బడిత పూజకి పరిహారం! | punishment in schools openion by madhabusi Sridhar | Sakshi
Sakshi News home page

బడిత పూజకి పరిహారం!

Published Fri, Jul 29 2016 2:07 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

బడిత పూజకి పరిహారం! - Sakshi

బడిత పూజకి పరిహారం!

విశ్లేషణ
పాఠశాలల్లో పిల్లలను ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు క్రమశిక్షణ పేరుతో కొడుతుంటారు. తిడుతుంటారు. దీని పర్య వసానం ఏ విధంగా ఉంటుందో ఆలోచించు కోవాలి. పిల్లలపైన ఎవరు దౌర్జన్యం చేసినా నేరమవు తుంది. నష్ట పరిహారం చెల్లించవలసిన తప్పిదం అవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో శారీరక హింసకు తావుండకూడదు. ప్రయివేటు పాఠశాలలు ఇష్టం వచ్చినట్టు నడుపుకునే స్వేచ్ఛ ఉన్నా, చట్టాలకు వ్యతిరేక కార్యక్రమాలను జరపడాన్ని ప్రభుత్వం సహించడానికి వీల్లేదు. పిల్లలను కొడితే చదువు వస్తుంది లేకపోతే రాదా? అది నిజమైతే కాలేజీ చదువుల విద్యార్థులకు ఈ నియమం ఎందుకు వర్తించదు?  

కేంద్రీయ విద్యాలయ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు విద్యావసరాలు తీర్చే పెద్ద వ్యవస్థ. అక్కడ శారీరక హింస లేకుండా తగిన చర్యలు తీసుకున్నారు. అయినా ఎవరైనా కొడితే అనుసరించే విధానం ఏమిటి? బడిహింసను పూర్తిగా నిరోధించారా, లేక నిషేధించి ఊరు కున్నారా? అనేక నివారణ చర్యలు తీసుకోవాలని జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ వివరమైన మార్గదర్శకాలను రూపొందించింది. కేవీఎస్‌లో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని శారీరకంగా గాయపరిచి నందుకు ఏ విచారణ జరిపారు? ఏ శిక్ష వేసారు? వివరాలు ఇవ్వండి అని సహచట్టం కింద ఒక సవాలు వచ్చింది. ఇది ప్రయివేటు వ్యవహారమని, అది వ్యక్తిగత సమాచారమని తిరస్కరించారు. ఉపా ధ్యాయుడిని సంప్రదిస్తే అతను అభ్యంతర పెట్టా డని కనుక ఇవ్వలేమని మొదటి అప్పీలులో తీర్పు చెప్పారు. విచారణలో తప్పు రుజువైందని, ఉపా ధ్యాయుడికి రెండు ఇంక్రిమెంట్ల కోత విధించి బదిలీ చేశామని కేవీఎస్ అధికారి విన్నవించారు.

సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(డి) ప్రకారం ప్రభుత్వ సంస్థ పాలనాపరంగా, అర్థన్యా యపరంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు, (సి) ప్రకారం కీలక విధానాలు రూపొందించినప్పుడు, లేదా ప్రజలను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసు కున్నప్పుడు వాటి కారణాలు, సంబంధిత వివరాలు తమంత తామే తెలియజేయాలని చాలా స్పష్టంగా నిర్దేశిస్తున్నది.విద్యార్థిని కొట్టిన తప్పిదానికి క్రమశిక్షణా చర్య తీసుకోవడం వ్యక్తిగత సమాచారం కాదు. అది ప్రజ లకు సంబంధించిన విషయం కాకుండా పోదు. ఈ విధంగా కొట్టడానికి వీల్లేదని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఇతర ఉపాధ్యాయులకు, పాఠశాల యాజమాన్యాలకు కూడా అర్థం కావాలంటే ఇటు వంటి చర్యలకు సంబంధించిన సమాచారం అంద రికీ అందుబాటులో ఉండాల్సిందే.

ఐక్యరాజ్యసమితి పిల్లల హక్కుల కమిటీ శారీరకంగా మానసికంగా పిల్లలను హింసించడం తప్పనీ, చెంపదెబ్బలు, మొట్టికాయలు, బెల్టు, బెత్తం, చెప్పు, చేయితో కొట్టడం, తన్నడం, ఊపేయడం, గిల్లడం, చెవ్వు మెలేయడం, జుట్టు పట్టి లాగడం, చెవులమీద కొట్టడం, కొరకడం, ఎండలో, క్లాసులో నిలబెట్టడం, బెంచీమీద నిల బెట్టడం లేదా అవమానించడం కూడదని వివ రించింది. యుఎన్ సీఆర్‌సీ ఆర్టికల్ 28(2) ప్రభు త్వాలు పిల్లల మానసిక శారీరక రక్షణ కల్పించ వలసి ఉంటుంది. విద్యా బోధన సమయంలో పిల్లల మానవ హక్కులను పాటించే చర్యలు తీసు కోవాలి. 37(సి) ప్రకారం పిల్లల పట్ల క్రౌర్యం అమా నవీయ ప్రవర్తన, అవమా నకర చర్యలు విడ నాడాలి.  తల్లిదండ్రులు, సంరక్ష కులు లేదా మరెవరి సంరక్షణలో ఉన్నా సరే పిల్లలను హింస, దోపిడీ, లైంగిక వేధింపులకు గురిచేయ కుండా చట్టాలు కాపాడాలి. ఇండియన్ పీనల్ కోడ్ కింద పిల్లలను కొట్టడం నేరం. శిక్షలు కూడా నిర్ధారించారు.

ఉపాధ్యాయులకు పిల్లలను కొట్టే అధికారాన్ని లేదా మినహాయింపును ఇవ్వలేదు. ఒకవేళ అటు వంటి సంఘటనలు జరిగితే అది నేరంగా పరిగణిం చేంత తీవ్రంగా ఉందా అని పరిశీలించాలి. తీవ్ర నేరంగా కనిపిస్తే వెంటనే పోలీసు స్టేషన్‌లో సంబంధిత ఉపాధ్యాయుడిపైనఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. తల్లిదండ్రులకు, పిల్లలకు నష్టపరిహారం చెల్లించే విధానం ఉండాలి. కేవీఎస్ వంటి కీలకమైన విద్యాసంస్థ ఇటువంటి నేరాలను అరికట్టడంలో తగిన చర్యలు తీసుకోవడం సంస్థాగతమైన విధా నాలు రూపొందించడం, ఎస్‌సీపీసీఆర్ నిర్ధారించిన మార్గదర్శక సూత్రాలను అనుసరించి ఇతర ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు ఆదర్శంగా నిలవాలి.

ప్రతి సంవత్సరం మొదటి 3నెలల లోపున గత సంవత్సరం ఎన్ని కేసులు జరిగాయి? ఎంత పరి హారం చెల్లింపజేసారు? ఎంత మందిపైన చర్యలు తీసుకున్నారనే నివేదిక విధిగా ఇవ్వాలని ఎస్‌సీపీ సీఆర్ మార్గదర్శకాలు విడుదల చేసింది. కేవీఎస్ ప్రతి ఏడాది ఒక నివేదిక ఇవ్వాలని, బాధితులైన విద్యార్థులకు పరిహారం చెల్లించే విధానాన్ని ప్రవేశ పెట్టి మిగతా విద్యా సంస్థలకు ఆదర్శంగా ఉండా లని, విద్యార్థికి చెల్లించిన పరిహారాన్ని బాధించిన టీచర్ జీతం నుంచి మినహాయించాలని కేంద్ర సమాచార కమిషన్ సూచించింది.
 (బ్రహ్మానంద్ మిశ్రా, కేసు సీఐసీ/సీసీ/ఏ / 2014/002226, 22.7.2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా)












(వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్
ఈమెయిల్: professorsridhar@gmail.com)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement