కాష్టంలో బొగ్గుల కోసం కాట్లాట
ఓట్ల కోసం.. సీట్ల కోసం వెంపర్లాడడం రాజకీయ పార్టీలకు మామూలే. ఎన్నిక లొస్తున్నాయంటే ఈ యావ మరీ ఎక్కువవుతుంటుంది. రాజకీయ లబ్ధికి పనికివచ్చే ఏ విషయాన్నీ అవి చూస్తూ వదిలిపెట్టవు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఇదే వెంపర్లాటలో ఉన్నాయి. యూపీలోని ముజఫర్‌నగర్ అల్లర్లు... అనంతర పరిణామాలలో అది స్పష్టంగా కనిపిస్తుంది.
నాలుగు నెలలుగా దక్షిణ యూపీ మతపరమైన అల్లర్లతో అట్టుడుకుతున్నది. ముఖ్యంగా ముజఫర్‌నగర్ జిల్లా మత హింసతో అల్లాడుతున్నది. ఇప్పటి వరకూ 62 మంది మరణించారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. దాదాపు 60 వేల మంది ఇల్లూవాకిలి వదిలి తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. సాధారణ పరిస్థితులు నెలకొని తిరిగి ఇళ్లకు వెళ్లేంత వరకు వారికి కనీస వసతులు కల్పించాల్సిన రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు ఆ బాధ్యతను విస్మరించి పరస్పర దూషణలపై దృష్టిపెట్టాయి. డిసెంబర్ చలి తీవ్రతకు శిబిరాల్లోని పసివాళ్లు 40 మంది వరకూ మరణించినా వారికి చీమ కుట్టినట్టు లేదు.. హింసాకాండ, శిబిరాలలో సౌకర్యాల లేమి సమస్యలపై రెండు పార్టీల నేతలు తిట్లపురాణంలో తలమునకలుగా ఉంటున్నారు.
సాధారణంగా ఏ సమస్యపైనా స్పందించని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ విషయంలో భిన్నంగా వ్యవహరించడంలోని అసలు ఉద్దేశాలను సుస్పష్టమే. ఊహించని విధంగా ఆయన రెండుసార్లు ముజఫర్‌నగర్ సందర్శించారు.
సరదాగా సెలవులకు వెళ్లినట్లు ముజఫర్‌నగర్ శిబిరాలకు వెళ్లి బాధితుల వైపు చేతులూపి, అక్కడి నాయకులతో బాతాఖానీలో మునిగితేలడం రాహుల్ ‘పరిణతి’కి అద్దం పడుతుంది. బాధితులపై దృష్టి పెట్టండంటూ అఖిలేష్‌కి ఉచిత సలహాలివ్వడం రాహుల్ మార్కు పరిష్కారం కాబోలు. కేంద్రంలో అధికారంలో ఉన్నది తామేనని, బాధితులకు తామూ సహాయం చేయవచ్చన్న విషయమే ఆయన మరచిపోయారు. అందుకే బాధితులు ఆయనకు నల్లజెండాలతో నిరసన తెలపాల్సి వచ్చింది. అయినా కేంద్రం ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడమే రాహుల్ పర్యటనల ఆంతర్యాన్ని స్పష్టం చేస్తోంది. ముజఫర్‌నగర్‌లో పర్యటిస్తూ అక్కడి ముస్లిం నేతలతో రాహుల్ సమాలోచనలు, సంప్రదింపులు జరుపుతున్న సమయంలోనే యూపీయే చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఢిల్లీలో యూపీ జాట్ నాయకులతో భేటీ అయ్యారు. రిజర్వేషన్ విషయంలో యూపీఏ సానుకూలంగా ఉండడంపై కృతజ్ఞతలు తెలుపుకునేందుకే వారు సోనియాను కలిసినట్లు పైకి ప్రచారం జరుగుతున్నా నిజానికి జరుగుతున్నది వేరే. యూపీ అల్లర్లలో భాగంగా ఉన్న ఈ రెండు వైరి వర్గాలను తమ దారికి తెచ్చుకునేందుకు రాహుల్, సోనియా ఎంత ‘ప్రణాళికా’బద్ధంగా వ్యవహరిస్తున్నారో దీనిని బట్టి తెలుసుకోవచ్చు.
ఇక ముజఫర్‌నగర్ బాధితుల విషయంలో అఖిలేష్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు మరీ ఆశ్చర్యకరంగా ఉంది. శిబిరాలలో 34 మంది చిన్నారులు మరణించారని ఒప్పుకుంటూనే చలి కారణంగా ఎవరూ మరణించలేదని యూపీ హోంశాఖ ఇంకో వితండ వాదనను మొదలుపెట్టింది. ఆ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఏకే గుప్తా అయితే మరో వింత వాదాన్ని తీసుకొచ్చారు. ‘చలికి ఎవరూ చనిపోలేదు. చనిపోరు కూడా. సైబీరియాలో మనుషులు బతకడం లేదా...’ అంటూ తర్కానికి దిగారు. ఈ మాట అఖిలేష్‌కు కూడా కోపం తెప్పించింది. రాష్ర్ట పోలీసులు తామేమీ తక్కువ తినలేదని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. శిబిరాలను ఖాళీ చేసి బాధితులు వెంటనే సొంత ఇళ్లకు తిరిగి వెళ్లాలని బెదిరిస్తున్నారు, వత్తిడి చేస్తున్నారు. గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెల కొనకముందే ఎలా వెళ్లిపోవాలనే వారి ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. అదేమని నిలదీస్తే మత హింసను అడ్డుపెట్టుకుని దాదాపు 30 కుటుంబాలు అక్రమంగా శిబిరాల్లో ఉంటున్నాయని, వారిని మాత్రమే వెళ్లిపోమంటున్నామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు.
నాలుగు నెలలుగా అక్కడ అరాచకం రాజ్యమేలుతున్నా అల్లర్లకు కారణమైన వారు ఎవరికీ అరదండాలు పడనేలేదు. బలాత్కారాలకు తెగబడుతున్న కీచకులను ఊచల వెనక్కు పంపనేలేదు. బాధితులు అరకొర సౌకర్యాలున్న శిబిరాల్లో అష్టకష్టాలూ పడుతుంటే, భయం భయంగా బతుకుతుంటే... అత్యాచారాలు చేసినవారు, హత్యలకు ఒడిగట్టినవారు బాహాటంగా తిరుగుతున్నారు. ఇప్పటికైతే రాజకీయ నాయకుల ‘ఉచిత’ పరామర్శలు... రక్షక భటుల ఇనుపబూట్ల చప్పుళ్లే ముజఫర్‌నగర్ బాధితులకు అందుతున్న ‘సాంత్వన’... అంతకుమించి ఆశించకూడదని వారికీ అర్ధమైపోయింది.
-పోతుకూరు శ్రీనివాసరావు