సాక్షి, అమరావతి: రాష్ట్రం కోసం, ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవాలి, తమ కోసం గెలవాలని ఆయన పార్టీ శ్రేణులతో వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, ఏ నగరానికి జరగనంతగా అమరావతి అభివృద్ది చేస్తున్నామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతి, నెల్లూరు, అమరావతి సభల్లో చెప్పారన్నారు. కానీ 5వ బడ్జెట్ తర్వాత అన్యాయం జరుగుతుందని గుర్తించామన్నారు. అందువల్లే ఎన్డీఏ నుంచి బయటకొచ్చి పోరాడుతున్నామని తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అంతా మన కష్టం వల్లే కానీ కేంద్రం వల్ల కాదని చంద్రబాబు పేర్కొన్నారు. బీజేపీ నాయకులు తమకు చుక్కలు చూపిస్తామంటున్నారు కానీ టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. తాను కేంద్రం, ప్రధానిపై పోరాడుతున్నానని.. తన నాయకత్వం కిందే అందరూ పనిచేయాలన్నారు. అంతేతప్ప వేరేవాళ్ల వెనుకాల తాను వెళ్లనన్నారు. ఓ పక్క జనాభా నియంత్రణ చేస్తుంటే, ఇపుడు 15వ ఆర్థిక సంఘం ద్వారా లింక్‌పెట్టి నిధులు తగ్గించాలని చూస్తున్నారని మండిపడ్డారు. దీని వలన అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు కూడా తగ్గిపోతాయన్నారు.
మరోవైపు ప్రతిపక్షం విమర్శించినపుడు వదిలిపెట్టకూడదని ఆయన శ్రేణులకు నూరిపోశారు. ప్రతిపక్షాల ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు. పబ్లిసిటీ రావడం లేదని అమెరికా నుంచి ఓ మహిళ చెప్పిందని, ఆ దిశగా అందరూ పనిచేయాలని తెలిపారు. దాచేపల్లి ఘటన దుర్మార్గమన్నారు. టెక్నాలజీ వలన చిన్నపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, విలువలు లేకపోవడం వలన మనుషులు ఇలా ప్రవర్తిస్తున్నారన్నారు. పిల్లలు టెక్నాలజీకి బానిసలవుతున్నారన్నారు. 50 కోట్లు పెట్టి రోడ్లు వేయిస్తే దానివల్లే ఓట్లు పడవని, పాలిటిక్స్ చేయలన్నారు. ఏం చేస్తే మెజారిటీ వస్తుందో అందరూ ఆలోచించాలి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment