాలంటే ఏంటో బొత్తిగా తెలియదు. జనతా పార్టీ నేతలు, గాంధేయవాదులు, కమ్యూనిస్టులు ఏ విధంగా సిద్ధాంతాల కోసం నిలబడే వారో ఒక్కసారి నేటి మన ప్రజాప్రతినిధులు తప్పక తెలుసుకోవాలి. నాటి నేతలు జీవిత చరమాంకం వరకు నమ్ముకున్న సిద్ధాంతం కోసమే పనిచేశారు, పోరాడారు, జీవించారు. ప్రాణాలు అర్పించారు. తమ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఏ అంశంలోనూ రాజీపడలేదు. అలాంటి వారిలో తెన్నేటి విశ్వనాథం, పుచ్చలపల్లి సుందరయ్య, గౌతు లచ్చన్న, జూపూడి యజ్ఞనారాయణ, వావిలాల గోపాలకృష్ణయ్య, ప్రగడ కోటయ్య తదితర నేతలు న్నారు. అధికారం కోసం, పదవి కోసం, అవసరం కోసం నిస్సిగ్గుగా పార్టీ మారుతున్న నాయకులు అడుగడుగునా నేడు మనకు దర్శనమిస్తున్నారు.
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొందరు నేతలు మాత్రం ఎప్పుడూ అధికారంలోనే ఉంటున్నారని గమనించాలి. పూర్తి స్వార్థంతో పార్టీలు మారడం సర్వ సాధారణమైంది. నేటి ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి వారు డజను మందికి పైగానే ఉన్నారు. ఇంకొందరు నాలు గైదు పార్టీలు సైతం మారుతున్న పరిస్థితి. సిగ్గూ, ఎగ్గూ లేకుండా పార్టీ మీద పార్టీ మారడంతోనే తామేదో పెద్ద నాయకులమైపోయామని అనుకుంటున్నారు మరికొం దరు. ఒక పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలో్లకి మారేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితి గతంలో చిన్న రాష్ట్రాలైన... ఈశాన్య రాష్ట్రాలు, పాండిచ్చేరి, గోవా, హరియాణాలో్ల అధికంగా ఉండేది. ఇప్పుడు ఆ జబ్బు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లకు, తాజాగా తెలంగాణకు సోకింది.
తెలుగు రాష్ట్రాలలో ఫిరాయింపులు అతి పెద్ద జాడ్యంగా మారాయి. గెలిచిన పార్టీని కాదని, అధికార పార్టీలోకి వలస పోవడం ప్రజల కోసమేనని గొప్పలు చెప్పుకునే నేతలు నిత్యం దర్శనమిస్తున్నారు. రాజకీయ మంటేనే గెలుపు, అధికారం అన్నట్టు నేటి తరం నాయకులు సాగిస్తున్న ఈ రాజకీయ వ్యాపార క్రీడ దేశ ప్రజలను విస్తుపోయేలా చేస్తోంది. ఈ ‘నయా రాజ కీయం’ చూసి రాజకీయాలంటే ఇవేనా! రాజకీయ మంటే ఇదేనా! అని యువత అవక్కావుతోంది. తెలంగాణలో పూర్తి మెజారిటీ దక్కకపోయినా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత దాదాపు 20 మందికి పైగా ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్, టీడీపీల నుంచి అధికార పార్టీలోకి వలసవెళ్లారు. తెలంగాణలో టీడీపీ అన్నదే లేకుండా పోతున్న స్థితిని చూస్తున్నాం. ఆంధ్రా పార్టీలకిక తెలంగాణలో కాలం చెల్లిందని, రాజకీయ పునరేకీకరణతో తెలంగాణను అభివృద్ధి చేస్తామని అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వలసలకు కొత్త భాష్యం చెబుతున్నారు. ఇదే సమయంలో ఏపీలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగు దేశంలోకి అరడజను మంది ప్రజా ప్రతినిధులు వలస పోయారు. తెలంగాణలో ప్రతిపక్షాలు బలహీనంగా ఉంటే ఏపీలో వైఎస్సార్‌సీపీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. అయినా ఏపీలోనూ అధికార పార్టీ వలసలను ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తోంది.
ఎన్నికలకు ముందేగాక, ఎన్నికలైన తర్వాత కూడా నాయకులు ఇలా వీలును బట్టి పార్టీలు మారుతుండటం ప్రజాస్వామ్య వ్యవస్థకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ముప్పును సూచిస్తోంది. ప్రజాప్రతినిధులుగా తాము గెలుపొందిన పార్టీ ప్రతిపక్షంగా మిగలడంతో ఎన్నికలకు ముందటి తమ మాటలను, ప్రగల్భాలను అన్నిటినీ మరచి అధికార పార్టీలోకి వలస పోవడం రెండు తెలుగు రాష్ట్రాలో్ల నిత్యకృత్యంగా మారింది. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పథకం ప్రకారం టీడీపీ ఎమ్మెల్యే లను ఒక్కొక్కరిగా తమ పార్టీలో చేర్చుకుంది. ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకపోగా, మంత్రి పదవులు సైతం కట్టబెట్టింది. ఒక పార్టీని పూర్తిగా నాశనం చెయ్యాలని ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి, చట్టాలను గౌరవించకుండా ఒక ప్రభుత్వం ఇలా వలసలను ప్రోత్సహించడం ఏ మాత్రం సమర్థనీ యం కాదు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిరాయించినప్పుడు వారితో ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజీనామా చేయించి తిరిగి ఎన్నికల బరిలోకి దించారు. అదే పద్ధతిని ఇప్పుడు పార్టీలు మారుతున్న నేతలూ పాటించాలి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ... ఎవరైనా పార్టీ మారేటప్పుడు తమ పదవులకు రాజీనామా చేసి, మరోసారి ప్రజల్లోకి వెళ్తేనే ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలుస్తుంది. పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని, రాజ్యాంగ పరి రక్షణ చేయాలని న్యాయస్థానాలు ఎన్నో ఆదేశా లిచ్చాయి. కోర్టులు పలుమార్లు స్పీకర్‌కు తేల్చి చెప్పాయి.
రాత్రికి రాత్రే పార్టీలు మారుతున్న ప్రజా ప్రతినిధులు తమను ఎన్నుకున్న ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. ఎందుకు పార్టీ మారుతున్నారో, పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చిందో, పార్టీ మారడం వల్ల తమకు కలిగిన ప్రతిఫలమేమిటో, నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా సాధ్యమో వారికి వివరించాలి. వలస పక్షులు సైతం కాలానుగతంగా ఆయా రుతువు లను బట్టి మాత్రమే ఒక దేశం నుంచి మరొక దేశానికి వలసలు వెళ్తాయి. మన నాయకుల్లా ఎప్పుడుబడితే అప్పుడు వలస పోవు. స్వప్రయోజనాలే పరమావధిగా పార్టీలు మారే నాయకుల, మంత్రుల మాటలకు విలువేముంటుంది? యువత ఇలాంటి వారి నుంచి ఏం నేర్చుకుంటుంది? ఆ నేతల విజ్ఞతకే వదిలేద్దాం.
రఘురామ్
ఏపీ బీజేపీ సమన్వయకర్త
raghuram.bjp@gmail.com
Advertisement